ప్రపంచ ప్రమాణాల దినోత్సవం – నాణ్యతపై అవగాహనకోసం శంఖారావం! - అచ్చంగా తెలుగు

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం – నాణ్యతపై అవగాహనకోసం శంఖారావం!

Share This

 ప్రపంచ ప్రమాణాల దినోత్సవం – నాణ్యతపై అవగాహనకోసం శంఖారావం!

ప్రతాప వెంకట సుబ్బారాయుడు




మన జీవితంలోని ప్రతి అంశానికీ ఒక సమతుల్యత, ఒక కొలత, ఒక స్థిరమైన ప్రమాణం అవసరం. మనం త్రాగుతున్న నీటి నుంచి, తినే ఆహారం, ముడి పదార్థాలు, పరికరాలు, యంత్రాలవరకు ప్రతి దానికీ ఒక నాణ్యతా ప్రమాణం ఉండాలి. ఈ ప్రమాణమే భద్రతకు పునాది, విశ్వసనీయతకు గుర్తు, మరియు అభివృద్ధికి మార్గం. ఈ సూత్రాన్ని గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 తేదీని ‘ప్రపంచ ప్రమాణాల దినోత్సవం (వరల్డ్ స్టాండర్డ్స్ డే)”గా జరుపుకుంటారు.

ప్రమాణాల ఆవిర్భావం పరిశ్రమల అభివృద్ధితో ముడిపడి ఉంది. 19వ శతాబ్దం చివరలో యంత్రాల తయారీలో గందరగోళం, కొలతల్లో వ్యత్యాసం, ఉత్పత్తుల అసమానత వలన ప్రపంచ దేశాలు ఒకే పద్దతిని అనుసరించాలనే ఆలోచనకు వచ్చాయి. 1901లో బ్రిటన్‌లో స్థాపించబడిన BSI (బ్రిటీష్ స్టాండర్డ్స్ ఇన్ స్టిట్యుషన్) మొదటి ప్రమాణ సంస్థ. తరువాత 1947లో ISO (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) ఏర్పడింది. ఈ సంస్థ ప్రపంచంలోని 160కుపైగా దేశాలతో కలిసి అన్ని రంగాలకు ప్రమాణాలను రూపొందిస్తోంది.

భారతదేశంలో ప్రమాణాల చరిత్ర 1947లో స్థాపించబడిన ISI (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్ స్టిట్యూషన్)తో మొదలైంది. అది తరువాత 1986లో BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్)గా రూపాంతరం చెందింది. BIS మన దేశంలో నాణ్యతకు బాటలు వేసిన ప్రధాన సంస్థ. విద్యుత్ పరికరాలు, వినియోగ వస్తువులు, ఆహార పదార్థాలు, ఇంధనాలు, నిర్మాణ సామగ్రి వంటి వేర్వేరు ఉత్పత్తులకు BIS ప్రమాణాలను నిర్దేశిస్తుంది.

ప్రమాణాలు ఎందుకు అవసరం? ఎందుకంటే ఒక ఉత్పత్తి విశ్వసనీయంగా ఉండాలంటే అది సామాన్యంగా అంగీకరించబడిన నియమాల ప్రకారం తయారవ్వాలి. ఒక విద్యుత్ ప్లగ్ ప్రతి దేశంలో సరిపడాలంటే దానికి ఒక పరిమాణం ఉండాలి. ఒక ఔషధం తయారీలో మోతాదు తప్పకూడదు. ఒక వాహన బ్రేక్ వ్యవస్థ విశ్వసనీయంగా ఉండాలి. ఈ స్థిరత్వం అందించే సాధనం ప్రమాణమే.

ప్రస్తుతం ISO, IEC (ఇంటర్నేషనల్ ఎలెక్ట్రో టెక్నికల్ కమీషన్), ITU (ఇంటర్నేషనల్ టెలికమ్యునికేషన్ యూనియన్)వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ప్రమాణాలు రూపొందిస్తుంటే, భారతదేశంలో BIS  తో పాటు FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆహార రంగంలో, CDSCO (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఔషధ రంగంలో, NABL (నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్) ప్రయోగశాల ప్రమాణాల పరిశీలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పరిశ్రమలలో ASTM (అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ అండ్ మెటీరియల్స్) (యుఎస్‍ఎ), DIN (జెర్మన్ ఇన్ స్టిట్యుట్ ఫర్ స్టాండర్డైజేషన్)(జర్మని), JIS (జపనీస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్) (జపాన్) వంటి సంస్థలు కూడా సాంకేతిక ప్రమాణాల రూపకల్పనలో ముందంజలో ఉన్నాయి.

ప్రతి రంగంలో ప్రమాణాల ప్రాముఖ్యత భిన్నంగా ఉంటుంది. ఆహార భద్రతలో FSSAI లేబుల్ మన ఆరోగ్యానికి హామీ ఇస్తే, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో BIS ISI మార్క్ భద్రతకు రక్షణ కవచంగా ఉంటుంది. విద్యా రంగంలో NAAC (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్), NBA (నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిషన్) ప్రమాణాలు విద్యా నాణ్యతకు దర్పణమైతే, పర్యావరణ ప్రమాణాలు (ISO 14001) మన భూమిని సంరక్షించే సంకల్పాన్ని తెలియజేస్తాయి.

ఇవి కేవలం పత్రాల రూపంలో కాకుండా, ఆకస్మిక తనిఖీలు, నిర్ధారణ పరీక్షలు, నాణ్యతా ఆడిట్‌ల ద్వారా నిరంతరంగా పరీక్షించబడతాయి. ప్రతి ఉత్పత్తి ల్యాబ్‌లో పరీక్షించబడిన తర్వాతే ISI లేదా ISO గుర్తు పొందుతుంది. అయితే కొన్ని సంస్థలు నకిలీ సర్టిఫికేట్లు, తప్పుడు లేబుల్‌లు ఉపయోగించి వినియోగదారులను మోసగిస్తాయి. అలాంటి మానిప్యులేషన్‌ను నిరోధించడానికి వినియోగదారులు BIS అధికారిక వెబ్‌సైట్ లేదా QR కోడ్ ద్వారా ఉత్పత్తి నంబర్‌ను ధృవీకరించాలి.

ప్రమాణాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు. BIS Act, 2016 ప్రకారం తప్పుడు ISI మార్క్ ఉపయోగించిన సంస్థలకు రూ.2 లక్షల వరకు జరిమానా, 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చు. అంతేకాదు, ఉత్పత్తి లైసెన్స్ రద్దు, మార్కెట్ నుంచి ఉత్పత్తి తొలగింపు వంటి చర్యలు కూడా చేపడతారు.

ప్రభుత్వం “జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్” అనే నినాదంతో ఉత్పత్తులు లోపరహితంగా ఉండటమే కాకుండా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం లేకుండా ఉండాలని ప్రోత్సహిస్తోంది. “మేక్ ఇన్ ఇండియా”లో భాగంగా భారత తయారీ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపడేలా ప్రోత్సహిస్తోంది.

ఇప్పుడు అవసరం ఏమిటంటే ప్రజల్లో, ఉద్యోగుల్లో, కార్మికుల్లో ప్రమాణాల పట్ల అవగాహన పెంపొందించడం. నాణ్యతను కేవలం తనిఖీలతో కాకుండా బాధ్యతతో పరిరక్షించాలి. ప్రతి ఉత్పత్తి వెనుక ఒక కార్మికుడి కృషి, ఒక ఇంజనీర్ ఆలోచన, ఒక దేశం గౌరవం దాగి ఉంటుంది. ప్రమాణాలను పాటించడం అంటే మన సమాజాన్ని, మన భవిష్యత్తును గౌరవించడం.

ఏదైనా పరికరం, వస్తువు కొనాలంటే అది ఏ ప్రమాణానికి అనుగుణంగా ఉందో చూడాలి. ఆ ప్రమాణంలోని అంశాలకు సరిపోతుందో లేదో అడిగి తెలుసుకోవాలి. డబ్బు చెల్లించి ఒక వినియోగదారుడిగా ఒక వస్తువు కొంటున్నప్పుడు దానిపట్ల కనీస పరిజ్ఞానం, అవగాహన ఉండాలి. అప్పుడే చెల్లించిన దానికి సరైన విలువ పొందినట్టు. కొన్నాక గ్యారంటీ లేదా వారంటీ వర్తించే బిల్లుపై స్టాంప్ వేయించుకోవాలి. ఈ విషయంలో అలసత్వం చూపకూడదు. నాసిరకంవి ఉపయోగించడం వల్ల త్వరగా క్షీణించి, పాడైపోయి, పనికి అంతరాయం కలిగిస్తాయి, అదే అన్ని జాగ్రత్తలతో కొంటే అది ఎంతకాలం పనిచేయాలో అంతకాలం సర్వీసు ఇస్తుంది.

ఒకవేళ వస్తువు చెడిపోయినా ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ లో చూపించి మరమ్మత్తు(రిపెయిర్) చేయించుకోవాలి. అక్కడైతే ఆ వస్తువు పట్ల తగిన పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులు సరిచేస్తారు. మనింటి పక్కనే ఉందనో, డబ్బులు తక్కువ అవుతాయనో దగ్గర్లో ఉన్న షాపులో ఇస్తే, ఇక అంతే సంగతులు. వస్తువు కొనేటప్పుడు, ఎప్పుడన్నా రిపెయిర్ చేయించుకున్నప్పుడు బిల్స్ తీసుకోవడం మరవకూడదు. అంతేకాదు వాటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఒకవేళ ఆ సంస్థల మీద కేసు వేస్తే ప్రూఫ్ గా పనికొస్తాయి. వస్తువులను నియమిత సమయంలో మెయింటెనెన్స్ చేయడం ముఖ్యం. దాని వల్ల వస్తువులు మరింతకాలం మన్నుతాయి. 

ఏ షాపులోనన్నా నకిలీ వస్తువులు అమ్ముతున్నారని గమనిస్తే ‘మనకెందుకులే’ అని ఊరుకోకుండా కంప్లయింట్ నమోదు చేయాలి. అది పౌరులుగా మన కనీస బాధ్యత!

వస్తువులు అమ్మేటప్పుడు సరైన నిర్దారణలు చూపకపోయినా, సేవనందించడంలో లోపం గమనించినా వినియోగదారుల ఫోరం లో కేసు వేయాలి. 

నాణ్యత అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు సంఘటితంగా విజిలెన్సింగ్ చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు ధైర్యంగా వస్తువు కొని, గుండెల మీద చెయ్యేసుకుని వినియోగించుకో గలుగుతాడు.

  ప్రమాణం అనేది కేవలం కాగితంపై వేసే ముద్ర కాదు, అది నాణ్యతకు, నమ్మకానికి ప్రతీక. నాణ్యతను కాపాడటం మనందరి బాధ్యత. ప్రమాణాలను పాటించే సంస్థలు దేశానికి గౌరవం తీసుకువస్తాయి. వినియోగదారులు సైతం అవగాహనతో ఉండి సరైన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటే, సమాజం మొత్తం నాణ్యమైన వస్తువులతో నిండిపోతుంది. అదే కదా ఎవరైనా కోరుకునేది!

ప్రమాణాలతో కూడిన నాణ్యత పొందడం మన హక్కు! ఆ విషయంలో రాజీపడకూడదు!!

***

No comments:

Post a Comment

Pages