అనసూయ ఆరాటం -6 - అచ్చంగా తెలుగు

 అనసూయ ఆరాటం -6 

చెన్నూరి సుదర్శన్


 

(ఏదైనా వ్యాపారం పెట్టాలని చూస్తున్న సమ్మయ్య, బుచ్చయ్య సలహా కోసం పంతులుని సంప్రదిస్తారు. శాలోల్ల దుకాణాలు కిరాయికి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. రాజయ్య పోరాటాలలో తిరుగుతున్న కొడుకు ధైర్యం చూసి బాధపడతాడు.)

గడియ ఇరాం లేకుంట గనారం లెక్క పనిచేసుట్లనో ఏందో గాని లింగారెడ్డి తబియత్ కూషైంది. ఊకె సల్లంగ చెమటలు పెట్టుడు.. జర్రంత పని చేసినా పానం సతికిల పడుడు.. మీదికెల్లి తాప తాపకు ఎడతెరిపి లేకుంట దగ్గు. ఓమానంగ తగ్గక.. ఎటూ సుజురాయించక పోయేది. దగ్గినప్పుడల్లా కంకెడు కంకెడు తెమడ పడుడు.. అనుమానమేసి వరంగల్ దవాఖానకు తీస్క పోయిండు బుచ్చయ్య.


లింగారెడ్డికి రక్త పరీచ్చలు చేసి టీ.బి. అని తేల్చిండ్లు డాక్టర్లు.


ఆ మాట ఇనంగనే పానం పోయినట్టు న్యాల మీద కూల పడ్డడు లింగారెడ్డి. కండ్లల్ల నీళ్ళు తిరిగినై. నోట్లె కండువ పెట్టుకొని సన్నంగ ఏడ్తాంటే.. బుచ్చయ్య దగ్గరికి తీస్కోని సముదాయించబట్టిండు.


ఇంతల డాక్టరు వచ్చి సిన్న పిలగాని లెక్క ఏడ్చుడేందని కోప్పడ్డడు. అయినా ఇదేమీ పెద్ద రోగం కాదని  సముఝాయించిండు.


“లింగారెడ్డీ.. క్షయ వ్యాధికి భయపడాల్సిన పనేమీ లేదు బాబూ. నీలో ఇప్పుడిప్పుడే ఆ లక్షణాలు కనబడుతానై. తొందరగా వచ్చి చాల మంచి పని చేసావు. పూర్వం టీ.బి. వచ్చిందంటే సచ్చినోని కిందనే జమచేసేటోల్లు. కాని ఇప్పుడు మన సైన్స్ ఎంతగానో ఎదిగింది.  కొత్త, కొత్త మందులు వచ్చినై. ఇప్పుడు ఆ జబ్బు మమూలు జ్వరం కింద లెక్క. నేను మందులు రాసిస్తా.. క్రమ తప్పకుండా వాడు. నెల రోజుల తరువాత మళ్ళీ వచ్చి పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా విశ్రాంతి అవసరం. బలానికీ మందులు రాసిస్తా.. పండ్ల రసాలు.. రోజుకో గుడ్డు ఉడుక బెట్టుకొని తిను.. బలవర్దకమైన  భోజనం చెయ్యి” అన్కుంట ధైర్నం చెప్పిండు.  


“డాక్టర్ సాబ్.. లింగారెడ్డికి ఇంకా పెండ్లి కాలే.. చేసుకోవచ్చా..” అని భయం భయంగ అడిగిండు బుచ్చయ్య.


భల్లున నవ్విండు డాక్టరు. లింగారెడ్డి, బుచ్చయ్య దేబె ముకాలేసు కొని సూడబట్టిండ్లు.


“పెళ్ళి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కాపురమూ చెయ్యవచ్చు. ఇందులో అనుమానమేమీ అఖ్ఖర లేదు. మంచి అమ్మాయిని చూసి పెండ్లి చేయండి. పెళ్ళికి నన్నూ పిలవండి. తప్పకుండా వస్తా..”  అని డాక్టరు మరో సారి భరోసగ నవ్విండు.


నెల రోజులు సరిపడే మందులు తీసుకొని లింగారెడ్డి, బుచ్చయ్య ములుగు ముకం పట్టిండ్లు.


          ఒక నెల మందులు వాడెటాల్లకు లింగారెడ్డి మల్ల మామూలు మనిషయ్యిండు. దగ్గు పురంగ తగ్గింది.నాత్రుల్లు కంటి నిండ నిద్ర పోతాండు. కడుపుల ఆయిమన్న కురాకు పడేటాల్లకు మనిషి మల్ల నిగ నిగలాడబట్టిండు.


          నెల తరువాత మల్ల బుచ్చయ్య, లింగారెడ్డి కలిసి డాక్టరు


దగ్గరికి పోయిండ్లు.


డాక్టరు పరీచ్చలు సేసి.. “శాన వరకు తక్కువైంది అయినా నిత్తె మందులు వాడాలె”  అని కొన్ని కొత్త మందులు రాసిచ్చుకుంట..పెండ్లి యాదికి చేసిండు. లింగారెడ్డి సిగ్గు పడుకుంట నవ్విండు.


          “ఇంకా చిన్న మొల్లివనుకుంటానవా..” అని డాక్టరు లింగారెడ్డి భుజం తట్టిండు.” పిల్లను చూసిండ్లా..” అని బుచ్చయ్యను చూసుకుంట అడిగిండు డాక్టరు.


          “ఇగ పోయినంక అదే పని..” అని బుచ్చయ్య సుత డాక్టరు నవ్వుల నవ్వు కలిపిండు.


లింగారెడ్డిని తీస్కోని ములుగు బస్సెక్కిండు బుచ్చయ్య.


          లింగారెడ్డికి రెస్టు అవసరమని  బుచ్చయ్య అల్లుడు రమేషు కిరాణ దుకాణం చూసుకుంటాండు.   లింగారెడ్డి పని దుకాన్ల అందరి మీద నిగరాని పెట్టి కూకుండుడు.. అక్కరైనమైనప్పుడల్లా.. వరంగల్లుకు పోయి సామాన్లు కొనుక్కచ్చుడు.. 


***


            లింగారెడ్డికి పెళ్ళి సంబధాల సంగతి నలుగురి చెవుల్లో పడేటాల్లకు నాలుగు రకాల సంబధాలు రాబట్టినై. ఒక పేదింటి పిల్లను చేసుకుంటే బాగుంటది.. ఎనకా ముందెవ్వలూ ఉండద్దు.. అప్పుడే మన చెప్పు చేతల్ల ఉంటదని లింగారెడ్డి ఆలోచన. సేట్లు లింగారెడ్డి మాటకు విలువిత్తరు. ఆయన ఇట్ట ప్రకారమే.. ఆయనకు నచ్చిన  పిల్లనే చెయ్యాలని సూత్తాండ్లు.


          ములుగు దగ్గర పల్లెటూరు జంగాలపల్లిల ఒక పిల్ల ఉన్నదని తెలిసింది.


          ఆదివారం దుకాన్లు బందు. బుచ్చయ్య, సమ్మయ్య సేట్లు, బుచ్చయ్య కొడుకు రవీందర్, పోలీసు రాజయ్య కొడుకు సురేందర్ మరో పెద్ద మనిషి వెంకటయ్య ఐదుగురు కలిసి ఎగిలిబారంగనే లేచి సైకిల్ల మీద జంగాలపల్లికి బైలెలెల్లిండ్లు. ములుగు నుండి కమస్కం పది కిలోమీటర్ల దూరం. ఎదురు గాలి.. కింద మీద పడుకుంట.. సైకిల్లు తొక్కుకుంట.. ముచ్చట్లు చెప్పుకుంట.. జంగాలపల్లి ఊరి పొలిమేరకు చేరిండ్లు.


ఎదురుంగ చాయె దుకాణం కనబడే టాల్లకు వెంకటయ్య సట్న సైకిలుకు బిరకేసి దిగిండు.


          “తమ్మీ రవీ.. చాయె తాగి పోదాంరా..” అన్కుంట అందరిని ఆగమని సైగ చేసిండు.


          నిజానికి అందరి పానాలు చాయె మీదనే కుతి గుంజబట్టినై. ఇంట్ల కెల్లి పడిగడుపున బైల్దేరిరి. చాయె తాగి బీడి, సుట్టలు ఎలిగిత్తే గాని సేట్లు ముందుకు కదిలేటట్టు లేరని వెంకటయ్య పసిగట్టిండు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages