ఈ దారి మనసైనది - 44 - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 44

అంగులూరి అంజనీదేవి  


వాళ్లిద్దరు తననెంత ప్రేమగా పెంచుకున్నారు... ఫారిన్ నుండి నెయిల్ పాలిష్ తెప్పించి తన గోళ్లకి పెట్టకపోయినా, పెరట్లో గోరింటాకు తండ్రి తెంపుకొస్తే తల్లి నూరి పెట్టేది. తినకుండా నిద్రపోతే ఏదో ఒక టైంలో నిద్రలేపి తినిపించేవాళ్లు ... వాళ్ల కళ్లలో ప్రాణం తనే అయినట్లు అడుగడుగున అన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ తను కరెక్ట్గా వున్నానని తెలిసి మురిసిపొయేవాళ్లు అలాంటి వాళ్లను పోగొట్టుకొని అనురాగ్ని పొంది తను సుఖపడగలదా?

అలా అని అనురాగ్ని మరచిపోవటానికి అతనేమైనా పీడ కలా? ఇంట్లో తనకి ఏ ఆప్యాయత లేకనో, లేక తన ఎమోషనల్ కండిషన్ వీక్గా వుండటం వల్లనో అతన్ని తను కావాలనుకోలేదు. తగినంత మెచ్చూరిటీ వచ్చాకనే అతన్ని సెలక్ట్ చేసుకొంది.

కానీ ... తన తల్లి ఇచ్చిన మాటకి కట్టుబడే మనిషి... ఇప్పుడు తనేం చేయాలి?

దీక్షిత చెక్కిళ్లమీద నుండి నీళ్లు కారి గుండెల్ని తడుపుతుంటేఅప్పుడనుకొంది. తను ఏడుస్తున్నానని... అనురాగ్ పరిచయం అయ్యాక ఏడవటం ఇదే మొదటి సారి. కానీ ఇప్పుడెలా? 

అనురాగ్ని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను చంపుకోవటమా? లేక తల్లిదండ్రుల్ని బ్రతికించుకొని అనురాగ్ని వదులుకోవటమా? అనురాగ్ది  ఐదుసంవత్సరాల బంధమైతే తల్లిదండ్రులది ఇరవైఐదు సంవత్సరాల బంధం... పేదరికంలో పుట్టి లోగడ ఎన్నో పరీక్షల్ని తట్టుకొంది కానీ ... 

ఈ పరీక్ష మనసుకి సంబందించింది దీన్ని తట్టుకోవాలంటే మానసిక స్పందనని హత్య చేసుకోవాలి... అలా హత్య చేసుకొని “కొన్ని జీవితాలు ఇంతే!” అనుకొని బ్రతికే కన్నా ఈ బ్రతుకే వద్దనుకుంటే?

ఎలా వద్దనుకుంటుంది?

ఇన్నేళ్ల తన కల, తన ఆశయం నిజమై అనుభవించే సమయంలో తనని తను చంపుకోవాలా? ఇంత కష్టపడి మెడిసిన్  చేసింది చనిపోవటానికా? కాదు తను బ్రతకి పదిమందిని బ్రతికించాలి. ప్రశంసలు పొందాలి... కానీ ... తనను తను మోసం చేసుకొని పొందే ప్రశంసలతో హాయిగా వుండగలదా? ఇవే చాలనుకొని సుఖంగా బ్రతుకగలదా?

ఇన్నాళ్లు ఎన్ని కష్టాలు వచ్చినా చావాలి అన్న అలోచనరాని తనకి ఈ రోజు వస్తుంటే అనురాగ్ తన హృదయంలో ఎంతగా నిండిపోయాడో అర్థమవుతోంది. అంటే అతను లేందే ఇక ముందు ఏపనీ చేయలేదా ? ఈ ఐదేండ్లలో అతనికి ఇంతగా అలవాటు పడిపోయిందా? 

రేపు అనురాగ్ వచ్చి నన్నెందుకు మోసం చేశావని అడిగితే తనేం చెప్పాలి.? 

ఇంత మందిని మోసం చేసి, బాధ పెట్టి ... సృజన లేని పెయింటింగ్లా జీవితాన్ని మార్చుకొని ఎలా బ్రతకాలి?

అంటే తనను తను చంపుకోవటమే దీనికి పరిష్కారమా? ఎన్ని ప్రశ్నలకి ఎన్ని సవధానాలు వెతికినా చివరకు తనను తన చంపుకోవడమే సరైనా సమాధానంలా వుంది.

కానీ ... తను చావకూడదు...

క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకునే వయసులో లేదు. మరి... ఇన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకుని భరించే స్థాయికి తను ఎదిగి తనను తను కాపాడుకోవాలంటే ఇప్పుడు తనేం చేయాలి? అనుకొంది దీక్షిత. 

******

ఉదయం పదిగంటలయింది. హాస్పిటల్ కి వెళ్లింది దీక్షిత. “ఏంటి దీక్షితా! అలా వున్నావ్ ?” అంది మన్విత ఓ.పి. అయ్యాక...

“ మనసు బాగలేదు మన్వితా!” అంది దీక్షిత. ఒక్క రోజుకే దీక్షిత చెక్కిళ్లు లోతుకిపోయి, కళ్ల కింద వలయాలు ఏర్పడి, ముఖం చిక్కిపోయి ఎన్నో రోజులుగా తిండి, నిద్ర, నీళ్లు లేని మనిషిలా అన్పిస్తోంది.

“ఎనీ ప్రాబ్లమ్ ! అనురాగ్ కాల్ చెయ్యట్లేదా?” అంది వెంటనే మన్విత.

“అదేం లేదు మన్వితా ! మా అత్తయ్య నన్ను మా బావ విజయేంద్రకి చేసుకుంటానంటోంది .అతను ఢిల్లీలో మిలటరీ ఆఫీసర్గావున్నాడు... నేను ‘ఎంసెట్ లాంగ్ టర్న్' ఇప్పించమని మా పేరెంట్స్ ని అడిగినప్పుడు అత్తయ్యతో వాళ్లేం మాట్లాడారో నాకు తెలియదు. అప్పటి నుండి నా చదువుకి ఎంత అవరసమైతే అంత డబ్బు అత్తయ్యవాళ్లే ఇచ్చారు. దానికి కారణం వాళ్ల అబ్బాయికి నన్ను ఇస్తామని మా పేరెంట్స్ మాట ఇవ్వడమేనని రాత్రి అమ్మ, అత్తయ్య మాట్లాడుకుంటుంటే విని తెలుసుకున్నాను. ఆ మాట ప్రకారం వాళ్లు కూడా నా చదువు అయ్యేంత వరకు అది ఇప్పుడు అడుగుతున్నారు. ఇందులో వాళ్ల తప్పేం లేదు. ” అంటూ ఒక్కక్షణం ఆగింది దీక్షిత.

భూమి కంపించినట్లు ఫీలయింది మన్విత.

“మీ ఫ్యామిలీ ఎకనామికల్ పొజిషన్ తెలుసుకోకుండా అనురాగ్ని ఎందుకు ప్రేమించావని నేను అడగను. అది నీ ఇష్టం ... కానీ అతను నిన్ను ప్రేమించేదాకా ఎందుకు తెచ్చుకున్నావ్? ప్రేమంటే మెకానికల్ మైండ్తో ఆడే ఆట కాదుగా ... ఎంతయినా ఈ గేమ్ నాకు నచ్చటం లేదు దీక్షితా !” అంది మన్విత. 

కాల్చిన చువ్వతో వాతపెట్టినట్లు విలవిల్లాడింది దీక్షిత మనసు...

“అనురాగ్తో నా ప్రేమను గేమ్' గా అనుకోవటం లేదు మన్వితా! కానీ ... కన్న పిల్లల్ని సైతం పట్టించుకోకుండా వారి, వారి పనుల్లో బిజీగా వుండే కొందరు తల్లి దండ్రులున్న ఈ రోజుల్లో ... మా అమ్మా, నాన్న నన్ను మా ఇంటి వెనకాల వుండే పెరట్లో కురిసే వెన్నెల్లో కూర్చో బెట్టుకొని నీతి కథలు, సూక్తుల్లాంటి మంచి మాటల్ని చెప్పి, నైతిక విలువల్ని నేర్చుకున్నారు. నేను నేర్చుకున్న ఆ నైతికత నా తల్లి, దండ్రుల్ని చంపుకోటానికి ఉపయోగపడితే నన్ను నేను క్షమించుకోలేను... ఈ విషయంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.” అంది నిస్సహాయురాలిలా తన చూపుల్ని ఎక్కడో నిలిపి దీక్షిత.

" ఏ ప్రశ్నకైనా సమాధానం వుంటుంది కానీ... సమాధానం లేని ప్రశ్నంటూ వుంటే ఒక్క ప్రేమనే ... అది దొరకనప్పుడు బాహ్యప్రపంచం వేరు ఆంతరంగిక ప్రపంచం వేరు అన్నట్లుగా వుంటుంది. అలా అని కన్న వాళ్ల అప్యాయతల బొడ్డుతాడును తెంచుకొని బోరున ఏడుస్తూ కృతిమ శ్వాసను పీల్చుకుని బ్రతకమని ఎవరూ చెప్పరు ... కానీ అనురాగ్ కి ఏం సమాధానం చెబుతావ్?” అంది మన్విత.

అర్థం కానట్లు పెదవిని ముడిచి ఆలోచిస్తోంది దీక్షిత.

“లేకుంటే ఒక పని చెయ్యి దీక్షితా ! వాళ్లకి మీరు ఇవ్వవలసిన డబ్బు మొత్తం అనురాగ్తో  చెప్పి ఇప్పించు ... ఈ సమస్యకి ఇదే సరైన పరిష్కారం ...” అంది మన్విత.

“ వాళ్లు డబ్బు గురించి మాట్లాడటం లేదు మన్వితా ! 'దానం చేశామని అనుకుంటాం 'అంటున్నారు. కానీ ... 'మాట' మాట ఇచ్చినందుకు కొశ్చన్ చేస్తున్నారు. అమ్మ మాట తప్పే మనిషి కాదు. “నేను మాట తప్పాల్సి వచ్చినప్పుడు చావనైనా చస్తాను, కానీ ... నా కూతురు ఈ పెళ్లికి ఇష్టంగా ఒప్పుకోవాలన్నదే నా కోరిక. అందుకే దాన్నో మాట అడగాలి' అని అమ్మ రాత్రి అత్తయ్యతో చెప్పింది. అమ్మంటే నాకు ప్రాణం మన్వితా ! నన్ను ప్రాణంగా పెంచుకొంది. అమ్మను బ్రతికించుకోవాలి. అమ్మ కోసం ఏమైనా చెయ్యాలి...” అంది దీక్షిత.

మన్విత మాట్లాడలేదు..

కొన్ని ప్రేమలకి విలువలు పెరగాలన్నా, పడి పోవాలన్నా వాళ్ల అనుభవాల పునాదులే సాక్ష్యం ... అనుబంధాలను కొలిచే యంత్రాలు వున్నాయో లేవో తెలియదు కాని దీక్షిత హృదయం ముందు ఏయంత్రం పనికి రాదు..

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages