సర్వరోగ నివారిణి "జిందా తిలిస్మాత్" - అచ్చంగా తెలుగు

సర్వరోగ నివారిణి "జిందా తిలిస్మాత్"

Share This

సర్వరోగ నివారిణి "జిందా తిలిస్మాత్"

శ్యామసుందర రావు అంబడిపూడి  

హైదరాబాద్ పేరు చెపితే గుర్తుకు వచ్చే విషయాల్లో జిందా తిలిస్మాత్ ఒకటి ఈ పేరు ఎన్నో ఏళ్లుగా అందరికి  సుపరిచితమైనది , ప్రతి ఇంట్లోనూ తప్పక ఉండాల్సిన సర్వరోగ నివారిణి గా జిందా తిలిస్మాత్ అవతరించింది. జిందా తిలిస్మాత్ హైదరాబాదులో తయారయ్యే ప్రసిద్ధమైన యునానీ మందు. జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు. ఇలా అన్నింటికీ ఇది సర్వరోగనివారిణిలా పనిచేస్తుంది. ఈ మందు ఫార్ములాను కనిపెట్టింది ఔరంగాబాద్ నుండి హైదరాబాద్ కు వలస వచ్చిన హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ. జలుబు, దగ్గు నుండి పంటి నొప్పి, ఒంటి నొప్పుల దాక, వికారం, వాంతులు, కడుపు నొప్పి, ఇలా ప్రతి రోగానికి దీని దగ్గర నివారణ ఉంది.హైదరాబాద్ లోని పురాతన సంస్థలలో ఒకటైన ఈ సంస్థ, హకీమ్ మహమ్మద్ రూపొందించిన జిందా తిలిస్మాత్, ఫారూకీ దంతపొడి, జిందా బామ్ వంటి యునాని ఔషధాలు తయారుచేస్తుంది. మొదటి నుండే బాగా కృషి చేయడం వల్ల కార్ఖానా జిందా తిలిస్మాత్ సంస్థకి ఈ 100 ఏళ్లు గా యునాని ఔషధాల గొప్ప తయారీదారుగా భారతదేశం అంతటా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది.

 జిందా తిలిస్మాత్ ని 1920లో దివంగత వైద్యుడు మొహమ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ  పురాతన మూలికా వైద్యం అయినా యునాని ఆధారంగా కనుక్కున్నారు. హకీం మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ యునానీ కోర్సు చేశారు. ఆయన షికాగో మెడికల్ కాలేజీ ఆఫ్ హోమియోపతి నుంచి హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు చేశారు. ఒక వ్యాఖ్యాత, వేటగాడు, వక్త , ప్రకటనకర్త, అమ్మకందారు , వ్యాపారస్తుడు అయిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఫరూఖీ గారు. ఏ కాలంలో హైదరాబాద్ లో కొత్త పరిశ్రమలు పుట్టుకొచ్చి దక్కన్ గొప్పతనాన్ని పెంచుతున్నాయో ఆ కాలంలో హకీమ్ మొహమ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ  1920 లో అంబర్ పేట్ లో "కార్ఖానా జిందా తిలిస్మాత్" అనే వైద్య కర్మాగారాన్ని స్థాపించడంతో ఆయన దక్కన్ సామాజిక జీవితాన్ని పారిశ్రామిక విప్లవ యుగానికి తీసుకువెళ్ళిన విశిష్ట వ్యక్తులలో ఒకరిగా నిలిచారు.

చికాగో నుండి చదువు పూర్తీ చేసుకున్నాక, ఆయన  హైదరాబాద్ మోతీ మార్కెట్‌లో ఇంట్లోనే క్లినిక్ ని నడిపేవారు( ఇప్పుడు ఆ మార్కెట్ ఉన్నా ఆ క్లినిక్ లేదు). అక్కడ ఆయన పేద వారికోసం యునాని వైద్యంతో దగ్గు, జలుబు వంటి చిన్న రోగాలకు చికిత్సలు చేసేవారు. ఆయనకి పరిశోధనలంటే ఇష్టం ఉండేది. అంచేతనే ఒకవైపు పేదలకు వైద్యం చేస్తూనే మరోవైపు ఔషధ తయారీకి శ్రమించేవారు. మందు కనిపెట్టడం ఒక ఎత్తయితే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడం మరో ఎత్తు. అందుకు ఆయన ఫలితాలను అంచనా వేసి మందు తయారీలో మార్పులు చేర్పులు చేసేవారు. ఈ అద్భుత ద్రవ్య తయారీకి ప్రేరణ ఫారూఖీ గారికి నిజాం వారి ఆఫ్రికన్ కావలరీ గార్డ్స్ భాగమైన సిద్ధి ముస్లిములను చూసి వచ్చిందంటారు. అలా సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ ఫార్ములాను కనిపెట్టారు ఫారూఖి గారు. దానితో పాటునే ఫారుఖీ పళ్లపొడి ఫార్ములాను కూడా కనిపెట్టారు.

ఫారూఖీ గారు 1920లో ఎప్పుడు సంస్థను ప్రారంభించారో, అప్పటి నిజాం రాజు అందరి నోటా ఆ ఉత్పత్తి గురించి విని ముగ్దులయి, నిజాం టోపీ లేదా దస్తార్న్ను(చూడడానికి టోపీ ఆకారంలో ఒకదానిపై ఒకటి ఏడు రొట్టెలు ఉంటాయి),నమోదు చేసిన వ్యాపార చిహ్నంలా ఉపయోగించటానికి ఫారుకీగారికి అనుమతి ఇచ్చారు. అప్పట్లో ఎన్నో సంస్థలు నిజాం పట్ల తమ విధేయతను చూపించడానికి దస్తారును తమ వ్యాపార చిహ్నంలా వాడేవారు. అలా జిందా తిలిస్మాత్ దస్తార్ ని ఇప్పటివరకు కూడా తన వ్యాపార చిహ్నంలా చూపుతూనే వుంది.

 ఈ అద్భుతమైన ఔషధం ఎచ్1ఎన్1 వైరస్ను ఎదుర్కోవడంలో చూపించే సాఫల్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి కూడా ప్రశంసించారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఔషధాన్ని విల్లు-బాణంతో సాయుధమైన బలమైన ఆఫ్రికన్ పురుషుడి యొక్క లోగో ఉండే మెరిసే నారింజ ప్యాకింగ్ ద్వారా గుర్తించవచ్చు.జిందా తిలిస్మాత్ అంటే ఉర్దూలో" సజీవ మంత్రం" అని అర్థం. పేరుకి తగట్టే రోగాలను అరికట్టే మంత్రంగా పనిచేస్తుంది ఈ ఎర్ర ద్రవ్యం. వందలాది మందికి ఇది ఇప్పటికీ సర్వరోగ నివారిణియేఎంతనగా తెలుగు భాషలో ఒక సామెతగా మారిపోయింది. ఆసక్తికరంగా, జిందా తిలిస్మాత్‌ను మందులాగా మరియు బాహ్యంగా ఉపోయోగించచు. దాని ప్రజాదరణకు ఇది మరొక కారణం. ఆ రోజుల్లో ఎక్కువ ప్రకటనలు ఉండేవి కావు. అందుకే హకీమ్ గారే స్వయంగానే ప్రచారం చేసేవారు.అప్పట్లో ఏ వస్తువుకైనా ప్రచారమంటే అంత సులువేమి కాదు. పగలంతా వైద్యం చేసి చీకటి పడగానే మహ్మద్ మొయిజుద్దీన్ ఫారూఖీ ఏదో గ్రామానికి వెళ్లేవారు. "ఈ మందు వాడండి. మీ ఇంటిల్లిపాదికీ సర్వరోగ నివారిణి..." అంటూ ఇంటింటా ప్రచారం చేసేవారు. గ్రామాల్లో గోడలపై ఆయనే ప్రకటనలు వ్రాసేవారు. గాలిపటాలపై గుర్తింపు చిహ్నం వేయించి వాటిని పిల్లలకు ఇచ్చేవారు.ముద్రణ ప్రకటన ప్రచారాలు జరగని కాలంలో ఉత్పత్తి ప్రచారం చేసే ఒక వినూత్న మార్గంని ఎన్నుకున్నారు. ఆయన రైళ్లలో తారాగణం ఇనుముతో తయారు చేసిన బోర్డులను తనతో తీసుకువెళ్ళేవారు. ఈ బోర్డులు ఇప్పుడు సంగ్రాహక వస్తువులుగా అయ్యాయి. యు.ఎస్ ప్రజలు వీటిని ఈబే ద్వారా వేలంపాటలు ఆడి మరి కొంటారు. వాటి మీద ఆయన తీసుకువెళుతున్న ఉత్పత్తులను రాసేవారు. ప్రయాణాల్లో పక్కనున్నవారికి ఉచితంగా జిందా తిలిస్మాత్ ఇచ్చేవారు

జిందా తిలిస్మాత్ యొక్క ప్రాథమిక పదార్ధం నీలిగిరి తైలం. ఇది 70 శాతానికి పైగా ఉండంగా మిగిలినది కర్పూరం, మెంథాల్( పిప్పరమెంటు పువ్వు ), థైమోల్, రతన్జోత్ చెట్టు యొక్క బెరడు( దీని వల్లే వాస్తవిక రంగు వస్తుంది), దాల్చిన చెక్క, లవంగాలు, పుదీనా, మిరియాలు, ఏలకులు, పటిక, లోహికామ్లజనిదము మరియు వాముతో తయారుచేయబడినది.

అప్పట్లో వాణిజ్య సంస్థలు ఉండేవి కావు. ఫారూఖీ గారిది సాంప్రదాయ కుటుంబం కాబట్టి ఆయన తన సంస్థ ప్రచారం కోసం స్త్రీలను వద్దనుకున్నారు, అంచేతే ఆంగ్లేయలను కూడా నిరాకరించారు. పైన చేపినట్టు మనం ఆఫ్రికన్ సిద్ధులు ఫారూఖీకి జిందా తిలిస్మాత్ కి ప్రేరణగా ఉన్నారని చూసాము కదా. అది ఎందుకంటే వాళ్ళ దేహబలం మంచి ఆరోగ్యానికి, బలానికి, నమ్మకానికి గుర్తు. వీళ్ల బొమ్మనే ముద్రిస్తే ప్రజలకు సులువుగా అర్థమవుతుందని ఫారూఖీ గారు తరువాత నిశ్చయించుకున్నారు. అంచేతనే ఒక సిద్ధి పురుషుని ముఖమునే జిందా తిలిస్మాత్ గుర్తింపు చిహ్నంగా తీనుకున్నారు ఫారూఖీ. అప్పట్లో కూడా ప్యాకేజింగ్, గుర్తింపు చిహ్నానికి ఎన్నో ప్రణాళికలు వేసిన తర్వాతే ఎంచుకునేవారని దీనితో మనకు తెలుస్తుంది. అన్ని ప్రణాళికలు ఉండడం చేతనో ఇప్పటికి జిందా తిలిస్మాత్ వాళ్లు తమ నారింజ ప్యాకేజింగ్, గుర్తింపు చిహ్నాన్ని ఇంకా వ్యాపార చిహ్నాన్ని మార్చలేదు.

***

No comments:

Post a Comment

Pages