జర్నీ ఆఫ్ ఎ టీచర్ -39 - అచ్చంగా తెలుగు

జర్నీ ఆఫ్ ఎ టీచర్ -39 

చెన్నూరి సుదర్శన్  


“మీరు రంగనాథపురం కాలేజీలో మాదిరిగానే సాయంత్రం ఇక్కడా ‘స్టడీ అవర్స్’ తీసుకుంటున్నారా” అంటూ అడిగాడు మహీంద్ర.

“అది తప్పదు సార్.. నేనెక్కడున్నా అదే పధ్ధతి అవలంబిస్తాను”

“అయితే.. సాయంత్రం పిల్లలకు మా ఇండస్ట్రీలో తయారయ్యే స్నాక్స్, బిస్కట్స్ పంపిస్తూంటాను.. వాటితో 

బాటు పుస్తకాలూ పంపిస్తాను. పాపం పిల్లలు కొందరు మధ్యాహ్నం టిఫిన్ బాక్సులు తెచ్చుకోకపోవడం నాకు తెలుసు..” అంటూ  మహీంద్ర వరాలు గుప్పిస్తుంటే సూర్యప్రకాష్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. నోట మాట రాలేదు. సమాధానంగా కళ్ళల్లో కృతజ్ఞతా భావం ఒలికిస్తూ  రెండు చేతులా దండం పెట్టాడు.

“సార్.. మీరు గురువులు.. మీలాంటి గురువుల ఆశీర్వాదంతో ఇలా ఎదిగాను. మీరు విద్యార్థులపట్ల ప్రేమతో ఇంత దూరం రావడం మా ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం.. నా అండ ఎప్పుడూ ఉంటుంది” 

‘అడగందే అవ్వైనా బువ్వపెట్టదన్నట్లు’ తన మొహమాటంతో ఒకింత కలిగిన జాప్యానికి నొచ్చుకున్నాడు సూర్యప్రకాష్. తానూహించని ఫలమది..

సంభ్రమాశ్చర్యాలతో లేచి నిలబడి “నాకే అధికారముంటే మా కాలేజీ పేరులో మార్పు చేసే వాణ్ణి.. మీ ఔదార్యానికి కృతజ్ఞుణ్ణి. మీ సహాయం మా కాలేజీ ఎన్నడూ మరువదు.. ఇక నాకు సెలవిప్పించండి..” అన్నాడు సూర్యప్రకాష్. 

“సార్.. భోంచేసి వెళ్ళుదురు గాని కూర్చోండి..నా టిఫిన్ షేర్ చేసుకుందాం” అంటూ వినమ్రంగా అడిగాడు మహీంద్ర. 

“మహీంద్రగారూ.. మీవాగ్దానాలతో నాకడుపు నిండి పోయింది. మరొకసారి భోజనానికి మీఇంటికి వస్తాను.. “ అంటూ మహీంద్ర చేతులు కలిపి వెనుతిరిగాడు సూర్యప్రకాష్. 

అలా ఒక టీచరుకు గౌరవం.. మర్యాద దక్కడమంటే.. అది అతడి క్రమశిక్షణకు నిదర్శనం. 

ఇంకా మన సమాజంలో దానశీలురు ఉన్నారు గనుకనే సజావుగా నడుస్తోంది..

సూర్యప్రకాష్ తిరిగి ఇంటికొచ్చే సరికి దాదాపు  నాలుగయ్యింది.. 

భోజనం వడ్డిస్తానంది విద్యావతి. 

వేళ కాని వేళ.. ఆకలి ఆవిరైపోయింది. టీ తో సరిపుచ్చి పెందళాడే భోంచేసి పడుకోవడం ఉత్తమని వద్దన్నాడు సూర్యప్రకాష్.    

అలా అలసి పోయిన ఆనందపు ఆదివారం రాత్రి మైమరిపించింది. ఆదమరచి నిద్రపోయాడు.  

***

కొందరు విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు సూర్యప్రకాష్. తాను స్వయంగా విద్యార్థులకు సూచనలిస్తూ.. చదివే వేళల సమయ పట్టికనిచ్చీ.. ప్రోత్సహించాడు. ఆనేపధ్యంలో ఒక రోజు ఒక అమ్మాయి పుస్తకంలో తలదూర్చి ఏర్పడకుండా ఏడుస్తూ ఉండటం సూర్యప్రకాష్ గమనించాడు.      

“చంద్రకళా.. ఏంమ్మా..” అంటూ ఆప్యాయంగా పలుకరిస్తూ దగ్గరికి వెళ్ళాడు. ‘బలవంతంగా చదువొద్దమ్మా.. ఇష్ట పూర్వకంగా మనసుపెట్టి చదవాలి.. ఏదైనా ప్రాబ్లమా?”

సూర్యప్రకాష్ ఓదార్పు మాటలతో చంద్రకళ ముఖం కన్నీళ్ళ పర్యంతమయ్యింది. దుఃఖం ఎదనుండి తన్నుకొస్తోంది.

మిగతా విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూడసాగారు. 

సూర్యప్రకాష్ అర్థం చేసుకున్నాడు. ఎదో బలమైన కారణం.. విద్యార్థులందరి ముందు అడగడం బాగుండదని చంద్రకళను తన చాంబరులోకి తీసుకెళ్ళాడు.   

చంద్రకళ నిజంగా చంద్రబింబమే. ముఖం వర్చస్సులో చంద్రకాంతి.. చదువులో సూర్య కాంతి. సి.యి.సి. సెకండియర్ చదువుతోంది.. స్టాఫ్ అందరి నాలుకపై నడయాడే చంద్రకళ ఇలా బెంబేలెత్తి పోవడం అనుమానమేసింది. మెల్లిగా బుజ్జగిస్తూ అడిగాడు సూర్యప్రకాష్..

“సార్.. మా ఇంట్లో నన్ను పెళ్లిచేసుకొమ్మని బలవంతపెడ్తున్నారు. పరీక్షలు రాయనిస్తారో లేదో అనే భయం నన్ను చదువనివ్వడం లేదు..” అంటూ వెక్కి, వెక్కి ఏడుస్తూ చెప్పింది. 

సూర్యప్రకాష్ ఎడం చేత్తో నుదురు సుతారంగా రుద్దుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. 

సుధాకర్ గుర్తుకు వచ్చాడు. చిన్నతనంలోనే పెళ్లి చేసి తమ గుండెలమీది కుంపటిని దించుకున్నామని తల్లిదండ్రులు అనుకుంటారే గాని ఆ తరువాత జరుగబోయే పరిణామాలు ఆలోచించరు. 

చెమ్మగిల్లిన తన కళ్ళను ఒత్తుకుంటూ “చూడమ్మా చంద్రకళా.. ఇలా ఏడిస్తే సమస్య సమసి పోతుందా .. ధైర్యంగా ఎదుర్కోవాలి. అధైర్యపడకమ్మా. పరీక్షలు రాస్తున్నానని.. శ్రద్ధగా  చదువు.. నిశ్చింతగా చదువు.. చదువు తప్ప మరే ధ్యాస పెట్టుకోకు.. నీ సమస్య నాకు వదిలెయ్యి” అంటూ ధైర్యం నూరి పోసాడు. 

ఆ మరునాడు చంద్రకళ కాలేజీకి రాలేదు. సూర్యప్రకాష్‍కు  అనుమానమేసింది.  అడ్మిషన్ ఫార్మ్స్ తెప్పించుకుని చంద్రకళ ఇంటి చిరునామా తెలుసుకొన్నాడు. 

మ్యాథ్స్ సీనియర్ లెక్చరరుకు ఆపూట ఇంచార్జ్ రాసి చంద్రకళ ఇంటికి దారితీసాడు.

అది పూరి గుడిసె. చుట్టూ వావిలి చెట్లు.. గోరింట చెట్లు గుడిసె ప్రహరీ గోడలై  గుడిసెను కనురెప్పలా కాపాడుకుంటున్నాయి. తడిక గేటును తట్టి కాస్తా నెట్టి దారి చేసుకొని లోనికి వెళ్ళాడు సూర్యప్రకాష్. ఇంటి ముందు వేసిన  వరిగడ్డి పందిట్లోకి కాలు పెట్టగానే ప్రాణం హాయిగొలిపింది. వాకిట్లో చెప్పుల జతలు చూసి ఎవరో చుట్టాలు వచ్చిఉంటారని ఊహించాడు. గుమ్మం తెరిచేవుంది.. లోన  మాటలు వినిపిస్తున్నాయి. తన రాకను గమనించే ధ్యాసలో లేరు.

సూర్యప్రకాష్‍ను చూడగానే అంతా లేచి నిలబడి ఆశ్చర్యంగా చూడసాగారు. చంద్రకళ వడి, వడిగా రావడం కనబడింది.  వాతావరణం..చంద్రకళలో కళ లేని  ముస్తాబు చూసి పెళ్లిచూపులని ఆట్టే తెలిసిపోతోంది. 

“నమస్కారం సార్...” అంటూ ఉక్కిరి బిక్కిరయ్యింది.. చంద్రకళ. ఊహించని సూర్యప్రకాష్ రాకతో.. మాటలు రావడం లేదు. 

“నేను కాలేజీ ప్రిన్సిపల్‍ని” అంటూ తనకు తానే పరిచయం చేసుకున్నాడు. 

చంద్రకళ తన పేరెంట్స్ ను పరిచయం చేసింది. మిగతా వారిని పరిచయం చేయడానికి వెనుకాడుతోంది. అది గమనించి చంద్రకళ నాన్న గారు మిగతా వారిని పరిచయం చేసాడు. 

అంతా వాల్చిన రెండు నులక మంచాలపై కూర్చున్నారు. ఆడవాళ్ళు చాపలో కూర్చున్నారు. ఎదురెదురుగా ఉన్న రెండు స్టూల్లలో నుండి ఒక స్టూల్ పక్కకు లాగి సూర్యప్రకాష్‍ను  కూర్చోమన్నారు. చంద్రకళ ఆడవాళ్ళ ముందు కూర్చుంది. పెళ్ళికి సిద్ధమైన అబ్బాయి మరో స్టూలుపై కూర్చున్నాడు. పిలవని పేరంటానికి వచ్చినట్లు ఆడవాళ్ళంతా సూర్యప్రకాష్ ను చూడసాగారు. వ్యవహారం అప్పుడే మొదలైనట్లు గమనించాడు సూర్యప్రకాష్.  తనకు తానుగా కలుగజేసుకొని విషయం కదిలించాడు.

“చంద్రకళ పెళ్లిచూపులనుకుంటా..” అన్నాడు నెమ్మదిగా.  

ఒక చిన్న పాప గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చిచ్చింది. సూర్యప్రకాష్ తాగుతూ వుంటే..

“ఔ సార్.. ఏదో మాట వరుసకి.. వాళ్ళ చిన్నప్పుడనుకున్నదే. మేన సంబంధం” అంటూ చంద్రకళ నాన్న సాందయ్య విషయమంతా వివరించాడు. 

“మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెబుదామని వచ్చాను” అంటూ ఖాళీ గ్లాసును కిందబెడ్తూ అన్నాడు. 

అందరి దృష్టి సూర్యప్రకాష్ వైపు మళ్ళింది. 

“సాందయ్యగారూ.. చంద్రకళ చదువు పూర్తిగాలేదు. చదువు మధ్యలో ఆమె పెళ్లి తలపెట్టడం మంచిపద్ధతి 

కాదు. నేను కాలేజీ ప్రిన్సిపల్‍గా ఆమె భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను. చంద్రకళ చాలా తెలివైన అమ్మాయి. బాగా చదువుతుంది.  మా కాలేజీకి పేరు తెస్తుంది. అటు అబ్బాయి చదువూ డిగ్రీ.. పూర్తి పూర్తిగాలేదు. వారికిచ్చిన మాట తప్పమనడం లేదు కాని పెళ్లి వాయిదా వేయమని ప్రార్థిస్తున్నాను” అంటూ లేచి రెండు చేతులా నమస్కరిస్తూ అందరి వంకా ప్ర్రాధేయపూర్వకంగా చూసాడు. 

పెళ్లి కుమారుడు చటుక్కున లేచి వచ్చి “సార్.. మీరు పెద్దవారు. ఆశీర్వదించాల్సిన చేతులతో ఇలా అర్థించడం మాకు అరిష్టం.. మీ మాటను కాదనం..” అంటూ సూర్యకుమార్ చేతులు పట్టుకున్నాడు. “నేనూ వద్దంటూనే ఉన్నాను సార్.. మా చదువులు కానివ్వండని చెబుతూనే ఉన్నాను. కాని సాందయ్య మామనే వినడం లేదు. నాకూ చంద్రకళ బాగా చదివి పేరు తెచ్చుకోవాలనే వుంది..”

సాందయ్య లేచి వచ్చి “సార్.. మీరు మంచి యాళ్ళకచ్చి మాకు మంచిమాట చెప్పిండ్లు.. మీ మాట కాదనం..” అంటుంటే అతడి వియ్యంకుడు ముఖం చిన్నబుచ్చుకోవడం గమనించక పోలేదు సూర్యప్రకాష్.

వాతావరణమంతా క్షణాల్లో మారిపోయింది. చంద్రకళ ఉల్లాసంగా వెళ్లి అందరికి టీ లు తెచ్చిచ్చింది. సూర్యప్రకాష్ టీ తాగుతూ..వారిలో ఒకడై  వారి స్థితి గతులన్నీ తెలుసుకుంటుంటే అంతా తబ్బిబ్బయ్యారు.

“నా మాటను మన్నించినందుకు మీకందరికి మరో సారి నమస్కారం..” అంటూ సెలవు అడిగాడు. 

సాందయ్య గుండె జావలా జారిన వాడిలా సాగనంపాడు.

ఆ మరునాడుదయం కాస్తా పెందళాడే కాలేజీకి వచ్చింది చంద్రకళ. 

“గుడ్ మార్నింగ్ సార్.. మే ఐ కమిన్..” అంటూ ప్రిన్సిపాల్ గదిలోకి అడుగుపెట్టింది ఉత్సాహంగా.. పేపర్ చదువడంలో మునిగి ఉన్న సూర్యప్రకాష్ చంద్రకళ గొంతును గుర్తుబట్టి “రామ్మా..” అన్నాడు.

“సార్.. మీరు మాఇంటికి వస్తారని కలలో గూడా అనుకోలేదు. రావడమే గాదు.. పెళ్లి గండం నుండి తప్పించారు” అంటూ ఆనంద భాష్పాలు రాల్చింది.

“చంద్రకళా.. నువ్వు నా కూతురులాంటి దానివి. నీ భవిష్యత్తు ముఖ్యం నాకు. నా ఆశలు వమ్ము చేయకు.. నీ హేండ్ రైటింగ్ ఆణిముత్యాలు.. నీ చదువుకు జోడిస్తే.. మంచి ఫలితాలు సాధించవచ్చు” అంటూ వెన్నుతట్టాడు.

“థాంక్ యూ.. సర్” అంటూ చంద్రకళ హుషారుగా వెళ్ళిపోయింది.

ఆమె ఆనందాశ్రుపూరిత వదనం సూర్యప్రకాష్ చేతిలోని దిన పత్రికలో ఛాయలా ఇంకా మెరుస్తూనే వుంది. 

ఇది అతడికి కొత్తగాదు. ఇలాంటి పలు విద్యార్థుల ముఖారవిందాలు అతడి గుండెల్లో పదిలంగా నిక్షిప్తమై ఉన్నాయి. 

పరీక్షల విభాగం అలాంటి అవకాశాలకు తావునిచ్చింది. దాదాపు ప్రతీ కాలేజీలో పాస్ అవుతారనుకునే విద్యార్థులెవరైనా  పరీక్ష ఫీజు చెల్లించ లేని విషమ పరిస్థితిలో ఉంటే.. వారికి తెలియకుండానే ఆదుకున్నాడు. అప్పుడు వారి ముఖాలలో కనిపించే కృతజ్ఞతా భావ ప్రతిఫలంతో కలిగే సంతృప్తి అమూల్యమనిపించేది. 

బెల్ మోగడంతో లేచి పేపర్  మడిచి పట్టుకొని ప్రార్థనకు బయలుదేరాడు సూర్యప్రకాష్.

ప్రార్థన, ప్రతిజ్ఞ అనంతరం సూర్యప్రకాష్ తెలుగు  లెక్చరర్ సూక్తి చెప్పబోతుంటే సూర్యప్రకాష్ కలుగజేసుకున్నాడు.

మైకు తన చేతిలోకి తీసుకొని..

“ప్రియమైన విద్యార్థినీ,,  విద్యార్థులు.. అందరకీ శుభోదయం..” అంటూ అమ్మాయిల వంక చూసాడు. చంద్రకళ కాస్తా కురుచ. అందరికంటే ముందు నిల్చుని వుంది. నా గురించి ఏమైనా చెపుతాడేమోనని జంకుతున్నట్లుగా కనబడింది.. తల దించుకుని కాలి వేలితో నేలపై గీస్తోంది. అదృశ్యం లిప్తకాలం చూసి పెదవి దాటని చిరునవ్వుతో సూర్యప్రకాష్ తిరిగి చెప్పడమారంభించాడు.

