కరణం గారి మల్లీశ్వరి - అచ్చంగా తెలుగు

కరణం గారి మల్లీశ్వరి

Share This
కరణం గారి మల్లీశ్వరి
 (మా జొన్నవాడ కథలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య
                                                                                     (9490400858)

"నువ్వు మధ్యాన్నం ట్రెయిన్‌కు వెళ్తున్నావా మోహన్?"
"అవున్రా! పరీక్షలయి రెండు రోజులయింది. రిజర్వేషన్ దొరక్కపోవడం వల్ల వెళ్ళలేదు. నీసంగతేంటి?" అన్నాడు హాస్టల్లో పుస్తకాలు, వస్తువులు  ఖాళీ చేస్తూ. 
"నీకేంట్రా బాబూ! మెరిట్ స్టూడెంటువి. క్యాంపస్లో జాబ్ వచ్చేసింది. రెండు నెల్లలో చేరిపోతావు. నాకు చాలా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయికదా!"
"ఈసారన్న కష్టపడి చదువు. గేంసూ.. క్రికెట్టూ.. అవీ కట్టిపెట్టు కొద్ది రోజులు  "
"అవున్రా అదే ప్రయత్నం. బి.టెక్ అయిపోయింది కదా క్యాంపసు ఉద్యోగం వచ్చిందా? వాళ్ళకొచ్చిందట. వీళ్ళకొచ్చిందట అని మా నాన్న ఒకటే సతాయింపు. ఇంట్లో తెల్సిందంటే నా పని చాలా ఘోరంగా ఉంటుంది" అంటూ పెద్దగా నవ్వాడు.
*   *   *
ట్రెయిన్ దిగే సరికి 8 గంటలు దాటింది. దగ్గర్లో ఉన్న హోటల్లో టిఫిన్ చేసి నిదానంగా ఆటో ఎక్కి ములుమూడి బస్టాండుకు చేరుకున్నాడు. అక్కడ రెడీగా ఉన్న జొన్నవాడ బస్సు ఎక్కాడు. డ్రైవరు సీట్లో లేడు. కండక్టర్ క్రింద బీడీ తాగుతూ ఉండడం చూసి "ఎన్నిగంటలకు బయలుదేరుతుంది బస్సు?" అని అడిగాడు మోహన్. ఆయన పెద్దగా నవ్వేసి ఇదేం ఆర్టీసీ బస్సనుకున్నావా? మా ఓనరు బస్సు నిండితే గానీ బయలదేరనివ్వడు" అని పొగ రింగులు రింగులుగా గాల్లోకి వదుల్తున్నాడు. ప్రక్కనే ఉన్న ఒక ప్రయాణీకుడు "ఇదిగో…అబ్బాయా..ఇది లాస్ట్ బస్సు. సెకండ్ షో సినిమా వదిలంతర్వాత   ఆ జనాలు వచ్చింతర్వాత డ్రైవర్ నిదానంగా భోంచేసి భుక్తాయాసం తీర్చుకోని గానీ రాడు. తొందరపడమాక! ఇంకా చానా టైముంది.  ఆకలైతే గనక ఏదన్నా తినెయ్!" అని సలహా ఇచ్చాడు.
