పన్నగాచలనాయక శతకము - పులహరి పీర్దేశికేంద్రులు - అచ్చంగా తెలుగు

పన్నగాచలనాయక శతకము - పులహరి పీర్దేశికేంద్రులు

Share This

పన్నగాచలనాయక శతకము - పులహరి పీర్దేశికేంద్రులు

దేవరకొండ సుబ్రహ్మణ్యం కవిపరిచయము:

శ్రీపులహరి పీర్దోశికేంద్రులు క్రీ.శ. 1829 సం|| గుంటూరుమండలములోని సత్తెనపల్లి అనేగ్రామంలో జన్మించారు. వీరితల్లి నర్సూబాయి తండ్రి నర్సోజి. వీరు చిన్నతనము నుంచే అనేక మహిమలు కనపరిచినారని ఆప్రాంతవాసుల నమ్మకం. వీరికి 14,15 సంవత్సరాలప్రాయమునందే గురు కటాక్షం వలన పరతత్వం రహశ్యాలన్ని గ్రహించిన మేధావి. వీరు బహుగ్రంధ కర్త. పరమానంద సుధాలహరి, తత్త్వసంగ్రహము, స్వప్రకాశమానము, మొదలైన వేదాంత గ్రంధములు, పన్నగాచలనాయక శతకము, రామశతకము మొదలైన భక్తిరస ప్రధనములైన గ్రంధములను రచించారు.
వీరి క్రీ.శ. 1889 సం|| ది 9 జులై మాసమునకు సరియగు విరోధి నామ సంవత్సము ఆషాఢ శుద్ధ ఏకాదశి మంగళవారమున పరమపదించారు.

శతక పరిచయం:
"పన్నగాచలనాయకా" అనే మకుటంతో అలరారే ఈశతకం భక్తిరస ప్రధానమైనది. శతకంపూర్తిగా 100 మత్తకోకిల పద్యాలలో రచింపబడినది. ఇందలి ప్రతిపద్యము భక్తిరసావేశకమై చదివే వారికి తన్మయత్వము కలిగిస్తాయి. ఈశతకములో కవిత్వము భావస్ఫోరకము, ధారశుద్ధి, సమాసఘట్టనము కలిగి చదివెడివారికి పోతనామాత్యుని కవిత్వము చదుతున్న భావనను కలిగిస్తుంది. కొన్నిచోట్ల కఠినపద భూఇష్టమై మరికొన్నిచోట్ల సరళపదములతోను ఈశతకము కవిగారి భాషాప్రావీణ్యమును స్ఫురింపచేస్తుంది.
కొన్ని పద్యాలను చూద్దాము.

మ. శ్రీరమారమణీమనోహర చిన్మయాత్మకపాండుర
స్మేర శోభితరాజమండల స్నిగ్ధసద్వద నాంబుజా
వారిజాసన సోమశేఖర వందితాంఘ్రి సరోరుహా
పారమోక్ష శుభప్రదాయక పగ్గగాచలనాయకా!

మ. సారసారితుషారశారద చంద్రికా ఘనసారమం
దారహార సుధాబుధీ రాజితావనీధర హీరపా
కారివారణ తుల్యసర్వదిగంత పూర్ణయశోజ్వలా
పారవీర విశేషసాయక పన్నగాచలనాయకా!

మ. జానకీనవమోహనా సదృశామలాత్మపధాను సం
ధాన సూనశరాతికోమల తత్త్వబోధనిథాన ప్ర
జ్ఞాన దీనశరణ్యపన్నగ శాయిసంవిదఖండ చి
ద్భాను భాను సహస్రదీపక పన్నగాచలనాయకా!

మ. రామకోమలమూర్తినిత్య నిరామయాత్మ చిదంతరా
రామ తామరసానంతవ రాక్షసాంతకభీమ స
త్కామ సామజరాజకష్టవిదార పావననామ భూ
పామహామహదర్దదాయక పన్నగాచలనాయకా!

మ. చిత్రచిత్ర మహాప్రభావ విశేష భక్తపవిత్ర చా
రిత్ర మిత్రకులాబ్ధిచంద్ర ధరిత్రిపుత్రికళత్ర గా
యత్రి సూత్రకర ప్రదీప వహత్రినేత్రసుమిత్ర స
త్పాత్ర గోత్రధరేశనాయక పన్నగాచలనాయకా!

మ. పద్మబాంధవ వంశసాగర పద్మవైరి నవస్ఫుర
త్మద్మలోచన పద్మవల్లభ పద్మనాభ దయానిధే
పద్మగర్భశివాదిపూజిత పద్మపాదసుధీమనః
పద్మసద్మసుభద్రదాయక పన్నగాచలనాయకా!

మ. వందనంబిదె వేంకటేశ్వర వైభవ ప్రకరేశ్వరా
డెందమందలరన్ వసింపుము ఠీవిబూని ముకుంద గో
వింద నీచరణారవిందము వేఁడెదీయెడ కోర్కెలిం
పందఁజేయుము జాగుసేయక పన్నగాచలనాయకా!

మ. తల్లిఁదండ్రివినీవెమాకును దాతదైవమునీవె మా
కెల్లకాల మభీష్టభాగ్యము లిచ్చుమాయిల వేల్పువే
కల్లగాదు ముకుంద మాకుసుకల్పవల్లివిగాన మీ
పల్లవాంఘ్రులుగొల్తుఁబాయక పన్నగాచలనాయకా!

మ. దంతిభూమివి భుండవంచును దండజేరినవాడ స
త్పండితావన నీదయాసదపాంగదర్శన మెప్పుడో
మండలేశ్వర సర్వకాలము మమ్ముబ్రోవగదయ్య భూ
పాండజధ్వజ భద్రదాయక పన్నగాచలనాయకా!

మ. నీవే సర్వచరాచరంబులు నీవె సర్వజగంబులున్
నీవె మానవతిర్యగాదులు నీవె సప్తసముద్రముల్
నీవె గాకితరంబులేదని నిర్ణయించి భజించితిన్
భావమందున నిన్ను బాయక పన్నగాచలనాయకా!

మ. చారునీల పయోధరంబుల సౌరుగేరు శరీరమున్
మారకోటివికాసమౌ సుకుమారమున్ యసమానసృ
గారమోహనరూపమున్ గల కైటభాసురశిక్ష యిం
పారగా గనుపించవేయిక పన్నగాచలనాయకా!

ఇంత చక్కని భక్తిరసమయమైన శతకము అందరు చదవదగినది.
మీరు చదవండి.మీ మిత్రులచేత చదివించండి.
 
***

No comments:

Post a Comment

Pages