చేనేత చెంచయ్య - అచ్చంగా తెలుగు

 చేనేత చెంచయ్య

(మా జొన్నవాడ కథలు)

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

        (9490400858)


"అయ్యా!  చెంచయ్యగారూ... అమ్మణ్ణి దర్శనానికి ఢిల్లీ నుంచి నవరాత్రిళ్ళకు మన శివారెడ్డి మంత్రిగారొస్తున్నారంట. ఊర్లో బ్యానర్లూ అవీ తెగ కట్టారు. రాష్ట్ర మంత్రులు కూడా కొంతమంది ఆయనతో కూడా వస్తున్నారంట" పదిమంది మనుషులతో వచ్చి చెప్పి అలా నిలబడ్డాడు.  జవాబుకోసం ఆతృతగా.

"అవున్రా! రాములూ..మనజిల్లా మడిసి, మనకు బాగా తెలిసినాయన, కేంద్రంలో మంత్రి అయినాడంటే మనకెంత గొప్ప చెప్పు. అవునూ అందరూ కట్టగట్టుకోని వచ్చారేంది. యాడికన్నా బోతున్నారా ఏందీ? "

"ఏంలేదు చెంచయ్యా.. ఆయనే కదా.. ఈడ మన రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు మనల్నిబతిమిలాడి బామాలి.. ఒప్పించి,  వెంకటగిరి నుంచి జొన్నాడకు తోలుకొచ్చాడు.  ఈడ బాద లేకుండా ఇళ్ళూ అవీ గట్టిచ్చాడనుకో.. దానికేమనబల్లా… ఆచ్చేపణేమీ జెయ్‌బల్ళా..గానీ.... మనకు జరుగుబడి సరిగా గావడంలేదు గదా! వాళ్ళంతా బాగానే ఉన్నారు. మన బతుకులే ఇట్ట తగలబడ్డాయి.  ఆ ఇసయం మీరు చేనేత సంఘం పెసిడెంటుగా నువ్వే ఆయనకు ఏదోకటి చెయ్యమని జెప్పాల".

"రాములా.. ఆళ్ళు పెద్దోళ్ళురా..మన పని చేనేత పని…. ఆళ్ళేంజేత్తారు సహాయం చెప్పు. మనం ఇట్టాగే పనిజేసుకుంటూ బతుకులీడ్చుకోవాల"

"అట్టా అనబాకయ్యా.. మన బతుకులు పెద్దోళ్ళు గాకపోతే ఎవరు బాగుజేస్తారు చెప్పు? అక్కడున్నా బాగుండేది. వెంకటగిరి చీరలంటే ఒక మర్యాదుండేది. ఇక్కడ మనం వెంకటగిరి వాళ్ళమని ఎంత చెప్పినా పట్టించుకోడంలేదు. జొన్నాడ చేనేతని పేరుబెట్టేశారు. ఆడ హాయిగా ఉండేవాళ్ళం. మన స్థలాలేమో ఆసుపత్రికని ఇచ్చేశారు. మనల్ని ఈడకు తోలారు.ఇపుడు జూడు…”

"సరేలే.. మీ అందరి బాధలు నాకు తెలవ్వా ఏందీ... ఆయనేం సహాయం జెయ్యెచ్చో మా హైదరాబాదులో ఉన్న పెద్దోణ్ణి అడుగుతాలే.. వాడంటే ఆడ రాజకీయ నాయకులతో కార్లల్లో డ్రైవరుగా తిరిగేవాడు. ఆడికి దెలుస్తాయి అన్నీ.. నువ్వు బాధ పడబాక. మనకు ఇళ్ళు కట్టిచ్చిచ్చి, ఒకేసారి మగ్గాలు పెట్టుకోడానికి నలభై  మందికి సెల్లార్‌లో పెద్ద హాలు కట్టిచ్చి చాలా జేశాడ్రా పెద్దాయన. రాత్రికి మా శీనుగాడితో మాట్లాడతాలే మీరు బోండి.....చూద్దాం. భగమంతుణ్ణి నమ్ముకుందాం."

చెంచయ్య వాళ్ళకు మాట జెప్పి పంపించాడే గానీ...ఏమనడగాల ఎట్టా అడగాల తెలీడంలేదు. రాత్రి దాకా మధనపడి రాత్రి కొడుకుతో మాట్లాడి కొడుకు చెప్పింది విన్నాక,  ముందుగా తనూ వస్తానని, ఏర్పాట్లు చేస్తానని చెప్పడంతో మనసు ప్రశాంతంగా అయి నిద్ర పట్టింది.

****

చెంచయ్య కొడుకు శీను అన్నట్టుగానే రెండురోజులు ముందేవచ్చి ఊర్లో దేవళం దగ్గరా..ఊరి బయటా చేనేత సంఘం తరఫున..మంత్రిగారి పెద్ద పెద్ద బొమ్మలతో స్వాగతం చెబుతూ చెంచయ్య పేరుతో క్లాత్ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టించాడు. ఆరోజు సమావేశం ఏర్పాటు చేసి మంత్రిగారిని రావాలని 10 నిముషాలు మాట్లాడాలని తెలిసిన మంత్రి గారి ద్వారా ఆయనకు సందేశం పంపించి ఒప్పించాడు.

చేనేత కాలనీ సాలిపేట మొత్తం తోరణాలు కట్టి అంగరంగ వైభోగంగా అలంకరించారు. ఎక్కడ చూసినా మంత్రి గారి బ్యానర్లు పెట్టించారు. ఇంతకీ చెంచయ్య ఏమి చెయ్యబోతున్నాడో అని అందరికీ ఆతృతగా ఉంది. శీను అప్పుడే ఏమీ చెప్పవద్దని తండ్రికి చెప్పడంతో  "ఏమో రా అంతా మా శీనే చూసుకుంటున్నాడు" అనేశాడు. అందరూ ఆరోజు 10 గంటలకు కాలనీ మొదట్లో ఉన్న వేదిక దగ్గరకు రావాలని అందరికి చెప్పించాడు. ముందురోజు నెల్లూరుకు వెళ్ళి ఎం.ఎల్.ఏ ను ఎం.పి గారిని కలిసి శీను తమ బాధలను వివరించాడు. వాళ్ళ సలహా మేరకు బెజవాడలో  ఆప్కో ఫ్యాబ్రిక్స్ ఎం.డి ని ఫోన్ చేసి సభకు ఆహ్వానించాడు. 

                                                      ****

కామాక్షమ్మ దర్శనం అవగానే చేనేత సంఘం కోరిక మేరకు శివారెడ్డి, తదితర రాష్ట్ర మంత్రులను శీను మీటింగు ప్రదేశానికి గౌరవంగా తీసుకువచ్చాడు. జొన్నవాడ జనం మొత్తం "శివారెడ్డి - జిందాబాద్" నినాదాలతో హోరెత్తించారు.

శివారెడ్డి తన ప్రసంగంలో.."మీ బాధలను కొంతైనా రూపుమాపేందుకు స్వయంగా నేను బ్రాండ్ అంబాసిడర్‌గా మారి... చేనేత దుస్తులను ధరిస్తూ… నేత వస్త్రాలు ధరించాల్సిందిగా అధికారులను ప్రోత్సహిస్తూ తరచూ ఉపన్యాసాల్లో చెప్తున్న విషయం మీకందరికి తెలిసిన విషయమే! ఇక సర్వశిక్షా అభియాన్ కింద యూనిఫారాల కాంట్రాక్టుని కూడా మీకు అందించడంతో సంవత్సరంలో కొద్ది నెలలు ఇక్కడి కార్మికులందరికీ తగినంత పని ఉంటుందని ఆశిస్తున్నారు. ఇక్కడి ప్రతి కార్మికుడూ మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన రుణాలు  కూడా మంజూరు చేసిన విషయం మీకు తెలిసిందే! మీ వెతలకు ఇవన్నీ శాశ్వత పరిష్కరాలు కాకపోయినా కూడా చేనేత మీద కేంద్ర ప్రభుత్వం మరియూ రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయని చెప్పడానికి సంతోస్తున్నాను. నాకు తెలుసు...పనులు కరువై ఈ రాష్ట్రంలోను..తెలంగాణాలోనూ వేలాది నేత కుటుంబాలు గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు తరలిపోయాయి. నానాటికీ పెరిగిపోతున్న ముడిసరుకు ధరలతో ఎలాగొలా శ్రమకోర్చి నేసిన బట్టని కొనే నాథుడు లేకపోవడంతో నేతన్నలు దిక్కు తోచకుండిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే మాలాంటి రాజకీయ నాయకులో, సినిమా యాక్టర్లో నేత వస్త్రాలతో ఫొటోలు దిగితే సరిపోదు. ఏదో ఒక ప్రాంతానికి కొన్ని నెలలపాటు ఉపాధి చూపించీ లాభం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాలన్నీ కూడా తమ యూనిఫాంలను నేతన్నల నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఆవిషయం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ముడి సరుకు కొనుగోలులో తగిన సబ్సిడీని అందించాలి. చేనేత సహకార సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీదకు తేవాలి. మగ్గాలను ఏర్పాటు చేసుకునేందుకు, వాటిని నిర్వహించుకునేందుకు రాయితీ ఆధారంగా రుణాలను అందించాలి. మాస్టర్ వీవర్స్ కింద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు లభించేలా చర్యలు తీసుకోవాలి. నేత కార్మికులకు ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించాలి. ఇలా ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు. ఇవన్నీ వెంట వెంటనే అయ్యే పనులేం కాదు. మాకూ కొన్ని హద్దులు ఉంటాయి. సవాలక్ష నియమ నిబంధనలు అడ్డొస్తాయన్న విషయం మీకు తెలియనిది కాదు" అన్న మాటలకు  చప్పట్లు మారుమ్రోగాయి.

ఆప్కో ఎండీని మాట్లాడవలసినదిగా అభ్యర్దించగానే ఆయన "మానవులకు దుస్తులు ధరించటం అవసరమని దైవం ప్రత్తి మొక్కని సృష్టించటం జరిగింది. పాతకాలంలో ఎక్కువగా నూలుదుస్తులే ధరించేవారు. అవి చెమటను చక్కగా పీల్చుకుంటాయి. సహజమైన చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో కంప్యూటర్ సహాయంతో క్రొత్త డిజైన్స్ కనుక్కోవటం, యంత్రాలపైన దుస్తులను విరివిగా తయారుచెయ్యటం వచ్చాక సాంప్రదాయ చేనేత మగ్గాల వారి పరిస్తితి దయనీయంగా తయారయింది. యంత్రాలతో పోటీకి తట్టుకోలేక వారు వెనుకబడిపోతున్నారు. కుటుంబానికి జరుగుబాటు లేక నేతన్నలు ఎందరో ఆత్మహత్యలు చేసుకోవటం జరుగుతోంది. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్పాలి. ఆ మధ్యన చెన్నైలో మా దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మా బంధువుల అబ్బాయి ఒక బనీను లాంటి " టీ షర్ట్ " వేసుకున్నాడు. ఆ షర్ట్ ధరించి బైటకు వెళ్తోంటే నేను ఉండబట్టలేక అదేమిటి.. బనీను వేసుకుని బైటకు వెళ్తున్నావు? అని అడిగాను. దానికి తను నన్ను ఒక అజ్ఞానిని చూసినట్లు చూసి వివరాలు చెప్పాడు. ఆ షర్ట్ ఒక పేరున్న పెద్ద కంపెనీ తయారు చేసినదట. ఆ షర్ట్ కు ఒక మూల బ్రాండ్ పేరు చూపించాడు. దాని రేటు విని నేను నోరెళ్ళబెట్టాను. రెండు వేల రూపాయలు పోసి కొన్నాడట. అది చూడటానికి అంత ఖరీదులా అనిపించటంలేదు అనుకుని, ఇక చేసేదేమీలేక నేను మాట్లాడ్డం ఆపేశాను. మనం పెద్దపెద్ద షాప్స్ కు వెళ్ళి కాటన్ చీరలు, షర్ట్స్ అవి వేల రూపాయలు ఖరీదుచేసి కొంటాము. అదే చేనేతదుస్తులు అమ్మే ఆప్కో ఫ్యాబ్రిక్స్ లాంటి చోట్లకు  వెళితే మాత్రం... గీచిగీచి బేరం ఆడి ఇష్టమయితే కొంటాము లేకపోతే లేదు. వారికి జరుగుబాటు లేక తక్కువరేటుకు ఇచ్చేస్తారులే అన్న ధీమా. వారికి ఫ్యాషన్ టెక్నాలజీలు, మార్కెటింగులు తెలియవుగదా!  మీ చేనేత పని వారు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా అందరూ కలిసి సంఘాలుగా ఏర్పడి క్రొత్త డిజైన్స్ తెలుసుకుని, మార్కెట్ మెళకువలు నేర్చుకుంటూ జీవితాలు బాగుచేసుకోవాలి. ఇది చెప్పినంత తేలికకాకపోయినా చేనేత నేతన్నల వెతలు తీరాలంటే ప్రజలు కూడా తమ వంతు సహకరించాలి. తమిళనాడులో కాలేజీ విద్యార్ధినులు కూడా వారంలో ఒక రోజు విధిగా చేనేత దుస్తులను ధరించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి చైతన్యం మన రాష్ట్రంలో కూడా రావాలి. ఫాషన్ టెక్నాలజీ నేర్చుకున్న యువత, ఇంకా మార్కెటింగ్ వ్యవహారాలు తెలిసిన యువత ఈ చేనేత నేతన్నలకు తమ సలహాలను అందించాలి.”

