కుండలినీ జాగృతి - అచ్చంగా తెలుగు

కుండలినీ జాగృతి

(సి.హెచ్.ప్రతాప్) 




మన భారతీయ తత్త్వశాస్త్రం ప్రాచీన కాలం నుండి మనిషిలోని అంతర్గత శక్తులపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో కుండలినీ అనేది ఒక కీలకమైన ఆధ్యాత్మిక అంశంగా పరిగణించబడుతుంది. ఇది సాధారణ శారీరక శక్తి కాదే, మనిషి చైతన్యంలో నిద్రించి ఉన్న శుద్ధమైన శక్తి రూపం. ప్రతి జీవిలో ఈ శక్తి అంతర్భూతంగా ఉన్నా, దాన్ని మేల్కొల్పగల సామర్థ్యం మానవుడికే ఉంది.

ఈ శక్తిని జాగృతం చేయడం ద్వారా మనిషి తనలో దాగిన పరిమితులను అధిగమించి, సమగ్రంగా ఎదగగలడు. శరీరంలోని మూలాధార చక్రంలో విశ్రాంతిగా ఉన్న ఈ శక్తి, సాధన ద్వారానే పైచక్రాలవైపు కదిలి, మానసికంగా, ఆధ్యాత్మికంగా వ్యక్తిని ఉద్ధరించగలదు. మన సంప్రదాయం ప్రకారం, దీన్ని సాధించాలంటే జీవనమంతా అప్రమత్తతతో జీవించాల్సి ఉంటుంది. ఇది కొద్ది రోజుల సాధనతో సాధించదగిన ప్రక్రియ కాదు, నిరంతర జాగృతి కావాలి.

ధ్యానం ఈ క్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధ్యానం అనేది పునశ్చరణలు చేసే ఒక పద్ధతి కాదు. అది క్షణక్షణాన అప్రమత్తతతో, చైతన్యాన్ని శుభ్రపరిచే జీవిత ధోరణి. ఈ సాధన ద్వారా మన ఆలోచనలు, జ్ఞానేంద్రియాలు, మన అభిరుచులు అన్నిటినీ విశ్లేషించి, వాటి మీద పట్టును సాధించాలి.

సహజంగా కొందరికి ఈ శక్తి జన్మతోనే మేల్కొన్నట్టుగా ఉంటుంది. వారు తక్కువ ప్రయత్నంతోనే ఆధ్యాత్మిక భావనలతో జీవితం గడుపుతారు. అయితే సాధారణంగా ఇతరులకు ఇది నిద్రించివుంటుంది. అలాంటి వారు దీన్ని మేల్కొలపాలంటే, ప్రత్యేకమైన మార్గాలను అవలంబించాలి. యోగం, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులు ఈ మార్గంలో సహకరిస్తాయి.

భూమిపై ఉన్న జీవరాశుల్లో కేవలం మానవుడికే ఈ శక్తిని మేల్కొల్పే సాధన ఉంది. శరీరం, శ్వాస, భావోద్వేగాలు, ఆలోచనలు — అన్నింటిపై నియంత్రణ సాధించినప్పుడు మాత్రమే కుండలినీ శక్తి పూర్తిగా వికసిస్తుంది. ఈ స్థితి మానవుడిని ముక్తి వైపు నడిపిస్తుంది.

కుండలినీ జాగృతం వల్ల మనస్సు లోపలి వికారాల నుండి శుభ్రపడుతుంది. ఉల్లాసం, శాంతి, స్పష్టత, అంతర్ముఖత పెరుగుతాయి. శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి, మనిషి లోపలి మౌనాన్ని అనుభవించగల స్థాయికి చేరతాడు. కుండలినీ శక్తి మేల్కొనడం అనేది ఆధ్యాత్మిక పరిపక్వతకే సంకేతం. దీన్ని సాధించగల వ్యక్తి, సమసమాజ నిర్మాణానికి ఒక ఉదాత్త ఉదాహరణగా నిలవగలడు.

***

No comments:

Post a Comment

Pages