ఏలికవు నీవట యింకా దైన్యమేల (24-06-21) - అచ్చంగా తెలుగు

ఏలికవు నీవట యింకా దైన్యమేల (24-06-21)

Share This

ఏలికవు నీవట యింకా దైన్యమేల (24-06-21)

వివరణ: డా.తాడేపల్లి పతంజలి 
రేకు: 0335-02 సం: 04-203

పల్లవి:

ఏలికవు నీవట యింకా దైన్యమేల

తాలిమి నీచేతలకుదగవు గాదనరా

చ.1:

ఘనకర్మానుభవమే కావలె నొండె నాకు

వనజాక్ష నీసేవే వలె నొండె

కినుకబూటయు సంకెలయు రెండు నేల

ననిచి యిందుకు నిన్ను నవ్వేరుసుమ్మీ

చ.2:

పైకొని నే జేసినపాపమె కావలె నొండె

తూకొని నీనామముచే దుంచుట యొండె

సాకిరి చంకదుడ్డు శరణార్తి రెండు నేల

మేకొని యీవట వింటే మెత్తురా నిన్నును

చ.3:

యిరవుగా మరపొండె యెరుక గావలె నొండె

సరస రెండును నైన సంగతౌనా

గరిమ శ్రీవేంకటేశ కరుణించితివి నన్ను

సరిబేసి జంటమాట జరపకు మికను

భావం

పల్లవి:

ఏలికవు నీవట యింకా దైన్యమేల

తాలిమి నీచేతలకుదగవు గాదనరా

భావం

పల్లవి

ఓ వేంకటేశా ! మాలాంటి దీనులను పాలించే పరిపాలకుడవు నీవట. ఇంకా మాకు దీనత్వమెందుకు? (అవసరం లేదని భావం)

క్షమాగుణం కలిగిన నీ చేతలు ఇలా ఉంటాయా? (భక్తుని దీనత్వంలో ఉంచుట మొదలయినవి భగవంతుని చేతలని భావం) ఇది న్యాయం (తగవు) కాదని అందరూ అనరా ? (అందరూ అంటారని భావం)చ.1:

పద్మముల వంటి కన్నులు కలవాడా ! వేంకటేశా !నాకు గొప్పదయిన కర్మానుభవమన్నా కావాలి. లేకపోతే

నీసేవన్నా కావాలి.

కోపము పూనుట, సంకెల - రెండు ఎందుకు? (కర్మానుభవము- స్వామి కోపముతో , సంకెల -సేవతో పోలిక)

ఇలా చేస్తే నిన్ను అందరూ నిన్ను చూసి నవ్వుతారు సుమా !

చ.2:

గాఢముగా నేను చేసిన పాప ఫలితాన్ని నేను అనుభవించాలి.. లేదా-

ఆపాపప్రభావమంతా నీనామస్మరణచే తొలగిపోవాలి.

అంతేకాని రెండూ ఉంటే ఎలాగయ్యా !

కొట్టడానికి చంకలో లావు కర్ర, శరణు కోరే తపన – రెండూ ఒకచోట ఎలా?

ఇలా చేసే వాడివి నీవట. ఇలా చేస్తే నిన్ను భక్తులు మెచ్చుకుంటారా? ?( నాపాపఫలితాన్ని అనుభవింపచేస్తున్నావు. నా శరణు కోరే తపనను అనుగ్రహిస్తున్నావు. రెండూ ఒకసారి కుదరవు. నేను చేసిన పాప ఫలితాన్ని తొలగించమని ప్రార్థన.)

చ.3:

ఉంటే మరపు అన్నా ఉండాలి. లేదా తెలివి(అద్భుతమైన జ్ఞాపక శక్తి) అన్నా ఉండాలి.రెండూ ఒక చోట ఎలా కుదురుతాయి? శ్రీవేంకటేశ! నన్ను కరుణించావు. మంచికి ,చెడుకు జంట కలిపే పద్ధతి చేయకు . నీకు నమస్కారం.

***

No comments:

Post a Comment

Pages