రమా శాండిల్య గారి ఆత్మక్షేత్రం... ఈ ముక్తి క్షేత్రం... - అచ్చంగా తెలుగు

రమా శాండిల్య గారి ఆత్మక్షేత్రం... ఈ ముక్తి క్షేత్రం...

Share This
రమా శాండిల్య గారి ఆత్మక్షేత్రం..ఈ ముక్తి క్షేత్రం...
సింహాచలం నాయుడురమా శాండిల్య గారు ఎప్పుడూ తీర్థ యాత్రలు అంటూ దేశాటన చేస్తుంటే ఎందుకిలా కష్ట పడతారు?...ఆరోగ్యం ఏమవుతుంది ?  అనుకుంటూ ఉండే వాడిని. ముఖ్యంగా ఆమె చేసిన కాశీ యాత్ర విశేషాలు తరచుగా  ఫేస్ బుక్ లో చూసి ఏమి సాధిస్తారు వీటితో అనుకునే వాడిని...తమను తాము కోల్పో వటానికి వెళ్ళే కాశీలో  తిరిగి పొందేది ఏమయినా ఉంటుందా అనిపించింది...

పదిరోజుల కిందట ఒక పుస్తకం పంపారు..ముక్తి క్షేత్రం...ఎన్నో దేవాలయాల గురించి ఉంటుందేమో అనుకున్నాను...తెరిచి చూస్తే దేవాలయాలు ఎన్నో ఉన్న మాట వాస్తవమే కానీ.. అన్నీ  కాశీ లోనే ఉండటం ఈ పుస్తక విశేషం...అప్పుడు అనిపించింది...కాశీ లో రమా గారు చూసిన విషయాలు  అనుభవించిన క్షణాలు  ఒక పుస్తకం కు సరి పోయాయి అంటే నేను చూసిన కాశీ కాదు ఇంకేదో ఉంది అని అనుకున్నాను..అందుకే చదవటం మొదలు పెట్టాను...నా అలవాటుకు భిన్నంగా ఈ రోజు పూర్తి కూడా చేశాను....

ఈ పుస్తకంలో ముఖ్యంగా మూడు విషయాలు కనిపించాయి.

ఒకటి...కాశీ లోని క్షేత్రం
రెండు...రమా గారి సంకల్పం
మూడు..రెంటినీ కలిపే అందరికీ కనపడని సూత్రం...

భర్త అంత్యక్రియల కోసం పుష్కరం కిందట  తొలి సారి కాశీ వెళ్లి నప్పటి నుండి తమ జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో మార్పులు జరిగాయి ...వల విసిరి కాశీ వైపు తనను లాగుతున్నట్టు ఉండే మానసిక స్థితి మొదలయ్యింది.... ఆ రోజు ఇంట్లో మాయమైన  నిత్యం కొలిచే లక్ష్మి విగ్రహం కాశీలో  కంచి స్వామీజీ చేతి నుండి మళ్ళీ దొరకటం ఆశ్చర్యకరమైన అనుభూతి....

విశ్వనాథ...అన్నపూర్ణ మందిరాలు..కాలభైరవ మందిరం...ఘాట్ లు...తులసి మానస మందిర్..లా మనం అందరం చుసేవే కాకుండా ...సందు సందుల్లో ఉన్న సుదూరంగా ఉన్న ఎంతో ప్రశస్తి కలిగి ఉన్న ఎన్నో  ఘాట్ లు..శివలింగాలు.. నవ దుర్గలు...అఘోరా క్షేత్రాల వివరాలు ఇందులో ఉన్నాయి...

మరణాన్ని కోరుకుంటూ ఆనందంగా .. ఎప్పుడు వస్తుందా అని విసుగుతో ఎదుటి చూసే ముముక్షు భవన్ ప్పూర్టి వివరాలు ఉన్నాయి..చదవటానికి భయం వేసి న విషయాలు  వణుకుతున్న కాళ్ళు చేతులతో వెళ్లి  బెదురు కళ్ళతో చూసి... ధైర్యం కూడ దీసు కుని మన ముందు పెట్టారు...

