చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 4 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 4

Share This
చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 4
అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
ఆంగ్ల మూలం : The Moonstone Castle Mystery
నవలా రచయిత : Carolyn Keene


 
(నాన్సీ తన స్నేహితురాళ్ళకి తన తండ్రి పరిశోధిస్తున్న తాజా కేసు గురించి చెబుతుంది. ఆఫ్రికాలో మతబోధకులుగా వెళ్ళిన బోవెన్ దంపతులు కిడ్నాపుకి గురై, ఎలాగో బయటపడ్డారు. తరువాత వారు ఆఫ్రికా వెళ్ళక ముందు తాము విడిచి వెళ్ళిన మనుమరాలి కోసం డీప్ రివర్ వెళ్ళారు. కానీ అక్కడ వారి మనుమరాలు కనిపించలేదని, ఆమెను అప్పగించబడ్డ వ్యక్తి మరణించిందని, ఊళ్ళో వాళ్ళకు ఆ పాప గురించి వివరాలు తెలియవని విని ఆ కేసును బోవెన్లు కర్సన్ డ్రూకి అప్పచెబుతారు. ఈ కథను చెప్పిన నాన్సీ తమ స్నేహితురాళ్ళకు ఆ పసిపాప ఫోటో చూపెడుతుంది. ఇంతలో కర్సన్ డ్రూ యింటికి వస్తాడు. తరువాత. . .)
@@@@@@@@@@

"హల్లో బెస్! జార్జ్! మీ అమ్మాయిలు యిక్కడ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే మీతో ప్రతిపాదించటానికి నా వద్ద విషయమొకటి ఉంది."

అతను తన సంభాషణను కొనసాగించటంతో ముగ్గురు అమ్మాయిలు శ్రద్ధగా వింటున్నారు. "నాన్సీ! హోర్టన్ కేసులో ఒక రిటైర్డ్ సామాను డీలరు నుంచి నేనొక క్లూని సేకరించాను. సుమారు పధ్నాలుగేళ్ళ క్రితం డీప్ రివర్ నుంచి జోన్ హోర్టన్ అన్న వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళిపోయింది. వీలైతే ఆమె జాడను కనుక్కోవాలనుకొంటున్నాను. కానీ, ఈలోగా, డీప్ రివర్లో తప్పిపోయిన పిల్ల వ్యవహారంలో నా పరిశోధన ఆగిపోకుండా కొనసాగాలి. అందుకోసం బెస్, జార్జ్ లతో కలిసి నువ్వు అక్కడకు వెళ్ళగలవా?"

నాన్సీ కళ్ళు ఉత్సాహంతో మెరవగా, బెస్ కీచుగొంతుతో అరిచింది. "ఓహ్! మిస్టర్ డ్రూ! మీ అభిప్రాయం అదేనా? ఇది చాలా అద్భుతంగా అనిపిస్తోంది!"

"ఉత్తేజకరంగా కూడా ఉంది. నేను వెళ్ళటానికి యిష్టపడుతున్నాను. ఇప్పుడే అమ్మానాన్నలతో మాట్లాడమంటారా?" జార్జ్ అడిగింది.

"అలాగే చేయి. అయితే యిది వాణిజ్య యాత్ర అని మాత్రమే వాళ్ళకు చెప్పు. మీ ఖర్చులన్నీ కర్సన్ డ్రూ న్యాయ సంస్థ భరిస్తుందని చెప్పు." తరువాత అతను తన కూతురి వైపు తిరిగాడు. "నాన్సీ! నా ప్రశ్నకు నువ్వు బదులివ్వలేదు?"

నాన్సీ హుషారుగా నవ్వింది. "ఏడిపించకండి నాన్నా! ఎప్పుడైనా నేను ఒక కేసుని తిరస్కరించానా?"

వెళ్ళటానికి జార్జ్ అనుమతిని పొందింది. తరువాత బెస్ తన యింటికి ఫోను చేసింది. మిసెస్ మార్విన్ తన కూతురితో 'నాన్సీతో కలిసి వెళ్ళవచ్చునని, అయితే మిస్టర్ డ్రూ వారు ఉండటానికి ఏ ప్రాంతాన్ని ఎన్నుకోకపోతే, కొండపైన ఉన్న లాంగ్ వ్యూ మోటెల్లో ఉండమని' ఆమె సిఫార్సు చేసింది. ఆమె డీప్ రివర్, అక్కడ లోయ ఉన్న ప్రాంతాన్ని అంతగా పట్టించుకోలేదు.

"అది చాలా సంతోషకరమైన మోటెల్. దాన్ని నడుపుతున్న మిసెస్ థాంప్సన్ మంచిది. అవసరమైతే మీలాంటి అమ్మాయిల పట్ల కన్నతల్లి చూపించే శ్రద్ధను చూపిస్తుంది."

బెస్ తన తల్లి యిచ్చిన సలహాను న్యాయవాదికి చెప్పగా, అతను చిరునవ్వు నవ్వాడు. "మీలాంటి అమ్మాయిలకు అది సురక్షితమని అనిపిస్తోంది. రేపు ఉదయమే బయలుదేరడానికి మీరు సిద్ధంగా ఉండగలరా?"

"అలాగే" ముగ్గురమ్మాయిలు ముక్తకంఠంతో ఉత్సాహంగా చెప్పారు. తరువాత బెస్, జార్జ్ ప్రయాణసన్నాహాలు చేసుకోవటానికి కంగారుగా తమ యిళ్ళకు బయల్దేరారు.

నాన్సీ చంద్రకాంత మణిని, హెచ్చరిక చీటిని, వింత సంబోధన కల కవర్ని తన తండ్రి దగ్గరకు తీసుకొచ్చింది. అతను వాటిని జాగ్రత్తగా అధ్యయనం చేశాడు. "నేను ఈ అక్షరాలను రివర్ హైట్స్ నుంచి వెలువడే ఒక వార్తాపత్రికనుంచి కత్తిరించిన విషయాన్ని సేకరించాను. ఇవి ఆ పత్రిక ముద్రణతో సరిపోలుతాయి. అయితే దీన్ని పంపిన వ్యక్తి స్థానికుడా లేక పొరుగూరినుంచి యిక్కడకు వచ్చి పత్రికను కొని పంపినవాడా అన్న విషయంలో ఆధారం దొరకలేదు."

మిస్టర్ డ్రూ కూడా నాన్సీలాగే విస్తుపోయాడు. ఈ చంద్రకాంత రాయికి అతను పరిశోధిస్తున్న కేసుకి ఎలాంటి సంబంధం లేదు.

"ఏదో ఒక రోజు నేను హోర్టన్ రహస్యాన్ని చర్చిస్తున్నప్పుడు చాటుగా విన్న వాడెవడో, నీ నుంచి కొంత సమాచారాన్ని తెలుసుకొందుకు ప్రయత్నించే అవకాశం ఉంది నాన్సీ!" న్యాయవాది చెప్పాడు. "ఈ చంద్రకాంత శిలలతో జరిగే ఏ వ్యవహారంలోనైనా నువ్వు అప్రమత్తంగా ఉండాలి."

అదే సమయంలో టెలిఫోను మోగింది. మిస్టర్ డ్రూ బదులిస్తూండగా, నాన్సీ ఎదురుచూస్తోంది. తరువాత అతను వెనక్కి వచ్చి చీఫ్ మెగ్గిన్నీస్ మాట్లాడాడని చెప్పాడు. నాన్సీని అనుసరించి, తరువాత అకస్మాత్తుగా ఒక బస్సులోకి ఎక్కిన వ్యక్తి, పోలీసులు ఆ బస్సుని అడ్డగించే లోపునే దిగిపోయాడు.

అది విన్న నాన్సీ వ్యాకులపడింది. "అతనింకా రివర్ హైట్స్ లోనే ఉన్నాడా అని నేను ఆశ్చర్యపోతున్నాను. అలా ఉంటే, అతను మళ్ళీ యిక్కడకు రావచ్చు."

"దాని గురించే నేను ఆలోచించాను" డ్రూ చెప్పాడు. "కాబట్టి ఈ రాత్రి మన యింటి కాపలాకి ఒక మనిషిని పంపమని చీఫ్ ని అడిగాను."

