బైరాగి బసవరాజు - అచ్చంగా తెలుగు

 బైరాగి బసవరాజు

(మాజొన్నవాడ కధలు)

టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


“ఇల్లు వాకిలినాది… యిల్లాలు నాదనుచు… యేల భ్రమసేవో.....మనసా.....

కాలుని వలలోన…. కానకను జిక్కేవు… కడతేరుటే త్రోవ...మనసా...

తనయులు చుట్టాలు…. తనవారు  యనినమ్మి…. తలపోయకే… వెర్రి మనసా...

ఆలు బిడ్డలు మాయ…. అందరూ మాయేనురన్నో...మిగిలేది సున్నేనురన్నో....

కాసుల నమ్ముకొని కలకాలముండకుర యన్నా..కష్టాలు వచ్చేనురన్నో...”

పెన్న గట్టుమీదున్న మర్రిచెట్టు కింద ఎవరో బైరాగి తంబూర మీటుకుంటూ తన్మయత్వంతో పాడుకుంటున్నాడు.  ఉదయం ఎనిమిదయింది. జనం కాలువలో స్నానాది కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. కామాక్షమ్మను దర్శించుకోడానికి జనం అంతకంతకూ పెరిగిపోతున్నారు.

"కొండమ్మా...ఓ కొండ మ్మా….. ఓ పాలి బయటికిరా..." అన్న చంద్రయ్య పిలుపుకు బయటికొచ్చింది. 

"నిన్న రాలేదు పన్లోకి?  రెడ్డడగమన్నాడు. వేరేవాళ్ళను బెట్టుకోవాలా..ఇవాళన్నా వస్తావా? అని.."

"వస్తా చెంద్రన్నా..వస్తున్నా...నిన్నంతా పేణం బాగాలేదు..ఇవాళ ఇప్పుడే లేచినా..నిన్న కూడు కూడా తిన్లే. ఒట్టు. ఇదుగో. అన్నం వండుకోని దబ్బున కారియర్లో బెట్టుకుని  పదిలోపు చేలో ఉంటానని చెప్పు"

"అట్టాగేలే.. నిన్న ఇసయం ఎవరితోనన్నా చెప్పి పంపొచ్చుగదా! రెడ్డి చిర్రుబుర్రులాడకుండా.."

" నేను లేవాలి గదా చెంద్రన్నా!...ఒళ్ళంతా ఒకటే నొప్పులాయె"

"అవునా.. నీ కష్టం పరాయోడికి గూడా వద్దు మే! కట్టుకున్నాడేమో.. దుబాయ్ నుంచి డబ్బు మూటల్ దెచ్చి పరాయిదానితో కులుకుతున్నాడు. నువ్వేమే ఈడ నానాక  బాదలు పడతున్నావు"

"పోనీలేన్నా… వదిలెయ్... ఆడికి నా మీద మనసులేదు. పట్నం పిల్ల గావాల…. నాకు రెండేళ్ళ క్రిందటే  ఈ ఇసయం తెలుసు చెంద్రన్నా... అప్పుడే వెంకురెడ్డి ఊర్లో జెప్పుళ్ళా...రెడ్డిని జూసి మొహం దప్పించి పొయ్యారట సికింద్రాబాదు స్టేషన్ కాడ... ఇంకో మాటిను…. మొన్నీమద్దెన గూడా మిట్ట మీదుండే సుదర్శనయ్య ఓటల్లో చూశాట్ట వాణ్ణి వాడి కొత్త పెళ్ళాన్ని.. పలకరిస్తే నువ్వెవరో నాకు తెలేదు పో.. అని చీదరించుకున్నట్టు మాట్లాడాడంట చెంద్రన్నా... ఆడొచ్చి ఒకటే గోల.. నా మొహానా ఇట్టా రాసుంది. నాకు కొడుకున్నందుకు కొద్దిగా సంతోషం. ఈ జన్మకింతే చెంద్రన్నా!"

"వినాశకాలం కొండమ్మా..ఏం జేస్తాం జెప్పు. నువు మంచిదానివి… నువ్వు ఈ ఊరు ఓలు మొత్తానికి ఆడబడుచువి కొండమ్మా! అందరూ నిన్ను అక్కా… చెల్లీ… అని పిలుస్తారు."

" అంతా ఈవూరోళ్ళ మనసు మంచితనమన్నా... అవునూ..అట్నించి వస్తున్నావా చెంద్రన్నా? ఆ మర్రిచెట్టు కిందెవరో బైరాగి నిన్న మధ్యాన్నుంచి ఒకటే పాటలు పాడతా ఉన్నాడు…అలుపూ సొలుపూ లేకుండా.."

"ఎవరో బైరాగి సన్నాసి కొండమ్మా…. నిండా ముప్పై యేళ్ళు కూడా లేవు. జీవితంలో ఏం కష్టమొచ్చిందో ఏమో సన్నాసుల్లో కలిసిపోయినాడు"

"ఒక్కోరికి ఒక్కో కష్టమిస్తాడు గావాల...ఆ భగమంతుడు. సర్లే! నీనివాళొస్తానని చెప్పు. ఎవర్నీ బెట్టుకోమాకండయ్యో …పున్నెం ఉంటాది. నోటికాడి కూడు తీసెయ్ బాకండి.. "  

కొండమ్మ నిముషాల్లో తయారై క్యారియర్ సర్దుకుని పోతూ పోతూ..మిగిలిన అన్నం, కూర ఒక విస్తారాకులో పెట్టి  చెట్టుక్రింద కూర్చున్న బైరాగి ముందు పెట్టింది. కొండమ్మ రంగు నలుపనే కాని చక్కగా ఉంటుంది. రూపాయ బిళ్ళంత కుంకుమ బొట్టు, కళ్ళకు కాటుక, కొప్పులో బంతిపూలు. ఒంటి నిండా కప్పుకున్న చీరె కొంగు. పద్ధతి గల్ల మనిషి. ఒక్క నిముషం బైరాగి కొండమ్మను కళ్ళార్పకుండా చూశాడు. వెంటనే తేరుకుని….రెండు చేతులతో ఆశీర్వదించి "పిల్లా..పాపలతో చల్లంగా ఉండు" అన్నాడు.

"అదేదో సినిమాలో బెమ్మానందం జెప్పినట్టు ఈ జన్మకంత సీను లేదులే సామీ! కట్టుకున్న మొగుడే వదిలేసి పదేళ్ళయింది…..ఒంటికాయ… సొంటికొమ్ము సామెతన్నమాట… నా బదుకు..హు.. నువు తిను..నా కతెందుకు గానీ.."

"అమ్మా! నీ పేరు? ఎక్కడుంటావు?"

"నన్ను కొండమ్మంటారు సామీ.. బిన్నా..పొలానికి బోవాల..ఈణ్ణే మా యిళ్ళు. అదుగో…. దూరంగా సగం పడిపోయిన పెంకుటిల్లుందా… అదే మా కొంప... వస్తా.. వీలైతే రేపుగూడా అన్నం తెస్తాలే.." అంటూ వెళ్ళిపోయింది.       

****

ఆరోజు పెందరాడే యింటికొచ్చింది కొండమ్మ. వాతావరణం గవర్నమెంటు వాళ్ళు తుఫాను అని చెప్పారట టీవీల్లో. ఆకాశమంతా మబ్బేసి వర్షం ఏ నిముషంలో నైనా ముంచేసేటట్టుంది. త్వరగా అన్నం వండడానికి మొదలుపెట్టింది. 

మరో గంటకు భారీ వర్షం మొదలయింది. మర్రిచెట్టు క్రింద కూర్చున్న బైరాగి వర్షానికి లేచి నిల్చున్నాడు. గుడ్డలు మొత్తం తడిసి ముద్ద ముద్దయ్యాయి. ఛలికి నిలువెల్లా చిగురుటాకులా వణికి పోతున్నాడు. ఇంతలో పక్కన తాడిచెట్టు మీద పిడుగు పడింది. వర్షానికి గాలి తోడవడంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కాలువలు పొంగిపొర్లాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గ్రామంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఆగకుండా కురుస్తోంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి జొన్నవాడంతా గాఢాంధకారం అలుముకుంది.  రోడ్డుమీద నీళ్ళ పాములు, తేళ్ళు, మండ్రగబ్బలు తిరుగుతున్నాయి.  పొలాల్లోనుంచీ కొట్టుకోని వచ్చే గడ్డి...చెత్తా చెదారం కూడా రోడ్ల మీదకు చేరుతున్నాది.  ఇంక లాభం లేదనుకున్న బైరాగి ఒక్క ఉదుటున దూకి ఊళ్ళోకి పరుగు సాగించాడు. ఇంతలో దగ్గరలో కొండమ్మ పెంకుటిల్లు  ఆశాజనకంగా కనిపించింది.

“అమ్మా..తలుపు తీస్తావా!" తలుపు దబదబ బాదాడు.

"ఎవరూ!" అంది. ఇంత వానలో వచ్చిందెవరా అని ఆలోచిస్తూ...

"అమ్మా! నేను బైరాగిని.. ఛలికి చచ్చిపోతున్నానమ్మా! దయచేసి తలుపుదియ్యమ్మా..లేకపోతే ఈణ్ణే  చచ్చిపొయ్యేట్టున్నాను తల్లీ!"

ఒక్క నిముషం ఆలోచించి ఏమైతే అదైందని  "రా సామీ.. రా.. లోపల కూర్చో! వాన తగ్గాక వెళ్తువుగాని" అంటూ తలుపుతీసింది. ఈదురు గాలికి లాంతరు ఆరిపోయింది. పొయిలో ఉన్న కట్టెతో మళ్ళీ దీపం వెలిగించింది. బైరాగి ఛలికి వణికిపోతున్నాడు. "ఉండు సామీ..గంజన్నం పెడతాను వేడిగా.." అని పాత చీరె ఇచ్చి తల వొళ్ళు తుడుచుకోమంది. బైరాగి అన్నీ విప్పేసి గోచి గుడ్డతో నిలబడి వళ్ళంతా తుడుచుకున్నాడు. చూస్తున్న కొండమ్మకు వళ్ళు అదోలా అయింది. మంచి బలిష్టమైన కండలు తిరిగిన శరీరం. గబుక్కున వెనక్కు తిరిగి నిల్చుంది. బైరాగికి కాస్తా కుదుట పడింతర్వాత ఉప్పువేసిన గంజన్నం గిన్నెలో పెట్టి నంచుకోడానికి పచ్చి మిరపకాయలు ఇచ్చింది. తింటున్న బైరాగికి దు:ఖం కట్టలుగా పొంగుకొచ్చింది. "అయ్యో! ఏమైంది బైరాగీ! ఏడవకు! భగవంతుడు అన్నం మెతుకు మీద మన పేరు ఉన్నంత కాలం మనకు అన్యాయం చెయ్యడు" అన్నమాట విని అంత దు:ఖంలోనూ బైరాగి నవ్వాడు."ఏంది మళ్ళీ నవ్వు!" అంది. "తత్వాలు పాడే నాకే తత్వం చెబుతుంటే నవ్వొచ్చింది" అన్నాడు. ఈతాకు చాప ఒక చిల్లులు పడ్డ కంబళి ఇచ్చి ఒక మూల పడుకోమని...అన్నం తిన సాగింది. 

"నీవల్ల నేను ఇవాళ బతికిపోయాను" అన్నాడు.

"మనిషికి మనిషి సహాయం సామీ..అంతే! ఇంతకీ మీదేవూరు?"

"నెల్లూరే! పెన్న దగ్గర రంగనాయకస్వామి దేవళానికి దగ్గరలో ఉన్న ఇంట్లో ఉండేవాడిని. మూడేళ్ళ క్రితం వరకూ..నేను కోటీశ్వరుడిని" అని నవ్వాడు.

"మరి ఏమైంది?"

"మేము క్షత్రియులము. నా పేరు బసవరాజు. పేద కుటుంబంలో పుట్టాను. మా నాయినా అమ్మా చెప్పినా వినకుండా..సుఖపడదామని వెంకటగిరిరాజా వంశానికి చెందిన నందినీదేవి అనే ఆమెను పెళ్ళి చేసుకుని కావలిలో ఒక పెద్ద భవంతిలోకి అడుగుపెట్టాను" అని ఆపాడు.

"ఆ..ఏమైంది..చెప్పు చెప్పు.."

"అక్కడి వెళ్ళాక తెలిసింది. దూరపుకొండలు నునుపు అని. ఆమెకనేకమందితో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. నన్ను నందిని వాళ్ళమ్మా నాయనా పనివాడి క్రింద జమకట్టి ఇంట్లో అన్ని పనులు చేయించేవాళ్ళు. అన్నీ డబ్బు కోసం ఓర్చుకుని చేశాను. ఒక సంవత్సరానికి మా అమ్మా నాయినా నన్ను చూడ్డానికి వచ్చారు. కానీ నందిని వాళ్ళను ఇంట్లోకి రానీయకుండా గలభాచేసింది. ఎలాగైనా నన్ను చూడాలనుకుని గోడ దూకి వచ్చిన మా నాయన్ను పనివాళ్ళతో కొట్టిచ్చింది. మా నాయిన అమ్మా ఏడ్చుకుంటూ రక్తం కారుతూ వెళ్ళిపోయారు. ఆరోజే మనసు విరిగిపోయింది. అంతా మాయని తేలిసిపోయింది.”

"అప్పుడు సన్యాసం తీసుకున్నావా?"

"లేదు. నేను ఆ రోజు రాత్రి గోడ దూకి ఒక లారీ ఎక్కి నెల్లూరికి వచ్చాను. మా అమ్మా నాయనా వంటి నిండా కట్లతో ఇంట్లో ఉన్నారు. నన్ను కౌగలించుకుని ఏడ్చి మాకోసం రావద్దు వెళ్ళు. నువ్వైనా సుఖపడు అన్నారు. ఒక మూణ్ణెల్ల తేడాతో ఇద్దరూ చనిపోయారు. నేను జీవితం మీద విరక్తితో కాళహస్తి ఆశ్రమంలో సన్యాసం తీసుకున్నాను. ఊళ్ళు తిరుగుతూ తిరుగుతూ...పుణ్య క్షేత్రాలు తిరుగుతూ నిన్న ఇక్కడికి వచ్చాను." అన్నాడు.

"పెద్ద కథే నీది కూడా! అని ఆవలిస్తూ...నాకు నిద్ర వస్తున్నాది…  ఆ మూల పడుకో! అని చెప్పి ఇంకో మూల గుడ్డ పరుచుకుని పడుకుంది. 

మళ్ళీ పెంకులదిరిపొయ్యేట్టు టప టప శబ్దంతో వర్షం మొదలయింది. దగ్గర్లో ఎక్కడో పిడుగులు పడుతున్నాయి. ఆ రాత్రి ఎవరు ముందు చొరవ తీసుకున్నారో తెలీదు.  బైరాగి, కొండమ్మ ఒకటయ్యారు.

****

నిద్రమత్తు వదిలి లేచేసరికి కొండమ్మ ఇంట్లో ఒక మూల కూర్చుని మోకాళ్ళమీద గడ్డం ఆనించి దీర్ఘంగా ఆలోచిస్తోంది. గత రాత్రి జరిగింది మొత్తం కలలా గుర్తుకొచ్చింది బైరాగికి.  కొండమ్మ దగ్గరకు పాక్కుంటూ వెళ్ళి ఆమె కాళ్ళ మీద తల ఉంచి "నన్ను క్షమించు! పాపం చేశాను" అన్నాడు. కొండమ్మ బైరాగి జుట్టు నిమురుతూ "ఈపాపంలో నా భాగం కూడా ఉంది. ఇప్పుడేం చెయ్యాలి అన్నది ఆలోచించాలి. జరిగిన దాన్ని గురించి కాదు" అంది.

"నీకిష్టమైతే నేను సన్యాసం వదిలేసి మళ్ళీ సంసారంలోకి వస్తాను"

"నాకిష్టమే! కానీ..ఇది పల్లెటూరు. పది మంది రాళ్ళేస్తారు. దీనికి ప్రెసిడెంటు రెడ్డి గారు ఏమంటారో! కనుక్కుంటాను.  ఆయన్ను ఒప్పిస్తే సమస్య పరిష్కారం అయినట్టే" అని లేచి పాలు తెచ్చి కాచి ఒక గ్లాసులో పోసి బైరాగికిచ్చి "ఒక అర్ధ గంటలో వస్తా! ఉండు బయటికి వెళ్ళకు" అని వెంకురెడ్డి ఇంటికి బయలుదేరింది.

కొండమ్మ వెళ్ళేసరికి రెడ్డి కాఫీ తాగుతూ ఉన్నాడు. రెడ్డమ్మ కూడా పక్కనే ఉంది. కాఫీ తాగడం అయి గ్లాసు ఆవిడకిచ్చి "ఏం కొండమ్మా ఇట్టా వచ్చావు పొద్దు పొద్దున్నే" అన్నాడు. చివక్కున అతని కాళ్ళమీద పడింది. అది చూసి రెడ్డమ్మ కూడా ఆశ్చర్యపోయి లోపలికి పోకుండా అక్కడే నిలబడింది.

"తప్పు జరిగింది రెడ్డీ.... మీరే మా నాయన మాదిరి కాచుకోవాల" అంది  పెద్దగా ఏడుస్తూ లేవకుండా అలాగే కాళ్ళు పట్టుకుని.

"లే అమ్మీ..లెయ్.. మందలేందో… చెబితే గదా నాకర్ధమయ్యేది" అన్నాడు. జరిగింది పూస గుచ్చినట్టు చెప్పింది.

"అమ్మీ..కొండమ్మా..నీకు మొదటి నుంచీ చెబతా ఉండా.. పెళ్ళిజేసుకో మే.. అని…. నీ మొగుడింక రాడు... రెండేళ్ళ క్రితం సికిందరాబాదు స్టేషన్లో వాడు వాడి వయ్యారం..వాడి కొత్తపెళ్ళాం కులుకులూ..చూసే నీకు జెప్పా. వాణ్ణి మర్చిపోవే!  మంచోణ్ణి జూసి కట్టుకోవే అని. ఇన్నా నామాట జెప్పు. సరే! మంచికో చెడుకో అయింది ఇట్టా..  కానీ..ఇదీ దేవుడు జేసిందే అనుకుందాం. బాధపడమాక ఊర్కే! నువ్వేందో ఈ ఊళ్ళో అందరికి దెలుసు.  ఆణ్ణి నెల్లూరు దీసుకుని పొయ్యి వాడి సన్యాసి అవతారం దీసేసి మంచిగా జెయ్యి. దేవళంలో నేను దగ్గరుండి జెయిపిస్తా పెళ్ళి" అన్నాడు.

"మంచి మాట జెప్పావయ్యా.. కొండికి తీరా ముప్పై యేళ్ళు గూడా రాలేదు. హాయిగా ఉండవే!... పిల్లా పాపలతో. మేమున్నంత కాలం నీకేం బయంలేదు పో! నువ్వు నా కూతురు లెక్క!" అనింది రెడ్డమ్మ. సంతోషంగా బయటికొచ్చింది కొండమ్మ.

****

కొండమ్మకు పెన్న ఒడ్డున ఉన్న తన ఇళ్ళు చూపించాడు. మూడు గదుల చిన్న ఇల్లు. బాగానే ఉంది. "ఇక్కడుందామా.. లేక జొన్నవాడా? ఏది బాగుంది అనేసరికి "మనం జొన్నాడలోనే ఉందాం. నేను పుట్టి పెరిగిన ఊరు. మంచికి చెడ్డకి ఆదుకుంటారు ఆడైతే!" అనింది. "నీ ఇష్టం కొండమ్మా! నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏమి జెయ్యను సరేనా!" అన్నాడు ఇంటికి తాళంవేసి మొలతాడులో ముడివేస్తూ. 

హాస్టల్లో ఉన్న కొడుకును చూపించి  ఆరో తరగతికి వచ్చాడని జెప్పింది. బైరాగిని ఎవరన్నట్టు చూస్తున్న కొడుకుకు "మీ నాయన రా!" అనేసరికి వాడు బైరాగిని చుట్టుకుని "డాడీ..అదేందో దేశం బొయ్యావంట డబ్బులకోసం! ఇంక బోబాక! ఉన్న డబ్బులు జాలు. నేనింటికి వచ్చేస్తా! ఇంట్లో ఉండి చదువుకుంటా అందరి మాదిరి… మళ్ళీ బోతే నామీదొట్టే" అని బైరాగి చేతిని తలమీద పెట్టుకున్నాడు. బైరాగికి, కొండమ్మకు  కళ్ళనిండా నీళ్ళు. ‘నిజమైన ప్రేమ’ కు నిర్వచనం తెలిసినట్టైంది బసవయ్యకు.

****

రెండు సంవత్సరాలు సాగిపొయ్యాయి. బైరాగి బసవయ్యగా మారి అందరికి పరిచయం అయి అందరిలో కలిసిపొయ్యాడు. కొండమ్మ మళ్ళీ పండంటి ఆడశిశువును ప్రసవించింది. ఆ పిల్ల అల్లారుముద్దుగా పెరుగుతోంది.

ఒకరోజు తుఫానులా కారులో ఇంటి ముందు దిగాడు కొండమ్మ మొదటిభర్త సుందర్రావు. కొండమ్మ ఆ సమయంలో ఇంట్లో లేదు. పెంచిల్‌శెట్టి అంగడికి సామాన్లు, కూరలు తేవడానికి వెళ్ళింది. కారు దిగి "కొండమ్మా! ఒక్కసారి బయటకు వచ్చి చూడు" అన్నాడు.. అప్పుడే బయటికొచ్చిన బసవయ్యను "మీరెవరు?" అన్నాడు. అది నేను అడగాలి "నువ్వెవరు?" అన్నాడు సుందర్రావు. "నేను కొండమ్మ మొగుణ్ణి. బసవయ్య నాపేరు. ఇప్పుడు చెప్పు నువ్వెవరో! వచ్చిన పనేమిటో!" అన్నాడు.

"ఓహో! నువ్వేనా? నా భార్యకు వలేసింది? నేను కొండమ్మ మొదటి మొగుణ్ణి.  చట్ట ప్రకారం నేను బ్రతికి ఉండగా నా అనుమతి లేకుండా, విడాకులు తీసుకోకుండా పెళ్ళిచేసుకున్నందుకు నిన్ను అరెస్టు చెయ్యొచ్చు తెలుసా!"

ఇంతలో కొండమ్మ అక్కడికి వచ్చి సుందర్రావును చూసి అవాక్కయింది. "కొండమ్మా! గుడ్డలు సర్దుకుని కారెక్కు! వీడితో మాటలేమిటి?  నువ్వు ఇక ఈ పాడుబడ్డ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. రాణి లాగా భవంతిలో ఉండొచ్చు. నీకింద నలుగురు పనివాళ్ళు". అనేసరికి చుట్టూ జనం పోగై తమాషా చూస్తున్నారు.

కొండమ్మ బాగా ఆలోచించుకుని "నాకు రేపు సాయంత్రం వరకూ టైమివ్వు. నీతో వస్తాను. ఉన్నట్టుండి రమ్మంటే రావడం కుదరదు. సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రేపు సాయంత్రం రా!" అంది.

"సరే! రేపు సాయింత్రం ఇదే టైముకు వస్తా. వీడికి ఏమి చెప్పుకుంటావో చెప్పుకో! రేపు వీడు నాకంటికి కనబడితే..అరెస్టు చేయిస్తా!" అని కారెక్కి వెళ్ళిపోయాడు.

ఆరోజు ఇద్దరూ మౌనంగానే గడిపారు. ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోలేకపోతున్నారు. ఇద్దరికి కదిలిస్తే దు:ఖం పొంగి వచ్చేలా ఉంది. మనసులు మూగగా రోదిస్తున్నాయి. ఆ రాత్రి బసవయ్య ఆలోచిస్తూ బయట నులక మంచంపై  పడుకున్నాడు. కొండమ్మ లోపల వెక్కి వెక్కి ఏడుస్తున్నది బసవయ్యకు వినబడుతూనే ఉంది.  బసవయ్య పరిస్థితి అందుకు భిన్నంగా లేదు.

****

కొండమ్మ కృతనిశ్చయంతో నిద్రలేచింది. పాప నిద్రపోతున్నది. బయటకు వచ్చి బసవయ్యను లోపల పడుకోమని చెప్పడానికి వచ్చి చూస్తే బసవయ్య లేడు. కాసేపు చూసింది. గంటైనా పత్తాలేడు. పాపను లేపి, స్నానం చేయించి, తను స్నానం చేసి పాలుపట్టి, ఇంట్లో ఉన్న డబ్బులు పర్సులో పెట్టుకుని ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. అప్పటికి సమయం ఎనిమిది గంటలయింది.

ఆటో ఎక్కి ములుమూడి బస్టాండులో దిగి, రంగనాయకుల పేటకు వేరే ఆటో మాట్లాడి ఎలా వెళ్ళాలో గుర్తులు చెప్పింది. గతంలో వెళ్ళిన ఇంటికి వెదుక్కుంటూ వెళ్ళేసరికి ఊహించినట్టే తలుపులు తీసే ఉన్నాయి. దగ్గరగా వేసి లోనకు ప్రవేశించింది మెల్లిగా చెప్పులు బయటే వదిలి. బసవయ్య దేవుడి పటాలతో బాటూ తన ఫొటో కూడా ఉంచి తలవంచుకుని మూగగా రోదిస్తున్నాడు. కొండమ్మ వెనుకగా నిలబడి భుజమ్మీద్ద చెయ్యివేసింది. అవాక్కయిన బసవయ్య తిరిగి చూశాడు. కళ్ళల్లో కోటి వెలుగులు. ఇద్దరూ కౌగలించుకుని అలాగే ఉండిపోయారు. "నాకేం కావాలో ఎంచుకోలేని మూర్ఖురాలనుకున్నావా బసవయ్యా నన్ను!" అంది. పాప నవ్వుతూ ఉంది. దూరంగా రంగనాయకస్వామి దేవళంలో గంటలు అదేపనిగా  మ్రోగుతున్నాయి.

****


No comments:

Post a Comment

Pages