*   *    *
జొన్నవాడ సమీపించింది బస్సు. ఇంతలో పెద్ద శబ్దoతో ముందు టైరు ఢమా మని పేలింది. "అందరూ బస్సు దిగండి. ఈడనుంచీ పెద్ద దూరమేంలే జొన్నాడ. నడిచిపోండి" అన్నాడు డ్రైవరు బ్రేవ్ మని తేనుస్తూ.  అమావాస్య రోజులు బాగా చీకటిగా ఉంది. ఊరు ఫర్లాంగు దూరం పైనే ఉంది. కొంతమంది అప్పటికే దిగి రెండెడ్ల బళ్ళల్లో, ట్రాక్టర్లల్లో వెళ్ళిపోయారు. బస్సు దిగి నడక మొదలు పెట్టాడు. తను వెనకబడ్డాడు. ఊరి మొదట్లో సత్రం దాటాడు. కరెంటు కూడా ఉన్నట్టు లేదు. పాత బస్టాండు దాటాక సుబ్బరామయ్యగారిల్లు, దాటాక ఖాళీ స్థలం ఒక పెద్ద వేపచెట్టు పోలేరమ్మ దేవళం. మిణుగురు పురుగులు బాగా దట్టంగా ఉన్నాయి. అవే కాస్తా వెలుతురు చూపిస్తున్నట్లు అనిపించింది. దూరంగా కరణం గారి ఇల్లు. కరణం కూతురు మల్లీశ్వరిని తలుచుకోగానే ఒక్క సారి ఆనందం పొంగింది. తనిప్పుడు స్వేచ్ఛా విహంగం. ఎవరికి భయపడాల్సిన పనే లేదు. తన కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తానని చెప్పి తన్నే పెండ్లి చేసుకోవాలని వేచి ఉన్న మల్లీశ్వరిని కాకుండా ఎవరిని చేసుకున్నా ద్రోహం చేసినట్టే అవుతుంది. చిన్నప్పుడు పదో క్లాసు వరకు కలిసి చదువుకున్న స్మృతులు ఒక్కసారి మదిలో మెదిలాయి. దాగుడు మూతల పేరు చెప్పి తోటలో మల్లీశ్వరితో చేసిన చిలిపి చేష్టలు రామయ్య మావ చూసి నాయనతో చెబితే జరిగిన బడిత పూజ గుర్తొచ్చినవ్వొచ్చింది.
టైం పది కావొస్తూంది. మల్లీశ్వరి ఈపాటికి గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటుంది. రేపు తప్పకుండా కలవాలి అనుకుంటూ వాళ్ళ ఇళ్ళు దాటుతూ ఉండగా అప్పుడే సందు దోవలో నుంచి బయటికి వచ్చి చేపట్టు గోడ దగ్గర నిలబడింది. తెల్లని చీరెలో తలంటిపోసుకున్న కురులు విరబోసుకుని ఎంత అందంగా ఉంది మల్లి. చుట్టూ చూశాడు ఎవరూ లేరు. 
అరుగు ఎక్కి "మల్లీ రేపు పొద్దున్నే వస్తా!" 
"నాకు నీమీద కోపమొచ్చింది. నీతో పచ్చి.. అంతే... మాట్లాడను  పో!. ఆరునెల్ల పాటు ఇటు రాలేదు నువ్వు. నేనేమై పొయ్యానో కనుకున్నావా?" 
"సారీ..మల్లీ.. చివరి సెమిస్టర్..క్యాంపసు ఇంటర్వ్యూలు. నేను ఉద్యోగం వచ్చి నిలదొక్కుకుంటేనే కదా మన పెళ్ళి. నువ్వు అర్ధం చేసుకుంటావని నాకు తెలుసు మల్లీ…."
"అవునా? ఓకే...ఓకే...ఈ వూళ్ళొ పోస్టాఫీసు ఫోను తప్ప ఇంకోటి లేదాయె! ఆ పోస్టు మాస్టరుగాడు అదోలా చూస్తాడు కార్డులకు వెళితేనే…. దొంగ సచ్చినోడు…. ఇంక ఫోనంటే ఇంకేమైనా ఉందా?"
"వెధవ..వాడి పని తర్వాత చెప్తాలే...అవునూ ఈవేళప్పుడు ఇక్కడ నిలబడ్డావేంటి బుజ్జీ.."
"కరెంటు లేదు. నిద్రపట్టడంలేదు. మా నాయన నిద్రపోతున్నారు. గాలి వేస్తుందని సందు దోవగుండా ఇప్పుడే ఇలా వచ్చాను"
"చూశావా! నేనొస్తున్నానని నీ మనసుకు తెలిసిపోయింది" నవ్వాడు. 
"నాకు అన్నీ తెలుస్తాయి. ఇదొక్కటే కాదు. తెలుసా!"
"అవునా.. రేపు వస్తాను. ఎవరో వస్తున్నారు" అంటూ అరుగు దిగిపోయాడు.
"ఏవరూ!" అంటూ మునుసబు గారి పెద్దబ్బాయి అడిగేసరికి "నేను మోహన్ని బస్సు చెడిపోయిందీ..అందుకని.."
