హరి ఇతండు హరుడతండుఆకారమొక్కటే (అర్థ విశేషాలతో) 23-03-21 - అచ్చంగా తెలుగు

హరి ఇతండు హరుడతండుఆకారమొక్కటే (అర్థ విశేషాలతో) 23-03-21

Share This
హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే (అర్థ విశేషాలతో)
డా.తాడేపల్లి పతంజలి
9866691587
 




ప. హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే

     హరిహరులందున అధికులెవ్వరు లేరు !!


  1.   నెరి కురులితనివి మరు జడలతనికి

      నురగ పరుపితనికి నురగములతనికి

      విరికన్నులితనికి చిచ్చర  కన్నతనికి

      గరుడుడీతనికి ఘనవృషభమతనికి !!

     

   2.  శ్రీ తరుణి ఇతనికి శ్రీ గౌరి అతనికి

       భూతలంబితనికి శీతనగమతనికి

       జాతి మణులితనికి విషమణులతనికి

       రీతిగంధమితనికి  భూతి పూతలతనికి  !!


    3. కరి భయ హరుడితడు కరిముఖుని గురువతడు

       నరసింహుడితడర్ధనారీశ్వరుండతడు

       మురవైరి యీతడు పురహరుడతడు

       పరగ శ్రీ వేంకటశైలపతి యీతడే అతడు. !!( తాళ్లపాక శేషాచార్యుల వ్రాతప్రతి నుంచి)

సంకీ.227)

 

అర్థ విశేషాలు

అన్నమయ్య ఈ  కీర్తనలో  ఏం చెప్పదలచుకున్నాడు?


 హరి ఇతండు హరుడతండు ఆకారమొక్కటే

  హరిహరులందున అధికులెవ్వరు లేరు


ఇతడు హరి. అతడు హరుడు. ఇద్దరి రూపము ఒకటే. హరిహరులలో ఒకరు గొప్ప వారు కాదు .ఇంకొకరు తక్కువ వారు కాదు.ఇద్దరూ ఒకటే.

ఇది పల్లవిలో అన్నమయ్య చెప్పిన సిద్ధాంతం.

 తన సిద్ధాంతానికి బలంగా మూడు చరణాల్లోను ఆధారాలు చూపించాడు. ఈ ఆధారాల్లో ఆకార అదృశ్యం ఉంది. క్రియా సదృశం ఉంది.అదెలాగో చూద్దాం.


  నెరి కురులితనివి మరు జడలతనికి

 శ్రీహరికి అందమైన తల జుట్టు ఉంది. శివునికి మరు జడలు ఉన్నాయి. మరు జడలు ఏమిటండిమరుగు లోని చివరి అక్షరం లోపిస్తే మరు అనే పదం వ్యాకరణంలో ఏర్పడుతుంది. మరుగైన జడలు మరు జడలు. శివునికి కపర్ది అనే పేరు ఉంది దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే జటాజూటం కలవాడు, జడల సమూహము కలవాడు కపర్ది. శివునికి ఉన్న జడలు ముడి పెట్టడం వల్ల చాటుగా ఉన్నాయి. అందుకే వాటిని అన్నమయ్య మరు జడలు అన్నాడు.

విష్ణుమూర్తి జుట్టు   బయటికి కనిపిస్తూ అందంగా ప్రకాశించేది.శివుని జుట్టు  అందముగలయినప్పటికీ మరుగున పడిన తల జుట్టు. ఒకరి జుట్టు బయటికి బాగా కనిపిస్తుంది.  మరొకరి జుట్టు మరుగునపడి ఉన్నప్పటికీ ఇద్దరి జుట్టులో ఉన్న సామ్యం అందం. కనుకనే కవి ఇద్దరి  ఆకారం ఒక్కటే అంటున్నాడు.


రగ పరుపితనికి ఉరగములతనికి

ఉరగము ఒకనికి పరుపు. ఇంకొకరికి మెరుపు. వక్షస్థలంతో నడుస్తుంది కనుక పాముని ఉరగము అన్నారు. ఆదిశేషుడు అనే ఉరగము శ్రీహరికి పరుపు అయితేఅదే ఉరగము శివుడి వక్షస్థలంలో మెరుపు. ఆభరణం. వినియోగించుకోవడంలో, సేవ చేయించుకోవటంలో తేడా ఉంది కానీ ఇద్దరి దగ్గర ఉరగము  ఉంది అందుకే ఆకారము ఒక్కటే.


విరికన్నులితనికి చిచ్చర  కన్నతనికి

విష్ణుమూర్తివి వికసించిన కన్నులు. శివునివి అగ్ని నేత్రాలు. వికసించిన దాంట్లోనూ అగ్ని లోనూ ఉన్న సమాన ధర్మం ప్రకాశం కనుక ఇద్దరి కళ్ళలోనూ సమాన ధర్మం ఉంది. ఇద్దరు ఒక్కటే. ఈ కీర్తమలో “చిచర కన్నతనికి అని శివపరంగా అన్నమయ్య వర్ణించాడు కాని -‘మలసీ జూడరో’ అను కీర్తనలో విష్ణుమూర్తిని ‘చిచ్చర కంటి తోడి జిగి సింహము ‘అన్నాడు. వేదాంతదేశికులవారి కామాసికాష్టకములో “తపనేంద్వగ్నినయనః అని నరసింహుని  అగ్ని నేత్రునిగా వర్ణించారు. ఈ బాటలోనే అన్నమయ్య శివవిష్ణువులిద్దరూ ఒకటే  అన్నాడు.


గరుడుడీతనికి ఘనవృషభమతనికి

రెక్కలతో ఎగిరేది  కనుక గరుడ అన్నారు. ఆ గరుడుడు విష్ణుమూర్తి వాహనం. వృషభము అంటే కోరికలను పూరించునది. ఎద్దుశ్రేష్ఠమైనది. ఇది శివుని వాహనం. గరుత్మంతుడు, ఎద్దు రెండూ ఒకటేనా?  ఎలాగండి? నిజమే…. ఆ రెండు వేరు వేరు. కానీ ఆ రెండు కలిసి గరుడాద్రి ,వృషభాద్రిగా కలిసే ఉన్నాయి. స్థూల దృష్టికి రెండు వేరు వేరుగా కనిపిస్తున్నాయి. కానీ  ఆ సప్తగిరీశుని  కొలువులో  ఆ రెండు ఇమిడిపోయాయి. కనుక గరుడునిపై ఎక్కిన విష్ణువు ,నంది పై ఎక్కిన శివుడు ఒకరే.


 శ్రీ తరుణి ఇతనికి శ్రీ గౌరి అతనికి       

శ్రీలక్ష్మి విష్ణుమూర్తి భార్య. శ్రీ గౌరి శివుని భార్య. పేర్లు భిన్నంగా ఉన్నప్పటికి ఇద్దరు భార్యలు శ్రీని కురిపించటం లో సమానులే. ఇద్దరూ శ్రీ కలవారే. అటువంటి శ్రీమతులు కలిగిన విష్ణు శివులు ఒకరే . సమానులే .ఒకరు ఎక్కువ. మరొకరు తక్కువ కాదు.


 భూతలంబితనికి శీతనగమతనికి

విష్ణుమూర్తి నివసించేది భూ ప్రదేశం. శివుడు నివసించేది చల్లని కొండ కైలాసం.

 భూమి జలము మనకి వేరువేరుగా కనిపిస్తున్నాయి. కానీ  జలములో నుంచి భూమి ఏర్పడింది.  మొట్టమొదట జలమేర్పడిందని  వేదం. నారాయణుడు అనగా నీటియందు ఉండేవాడని వ్యుత్పత్తి . ఆ నీటికి సంబంధించిన భూమిని భూదేవి రూపంలో గ్రహించినవాడు విష్ణువుశీత అంటే శ్యాయతే వ్యాపించునది. చల్లని వస్తువుచలి. చల్లదనం సహజ లక్షణంగా కలిగిన పాలసముద్రంలో- లక్షణతయా- నీటిలో –  నివసించేవాడు విష్ణుమూర్తి . చల్లదనం సహజ లక్షణంగా కలిగిన పర్వతంలో నివసించేవాడు శివుడు. ఇద్దరి నివాసాలలోను చల్లదనం ఉంది .భక్తులపై వారు కురిపించే అనుగ్రహపు  చల్లదనపు లక్షణం ఉంది కనుక ఇద్దరూ ఒక్కరే.


జాతి మణులితనికి విషమణులతనికి

జాతి అంటేమంచిశ్రేష్ఠమైన.

 శ్రేష్ఠమైన మణులు విష్ణుమూర్తి దగ్గర ఉన్నాయి వాటిని ఆయన అలంకరించుకుంటారు. విషపూరితమైన మణులు శివుడు అలంకరించుకుంటారు. శివుడికి ఆభరణాలు పాములు కదా! పాముల నెత్తిపై మణులు ఉంటాయి కదా! కనుక విషముతో కూడిన మణులు కలిగిన వాడు శివుడు.

విషం అంటేవిష్+క్విప్వ్యాప్నోతి సర్వం జగత్ ప్రపంచమంతా వ్యాపించునది. అంతటా వ్యాపించిన తన సుగుణాల మణులు కలిగిన వాడు శివుడు అని ఇంకొక అర్థం. ఇద్దరిలోనూ  మణులు ఉన్నాయి. చూసే చూపుని ట్టి ఆ మణుల స్వరూపం మారుతుంది అంతే.  మణులు ఒక్కటే. శివకేశవులు ఒక్కటే.


 రీతిగంధమితనికి  భూతి పూతలతనికి  

పరంపరగా వచ్చునది. సంప్రదాయముఆచారము. రీతి. ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి ఆ విష్ణు దేవుడు చందన చర్చిత నీల కళేబరుడు. ఇక ముక్కంటి విభూతి కళేబరుడు. ఇద్దరూ పూతలు కలిగిన వారే. వస్తు వైవిధ్యం ఉంది కానీ పూత సంప్రదాయం మాత్రం ఇద్దరూ పాటిస్తారు కనుకనే ఇద్దరు ఒక్కటే.


కరిభయ హరుడితడు కరిముఖుని గురువతడు

కరః శుండా దండః అస్తి అస్యతొండము కలది కనుక  ఏనుగును కరి అన్నారు. ఇక్కడ కరికి గజేంద్రుడని లక్షణార్థం. గజేంద్రుని భయం పోగొట్టిన వాడు విష్ణువు. ఏనుగు ముఖం కలిగినవాడు వినాయకుడు. అతని గురువు (తండ్రి) శివుడు.ఒకరు ఏనుగు భయం పోగొడితే, ఇంకొకరు ఏనుగు ముఖం కలవానికి తండ్రిగా ఆత్మీయతను పంచుతాడు. ఇద్దరిలోను ఏనుగు పట్ల  క్రియా సామ్యం ఉంది కనుక ఇద్దరు ఒక్కరే.

 నరసింహుడితడర్ధనారీశ్వరుండతడు

నరః సింహ ఇవ శౌర్యాదీనాన్  పురుషులలో సింహము వంటివాడు. శౌర్యాది గుణములు గల ఉత్తముడిని నరసింహుడు అంటారు. విష్ణువు నరసింహుడు. అర్ధదేహము స్త్రీరూపముగా కల ఈశ్వరుడు లేదా సగము (పార్వతి) స్త్రీ అయిన మూర్తి. అర్ధ నారీశ్వరుడు  శివుడు. విష్ణువు నరసింహస్వామిరూపంలో సగం  నరుడు సగం  సింహం . శివవిష్ణువు లిద్దరూ లోక క్షేమం కోసం అర్ధ దేహంలోవేరొక రూపాన్ని వహించినవారు. కనుక ఇద్దరూ ఒక్కరే.  


 మురవైరి యీతడు పురహరుడతడు

మురస్య రిపుః విష్ణుః మురాసురుని శత్రువు. విష్ణువు. పురస్య త్రిపురస్య అరిః త్రిపురములకు శత్రువయి అసుర నిర్మితమైన ఆ మూడు పురాలను ధ్వంసం చేసిన వాడు  శివుడు. నరకాసురుని అన్నమురాసురుడు.. కృష్ణునిచే చంపబడెను. రాక్షసులను సంహరించు క్రియా సామ్యమున్నది కనుక ఇద్దరు ఒక్కరే.

పరగ శ్రీ వేంకటశైలపతి యీతడే అతడు.

ప్రసిద్ధమయిన శ్రీ వేంకటాచలమునకు అధిపతి శ్రీ వేంకటేశుడు. ఇతడే “ఈశుడు.”

స్వస్తి.

No comments:

Post a Comment

Pages