శ్రీరుద్రంలో విశేషాలు - 9 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 9

Share This
శ్రీరుద్రంలో విశేషాలు - 9 

శ్రీరామభట్ల ఆదిత్య 
వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽన్ధకారాపహం
వందే రావణనందిభ్రుంగివినతం వందే సుపర్ణావృతమ్
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్... 

పదవ అనువాకం:
( శేష భాగం ) 

హే పరమేశ్వరా! విశ్వనాథా! నీ రౌద్రరూపం శాంతింపబడి లోకమంతా రక్షింపబడుగాక! పశుపక్ష్యాదులు, మనుష్యజంతుసమూహాలన్నీ రక్షింపబడుగాక! నీ చిన్మయశాంతరూపము మమ్ము కాపాడుగాక! హే శంకరా! నీ కారుణ్యపూరిత వచనాలతో మమ్ము ఆదుకో! ఈ ప్రపంచంలోని సమస్త సుఖాలను మాకు ప్రసాదించి మమ్ములను అనుగ్రహిచు తండ్రి! 

ఇలా ప్రార్థించిన భక్తుడు తన మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. " ఓ మనసా! నీ హృదయకమలంలో వసించే రుద్రుడిని ఎల్లప్పుడూ ధ్యానిస్తూండు. జగన్మోహనాకారుడైన రుద్రదేవుని, శత్రుసంహారకుడైన రుద్రుని ధ్యానించు. సింహము వలె భయంకరుడైన రుద్రుని కూడా ధ్యానించు. అలాగే అశేషకీర్తికలిగిన పరమేశ్వరుణ్ణి, ఎప్పుడు పొగడబడే ఆనందతాండవేశ్వరుణ్ణి ధ్యానించు.ఈ శరీరానికి ఆనందాలను, సుఖాలన్నిచ్చే ఆ మంగళస్వరూపుణ్ణి ధ్యానించు. నీ శత్రువులను సంహరించి నిన్ను రక్షించే పార్వతీపతిని ధ్యానించు." 

భక్తుడు మళ్ళీ ఇలా వేడుకుంటున్నాడు " శత్రుభయంకరమైన నీ త్రిశూలము నన్ను కాపాడుగాక! భయంకరుడై, క్రోధమూర్తిగా పాపాలను నాశనంచేసే నీ రౌద్రస్వరూపము నన్ను కాపాడుగాక! ఓ జగన్మయా! నీ భక్తుల కోరికలను తీర్చు. శత్రుసంహారం చేసే నీ యొక్క భయంకర క్రోధమును మాపై చూపకుము, మాపై దయ చూపి మమ్ము కరుణించి మమ్ములను, మా పుత్రులను, వారి పుత్రులనూ కాపాడు. 

హే పరమేశ్వరా! భక్తుల కోరికలను తీర్చే వారిలో అందరికన్నా ముందుండువాడవు నీవే! నీవు నీ ఆహ్లాదకరమైన రూపాన్ని ధరించు మమ్ము కరుణించు. మాకు శాంతిని ప్రసాదించు. మాకు శుభాలను చేకూర్చు. నీ యొక్క ఆయుధములను వృక్షములపై ఉంచి మమ్ములను రక్షించు సమయంలో పినాకమును భూషణముగా చేపట్టి, పులిచర్మాన్ని కూడా ధరించి రావయ్యా! 

సకలసంపదలను మాకు ప్రసాదించే ఓ శంకరా! అరుణవర్ణంలో ఉండేవాడా, మా నమస్కారాలను స్వీకరించు. నీయొక్క సహస్ర ఆయుధాలు మా శత్రువులను సంహరించి, మమ్ములను కాపాడాలి. ఓ రుద్రుడా నీ సహస్ర బాహువులలోని వెయ్యిరకముల ఆయుధాలు మమ్ము కాపాడుగాక! నమో నమః! 

నమఃశివాయ 

( ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages