చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 16 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 16

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 16

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)

ఆంగ్ల మూలం : The moonstone castle mistery 

నవలా రచయిత : Carolyn Keene

 


(కందకం పైన ఉన్న వంతెనను తీగలతో నేలకు బిగించి కట్టేస్తారు ఆ ఇద్దరు యువతులు.  ఆ కోట దొంగలకు రహస్య స్థావరంగా ఉందేమో తెలుసుకోవటానికి నాన్సీ ఫోనులో తన మిత్రుడు నెడ్ సాయం అడుగుతుంది.  మరునాటి మధ్యాహ్నానికి తాను మిత్రులతో కలిసి వస్తానని చెబుతాడు.  అలాన్ అన్న యువకుని ఆహ్వానంపై పిక్నిక్ కి బయల్దేరబోతున్న సమయంలో గన్నేరు పొదల్లో ఉంచిన నాన్సీ కారు మాయమవుతుంది.  నాన్సీ వెంటనే కారు దొంగతనం గురించి స్థానిక పోలీసులకు ఫోనులో తెలియపరుస్తుంది.   తరువాత. .....)

@@@@@@@@@@@@


"కారు తాళాలను నేను ఇగ్నిషన్లో వదల్లేదు.  కారు దొంగ మాత్రమే దాన్ని తీయగలడు."  


  యువజనమంతా డీప్ రివర్ ప్రాంతమంతా వెతికి చూసినా, మాయమైన కారు జాడను కనుక్కోలేకపోయారు.  చివరకు వాళ్ళు పోలీసు కేంద్ర కార్యాలయం దగ్గర ఆగినప్పుడు, తన కారు గురించి ఎలాంటి సమాచారం లేదని నాన్సీకి చెప్పబడింది.  


  "కానీ ఎవరో," సార్జెంట్ చెప్పాడు, "మీ కన్వర్టిబుల్ లాంటి కారులో ఒక  స్త్రీ ఈ పట్టణాన్ని దాటి వెళ్తుంటే చూశాడు." 


  ఈ ఆశ్చర్యకరమైన సమాచారం గురించి నాన్సీ ఆలోచిస్తూంటే, సార్జంట్ యిలా చెప్పాడు, "అయితే, మీరు అడిగిన కారు యజమాని రాల్ఫ్ సీమన్.  అతను 24, విల్లో రోడ్డులో నివసిస్తున్నాడు."


  "ధన్యవాదాలు" అంది నాన్సీ.


   ఈ సమయానికి నాన్సీ అలాన్  అమ్మమ్మ రైడర్ యొక్క పిక్నిక్ పై ఉన్న ఉత్సాహాన్ని కోల్పోయింది.  కానీ ఆమె ఆసక్తి లేని ఆటగాడిలా కనిపించటం యిష్టం లేక మిగిలినవారిని అనుసరించింది.  వారంతా ఆకర్షణీయమైన ఆ వృద్ధ మహిళను అభినందిస్తూ, తామిలా కలుసుకొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు.  తరువాత యువజనులంతా పక్కకు వెళ్ళిపోయారు.  


  "మీ జీవితంలో యింత ఆహారాన్ని ఎప్పుడైనా చూశారా?" బెస్ అడిగింది.  ఆమె దృష్టంతా ఎన్నో రకాల రుచికరమైన వంటకాలతో నిండిన అనేక పొడవైన బల్లలపై కేంద్రీకృతమైంది.  


  "నేను దీన్ని విందు అని పిలిస్తాను!" అని జార్జ్ చెప్పింది. 


  అలాన్ మరియు ఆ అమ్మాయిలు ఆ చోటంతా తిరిగారు.  అతను ఒక బల్ల చివర ఉన్న దొంతర నుంచి తలొక పళ్ళాన్ని తీసి ప్రతి ఒక్కరికి యిచ్చాడు.  తరువాత వారికి వంటకాలను ఎంచుతూ అటూ యిటూ వెళ్తున్నాడు. 


 నాన్సీ ఒక చెంచా నిండుగా చికెన్ సలాడ్ తీసి తన పళ్ళెంలో వేసుకొంటూంటే, ఆమె చేతిని ఎవరో తట్టారు.  ఆమె అటు తిరిగి చూసింది.


  "మిస్టర్ వీలర్! ఎలా ఉన్నారు?" అంటూ పలకరించిందామె.


  "మిస్ నాన్సీ! నేను మీతో ఏకాంతంగా మాట్లాడవచ్చా?" అడిగాడతను.


  నాన్సీ తన పళ్ళాన్ని పక్కనున్న బెస్ చేతికిచ్చి, వంటకాలను దానిలో నింపమని చెప్పింది.  తరువాత న్యాయవాదితో కలిసి దూరంగా వెళ్ళింది.  


  "మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచనని వాగ్దానం చేస్తున్నాను" వీలర్ అన్నాడు.  "హోర్టన్ కేసు విషయంలో నన్ను ఆలోచింపజేశారని మీకు తెలుసు."


గతాన్నంతా ఒకసారి నెమరువేసుకొన్నానని వీలర్ చెప్పాడు.  మొత్తం వ్యవహారంలో జరిగిన దానికి అతను ఆశ్చర్యపోవటం ప్రారంభించాడు.  


  "సంవత్సరాల క్రితం సంభవించినదేదో విషయం నాకు గుర్తుకొచ్చింది" అని చెప్పాడతను.  "నది అవతల ఉన్న ఒక వ్యక్తిని కలవటానికి మీరు నాతో రావాలని కోరుతున్నాను.  అతను ఈ రహస్యంలో  కొంత వెలుగులోకి తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను."


  నాన్సీ మొదట సంశయించింది.  తరువాత, "మీరు ఎప్పుడు వెళ్ళాలనుకొంటున్నారు?" అని అడిగింది.  


  "మనం ఈ పార్టీనుంచి బయటపడిన వెంటనే" న్యాయవాది బదులిచ్చాడు.  


  "మనం  ఎలా వెళ్తాం?" నాన్సీ అడిగింది.


"నా దగ్గర ఒక మోటారు బోటు ఉంది.  అది యిక్కడకు దగ్గర్లోనే లంగరేసి ఉంది." 


  "నా స్నేహితుల్లో ఒకరిని నాతో తీసుకొస్తాను" అంది నాన్సీ.   "సంగీతకారుల కార్యక్రమం అయిపోగానే నేను మిమ్మల్ని కలుస్తాను."  అప్పుడే లోనికొస్తున్న సంగీతకారులు అందమైన గులాబీ తోట పక్కన తమ స్థానాలను ఆక్రమించుకోవటం ఆమె గమనించింది.  


  "అయితే సరె!  తొమ్మిది గంటలు."


  నాన్సీ తన స్నేహితురాళ్ళను కలిసి, బెస్ మరియు జార్జ్ లతో తన పథకాల గురించి గుసగుసలాడింది.  తను అలాన్ తో కలిసి ఉండటానికే యిష్టపడతానని, అయితే ఈ మిస్టరీ గురించి అతనికి చెప్పకపోవటమే మంచిదని బెస్ చెప్పింది.  జార్జ్ వెళ్ళటానికి తన ఆత్రుతను తెలియపరచింది.  


  సరిగా తొమ్మిది గంటలకు అమ్మాయిలిద్దరూ వీలర్ని కలుసుకొన్నారు.  అతను వారిని పల్లపు బాటలో తీసుకెళ్ళాడు. తరువాత నదిని ఆనుకొన్న గట్టు వెంట కొంత దూరం వెళ్ళి వారు బోట్ హౌసుని చేరుకొన్నారు. 