“పబ్లిక్ పరీక్షలకు ముందు మనం ప్రిఫైనల్ పరిక్షలు నిర్వహించుకునే ఆనవాయితీ మీకు తెలిసిందే.. గత సంవత్సరం మాదిరిగానే పబ్లిక్ పరీక్షల్లో ప్రతీ క్లాసునుండి మొదటి మూడు ర్యాంకుల సాధించిన విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్ అందజేస్తాను. ఈ సారి ప్రిఫైనల్ పరీక్షల్లో మొదటి ర్యాంకులు సాధించిన వారికి వివిధ రూపాలలో బహుమతులివ్వడానికి కొంతమంది స్టాఫ్ ముందుకు వచ్చారు.

 మీరంతా దాదాపు కర్షకసోదరుల పిల్లలే.. విత్తనం నేలలో  నాటి ఫలాలాశించడం స్వార్థమనిపించుకోదు. అలాగే అధ్యాపకులు మీలో విద్యావిత్తును నాటి మీనుండి ఫలితాలిశించడం సరియైనదే కదా.. విత్తుకు  గాలి, వీరు అవసరమైతే మీకు వాటితో బాటు చదువు, సాధన అవసరం. 

ప్రతీ ఇంటా ఏవేవో సమస్యలుంటాయి. పుస్తకాలు కూడా కొనుక్కోలేని కొనలేని దయనీయ ఆర్ధిక పరిస్థితి కొందరిది. కాని చదువుకెప్పుడూ పేదరికం అడ్డు రాదు.. చదువు అనే సూర్యకాంతికి అరచేయి అడ్డుపెట్టినట్లే.. పేదరికం అనేది.    

ఒక ప్రణాళిక బద్ధంగా చదివితే విజయం చాలా సులభం.. మన అధ్యాపక బృందం నేను మీ వెంట 

ఎల్లవేళలా ఉంటాం.. మీరు బాగా చదివి మన కాలేజీకి మంచి పేరు తీసుకురండి. ఉత్తమ విద్యార్థుల పేర్లు రికార్డు చేసి.. కాలేజీ బోర్డుపై రాయిస్తాను” అంటూ ముగించాడు. 

పిల్లల కరతాళధ్వనులద్వారా వారు చేయబోయే కృషిని తెలిపారు.   

అదే రోజు సాయంత్రం స్టడీ అవర్స్ వేళ పెద్ద వ్యాను రావడం కాలేజీ సాంతం ఆశ్చర్య పోయింది.     

వ్యానులో నలుగురు సుమేధ మనుషులు స్నాక్ , బిస్కట్స్, పుస్తకాలు తెచ్చారు.

అప్పుడు విషయం చెప్పాడు సూర్యప్రకాష్..

పిల్లలకేరింతలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. 

ఆగమయ్య  స్టోర్ రూంలో అన్నీ సర్దించాడు.

సుమేధ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజరైన మహీంద్ర గారికి ఫోన్లో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఓ పూట కాలేజీకి రావాలంటూ ఆహ్వానించాడు సూర్యప్రకాష్. 

మహీంద్ర అనుకూల సమయంలో  గ్రామ పెద్దలను, పత్రికా విలేకరులను పిలిచి కాలేజీలో ఆవరణలో సభ నిర్వహించాడు సూర్యప్రకాష్.

గ్రామ సర్పంచ్, మహీంద్ర గార్లకు  సన్మానం చేసారు... జ్ఞాపికలిచ్చారు.

సర్పంచ్ గారు కళాశాలకు ఒక  రీడింగ్ రూం.. అమ్మాయిల కోసం టాయ్ లెట్ తన ప్రత్యేక నిధులతోకట్టిస్తానని వాగ్దానం చేసాడు. 

 సర్పంచ్.. మహీంద్ర  చేతుల మీదుగా  పిల్లలకు పుస్తకాలు. స్నాక్స్ బిస్కట్స్ పంపకాలు జరిగాయి. సభ విజయవంతంగా ముగిసింది.

నరహరి ఆధ్వైర్యంలో దినపత్రికలన్నీ సూర్యప్రకాష్ సేవలను కొనియాడుతూ పొగిడాయి.

(సశేషం )

***


No comments:

Post a Comment

Pages