మృత్యుంజయం - మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి - అచ్చంగా తెలుగు

మృత్యుంజయం - మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి

Share This
మృత్యుంజయం - మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్త్రి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 
కవి పరిచయం: మృత్యుంజయం శతకకర్త మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారు కవి, పండితుడు, రచయిత, 1895 సం.లో గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరు గ్రామమున జన్మించారు.ఈయన తండ్రి శాంకరయ్యగారు. వీరు చిన్నప్పటినుంచి తిరుపతి వేంకట కవుల అవధానములతో ప్రేరితులై బహుగ్రంథాలను రచించారు. మాధవపెద్ది కవి ఉన్నచోట చుట్టు నోరు తెరుచుకొని ఆయన మాటల్నీ, పద్యాల్నీ వింటూ అనేకులు అట్టే నిలుచికొనిపోయేవారట. ఈయనది హాస్య ప్రకృతి. ఈతని భార్య కామేశ్వరి వియోగ బాధలో సతీస్మృతి అనే ఖండ కావ్యమును రచించారు. ఆతరువాత ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలవలన బాధలు పొంది తరువాత వీరు తెనాలిచేరి అక్కడే స్థిరపడినారు.
 మాధవపెద్దికవి హరిజనోద్ధరణంనిమిత్తం హెచ్చుగా పాటుపడిన కవి.

ప్రణయలీల అనే ఖండ కావ్యాన్ని వ్రాసి ఉమరుఖయ్యాం రుబాయితీ ల ప్రభావాన్ని చూపించాడు. ఉమర్ ఖయ్యా మనే ప్రత్యేక కావ్యాన్నే ప్రచురించి ఆభావాన్ని స్థిరపరచాడు.
శుర్పణఖనాసికాఖండనము-పంచవటి అన్న ఖండకావ్యము రచించాడు. ఇంకను ఈయన చాటుధారాచక్రవర్తి అన్నట్లు వ్రాసినట్లు చాటువులు ప్రముఖుల ప్రశంసలు పొందినవి.
హాస్యం అణువణువునా అగుపిస్తుండే ఈయనపలుకులు పలుకులవెలదికి మందస్మితం కలుగజేస్తాయి. ఆంగ్లపదాల్నీ, హిందుస్థానీపదాల్నీ బహుళంగా తన కవిత్వంలో వాడి ఆవిధమైన ధోరణికి మార్గదర్సి అయినాడు. పోచాయింపులు- గాడిద తన్నులు- బండారం బైటపడడం- సవాలక్షా లావాదీవీలు - సున్నకు సున్న, హళ్ళికి హళ్ళి - లెక్కకా జమక - బిస్మిల్లా- టికానాలేదు - కనాకష్టము- చలోభాయిగాడు - హత్తెరీ- ఫక్తు - కామూషు- డికాక్షన్- గంపశ్రాద్ధపు తలకట్టువాడు- ఇలా జాతీయాలు - మామూలు పలికబళ్ళు - స్వేచ్ఛగా ఇతని కవితలో వాడినట్లు గుర్తిస్తాము. నవ్యాంధ్రలో మాధవపెద్దికవికి ఉన్నస్థానం అనితరసాధ్యమైనది.

ఆవామనమూర్తి- చేతులో పొడుంకాయ- చంకలో ఉత్తరీయపు చుట్టా- పొడుంచారలతోటి ముక్కు- నిరంతరకవితా ప్రసక్తీ- ఆహాస్య ప్రకృతీ- ఆదరంతో కవిమిత్రుల్నీ బంధువుల్నీ సంభావించడమూ- చేస్తూ సం. 1950 ఫిబ్రవరి 6 న మరణించారు.
(తెలుగు వికిపేడియా నుండి సేకరణ)

శతక పరిచయం:

మాధవపెద్ది కీర్తిని చిరస్థాయిగా నిలువరిచిన రచన మృత్యుంజయస్తవం అను శతక కావ్యము. శతకాలన్నీ భక్తిభావ ప్రకాశితాలైనా, మృత్యుంజయ శతకము మాత్రం హాస్యాన్ని మేళవించి సార్ధక్యాన్ని పొందుతున్నది.
"మృత్యుంజయా" అనేమకుటంతో రచించిన ఈశతకంలో 108 పద్యాలున్నాయి. ఈశతకంలోని భాష సరళంగా ఉండి పద్యాలు సున్నితమైన హాస్యం తో చదువరులకు ఉల్లాసం కలిగిస్తుంటాయి, కవి అత్యంత చతురతతో తన కష్టాలను కూడా హాస్యంతో మేళవించి చెప్పటం మనం చూస్తాము.
కొన్ని పద్యాలు చూద్దాము

శ్రీకైలాసనగాధివాస! కరుణాసింధూ! జగత్ప్రాణబం
ధూ! కల్యాణగుణావహా! సకలదుర్దోషాపహా! దేవతా
నీకాభ్యర్చితపాదపంకజ! భవానీనాథ! గంగాసనా
థా! కైవల్యమయా! చతుర్నిగమగేయా! తండ్రి, మృత్యుంజయా!

అకలంకా! నిజమౌళ్యలంకృతమృగాంకా! సర్వలోకైకనా
యక! పాదాశ్రితపారిజాతక! మునీంద్రారాధితా! నాదబిం
దుకళాతీత! సురాసురప్రకరపాధోజాతఖద్యోత! సా
యకితాబ్జాతదళేక్షణా! శరధితూణా! తండ్రి, మృత్యుంజయా!

చమత్కారంతో కూడిన కొన్ని పద్యాలు చూదండి

ఓ విశ్వేశ్వర! ఓ నితాంతమధుపానోద్రిక్త మాతంగ క
న్యావీణాస్వనదత్తచిత్తనటరాజా! సుంత విన్పించుకో
లేవా మామొఱ, యొక్కమాఱయిన రాలేవా, యిటన్‌ మాపయి
న్నీవాత్సల్య మొకింతయున్‌ జిలుక లేనేలేవ, మృత్యుంజయా!

మెడనాగయ్యకు నొక్కటే బుసబుసల్‌, మేనన్‌ సగంబైన యా
బిడతో నీ కిఁకనెప్పుడున్‌ గుసగుసల్‌, వీక్షించి మీచంద మె
క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్‌ గంగమ్మకున్‌, నీచెవిన్‌
బడుటేలాగునొ మామొఱల్‌ తెలియదప్పా! మాకు, మృత్యుంజయా!

మెదలన్‌ బాప మొకొక్కటే మెదడున న్మేనెల్లఁగంపించి గా
డిద తన్నుల్‌గద గుండెలో నెచటొ, నాడే నీవు కాదన్నచో
మొదలా జోక్యమె యుండఁబోదుగద, నీమోసమ్మె మోసమ్మురా
సొదగాఁ దేలిచివైచినావు సుధగాఁ జూపించి, మృత్యుంజయా!

ఎడమీకుండగఁ బైనవచ్చిపడు మా యీ పాపపంకమ్ములన్‌
గడుగంగాఁ దలదాల్చుకొంటివటరా గంగామహాదేవి, నీ
యెడ దాకొల్పెడి మాదు పాపముల నీ వెల్లప్డు శాంతిల్లఁజే
సెడుపొంటెన్‌ దరుణేందుశేఖరుఁడవై చెల్వౌదె, మృత్యుంజయా!

ఒక లంబోదరుఁడైన పుత్రకుఁడు మున్నున్నట్టిదే నీకుఁ జా
లక కాఁబోలును సృష్టిఁజేసితివి యీ లంబోదరుంగూడఁ, దీ
గకుఁ గాయల్‌ బరువౌన కాని, కుడుముల్‌ గల్పించి యవ్వాని కే
లొకొ యివ్వానికి నొక్కమైని యిడుముల్‌ మొల్పింతు, మృత్యుంజయా!

సరిలే మానవకోటి యీ వెలుపలన్‌ సంసారచక్రాననే
దొరలన్‌ లే కిటులుండ, లో నొకటిరెండున్‌ గావె షడ్చక్రముల్‌
వరుసన్‌ బేర్చి బిగించినావుగద యబ్బా! నాగపాశాలతో
దరియింపం దరమౌనె నీకరుణచేతంగాక, మృత్యుంజయా!

తన కష్టాలను కూడా ఎంతో చమత్కారంగా ఆ మృత్యుంజయునితో ఎలా చెప్పికొన్నారో చూడండి

మొదలున్నట్టి యశీతివాతములలో ముఖ్యమ్ములైనట్టి వే
పదిపైనో ననుఁ బట్టిచూచియును లాభంబేమిలేకే చెవిన్‌
గదపాయించుక వెళ్ళిపోయినవి, యీ కాలానకున్‌ జాల బె
ట్టిదమై యుబ్బసమొండె ప్రాణములఁ దోడెన్‌ దండ్రి, మృత్యుంజయా!

ఏచుట్టమ్ములఁ జేరుదున్‌ ముదిమి రానేవచ్చె, నీవైపుగన్‌
నా చూపిప్పటిదాఁక పెట్టుకొని సంతానమ్మునే చూచుకో
నోచన్‌ దిన్నగ, నేరు చూచెదరు కాల్‌నొవ్వంగఁ జేనొవ్వఁగా
నీ చిత్తం బెటువచ్చునో యటులె కానీ తండ్రి, మృత్యుంజయా!

పద్దుల్‌ వ్రాసి గడించుకొన్నదెదియో పద్యమ్ము లచ్చందునన్‌
గ్రుద్దింపంగను దెచ్చిపెట్టి యిదిగో! కూర్చుంటి, నాయొద్ద నీ
యొద్దంగూడను సర్వమంగళము, నాకో నీకొ యీమీఁద నిల్‌
దిద్దన్‌ బాధ్యత వచ్చి తేల్చుకొనరాదే తండ్రి, మృత్యుంజయా!

నవరాత్రుల్‌గద దేశమంతటను ఈనాఁడేని నాయింటిలో
శివరాత్రుల్‌ జరిగింపఁగావలెనె? నే సేవించుటా దేవినే
యవునేనీ యిటు కూటికే మొగమువాయంజేయునే? యాదిభి
క్షువువీ వాయమ యన్నపూర్ణ యెటులొక్కొ సాటి, మృత్యుంజయా!

ఈకవి ఆనాటి వాడుకలో నున్న పరభాష పదాలను స్వేచ్చగా పద్యాలలో చొప్పిచటం చూదవచ్చు.

పల్లెత్తంగనె కళ్ళమంతపడు తుప్పర్లంచు లోనెంతువో
అల్లాకాదుర ఫక్తు రొక్కముర ఆ 'అల్లాడి' నిల్వంగనే
అల్లల్లాడుర అద్దియిద్దియటరా హైకోర్టతం డెంతరా!
యెల్లన్‌ నీవయికూడ రాలెడిది విత్తే లేదు, మృత్యుంజయా!

ఏదో నీకొక దేవిగాని యిఁక నేవేవో సవాలక్ష లా
వాదేవీ లయిపోయె మాకు, జరుగుంబాటెట్టు, లే కొండనో
లేదా యే గుహలోనొ పట్టకొక జోలే దాగియుండంగ, మే
మేదేవుళ్లమొ విశ్వమూర్తులమొ నీవే తెల్పు, మృత్యుంజయా!

ఇవేకాక సందర్భానుసారంగా అనేక జాతీయాలను, సామెతలను ఈ కవి ఈశతకాలలో వాడారు.
అందరినీ అలరించే ఈశతకం ప్రతి ఒక్కరు తప్పక చదవవలసినది, 
మీరూ చదవండి, మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages