జ్యోతిష్య పాఠాలు -17 - అచ్చంగా తెలుగు

 జ్యోతిష్య పాఠాలు -17 

PSV రవి కుమార్ పాఠం -
  17

యోగాలు

గజ కేసరి యోగం

ఇది చాలా అద్భుతమయిన యోగం. ఈ యోగం ఉన్న వారు, పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. సుఖవంతమయిన జీవితం కలుగుతుంది.

ఈ యోగం గురు చంద్ర గ్రహాల వలన కలుగుతుంది. చంద్రుడు మరియు గురుడు కలిసి కేంద్ర స్థానాల యందు ఉండిన ఈ యోగం ఏర్పడుతుంది.

చంద్రుని నుండి గురుడు కేంద్ర స్థానాల యందు అనగా 1,4,7,10 స్థానాలయందు ఉన్న ఈ యోగం ఏర్పడుతుంది.

చంద్రుడు ఒకో రాశి లో రెండున్నర రోజులు ఉంటాడు, అంటే, రాశి చక్రం అంతా తిరగటానికి చంద్రునికి పట్టే సమయం నెల రోజులు. అనగా ప్రతి నెలా ఎదో ఒక రెండు రోజులు చంద్రుడు మరియు గురుడు గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ యోగం చాలా మంది జాతాకాలలో కనిపిస్తుంది. కాబట్టి, ఈ యోగం ఎటువంటి జాతకాలలో యోగిస్తుంది అని తెలుసుకుని ఫలితాలు చెప్పవలెను.

ఈ యోగం కేంద్ర స్థానలలో ఏర్పడవలెను. ఇక ఈ యోగం చంద్రుని స్వక్షేత్రం లో కానీ, గురుని స్వక్షేత్రాలలో కానీ, చంద్రుని మరియు, గురుని ఉచ్చ క్షేత్రాలలో ఏర్పడితే అధుత ఫలితాలు పొందుతారు.

గురుడు తన మిత్ర క్షేత్రాలలో ఉన్నప్పుడు మరియు చంద్రుడు కూడా తన మిత్ర క్షేత్రాలలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడిన శుభ ఫలితాలు పొందుతారు.

ఇక ఈ గ్రహాల పైన రవి ద్రుష్టి ఉండరాదు, పాప గ్రహ వీక్షణ మరియు శత్రు గ్రహ వీక్షణ ఉండరాదు. గ్రహములు నీచత్వం పొందరాదు, వక్రించి ఉండరాదు.
పైన తెలపబడిన నియమాల ప్రకారం గజకేసరి యోగం ఏర్పడిన ఆ జాతకుడు మంచి ఫలితాలు పొందుతారు.

ఈ యోగ జాతకులు, అధికారులు గాను, భూస్వాములు గానూ, ఎదయిన ఒక వర్గానికో, లేకా ఉద్యోగం లో ఒక బ్రుందానికో నాయకునిగా ఉండటం జరుగుతుంది.

లగ్నం లో ఈ యోగం ఏర్పడితే, స్వశక్తి తో ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. చతుర్దం లో ఈ యోగం ఏర్పడితే, భూ లాభాలు, వాహన లాభాలు కలుగును. సప్తమం లో ఈ యోగం ఏర్పడితే, కళత్ర సౌఖ్యం, కళత్రం వలన ధన లాభం, వ్యాపారం లో అధిక లాభాలు కలుగును. రాజ్యం లో ఈ యోగం ఏర్పడితే, ఉద్యోగం లో ఉన్నత స్థాయి అధికారి గా ఉండటం లేదా ప్రభుత్వం లో ఉన్నత అధికారి ఉద్యోగం దక్కు అవకాశం కలుగును.

ఈ యోగం ఉన్నవారు సాధారణంగా గురు మహా దశ లోగానీ, చంద్ర మహదశ లో గానీ ఫలితాలు పొందుతారు.

బుధాదిత్య యోగం:

ఈ యోగం రవి బుధుల కలయిక వలన కలుగును. ఈ గ్రహాల కలయిక, సింహ రాశి లో కానీ, మిథున, కన్య రాశులలో కానీ, మేష రాశి లో కానీ కలిగిన మంచి ఫలితాలు పొందుతారు.

సాధారణంగా రవి తో ఏ గ్రహం కలిసినా, ఆ గ్రహం తన సహజత్వాన్ని కోల్పోతుంది. కానీ, బుధుడు మాత్రం రవి తో కలిసిన, యోగాన్ని ఇస్తాడు. ఈ గ్రహాల మధ్య కనీసం 10 డిగ్రీల దూరం ఉండవలెను. అప్పుడే ఈ యోగ ఫలితాలని ఆ జాతకుడు అనుభవిస్తాడు.

ఈ యోగ జాతకులు, ఉన్నత విద్య లో మంచి ర్యాంకు సాధంచును. రీసెర్చ్ రంగం లో రాణించును. మంచి తెలివితేటలు కలిగి ఉండును, వ్యాపార నైపుణ్యం మార్కెటింగ్ తెలివి కలిగి ఉండును. లెక్కల యందు అభిలాష కలిగి ఉండును.  రచనా సామర్ద్యం ఉండును.

***

No comments:

Post a Comment

Pages