 అతను ప్రవేశ ద్వారానికి ఉన్న తాళాన్ని తీయగా, వాళ్ళంతా నిగనిగలాడుతున్న మోటారు బోటులోకి ఎక్కారు.  వీలర్ గోడ వైపు వంగి, అక్కడ ఉన్న బటన్ని నొక్కగానే ముందు ఉన్న పెద్ద తలుపు పైకి చుట్టుకొంది.  న్యాయవాది మోటార్ని ఆన్ చేయగానే, ఆ పడవ బోట్ హౌస్ నుంచి రయ్యిమంటూ నదిలోకి దూసుకుపోయింది.  


  "అతను వేగంగా నడిపే పైలట్" జార్జ్ నాన్సీ చెవిలో గుసగుసలాడింది.  పడవ నదికి అడ్డంగా పరుగులు తీస్తోంది.


వాళ్ళు నది అవతలి తీరానికి చేరుకొన్నారు.  వీలర్ పడవ స్టీరింగుని  కుడిచేతి వైపు వేగంగా తిప్పాడు. 


 అమ్మాయిలిద్దరూ ఒకరి ముఖం  ఒకరు చూసుకొన్నారు.  వారికి ఆ నది గురించి తెలియకపోయినా, ఆ చీకట్లో తాము తీరానికి చాలా దగ్గరగా వచ్చినట్లు అమ్మాయిలిద్దరూ భావించారు.   


  వీలర్ మరింత బలాన్ని ప్రయోగించాడు.  జార్జ్ మెల్లిగా గొణిగింది, "ఒక వృద్ధుడికి. . .ఇతను వేగంలో దయ్యంలా ఉన్నాడు!"


  నాన్సీ భయంతో వణికిపోయింది.  ఆమె ఒడ్డుకి దూరంగా వెళ్ళమని న్యాయవాదిని అడగబోతోంది.  అంతలో ఏదో బలంగా గుద్దుకొన్న శబ్దం వినిపించింది.  పడవ వేగంగా ఒక చుట్టు తిరగటంతో, దానిలోని ప్రయాణీకులు చిందర వందరగా పడిపోయారు.


@@@@@@@@@@@


నాన్సీ, జార్జ్ పూర్తిగా తేరుకొనేసరికి అర నిమిషం పట్టింది.  పడవ ప్రమాదానికి వాళ్ళు పూర్తిగా చలించిపోయారు.  చిన్న పడవలేవీ అక్కడ లేనందున, తమ మోటారు బోటు ఒక బండరాయిని ఢీకొందని వారు ఊహించారు.   


  "నాన్సీ!" జార్జ్ అరిచింది.  "పడవ నీటితో నిండుతోంది.!"  


  "అవును.  వీలర్ స్పృహ కోల్పోయాడు!" 


  పడవకైన రంధ్రాన్ని మూయటానికి ప్రయత్నించటం వ్యర్ధమని అమ్మాయిలు గ్రహించారు.  వారు గట్టుకి ఈత కొట్టి చేరాలి.  అంతేగాక తమతో స్పృహ తప్పిన వీలర్ని తీసుకెళ్ళాలి.  నది యొక్క ఆ భాగంలో గట్టున చాలా చీకటిగా ఉంది.  ఆ గట్టు చెట్ల వరుసలతో నిండి ఉండటంతో అక్కడ నదిలో నీరు ఎంత లోతు ఉందో తెలుసుకోవటం అమ్మాయిలకు కష్టం.  


   తాము ఆ వైపుకు బయల్దేరే ముందే వీలర్ ని స్పృహలో కొచ్చేలా చేయాలని వారు ప్రయత్నించారు.  అది నిరాశాజనకమైంది.  ఆ సమయానికి పడవలో ఆరు అంగుళాల ఎత్తు వరకు నీరు నిండింది.   


  "ఇక్కడ లోతు ఎంత వరకు ఉందో నేను చూస్తాను" అంది నాన్సీ.  తరువాత ఆమె పడవలోనుంచి నదిలో దిగి మాయమయ్యింది.


(సశేషం)

No comments:

Post a Comment

Pages