ఒక్కో మందిరం విశేషం..పూజ విధానం.. గ్రౌండ్ లెవెల్ లో బాగా తెలుసుకుని సమగ్రంగా రాశారు ...ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు ప్రతి పేజీలో ఉన్నాయి...

ఎక్కడ ఏ మందిరం ఉంది, ఎలా వెళ్లాలి అన్న విషయం చిన్న చిన్న సందుల వివరాలతో ...లాండ్ మార్క్ వివరాలతో ఉపయోగకరంగా రాశారు...అయితే అవన్నీ ఏదో  చిరు నామా  చెప్పి నట్టు కాకుండా తన ట్రావెలాగ్ లా ఉన్నాయి..

అన్నిటికంటే నాకు నచ్చింది భాష.....ఇలాంటి పుస్తకాలకు ఎలాటి భాష ఉండాలో.....చక్కగా అందరినీ రీచ్ అయ్యేటట్లు ఉంది..అట్టహాసంగా కాకుండా.....అమాయకంగా ఉంది....త్రోవ కూడా తెలియని ఒక బాటసారి కళ్ళతో చూసింది చూసినట్టు.. ..ఆశ్చర్యకరంగా భావించి చెప్పినట్టు ఉంది....క్షేత్ర దర్శనం లా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక ట్రావెలాగ్ లా ఉంది ...

కాశీ అంటే కేవలం మందిరాలు కాదు...అంతకంటే ఏదో ఉంది అన్న భావన కలుగుతుంది...గుర్రం జాషువా గారు అన్నట్టు ఒక గొప్ప భస్మ సింహాసనం మీద కూర్చుని ప్రపంచంలోనే  ఒక మహా  శ్మశానం ను పాలిస్తున్న విశ్వనాథుని చూస్తాం... నిత్యం ఆకలి తీర్చే అన్న పూర్ణను చూస్తాం...ఆశలన్నీ కరిగి పోయిన మనిషి  చివరకు చనిపోవటం కూడా ఒక గొప్ప ఆశగా భావించి చేరుకునే క్షేత్రం కాశీ.... వేల మంది అలాంటి ఆశతో ఎదురు చూసే క్షేత్రం కాశీ...అందుకే నిత్యం సెగల తో.. పొగలతో...భగ భగ మండే జ్వాల లతో  ఎగసి పడుతుంది కాశీ ...జనన మరణ చక్రాల నుండి తప్పించుకున్న స్వేచ్ఛా జీవిలా...దేవలోకం చేరుతున్న  బాటసారి మహా ప్రస్థానం లా...మనిషిని దైవంతో కలిపే దేవలోక నిచ్చెన లా....జననం మాత్రమే  కాదు ..మరణం కూడా వేడుకే అన్న సత్యాన్ని కళ్ళ ముందు నిలిపింది...

ఎన్నో క్షేత్రాలు చూసాను..పుస్తకాలు కొన్నాను...కానీ...ఒక క్షేత్రం గురించి ఇంత గొప్పగా ఉన్న పుస్తకం ఇంతవరకు నేను  చూడలేదు...అతిశయోక్తి కాదు కానీ...ఈ పుస్తకం మీరు కాశీలో ఉన్నారు అను కున్న భర్త కళ్ళతో చూసి రాసినట్టు ఉంది ...లేదా ఆయన అవహించి రాయించి నట్టు ఉంది ...లేదా మీ ప్రాణం అక్కడే పెట్టీ రాసినట్టు ఉంది....ఇదో సత్యం...శివం...సుందరం లా ఉంది...

ధన్యవాదాలు...పుస్తకం పంపినందుకు...చదివించి నందుకు...

Kotnana Simhachalam Naidu  19.11.2021

***
పుస్తకాన్ని దిగువ లింక్ లో కొనుగోలు చేయవచ్చు...


No comments:

Post a Comment

Pages