దక్షిణామూర్తి తత్త్వం – మౌనబోధ స్వరూపం - అచ్చంగా తెలుగు

దక్షిణామూర్తి తత్త్వం – మౌనబోధ స్వరూపం

Share This

దక్షిణామూర్తి తత్త్వం – మౌనబోధ స్వరూపం

సి.హెచ్.ప్రతాప్  


వేదాంతంలో అత్యంత గంభీరమైన, పరిశుద్ధమైన తత్త్వజ్యోతి — దక్షిణామూర్తి తత్త్వం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక దృశ్యం కాదు; జీవన పరమార్థాన్ని గుర్తించి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందేందుకు మార్గం చూపే జ్ఞానస్వరూపము.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానమూర్తి స్వరూపం. ఆయనను చేరుకోవడం భక్తి ఒక్కటితో సాధ్యం కాదు — జ్ఞానపూర్వకమైన ధ్యానం, మౌనవ్యాసంగం అవసరం. ఎందుకంటే ఆయన బోధనం మాటల ద్వారా కాదు; మౌనం ద్వారానే జరుగుతుంది. దక్షిణామూర్తి మౌనముగా ఉండి కూడా పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించే గూరూ స్వరూపం.

పురాణిక చిత్రాలలో ఆయనను వటవృక్షం క్రింద, దక్షిణాభిముఖంగా ఆసీనుడై, చుట్టూ వయోవృద్ధ ఋషులకు మౌన బోధన చేస్తున్నట్లు చూపిస్తారు. ఇది వాచిక విద్య కాదు — సాక్షాత్కార బోధ. ఈ బోధ అనుభవం ద్వారానే గ్రహించదగినది.

శ్రీదక్షిణామూర్తి స్తోత్రంలో ఆదిశంకరులు ఇలా పేర్కొంటారు:

"మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం యువానం
వర్షిష్ఠానాం వరద మునినాం మధ్యవర్తినమీడే॥"

(మౌన వ్యాఖ్య ద్వారా పరబ్రహ్మ తత్త్వాన్ని బోధించే యువకుడైన దక్షిణామూర్తిని, వయోజ్ఞులైన ఋషుల మధ్య కూర్చొని ఉండే స్వామిని నేను నమస్కరిస్తున్నాను.)

ఈ లోకాన్ని అద్దంలో ప్రతిబింబంలా చూసే విధంగా ఆదిశంకరులు వివరిస్తారు. ప్రపంచ భిన్నత్వం ఉపాధినిర్మితమే. అసలు స్వరూపం — నిత్య శుద్ధ బోధాత్మక బ్రహ్మం. దాన్ని గ్రహించినవాడే విముక్తుడు.

దక్షిణామూర్తి తత్త్వం అజ్ఞాన నివారణే ప్రధానలక్ష్యం. వేదాంత సరస్వతి, ఉపనిషత్తుల హృదయం ఆయన బోధలో దాగి ఉంది. ఈ బ్రహ్మవిద్య పరంపర ఆయనే మూలం:

"సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం॥"

దక్షిణామూర్తి తత్త్వం — అద్వైత సూత్రరూపం: జ్ఞానమే గురువు, జ్ఞానమే దైవం, జ్ఞానమే మార్గం. శంకరులు ఈ తత్త్వాన్ని వివరిస్తూ, మాయాభ్రమల నుంచి విముక్తి కలిగించే మార్గాన్ని చూపారు.

దక్షిణామూర్తిని పూజించడం అంటే విగ్రహాన్ని నమస్కరించడం కాదు — లోపల ఉన్న జ్ఞానదీపాన్ని వెలిగించడం. ఆయన మౌనబోధ మనలోని చిత్తవృత్తులను శాంతపరచి, ఆత్మ జ్ఞానం వైపు మనల్ని నడిపిస్తుంది.

నిజమైన ఉపాసన అంటే అహంకార నిర్మూలన, మాయావిమోచన మరియు ఆత్మస్వరూప దర్శనం. అదే దక్షిణామూర్తి తత్త్వం — శుద్ధమైన అద్వైత సత్యం.

***

No comments:

Post a Comment

Pages