మానస వీణ-27. - అచ్చంగా తెలుగు

  మానస వీణ-27.

                                                                     శ్రీదేవి సురేష్ కుసుమంచి


భూషణం గారి అనురాగ స్పర్శతో మనోసంద్రంలో నిరంతరం జనిస్తున్న ప్రశ్నల అలలకి సమాధాన తీరం తాకినట్టూ... వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టూ, శ్రావణి గారి పలకరింపుల వర్షంలో తడిచిన మానసకి ఏదో తెలియని అలజడి మనసులో. తన వారంతా తను చుట్టే వున్నట్టు. కాని వాళ్ళు ఎవరు? తెల్సుకోలేక, తేల్చుకోలేక, తన ఆలోచనలతో మౌనమనే ఆయుధంతో పోరాడుతూ ఉంది. అనిరుధ్ బైక్ దిగి, ఆశ్రమంలో అడుగులు వేస్తూ లోలోపల భూకంపాలు పేలుతున్నా పున్నమి నాటి వెన్నెల కిరణాలకి మూస్తాబై, మిలమిల మెరుస్తూ ప్రశాంత వదనంతో ఆశ్రమంలో అడుగుపెట్టిన మానస ని చూసిన సమీరా పరుగు పరుగున ఓ లేడి పిల్లలా వచ్చి “ఏంటి అక్కా ఎప్పటి నుండో నీ కోసం ఎదురు చూస్తున్నాను.” అంది.

"ఎందుకు సమీరా?" అంటూ అడుగులు ముందుకు వేసింది మానసా.

నువ్వు నాకు పాఠాలులో అర్థం కానివి చక్కగా వివరించి చెప్పడం వలన నేను ఈ రోజు చాలా బాగా పరీక్ష వ్రాయగలిగేను. ఆ సంతోషాన్ని నీతో పంచుకుంటూ, భోజనం చేద్దామని వేచి వున్నాను.

"అవునా నా కోసం ఎందుకు ఎదురు చూడటం రేపు ఉదయమైనా చెప్పవచ్చు కదా?” అంటూ, నువ్వు పద నేను వస్తానంటూ...

ఉదయం నుండి అటూ ఇటూ అంటూ ఏవో పనుల మీద తిరిగి అలసిన ఆ మోహాన్ని చల్లని నీటితో కడుక్కున్ని వంటగది వైపు వెళ్ళింది..

సమీర “ఏమైందక్కా? అలా వున్నావు? ఎప్పుడూ చాలా చురుకుగా కనబడేదానివి. కాని ఈరోజు ఏవో ఆలోచనలతో యుద్ధం చేస్తున్నట్టున్నావు. బయటికి నువ్వు చెప్పకపోయిన నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఈ తెలివైన అక్కకి దేవుడిచ్చిన చెల్లిని కదా ఆ మాత్రం కనిపెట్టలేనా ఏంటి?” అంది ఆట పట్టిస్తూ.

"ఓ పెద్ద కనిపెట్టేవు లే!"

ఏమీ లేదు! ముందు భోజనం చేయి, మళ్ళీ రేపు తొందరగా నిద్రలేవాలి కదా!" అంటూ మాటను దాటేసింది.

భూషణానికి శ్రావణీని చూసిన దగ్గర నుండి “దేవుడే తన మొర ఆలకించి తన మనవరాలిని పంపివుంటాడు." అనుకుంటూ తెగిన చెరువు గట్టులా కళ్ళల్లో కారుతున్న కన్నీరు బుగ్గలని తడుపుతూ, ఆ దేవునికి కృతజ్ఞతా అభిషేకం ఆగలేదు.

ఓ పక్క రఘురాం ఎన్నో ఆలోచనలకి తన మెదడులో పురుడుపోస్తూనే ఉన్నాడు. ‘తన భార్య శ్రావణీలో మ మార్పుని చూస్తుంటే, తన బిడ్డ లాగ వున్న మానసని దత్తత తీసుకుంటే బాగుంటుంది, తన భార్య పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదో, మానస కూడ తన కళ్ళకి అలానే కనబడుతోంది... తన భార్య మాట తీరు, నడవడిక కూడా అన్నీ మానసలో కనబడుతున్నాయి. ముందు తన పుట్టుపూర్వాత్తరాలు   తెలుసుకుందాము. తరువాత నిర్ణయం తీసుకుందాం. ఎలాగైనా రేపు మళ్ళీ నా భార్యని చూడటానికి ఆసుపత్రికి వస్తుంది. అప్పుడు తన తల్లిదండ్రుల వివరాలు అడుగుదామనుకుంటూ’ నిద్రలోకి జారుకున్నాడు రఘురాం.

బైక్ మీద మానసని ఆశ్రమంలో దించి ఇంటికి వెళ్ళిన అనిరుధ్ కి మానస చిత్తరువే ప్రత్యక్షమౌతూ, “తనతో ఉహించుకుంటున్న భవిష్యత్ ని ఎలా ఆహ్వానించాలి?తన  తల్లిదండ్రులకు మానస అంటే ఎంతో ఇష్టంతో కూడిన అభిమానమున్నా పెళ్ళి విషయం అడగటానికి నోటికి కుల, గోత్రాలు, పుట్టుపూర్వోత్తరాలతో తాళం వేసుకుంటున్నారు... ఏమి చేయాలి? ఓ ప్రక్క రాజేష్ నిజస్వరూపం తేటతెల్లమైనా వాడి గత చరిత్ర భయంకరమైన క్రూర లక్షణాలు గలది, అందుకే క్షణం కూడా నేనేంటో ఆలోచించకుండా నా అడ్డు తన ప్రేమకి తొలిగించుకోవాలని, నా క్యారెక్టర్ చెడ్డగా చూపించడానికి, ఒక విష వలయానికి అల్లేడు, వాళ్ళ స్నేహితుల యాసిడ్ దాడులు ఒక వైపు… అయినా నేను ముందు మానసని కాపాడుకోవాలి… తరువాత పెళ్ళి కోసం ఆలోచిస్తే బాగుంటుందేమో!అనుకుంటూ నిద్రలోకి జారుకున్న అనిరుధ్ కి తెల్లవారే సరికి మానస నుండి ఫోను!.

హలో మానసా! ఏమిటి విషయం? ఇంత తెల్లవారే ఫోను చేశావు?”

అనిరుధ్ నేను బి.ఎడ్ కోచింగ్ లో జాయిన్ అవుదామనుకుంటున్నా… నన్ను సాయి కోచింగ్ సెంటర్ కి తీసుకువెళ్ళగలవా?”

"సరే మానసా అలాగే వెళదాం" అంటూ ఫోను పెట్టేశాడు.

అనిరుధ్ కోసం బయట నిలబడి ఎదురు చూస్తున్న సమయంలో ఒక కారు ఎదురుగా వచ్చి ఆగి, ‘అమ్మా మానసా!’ అంటూ పిలుపు వినబడింది. ఎవరూ అని చూసే సరికి, శ్రావణీ గారి భర్త రఘురాం గారు!

మీరా! ఇలా వచ్చారేటండి..?”

లేదురా తల్లీ! ఇటుగా పని వుంటే నువ్వు ఇక్కడే ఉంటావని తెల్సి చూసి పోదామని వచ్చేను రా అంటూ, ఆమె తల నిమురుతూ, “కలకాలం చల్లగా ఉండరా అంటూ, కళ్ళల్లో తెలియని ఆనందభాష్పాల దీవెనలతో దీవిస్తూ తనకై తెచ్చిన మిఠాయి పొట్లాం చేతిలో పెట్టేసరికి రఘురాం ఆశలు ఫలించినట్టు అనిపించాయి.

మానస చిటికెన వేలు శ్రావణి చిటికెన వేలులాగే గోరు వద్ద చిన్న ఒంపుగా వుంది. “ఈ మానస నా కూతురే అయి వుండచ్చు. ఎలాగైనా మానస వివరాలు సేకరించి, నా మహాలక్ష్మిని మా ఇంటికి తీసుకువెళ్ళి, శ్రావణి కళ్ళల్లో కోటి జ్యోతులు వెలిగిస్తానంటూ” కారు ఎక్కి బయలుదేరేడు రఘురాం.


No comments:

Post a Comment

Pages