"సరే ఈవేళప్పుడు ఇక్కడ ఈ ఇంటి అరుగెక్కావేదయ్యా…. మంచిది గాదు..పో..పో..ఇంటికిపో త్వరగా... అసలే రోజులు బాగా లేవు" అనగానే తిరిగి కరణం ఇంటివేపు చూశాడు. మల్లి చేతులు ఊపుతోంది. వీడెక్కడ చూస్తాడోనని టెన్షన్ పడ్డాడు. కానీ వాడటువైపు చూడలేదు.
"దిక్కులు చూడమాకని చెప్పానా వెళ్ళవయ్యా..బాబూ…. ఈ ఊళ్ళొ గొడవలు అర్ధంగావు నీకు… చదువుకున్నోళ్ళు మళ్ళీ….  చెబితేనేమో  భయపడతావు" అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
*   *   *
"ఏమిరా ఈవరప్పుడొచ్చావు? ఊర్లో  గొడవలుగా ఉన్నాయి. పొద్దన్నే రాకపొయ్యావా?" అన్నడు నాయన తలుపుతీస్తూ.  
"ఈ వూళ్ళొ గొడవలు నాకేం కొత్తా నాయనా! చెప్పు"  అన్నాడు నవ్వుతూ.   అమ్మ బ్యాగు తీసుకుని  "ఎప్పుడు తిన్నావో ఏమో..కాస్తా పెరుగన్నం తినయ్యా.." అని బ్రతిమాలి కలుపుకొచ్చింది. అమ్మ ముద్దలు కలిపి పెడుతుంటే తింటూ “అమ్మా ఇంక చాలు. నిద్దరొస్తున్నాది”.  మల్లీశ్వరి విషయం వీళ్ళకు ఎలా చెప్పాలన్న ధ్యాసలో ఉండిపోయాడు మోహన్.
*   *   *
పొద్దున్నే లేపేసి తలంటి స్నానం చేయించి దిష్టి దీసింది అమ్మ. " ఈ చాదస్తం ఇంక పోదా అమ్మా..నీకు? నేనే చిన్న పిలగాణ్ణా దిష్టి తీడానికి" అన్నాడు. 
టిఫిన్ తిని "అమ్మా.. కాస్తా ఫ్రెండ్సును కలిసొస్తా!" అన్నాడు.
"ఒరేయ్..జాగర్త..కరణం గారింటివైపు మాత్రం వెళ్ళబాక! రకరకాలుగా చెప్పుకుంటున్నారు జనం మనకెందుకొచ్చిన గోల".
విషయం అమ్మకు తెలిసిపోయిందా ఏమిటీ? అనుకుని అమ్మను ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు.
"అమ్మా...నీకు ఒకటి చెప్పాలి.. రాత్రి వచ్చేటప్పుడు కరణంగారింటి ముందు మల్లీశ్వరిని కలిసా..." అనే సరికి కళ్ళు పెద్దవి చేసి మాట పూర్తిగాకుండానే "ఏందయ్యా..మళ్ళీ చెప్పు? అనింది. 
"అవునమ్మా! రాత్రి చూసాను"
"ఓరి దేవుడా! "ఏమయ్యోవ్.." అని అరుస్తూ బయటికి వెళ్ళిపోయింది.
*   *   *
ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటూ సందు దోవగుండా పసువుల కొట్టం గుండా బయటికి నడిచి కరణంగారింటివేపు అడుగులు వేశాడు. తలుపులు దగ్గరికి వేసి ఉండడంతో తోశాడు. తలుపులు తెరుచుకున్నాయి. లోపల కరణంగారు ఈజీ ఛైర్లో కూర్చొని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. 
"నమస్కారం అండీ!"
తలెత్తి చూచిన కరణం ఒక్క క్షణం నివ్వెర పోయి..."ఏంది నాయనా వచ్చావు. అక్కడే ఉండు… లోపలికి రాబాక... ఏమైనా పనా?"
"ఒక్కసారి మల్లీశ్వరిని పిలుస్తారా?" ఆమాటకు పెద్ద పెట్టున ఏడుస్తూ నేల మీద కూలబడ్డాడు. కొంతసేపటికి తేరుకుని    "రా బాబూ! అని హాలు ప్రక్కనే ఉన్న గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ మల్లీశ్వరి ఫొటోకు దండ వేసి ఉంది. ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. మోహన్‌కు ఏమి చూస్తున్నాడో అర్ధం కాలేదు. మళ్ళీ ఈజీఛైర్లో కూర్చుంటూ "బాబూ! దానికి చెప్పకుండా పెండ్లి నిశ్చయం చేశాం. తల్లిలేని బిడ్డని తాహతుకు మించి పెద్ద సంభందం తెచ్చాను. పెండ్లి జరిగిన రోజే సాయంత్రం  ఉరిపోసుకుని ఆ గదిలోనే చనిపోయింది" అని వెక్కి వెక్కి ఏడ్చాడు.  మరి తాను రాత్రి చూసింది ఎవరిని? కళ్ళు తిరుగుతున్నట్టయింది.
"ఒక ఉత్తరం రాసిపెట్టింది. దానిలో నువ్వంటే ఇష్టమని నిన్ను తప్ప జీవితంలో ఎవ్వరిని భర్తగా ఊహించుకోలేనని రాసింది. చూడు బాబూ..అంటూ అలమేరాలో పెట్టిన పాత కాగితం ఒకటి చేతికిచ్చాడు". వణుకుతున్న చేతులతో  ఇస్తున్న కాగితాన్ని చూడగానే మోహనుకు గూడా చేతులు వణికాయి. కాగితం చేతిలో పడగానే ఏదో షాక్ కొట్టినట్టయింది. చదవాలని కాగితం మడతలు విప్పబోతుండగా.... బయటనుండి "మోహనూ..మోహనూ.." అని కేకల్లాంటి పిలుపులు వినబడుతున్నాయి. బయటికొచ్చేసరికి ఫ్రెండ్సు ఇద్దరు తనకోసం ఆతృతగా నిలబడి  ఉన్నారు. స్కూటరు స్టార్ట్ చేసి ఉంది. “మీ నాయన అర్జెంటుగా నిన్ను వెదికి తీసుకురమ్మన్నాడు మోహన్…..నీకు ఇక్కడ కరణంగారితో ఏం పని?  చెప్పలేదా ఎవరూ.. ప్రమాదం… త్వరగా రా.. స్కూటరెక్కు" అని  మధ్యలో కూచోబెట్టుకుని  ఇంటిముందు దించారు.

ఇంటిముందు జనం గుమికూడి ఉన్నారు. ఏమి జరిగిందా అని జనాన్ని తోసుకుంటూ ఆతృతగా వెళ్ళాడు. ఇంటి ముందు ఒక బారెడులోతు పెద్ద గుంట త్రవ్వి అందులో ఏవో రాగిరేకులు కుంకుమతో తడసిన నిమ్మకాయలు వేసి, పోలేరమ్మ గుడి పూజారి ఎల్లమంద క్షుద్రపూజలేవో చేస్తున్నాడు.  ఒక కోడి పెట్టను బుట్టలోనుంచీ తీసి పండ్లతో మెడ కొరికి గుంటలో వేశాడు.  పూజారి కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. నల్లని శరీరం. పొడవైన గడ్డం పెద్ద మీసాలు. మెడలో ఏవో దండలు. తల జడలు కట్టి ఉంది. చూడ్డానికి ఎంత భయానకంగా ఉన్నాడో అక్కడి వాతావరణం కూడా అంతే భయంకరంగా ఉంది. కొడితల,  కొడి శరీరం గుంటలో ఎగిరెగిరి పడుతున్నాయి. ఆ నెత్తురు చూడగానే ఒక్కసారి కడుపు తిప్పినట్టయింది.
"నాయనా! మోహన్..రా.. ఎక్కడికిబొయినావు. ..రా.. కూర్చో. ఎల్లమంద చెప్పినట్టు చెయ్! " అంది అమ్మ. కూర్చున్నాక ఏవో పూజలు చేసి దిష్టి తీసి నుదుట బొట్టు పెట్టి చేతికి ఒక తాయత్తు, మెడలో ఒక తాయత్తు, మొలతాడులో ఒక తాయత్తు కట్టాడు. "ఎప్పటికి వీటిని విప్పకు" అన్నాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. మోహనుకు ఒక్కసారి వెన్నెముకలో వణుకు ప్రారంభమయింది అతన్ని అలా చూడగానే.  అమ్మ నాయనా  తాయత్తులు  విప్పనని ఒట్టేయించుకున్నారు. అమ్మ వీపు నిమురుతూ ధైర్యం చెప్పింది.  “అమ్మా! ఈ రాగిరేకు ఒకటి కరణంగారింటి గేటుకు కొడతాను. ఇంకోటి ఇంటి ముందు పూడ్చిపెడతాను. తర్వాత అన్నీ ఆ అమ్మతల్లి కామాక్షమ్మే చూసుకుంటుంది. భయపడమాకండి. మళ్ళీ ఇలాంటివి జరగవు. దిగ్బంధం చేశాను ఈ ఎల్లమందను కాదనే ధైర్యం ఎవరికి లేదు.” అని వేగంగా సాగిపోయాడు ఎల్లమంద.
*   *   *
ప్రక్కరోజు బారెడు పొద్దెక్కాక లేచాడు.  "ఒరేయ్..నీ విప్పిన గుడ్డలు చాకలిదానికి వెయ్!" అని అమ్మ అనడంతో నిన్నటి చొక్కా తీసాడు. అందులో ఉన్న డబ్బులతో పాటూ కరణం ఇచ్చిన ఉత్తరమూ కనపడింది. గుడ్డలు చాకలికి వేసి గదిలోకి వెళ్ళి కూర్చుని వణుకుతున్న చేతులతో ఉత్తరం విప్పాడు. 
“మోహన్...కలలు అందరూ కంటారు. కానీ అవి నెరవేరేది కొందరికే.. నా పెండ్లి నా నిమిత్తం లేకుండానే నిశ్చయమయింది. నువ్వు వస్తావని చివరి నిముషంలో నైనా పెండ్లి ఆపుతావని అనుకున్నావు. సినిమాలలో జరిగే సంఘటనలు జీవితాల్లో కూడా జరుగుతాయని అనుకున్న పిచ్చిదాన్ని. పెండ్లి పెద్దల అభీష్టం మేరకు జరిగిపోయింది.  మనం ప్రేమించుకున్న విషయం ఇద్దరం ఎవరికి చెప్పకపోవడం మనం చేసిన తప్పు అనిపిస్తోంది. ఏది ఏమైనా సరే!  నిన్ను ప్రేమించిన నేను కొత్త అతనితో జీవితం పంచుకోవాలనిపించలేదు. శోభనానికి గంట ముందు నా జీవితం ముగించాలని అనుకుంటున్నాను. దానికి ధైర్యం ప్రసాదించమని దేవుణ్ణి కోరుకుంటున్నాను. కానీ….. నీకోసం నాలుగు మాటలు…. ఏడో క్లాసులో ఊహ తెలిసినప్పటినుండి నీమీదే నా ధ్యాస. ఎందుకో నువ్వు సినిమా హీరోలా అనిపించేవాడివి. క్లాసులో ఫస్ట్. అన్నిటిలో ఫస్తే నువ్వు. నువ్వు కాలేజీలో చేరింతర్వాత కూడా సెలవుల్లో నరసింహకొండ మీద మనం ఎన్ని ఊసులాడుకొన్నాం. ఎంత దగ్గరయ్యాం? ఈ జీవితంలో నిన్ను కాక ఇంకొకర్ని భర్తగా ఊహించుకోగలనా? చెప్పు? ఎందుకో చనిపోయే లోపు నిన్ను చూసి నీతో ఒక్కసారి తనివితీరా మాట్లాడాలని ఉంది. మాట్లాడగలనా?  కాలం    ఇంక నా జీవితానికి  రెండు గంటలు మాత్రమే సమయం మిగిల్చింది.. వచ్చే జన్మలోనైనా  మనం  కలుసుకోగలమా? - ఇట్లు నీ మల్లీశ్వరి.” 
ఉత్తరం చదివిన మోహన్ గది తలుపులు మూసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.  
*   *   *

No comments:

Post a Comment

Pages