కాంతులీనుతున్న మనసు - అచ్చంగా తెలుగు

 కాంతులీనుతున్న మనసు

ప్రతాప వెంకట సుబ్బారాయుడు 


ఉదయం.

లోటస్ టెంపుల్, న్యూ ధిల్లీ.

వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంది.  సూర్యబింబం కనిపించడం లేదు. వెలుగును బట్టి సూర్యుడి ఉనికి తెలుస్తోంది.

కుల మతాలకతీతంగా  ప్రార్థనలు చేసుకునే ప్రదేశం ఒకటుందని, అదీ మన దేశంలోనే అని గూగుల్ లో సెర్చ్ చేస్తే తెలిసి ఇక్కడికి వచ్చాను. భిన్నత్వంలో ఏకత్వానికి అద్దం పడుతూన్న వసుధైక కుటుంబాన్ని  ప్రతిఫలింపజేస్తూ, అంతమంది కలిసిమెలిసి మౌన ప్రార్థనలు చేస్తుంటే చూడముచ్చటేసింది. ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లల్లో ఆ బీజం పడడం ముదావహం.

కళ్ళుమూసుకుని ధ్యానంతో మనసును, శరీరాన్ని ఒక కేంద్ర బిందువులో లయం చేసి, తాదాత్మ్యంతో ప్రశాంతంగా లోపల కొంతసేపు గడిపి బయటకొస్తున్న నాకు ఒక వ్యక్తి కనిపించాడు. సుమారు ముప్పై ఏళ్లుంటాయి. కళ్లల్లో, ముఖంలో నేనెవరిలోనూ, ఎన్నడూ చూడనంత ప్రశాంతత ద్యోతకమవుతోంది. అతన్నెందుకో పలకరించాలనిపించింది. బహుశా అతని ముఖం చూడగానే నా మనసులో ‘మన ప్రాంతం వాడేన’న్న భావం కూడా కదలాడినందుకేమో? అతను కొంత దూరం నడిచి, పచ్చికబయల్లో కూర్చున్నాడు. 

నేను అతనికి దగ్గరగా వెళ్లి కూర్చున్నాను. నన్ను చూసి నవ్వాడు. 

కాసేపు అక్కడున్న పచ్చదనాన్ని, పక్షుల కిలకిలలను ఆస్వాదించి, 

"మీరు తెలుగువారు కదూ.." అన్నాను.

అవునన్నట్టుగా చిరునవ్వు నవ్వాడు.

"నా పేరు విశిష్ట్. మాది విజయవాడ. నేను ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. సమయం చిక్కినప్పుడల్లా మనదేశంలోని ప్రఖ్యాత గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలు చూస్తాను. నెట్లో లోటస్ టెంపుల్ గురించి చదివి జాతి కుల మతాలకతీతంగా, స్త్రీ పురుష భేదం లేకుండా ఇందులోకి ప్రవేశించి మౌన ప్రార్థనలు చేసుకోవచ్చని చదివి మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చాను. ఇదో మధురానుభూతి. మరి మీరు?"

"నా దేహానికి ఉన్న పేరు కిరణ్, నా అసలు పేరు కులాన్ని ప్రతిబింబిస్తూ ఉండేది. దాన్ని తొలగించుకుని అధికారికంగా కిరణ్ అని మార్చుకున్నాను. సూర్యకిరణం ప్రకృతి ప్రసాదితం. ఎటువంటి వివక్షలు చూపకుండా, జగతిని జాగృతం చేస్తుంది. అందుకే ఆలోచించి ఆ పేరు పెట్టుకున్నాను. నేను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వస్తాను. ఇంకే పర్యటనలూ చేయను. ఉద్యోగం చేయడం బతకడానికి, ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా మానసిక ప్రశాంతత పొందడానికి..అంతే" అన్నాడు.

"మిమ్మల్ని పలకరించాలని నాకెందుకు తీవ్రంగా అనిపించిందో ఇప్పుడు అర్థమవుతోంది. మీకు అభ్యంతరం లేకపోతే మీతో కొంత సమయం గడుపుతాను" అన్నాను.

అతనేమనుకున్నాడో కాని కొంతసేపటి మౌనం తర్వాత ఒప్పుకున్నట్టుగా తలూపాడు.

"మీరు కేవలం ఇక్కడికే వస్తానన్నారు, మన దేశంలో ఆధ్యాత్మిక ప్రత్యేకతలు, మహత్మ్యాలతో అలరారే ఆలయాల సందర్శనం చేయరా?" అడిగాను.

అతను ఆకాశంలో గిరికీలు కొడుతూ విహరిస్తున్న పక్షిని చూస్తూ-

"పుట్టింది మొదలు చనిపోయేవరకు మనిషి మనశ్శాంతిని అభిలషిస్తాడు. పుట్టింది ఏ జాతిలో, కులంలో, మతంలో అయితే ఆయా సంప్రదాయాల వృత్తంలో అలుపులేకుండా తిరుగుతుంటాడు. విచిత్రమేమిటంటే తను మనిషినన్న విషయం మర్చిపోయి ఆయా జాతి, కుల, మతాలకు ప్రాతినిధ్యం వహించడంలో తలమునకలవుతాడు. అందులో మనశ్శాంతి లభిస్తుందని ఆరాటపడతాడు. నిజానికి మనశ్శాంతి అందులో ఉండదు.

దేవుణ్ని నమ్మితే ఆస్తికుడు లేదంటే నాస్తికుడన్న ముద్ర. మరి కంటికి ఎదురుగా ఉండే మనిషిని నమ్మితే..? ఏమనాలి? మనిషికి కష్టమొస్తే ఆదుకునేది మనిషా? దేవుడా? సమయానికి మనిషి సహాయం చేసినా, దేవుడారూపంలో వచ్చాడని మురిసిపోవడం నా దృష్టిలో పిచ్చితనానికి పరాకాష్ఠ!"

"అంటే మీ దృష్టిలో ఆస్తికత్వానికి విలువ లేదా?" ప్రశ్న అడగొచ్చో లేదో అనుకుంటూనే అడిగేశాను.

"మనిషితత్త్వాన్ని మరుగున పడేసే ఆస్తికత్వం ఎందుకు? మానవుడే మాధవుడంటారుగాని చేతల్లో అది కనిపించదు. ఎవరికన్నా ఉపకారం చేయాలంటే మనసులో ఎన్ని లాభ నష్టాల బేరీజులేసుకుంటారో. లోకంలో పుణ్యం అన్న మాట లేకపోతే సహాయ సహకారాలన్నీ చాలావరకు సద్దుమణగిపోతాయి"

అతనన్న మాటల్లో వాస్తవం ఉంది! చిన్నప్పట్నుంచి పాపం పుణ్యం అందరి మనసు పొరల్లో నిక్షిప్తమయిపోయాయి. ఏది పాపమో, ఏది పుణ్యమో మన పెద్దవాళ్ళు నిర్దేశించారు. పాపం చేయడానికి కొంతమంది మనసు జంకుతుంది. అందుకనే ప్రపంచం ఈ మాత్రం నిలకడగా ఉంది. లేకపోతే అంతా అరాచకం, అస్తవ్యస్తమే! 

"మన పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు దానం, ధర్మం, నీతి, మానవత్వాలకు పెద్దపీట వేశాయి కదా?" అతనికి పురాణ పరిచయం ఉందో లేదో అని సంశయిస్తూ అడిగాను.

"ఒక్క హిందుమతంలోనే కాదు ఏ మత సాహిత్యంలోనైనా, సమాజ వికాసానికి మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న సారాంశాన్ని పక్కనపెట్టి, వ్యక్తులకు పట్టం కట్టారు. రామాయణం విషయం తీసుకుంటే ‘మనిషి ఎలా ఉండాలి?’ అనే విషయాన్ని గ్రహించాల్సింది పోయి రాముణ్ని దేవుణ్ని చేసి అడుగడుగునా గుడికట్టి పూజిస్తున్నారు. భాగవతం కృష్ణున్ని భగవంతుణ్ని చేసింది. బైబిల్ క్రీస్తును చర్చిలో నిలిపింది, ఖురాన్ మహమ్మద్ ప్రవక్తకు పట్టంకట్టింది. ఏ గ్రంథంలోనైనా ఆనాటి సామాజిక పరిస్థితులను పరిచయం చేస్తూ, మనుషుల విచిత్ర పోకడలను, రాక్షసత్వాన్ని, పైశాచికత్వాన్ని చిత్రిస్తూ ఒక చరిత్రాంశంలా ‘మనిషన్నవాడు అలా ఉండకూడద’ని హెచ్చరించింది. మనిషితత్వాన్ని, మానవత్వాన్ని అవతారరూపంగా విస్తృత పరచింది. సద్గుణాలను, సత్ప్రవర్తనను అలవరచుకోకుండా కేవలం చదవడం, మనిషిని పరమాత్ముణ్ని చేయడం, పూజించడం పారమార్థికత అనుకుంటే ఎలా? 

దేవుడు గుణాతీతుడు, సర్వోన్నతుడు(మానసిక స్థితిలో) అనుకుంటే పూజలు, మొక్కులు, కానుకలు, సేవలకు లొంగే అల్పమనస్కుడిగా చూడడం మన అధమ మానసిక స్థాయికి సూచిక కాదా? పిండికొద్దీ రొట్టెలాగా, డబ్బుకొద్దీ దర్శనం ఎంత హాస్యాస్పదం. దేవుడు ఒక్కడే అంటారు. కాని ఒక్కొక్కరికీ ఒక్కోదేవుడు. దేవుడు ఎక్కడో లేడు హృదయంలో కొలువుంటాడని చెబుతూ అవిశ్రాంతంగా కొండలు కోనలు తిరుగుతుంటారు. మనోస్థిరత్వం లేని మనిషికి అసలంటూ దేవుడనేవాడుంటే పట్టుపడతాడా?"  

"మిమ్మల్ని ప్రశ్నలతో విసిగిస్తున్నానుకోవద్దు. సూర్యబింబంలా బహిర్గతమవుతున్న మీ అంతరంగం ఇన్నాళ్లుగా నా మనసుకు చుట్టుకున్న చీకటి పొరలను తొలగిస్తోంది. కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఆధ్యాత్మికత అనే మత్తు మానవజాతిని పట్టి పీడిస్తోందన్న విషయం క్రమంగా అర్థమవుతోంది"

అంతలో ఓ చిన్నపిల్ల విసిరిన బంతి తన దగ్గరికి రావడంతో, దాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లకిచ్చి వచ్చికూర్చున్నాడు కిరణ్.

తర్వాత మళ్లీ కొనసాగిస్తూ "ఇదిగో ఇప్పుడు నేను చేసిన ఈ చిన్న పని ఆ పసి మనసులో లోకం మొత్తం మంచిదన్న విత్తనం వేస్తుంది" అని చెప్పి "ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు. ఒకరు తమ మేధతో దేన్నైనా కనిపెట్టేవారు. మరొకరు దాన్ని ఉపయోగించుకునేవారు. మన వెనకటితరాల్లోని మేధావులు దేవుణ్ని కనిపెట్టారు. దాన్ని ఉపయోగించుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంతమంది బతుకుతున్నారు. అంటే కోపం వస్తుంది కాని, ఇదీ తరతరాలుగా సాగుతున్న లాభసాటి వ్యాపారమే. అనుకున్నది జరిగితే దైవలీల అనుకుంటారు, జరక్కపోతే మనలోనో, మనపూజలోనో లోపం అనుకునే చిత్రమైన స్థితిలో ఉంటారు. అదో మానసిక బలహీనత అనుకోకుండా, చాలామంది దాన్నే గుడ్డిగా అనుసరిస్తున్నారు"

ఒక వ్యక్తి వయసు నలభై ఉండొచ్చు, ఐదడుగుల ఆరంగుళాలుంటాడు, తెల్లటి లాల్చీ పైజమా ధరించి ఉన్నాడు. మా వైపుగా వచ్చి మాకు కొద్ది దూరంలో అటువైపుగా ముఖం చేసుకుని కూర్చున్నాడు.

అతనివంకోసారి చూసి కిరణ్ చెప్పడం ప్రారంభించాడు-

"పోయిన్నెల మా నాన్నగారు చనిపోయారు. కార్యక్రమ నిర్వహణకు, దానాలకు ఓ భ్రాహ్మణుడు ఖరీదైన ప్యాకేజీ చెప్పాడు. నేనా చిన్న ఉద్యోగిని, ప్రైవేటు ఉద్యోగి అయిన మా నాన్న సంపాదించిన అరకొర డబ్బు ఇలా దాన ధర్మాలకు, కర్మలకు కర్చుపెడితే రేపటిరోజున మా అమ్మ ఎలా బతుకుతుంది? మా నాన్న ఆత్మశాంతి అన్నది ఆయన పార్థివ శరీరానికి చేసే కర్మల్లో కాదు, మా అమ్మ ఏ చీకూచింతా లేకుండా బతకడంలో ఉంటుందనిపించి, విద్యుత్ దహన వాటికలో దహనం చేయించాను. పన్నెండు రోజుల కార్యక్రమాలు సామాన్యంగా జరిపించాను. చుట్టాలనబడే వాళ్ల నోళ్లు రకరకాలు మాట్లాడాయి. పట్టించుకోలేదు. పదిమంది కోసం కాకుండా మనకు తోచింది సవ్యంగా చేయడం సంస్కారం అనిపించింది. అదే చేశాను.

ప్రకృతిలో పంచభూతాల ధర్మాలు అన్నిచోట్లా ఒకేలా ఉంటాయి. అది శాస్త్రం, అదే సత్యం. కాని మరణించడం తర్వాత చేసే తతంగం ఒక్కో జాతి, మత, కులం, తెగలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ వారికి సద్గతులు ప్రాప్తించాయని మానసికంగా సంతృప్తిని పొందుతారు. మరి ఏ పద్ధతి  మరణించిన వారి ఆత్మకు నిజమైన శాంతిని ప్రసాదిస్తుంది? సమాధానం దొరకని ప్రశ్న ఇది. పుట్టిన జీవికి మరణం అనివార్యం. ఏ ఇతర జీవికీ లేని కర్మకాండలు మనిషి తన తెలివితో మనిషి కోసం రూపొందించాడు. దాన్ని అలా గుడ్డిగా అమలు పరుస్తారు చాలామంది. మన దేశంలో చనిపోయిన వారి అస్థికలను పవిత్రనదుల్లో కలుపుతారు. ఒకవేళ ఒకదేశంలో అలాంటి నది ఒక్కటీ లేకపోతే అది ఆ చనిపోయినవాడు చేసుకున్న దౌర్భాగ్యమా? వాడి ఆత్మ పవిత్రతనొందదా? అసలు ఆత్మ అంటే జీవికి శరీర పంజరం నుంచి స్వేచ్ఛ లభించే గాలి అని, ఎటువంటి వికారాలు సోకని పవిత్రమైనదని అంటారు కదా, మరి దానికి శాంతి లభించడమేంటి? కాస్త నిదానంగా ఆలోచిస్తే ఇక్కడే మన పూర్వికుల తెలివితేటలు స్పష్టమవుతాయి"

ఏవిటీమనిషి? నా మనసు చీకట్లో దీపం వెలిగించి క్షణక్షణానికి కాంతి పెంచుతున్నాడు. ఆలోచనలు కొత్తదారి పడుతున్నాయి. ఇతడు సన్యాసి, స్వామీజీ, ప్రవచనకారుడూ కాడు. మామూలు మనిషి, అయినా తరతరాలుగా పేరుకుపోయిన సంప్రదాయ మకిలీని మాటల్తో శుభ్రం చేసి, కంపు కొడుతున్న హృదయాన్ని ఉతికి ఆరేస్తున్నాడు.

మాకు కొద్ది దూరంలో కూర్చున్న వ్యక్తి మా వైపు తిరిగాడు.

"మన దేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ధర్మ ప్రవచనాలు చెబుతూ నీతిని బోధించే స్వామీజీలు ఉన్నారు. అనుసరించే వందలు, వేలు, లక్షల శిష్యగణాలు ఉన్నారు. అయినా పేపరు తిరగేస్తే మానవ మృగాల సంచారం, వారి అకృత్యాలు, ఆగడాలు మితిమీరి కనిపిస్తాయి. సన్యాసులు ఎక్కడో ఆశ్రమాల్లో ఒక మూల కూర్చుని ధ్యానంలో, సత్సంగాల్లో కాలం వెళ్లదీసే బదులు సమాజంలో సంచరిస్తూ నేరాలను అడ్డుకోవచ్చుకదా, రక్షణ కవచంలా మారొచ్చు కదా, ఊహూ, అలాంటివేం చేయరు. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు సైనికులు, భద్రతా సిబ్బంది, సాధారణ మనుషులు సహాయక చర్యల్లో పాల్గొంటారు కాని, కాషాయంబరధారులందరూ ఊకుమ్మడిగా పాల్గొని సహాయ సహకారాలు అందించవచ్చు కదా! అలా చేయరు. దీని అర్థం ఏమిటి? మనిషి లోని దేవుణ్ణి వాళ్ళు చూడలేకపోతున్నారనే కదా! ఆధ్యాత్మికత ముసుగు అర్థం లేనిదనే కదా? మనసు గంగ కానప్పుడు, శరీరం గంగానదిలో మునకలేయడం అవివేకం. నేనందుకే దేవుళ్లు, పూజా తతంగాలు లేని, ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపారం కనిపించని మానసిక ప్రశాంతతనిచ్చే ఈ ప్రదేశానికి వస్తాను. ఇక్కడ మనుషులు, మనసులు ఒక్కటిగా ఉంటాయి. దాన్ని మౌనంగా అనుభూతిస్తాను "

ఇతన్ని కలిసే వరకు దేవున్ని వెదికే పనిలో ఉండేవాణ్ని, ఇప్పుడు దేవుడు మన పక్కనే మరో మనిషి రూపంలో ఉన్నాడన్న ఉనికి లభించింది. అన్నట్టు దేవుడంటే పంచభూతాలు, వాటి కలయిక అయిన జీవ జంతుజాలం. ప్రకృతిలోకొచ్చి, సంచరించి, ప్రకృతిలో కలిసిపోడానికి మధ్య ఎన్ని నమ్మకాలు? మూఢనమ్మకాలు? విశ్వాసాలు? మనిషి ప్రశాంతత అతని ఆలోచనా విధానంలోనూ, నిత్యజీవిత కర్మాచరణలోనూ ఉంటుంది. అది వదులుకుని ఒంటిపూట తింటూ డబ్బులు కూడబెట్టుకున్నామని దూరాభారాలు భరించి ఆలయాలు తిరగడం, ఎవరో పెద్ద(?) మనిషి ఆసువుగా చెప్పే మాటలు నాగస్వర శబ్దంగా గ్రహించి తలలూపడం, మతమార్పిడులు, వేధింపులు ఇదా మనకోసం మనం సృష్టించుకున్న మరో కలుషిత ప్రపంచం కాదా? 

నేను ఆలోచనలో ఉండగానే మాకు కొద్ది దూరంలో కూర్చున్న వ్యక్తిని, మరోమనిషి తీసుళ్లడానికి వచ్చాడు. వాళ్లూ తెలుగువాళ్ళే అని మాటలను బట్టి అర్థమైంది. అతడు కిరణ్ మాటలు నచ్చినట్టుగా బొటనవేలు, చూపుడు వేలు కలిపి సంజ్ఞ చేశాడు. ఆ వ్యక్తి మూగవాడన్న విషయం అతని పక్కనున్న మనిషి చెప్పాడు.

"మీ మాటలు అతణ్నీ ప్రభావితం చేశాయి" అన్నాను నవ్వుతూ.

"ప్రభావం అన్న మాట నాకు నచ్చదు. ఎవరి ప్రభావం, దేని ప్రభావం ఎవరిమీదా ఉండకూడదు. స్వతంత్రంగా ఆలోచించకపోవడమే ఇప్పటి ఈ మన స్థితికి కారణం. ఎవరేం చెప్పినా వింటాం. కాస్తయినా ఆలోచించం. మానవుడు విచక్షణతో జన్మించింది.. ప్రకృతికి ఏదైనా ఉపకారం చేయడానికి, కాని మనిషితో సహా ప్రకృతికీ అపకారమే జరుగుతోంది. నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? అన్న సృష్టి రహస్యాన్ని తెలుసుకోడానికి కొంతమంది సంప్రదాయవాదులు, ఛాందసులు తెగ తాపత్రయపడుతుంటారు. అది అనవసరం అని నా అభిప్రాయం. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళతామన్నది సృష్టి కర్త చూసుకుంటాడు. భూమ్మీదకు మనం వచ్చినందుకు ఏదైనా సాధించడమే ముఖ్యం. అన్నట్టు మిమ్మల్ని నా దగ్గరకు రప్పించింది ప్రాంతీయాభిమానమైతే శోచనీయం. మానవత్వం అయితే హర్షణీయం" అని లేచి నుంచున్నాడు వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ.

నా మనసు నావకు చుక్కానిగా నిలిచిన ఆ మహామనీషికి వీడ్కోలు చెబుతూ నమస్కరించాను. అతను ముందుకు కదిలాడు. 

సూర్యుడు పడమటి కొండల మాటుకు వెళ్ళిపోయాడు. చీకటి పడింది కాని సూర్యకిరణాలు ప్రసరించిన సమయంలో చక్కబడిన నా మనసు ఇప్పుడు స్పష్టమై, సవ్యంగా కాంతులీనుతోంది.        

***


No comments:

Post a Comment

Pages