చెంచయ్య చివరగా "మన రాష్ట్రంలో వెంకటగిరి చేనేతన్నకు ఘనమైన చరిత్రే ఉంది. నాణ్యమైన, అందమైన వస్త్రాలకు వెంకటగిరి పెట్టింది పేరు. ముచ్చటగొలిపే చేతి నేత, మైమరిపించే డిజైన్లు, అంచుల మెరుపులు, బుటాల తళుకులు...వెరసి వెంకటగిరి వస్త్ర సోయగాల ప్రత్యేకతను చాటుతాయన్న విషయం మీ అందరికి తెలిసిందే! చేతినేతతో జాలువారే వివిధ వస్త్రశ్రేణులు అన్నితరాల వారిని ఆకర్షిస్తాయి. అయితే కాలానుగుణ పరిస్థితులకు అనుగుణంగా మిగతా రంగాల మాదిరిగానే చేనేత పరిశ్రమ పూర్తిస్థాయి నవీకరణకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాంకేతికత పరిఢవిల్లుతున్న అధునాతన కాలంలోనూ సంప్రదాయ మగ్గాలపైనే కార్మికులు పనిచేస్తూ జీవితాలను నెట్టుకొస్తున్నారు. చాలీచాలనీ ఉపాధికి తోడు దానిపైనే కుటుంబమంతా ఆధారపడే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా చేనేత వస్త్రరంగాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే ఆదుకోవాలని మా నివేదన. ముడి నూలును జీఎస్టీ పరిధిలోకి చేర్చి 5.2 శాతం పన్ను వసూలు చేస్తుండటంతో వ్యాపారులు అల్లాడుతున్నారు. జీఎస్టీ నుంచి చేనేతరంగాన్ని మినహాయించాలని ఎప్పటినుంచో వేడుకుంటున్నా ఫలితం ఉండటం లేదు.  మరోవైపు మాదగ్గర  పేరుకుపోయిన నిల్వలను రాష్ట్రప్రభుత్వం ఆప్కో ఫాబ్రిక్స్ ద్వారా కొనుగోలు చేస్తేనే చేనేత వస్త్ర పరిశ్రమ బతికిబట్టకట్టే అవకాశముందని మాస్టర్ వీవర్లు అభిప్రాయపడుతున్నారు. 1992లో ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే సమస్యను పరిష్కరించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను" అనేసరికి ఆప్కో ఎండీ "మాకు అవసరమైన చీరలను మరో ఐదు సంవత్సరాలపాటు 20 శాతం  మీ వెంకటగిరి చేనేత వారి వద్ద కొంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను" అనడంతో అంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. జి.ఎస్.టి గురించి కేంద్రం ప్రక్క సంవత్సరం బడ్జెట్ తయారుచేసే సమయంలో అన్ని సంఘాలవారూ కలిసి మహజరు సమర్పించాలని శివారెడ్డి కోరారు.

****

జొన్నవాడ సాలిపేటలో ఇప్పుడు సర్వత్రా హర్షం నెలకొనింది. అందరికి ఉపాధి దొరకడంతో నలభై కుటుంబాల మగ్గాల మోతలు ఊళ్ళోకి వినిపిస్తున్నాయి.

"ఏమయ్యోవ్.. బువ్వ తినడానికొచ్చేదుందా లేదా? నాకు బాగా ఆకలవుతున్నాది. తొందరగరా!" అన్న భార్య అరుపు లాంటి పిలుపుకు   తలెత్తి చూసి నవ్వుతూ "నువ్వు తినవే ఇంకొంచెం నేస్తే ఈ చీర శానా మటుకు అయిపోతుంది. చూడు పట్టులాంటి నేత చీరె. ఎంత మెత్తంగా ఉందో పట్టుకోని చూడు. ఈ చీరె శివారెడ్డి భార్యకోసం నేస్తున్నా. అవగానే రెండురోజుల్లో కొరియర్లో పంపిస్తా. మన పక్క కూడా కొంచెం కృతజ్ఞత ఉండాలి గదా! లేపోతే దేముడు గూడా క్షమించడు""

"అవునయ్యా..... శానా బాగుండాది.  చెంచయ్య.. చెంచయ్యే నయ్యోవ్.. నేతలో మొనగాడు. మన పెళ్ళయ్యాక నువు నేసిచ్చిన చీరె ఇంకా ఉండాది నా కాడ. నాగ్గూడా ఇట్టాంటి చీరె కావాలయ్యో.. ఇదయింతర్వాత నాకొకటి నెయ్. నేను హైదరాబాదు కొడుక్కాడికి బొయినప్పుడు కట్టుకుంటా.   సర్లే..అన్నానికి రా !"

****

ఆ రాత్రి పడుకున్న చెంచయ్య  మరుసటి రోజు లేవనే లేదు. నిద్రలోనే వెళ్ళిపోయాడు. సాలిపేట మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది. ప్రక్క రోజు బంగాళాఖాతంలో వాయుగుండంపడి సాలిపేట మొత్తం వరదలమయం అయింది. ప్రక్కనే పెన్నానది ఉండడంతో మగ్గాలూ..నూలు కండెలూ. దారాలు అన్నీ వరదకు కొట్టుకుపొయ్యాయి.

****

"ఒరే రాములా..చెంచయ్య బొయ్యాడు. చెంచయ్యతో పాటే ఈ సాలిపేట కళ కూడా పోయిందిరా..ఇప్పుడు ఎవరితో జెప్పుకుంటాం మన కష్టాలు. మనం సాలిపేట ఖాళీ చేసి ఎక్కడికైనా ఎల్దాంరా.. ఈ వృత్తి మనకొద్దు. ఏ కూలీ నాలీ చేసుకున్నా కడుపులు నిండుతాయి" అన్న శీనప్ప మాటలను అందరూ మౌనంగా వింటున్నారు. 

అదే సమయంలో వరదల పరిస్థితి చూడ్డానికి వచ్చిన శివారెడ్డి అందరిని పలకరిస్తున్నాడు. అందరూ దీనంగా ఏడుస్తున్నారు. చెంచయ్య ఇంటికి వచ్చాడు. భార్య, కొడుకు శీను కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. కిటికీ పైన దూలానికి వేలాడుతూ రెప రెపలాడుతూ సగం నేసిన చీరె మీద తన పేరు "శివారెడ్డి" అని తన కనపడడంతో..ప్రక్కనున్న వాళ్ళకు సైగ చేయడంతో వాళ్ళు తీసి చూపించాడు. "శివరెడ్డిగారికి నమస్సుమాంజలి! - చెంచయ్య, జొన్నవాడ" అని నేసి ఉంది. నీళ్ళు కారుతున్న చీరెపై శివారెడ్డి కన్నీళ్ళూ వర్షించాయి. ఆ చీరెను జాగ్రత్త చేయమని పి.ఎ కిచ్చి మారు మాట్లాడకుండా కారెక్కి వెళ్ళిపోయాడు.

-0o0-

No comments:

Post a Comment

Pages