నాన్సీ సాయంత్రంలో ఎక్కువ భాగం తన గదిలో డీప్ రివర్ పర్యటన కోసం సామాను సర్దుకొంటూ గడిపింది. తరువాత పెందరాళే మంచమెక్కి వెంటనే నిద్రలోకి జారుకొంది. కానీ అర్ధరాత్రి సమయంలో "ఆగు, ఆగు" అన్న కేకలతో త్రుళ్ళిపడి లేచింది.
యువ గూఢచారి మంచం పైనుంచి కిందకు దూకి గదిలోని ఒక కిటికీ దగ్గరకు పరుగెత్తింది. సరిగా అప్పుడే, ప్రశాంతమైన రాత్రి సమయంలో తుపాకీ పేలిన శబ్దం వినిపించింది.

నాన్సీ వెంటనే నిలువుటంగీ(రోబ్)ని, చెప్పులను వేసుకొంది. ఒక్కుదుటున తన తండ్రి గదికి పరుగెత్తింది. గది తలుపు తీసి ఉండటం, లోపల అతను లేకపోవటంతో ఆమె బిత్తరపోయింది.
అదిరే గుండెతో ముందు ఉన్న మెట్లను వేగంగా దిగుతూ "నాన్నా! నాన్నా!" అంటూ పిలిచింది.

సమాధానం లేదు.

@@@@@@@@@@@@@@

ఆమె కింద మెట్టు దగ్గరకు చేరుకొనే సమయానికి, వేగంగా ముందు తలుపును తోసుకొని ఆమె తండ్రి పరుగున లోనికి వచ్చాడు. అతను తిన్నగా హాలులో ఉన్న టెలిఫోను దగ్గరకు వెళ్ళి ఒక నంబరును డయల్ చేశాడు.

నాన్సీ కదలకుండా నిలబడిపోయింది. తండ్రి బాగానే ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ, వీధిలో ఏమి జరిగి ఉంటుందని ఆలోచిస్తోంది. ఒక్క క్షణం తరువాత, "సార్జంట్! కర్సన్ డ్రూ మాట్లాడుతున్నాను. మీ మనిషి డోన్నెల్లీ నుంచి నాకొక సందేశం ఉంది. డోన్నెల్లీ ఈ రాత్రి మా యింటిని కాపు కాస్తున్నాడు. అతను దాదాపుగా ఒక దొంగను పట్టుకోబోయాడు. ప్రస్తుతం అతను పారిపోతున్న దొంగను కారులో వెంబడిస్తున్నాడు. అతని కారులోని రేడియో సెట్ సరిగా పనిచేయనందున అతను మీకు రేడియో మెస్సేజి పంపలేకపోయాడు."

దొంగ కారులో పారిపోయాడని డ్రూ చెప్పాడు. "ఆ కారు నంబరు వ్రాసుకోండి." దాన్ని అతను సార్జంట్ వ్రాసుకొనేంత నెమ్మదిగా చెప్పాడు.
ఫోను పెట్టేసి, యింకా కింద మెట్ల దగ్గరే నిలబడి ఉన్న నాన్సీ వైపు చూశాడు.

"నాన్నా! ఏమైంది?" నాన్సీ ఉద్విగ్నతతో అడిగింది. "బయట తుపాకీ మోత విన్నాను!"

జవాబు చెప్పే ముందు డ్రూ పగలబడి నవ్వాడు. "మీ ముసలి తండ్రి కథ ముగిసిపోయిందని అనుకొన్నావా, ఏం?"ఆట పట్టిస్తూ అన్నాడతను. "వాస్తవానికి ఆ శబ్దానికి, దొంగకి ఎలాంటి సంబంధం లేదు. దానితో డిటెక్టివ్ డొన్నెల్లీకి, దొంగ తప్పించుకు పారిపోవటానికి కూడా సంబంధం లేదు. పక్క వీధిలో ఎవరో పాత జలోపీ కారుతో యిబ్బంది పడుతున్నారు. దొంగ పరుగు ప్రారంభించగానే డొన్నెల్లీ 'ఆగు' అని అరిచాడు. అదే సమయంలో కారు టప్పు మని గట్టిగా శబ్దం చేసింది."

నాన్సీ ఉపశమనం పొందినట్లు నిట్టూర్చింది. "ఎవరి మీదా తుపాకీ పేలనందుకు సంతోషిస్తున్నాను. దయచేసి మిగిలిన కథను చెప్పండి."

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages