ఇందిరానాథుడవు యిందరికి నేలికవు - అచ్చంగా తెలుగు

ఇందిరానాథుడవు యిందరికి నేలికవు

Share This

ఇందిరానాథుడవు యిందరికి నేలికవు

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి





రేకు: 0336-02 సం: 04-209

పల్లవి:

ఇందిరానాథుడవు యిందరికి నేలికవు

చిందరవందరలైన చింతలు మరేలా



చ.1: వుండుమంటే నుండవీవూరకే బ్రహ్మాండాలు

నిండుమంటే నిండినవి నీరధులెల్లా

మెండగుప్రతాపమిదె మించి నీ వినోదమిదె

వొండుదైవాలగొలువ నూరకే మరేలా



చ.2: పుట్టుమంటేబుట్టిరి పూచినదేవతలెల్ల

అట్టే యణగిరిగా అసురలెల్ల

పట్టిన నీచలమిదె బహుళస్వతంత్ర మిదె

వెట్టి దైవాలపనులు వేరే మరేలా



చ.3: కమ్మంటే నాయను కైవల్యపదవులు

రమ్మంటే వచ్చె వేదరాసులెల్లను

కమ్మిన శ్రీవేంకటాద్రి కడపరాయడ నీకు

యిమ్ముల నీమహిమిదె యితరములేలా

భావం



పల్లవి:

కడపరాయడ!(జిల్లా కేంద్రమైన కడపలో పాతకడపలోని శ్రీనివాసుడు)

నువ్వు లక్ష్మీదేవినాథుడవు,ఇందరికి ప్రభువువి. అయినా చిందరవందరలైన(అస్తవ్యస్తం, ఒక క్రమము పద్ధతి లేకపోవటం, చెల్లాచెదరు ) చింతలు మాకు ఎందుకు కలుగుతున్నాయి? (నువ్వు లక్ష్మీదేవినాథుడవు, ప్రభువువి కనుక కలుగకూడదని భావం)


చ.1:

నువ్వు అలా ఉండండి ..అంటే చాలు.. ఈ బ్రహ్మాండాలు(భూగోళ ఖగోళాదికము, అందలి లోకములు. చరాచరాఖిలము.) అలా కదలక ఉన్నాయి. నువ్వు నిండండి అంటే సముద్రాలు నిండినవి .

ఇదంతా నీ వినోదము. నీప్రకాశించే ప్రతాపము.ఇటువంటి గొప్పవాడివయిన నిన్ను వదిలి ఇతర దైవాలను ఊరికే కొలుచుట ఎందుకు? ( కొలవనక్కరలేదని భావం)


చ.2:

నువ్వు పుట్టుమంటే సిరిసంపదలతో నిండిన దేవతలందరూ పుట్టారు.

అలాగే రాక్షసులందరూ నశించారు.

పట్టిన నీ పట్టుదల ఇది. నీ అధికమైన స్వతంత్రము ఇది.(అందువల్లే దేవతల పుట్టుక, రాక్షస వినాశనం జరిగిందని భావం)

ఇంత గొప్పవాడివయిన నువ్వుండగా వేరే దైవాల చాకిరి ఎందుకు చెప్పు? (ఇతరదైవాల సేవ అనవసరమని భావం)


చ.3:

నన్ను ఆశ్రయించిన వారి జీవితాల్లో వ్యాపించండి అని నువ్వు అంటే చాలు మోక్షాది స్థానాలన్నీ వారిని ఆశ్రయిస్తాయి. (స్వామిని నమ్ముకొంటే మోక్షాదులు లభిస్తాయని భావం)

నువ్వు రమ్మంటే వేదరాశులన్నీ(నాలుగు వేదాలు) వచ్చాయి.

శ్రీవేంకటాద్రిలో ఉన్న కడపరాయడ ! నీ గొప్పతనం ఇది. ఇక మిగతా వారి విషయాలు చెప్పుకొనుట ఎందుకు? (అందరి కంటె నువ్వే గొప్పవాడివని భావం)


విశేషాలు

వేదరాశులు

1,ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 4. అథర్వవేదము.("ఋగ్యజుస్సామ చాథర్వేత్యపి వేదచతుష్టయమ్‌")

***

No comments:

Post a Comment

Pages