బసవ పురాణం - 20 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు - బసవ పురాణం - 20 

సేకరణ: పి.యస్.యమ్. లక్ష్మి20  నిమ్మవ్వ కధ

 

కిందటి కధలో సిరియాలుడు బంధు మిత్ర సమేతంగా కైలాసాన్ని పొందాడని చదివాము కదా. దానితో సిరియాలుడికి కొంత గర్వం వచ్చింది.  పరమ శివుడంతటివాడు తన భక్తిని మెచ్చి, తన కుమారుడిని బతికించి, తనకి బంధు మిత్ర గణంతో సహా శివ గణంలో చోటిచ్చాడని అహంభావం చూపసాగాడు.  ఈయనకొచ్చిన గర్వాన్ని అణచాలని శివుడు నిర్ణయించుకున్నాడు. 

 

ఒక రోజు శెట్టీ, మనం ఒకసారి భూలోకం వెళ్ళి వద్దాము రమ్మని అతని చెయ్యి పట్టుకుని, ఇద్దరూ జంగమ రూపాలలో నిమ్మవ్వ ఇంటికి వెళ్ళారు.  వారిని చూసి ఆవిడ ఎంతో సంతోషించి, మా ఇంటిని పావనం చేయటానికి వచ్చిన భూరుద్రులు మీరు.  మీరు మాఇంట భిక్ష గైకొనుడని ప్రార్ధించి, వారిరువురికీ శయ్య పరిపించి, కొంచెము సేపు విశ్రాంతి తీసుకోండి.  నేనీ లోపల వంట చేసి మీ స్నానానికి ఏర్పాటు చేస్తానని చెప్పి తన పనిలో నిమగ్నమయింది.  వీరిరువురూ సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వుండగా నిమ్మవ్వ వంట పూర్తి చేసి, వారి స్నానానికి నీరు సరిపోదని, కడవ తీసుకుని ఏటికి వెళ్ళింది నీళ్ళు తీసుకువద్దామని.

 

నిమ్మవ్వకి ఒక కొడుకున్నాడు.  అతను పశువులు కాయటానికి వెళ్ళాడు.  మధ్యలో ఆకలి వేసి ఇంటికి వచ్చి, అమ్మా, అమ్మా, అని పిలుస్తూ తల్లికోసం వెతికాడు. నిమ్మవ్వ కనిపించలేదుగానీ ఒక పళ్ళెంలో అతిధుల కోసం చేసి పెట్టిన బూరెలు కనబడ్డాయి.  ఆకలి వెయ్యటంవల్ల వాటిని రెండు తీసుకుని తింటూ బయటకెళ్తూ నీళ్ళు తీసుకు వస్తున్న తల్లి కంట పడ్డాడు.  ఆమె కొడుకుని చూసి ఓరీ కుక్కా, భక్తుల కోసం సిధ్ధం చేసిన వంటలను ముట్టుకుని తిన్నావా?  నీలాంటి కొడుకు వుంటే ఏమి లేకుంటే ఏమి?” అని కోపముతో అతనిని చావకొట్టి, గాడిలో తోసివేసి, ఆ శవముపై ఒక తొక్కు కప్పి, శుచి స్నానము చేసి మరల పరిశుధ్ధముగా వంటలన్నీ చేసినది.  తిరిగి నీరు తీసుకు రావటానికి ఏటికి వెళ్ళింది.

 

ఈ లోపల శివుడు సిరియాలుని తీసుకుని గాడి దగ్గరకు వెళ్ళి, నిమ్మవ్వ కొడుకు మీద కప్పిన ధూళిని ఊది , ఆ శవాన్ని చూపించి సిరియాళుతో చూశావా, మనకోసం సిధ్ధం చేసిన పదార్ధాలు వీడు ముట్టుకుని అపవిత్రం చేశాడని వీడిని గోతిపాలు చేసి , మరల వంటచేసి, మనస్నానానికి నీరు తేవటానికి వెళ్ళింది.  అని అవ్వ చేసిన సాహస క

కృత్యాన్ని అతనికి చెప్పి, ఏమీ తెలియనట్లు వచ్చి పడుకున్నారు.  

 

ఇంతలో అవ్వ వచ్చి, లేచి స్నానం చేసి వేగంగా శివ పూజ కానివ్వండి.  ఇప్పటికే చాలా ఆలస్యమయింది.   బాగా ఆకలిగా వుండి వుంటుంది.  అని వారికి శివ పూజా సామగ్రి సిధ్ధం చెయ్య సాగింది.  వారును స్నానములు చేసి, విభూతి రుద్రాక్షలు ధరించి, శివ పూజ చేసి , అవ్వ వడ్డించిన పదార్ధాలు భుజించటానికి ముందే, అవ్వా, నీ కొడుకు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి, నీకోసం వెతికి, నువ్వు కనబడక ఎటో వెళ్ళాడు.  పాపం ఎంత ఆకలిగా వున్నాడో  అలాంటి పిల్లాడుని వదిలి మేము భుజించటం మంచిది కాదు.  అతనిని కూడా పిలిచి తీసుకు రమ్ము.  మేము ముగ్గురం కలసి తింటాము.  అప్పటిదాకా మేము ఆగి వుంటాము.  తొందరగా పిలుచుకుని రా అని చెప్పాడు శివయ్య. 

 

ఆ మాటలు విన్న నిమ్మవ్వ, ఓ నీలకంఠా, నన్నెందుకు మాయ చేస్తావు?  ఆడదాన్నని నన్ను భ్రమలో పడేస్తావా?  నీ వేషములు మాను.  నేనేమన్నా సిరియాలుననుకున్నావా?  కొడుకుని చంపి, నిన్ను మెప్పించి, తిరిగి ఆ కొడుకుతో నీవిచ్చే కైలాసము నాకొద్దు.  నా కొడుకు స్వయంకృతాపరాధ దోషంతో పోయాడు.  వాడి పాపంవల్లే వాడు పోయాడు.  అలాంటి పాపిష్టి కుమారుడు నాకెందుకు?  నేను వాడిని పిలువను.  వాడు రాడు.  పొద్దు పోతున్నది.  మీరు భోజనం చెయ్యండి. నా కొడుకు మాట మీకెందుకు?  పాపాత్ముడు చావక బతుకునా!?  చచ్చిన వాడు మరల వచ్చునా?  వచ్చినా నేను మెచ్చను.  ఇంక ఆలస్యము చెయ్యక మీరు భోజనం చెయ్యండి అని చెబుతున్న నిమ్మవ్వ ధైర్య స్ధైర్యాలకు సిరియాలు సిగ్గుపడి ముఖము దించుకున్నాడు.  అతడు నిశ్చేష్టుడై వుండగా పరమేశ్వరుడు పార్పతీ సమేతంగా ప్రత్యక్షమైనాడు.

 

అది చూసి నిమ్మవ్వ, పరమేశ్వరా, ఏమి నీ లీలలు? ముందు ఒక కొంటె వేషముతో రావటం, మమ్మల్ని భ్రమలో పెట్టటం, తర్వాత నిజ రూపం చూపించి రారమ్మని పిలవటం, వరములు కోరుమనటం.  నీ ఈ పనులు నాకు తెలియనివి కావు.  నేను మనిషినైనా నీ మాయలకు లొంగను.  నువ్వు నా ఇంట భోజనానికి వచ్చావు.  రెండు సార్లు నా చేత వంట చేయించావు.  ఇప్పుడు భోజనము మాని ఇలా మాయ రూపములు చూపిస్తే నేనూరుకోను.  నీ ఇదివరకు భక్తులులాగా నేను నీ మాయోపాయాలకు లొంగి నీవిచ్చే వరాలకు సంతోషించి ఈ లోకంలో చిరకాలం బతికి, చివరకు కైలాసాన్ని చేరేదానిని కాదు.  నువ్వొకవేళ ఇప్పుడే కైలాసానికి రమ్మన్నా నేను రాను.  ఇంకేమీ వేషాలెయ్యక తిన్నగా కూర్చుని నే వండిన వంటలన్నీ ఆరగించి మరీ వెళ్ళండి.  అప్పటిదాకా మిమ్మల్ని వదలను, కదలనియ్యను అని పట్టు పట్టింది.  శివునికి వేరే దారిలేక ఆమె వడ్డించినవన్నీ తింటూ, తన గర్వానికి సిగ్గుపడుతున్న సిరియాళుని అనునయిస్తూ, నువ్వెందుకింత చిన్నబోతున్నావు?  పన్నగ భూషణుని భక్తుల చరిత్రలు వినలేదా?  అని అతనికి ఇంకొక కధ చెప్పసాగాడు.

ఆ కధ ఇంకోసారి.  

***

No comments:

Post a Comment

Pages