తుచ్చ సుఖాలను ఆశించని మహర్షి "శుక బ్రహ్మ" - అచ్చంగా తెలుగు

తుచ్చ సుఖాలను ఆశించని మహర్షి "శుక బ్రహ్మ"

Share This

 తుచ్చ సుఖాలను ఆశించని మహర్షి "శుక బ్రహ్మ"

అంబడిపూడి శ్యామసుందర రావు 




వ్యాస మహర్షి కర్ణికారము అనే వనములో శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షం కాగా,నీటికి గాలికి అగ్నికి భూమికి ఆకాశానికి సమానమైన  సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి అనే అప్సరస కనుపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు కామవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు. ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం దాల్చి పొంచి యున్నది. అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుక బ్రహ్మ జన్మించాడు.శుకుడు పుట్టంగానే ఆకాశ గంగ స్నానము చేయించింది. ఆకాశము నుండి కృష్ణాజినము దండము వచ్చాయి. దేవతలు గానము చేస్తూ పుష్ప వర్షము కురిపించారు.  పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం యిచ్చాడు. దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు. తండ్రి అనుమతి తీసికొని శుక బ్రహ్మ బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము, రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్తు మహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపించాడు.వ్యాసుడు  కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు కానీ జనకుని దగ్గరకు నడిచి వెళ్ళమని చెప్పాడు. .


శుక బ్రహ్మ తిన్నగా నడుచుకుంటూ మిథిలా నగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనక మహా రాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు. కుసుమములచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం అడుగగా, శుకుడు జనక మహారాజా మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను అని మౌనం వహించాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.


శుక బ్రహ్మ కు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. వ్యాసుడు శుకునికి కాలావయ్యావా నిరూపణ, చతుర్యుగా ధర్మాలు,బ్రహ్మమయు దాని విజ్ఞానము ,సర్వ వర్ణ ధర్మాలు దానగుణం ప్రాశస్త్యము, మైత్రి గుణ లాభము,వంటి ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చటను ఉండక భూభాగమంత సంచరించసాగాడు.ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు ముని శాపము వల్ల తనకు వారము రోజులలో తక్షకుడనే సర్పము చే మృత్యువు సంభవించును కాబట్టి ఈ ఏడూ రోజులలో  ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుక బ్రహ్మ తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుక బ్రహ్మ సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.


ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుక బ్రహ్మ ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు. శుక బ్రహ్మ ని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కాని వ్యాసమహర్షిని చూచి వారు వలువలు ధరించేవారు. శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు. పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాల లోన లేడు. ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమ చయోగీశ్వరుడు. శుక బ్రహ్మ రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుక రంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.

***

No comments:

Post a Comment

Pages