దూరపు కొండలు నునుపు - అచ్చంగా తెలుగు

 దూరపు కొండలు నునుపు

(మా జొన్నవాడ కథలు)

- టేకుమళ్ళ వెంకటప్పయ్య

 (9490400858)


ఉదయం 8 గంటలు దాటింది. నెల్లూరు నుండి ఫస్టు బస్సు వచ్చే టైం అయింది. కూరగాయల బుట్టలవాళ్ళు బస్టాండులో బస్సుకోసం ఎదురు చూస్తున్నారు. అమ్మవారి ఆలయంలో గంటలు మ్రోగుతున్నాయి. మైకులో నమక చమక అభిషేకాలు సాగుతున్నాయి. సీత  కాలేజీకి తయారై బయట అడుగు పెట్టింది. ఎదురొచ్చిన రాము సీతను చూసి ముక్కు మీద వేలేసుకున్నాడు. ఎలాంటి చీమిడిముక్కుల సీత ఎలా తయారైంది? చేతుల్లేని రవికలేంది? హవ్వ… ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు.

"శుభమా అని పోతుంటే ఎదురొచ్చావు. ఖర్మ! ఇంక నా పని జరిగినట్టే!” 

" ఓయ్...సీతమ్మో! ఈ డ్రస్సెందే! ఈ డ్రస్సుతో కాలేజీకి బోతున్నావా? లోపలికిబోయి డీసెంట్‌గా ఉండే డ్రెస్సు వేసుకో! బో! నవ్వుతారు అందరూ!"

“మిస్టర్ బావ! ప్లీజ్ షటప్! నువ్వేమైనా నా మొగుడివా? నన్ను పెళ్ళాం లాగా అదీ ఇదీ అనకు ఇంకోసారి మర్యాదగా ఉండదు. అడిగితే మా అమ్మా నాయనా అడగాలి. మధ్యలో నీ బోడి పెత్తనమేంది నా మీద. ఆ... అయినా... మట్టి బిసుక్కునేవాడివి ఛీ!... నీతో నాకు మాటలేంది. పో పొయ్యి కయ్యల్లో పని జూసుకో పో! పో! నీకు వెయ్యి సార్లు జెప్పాను. నా విషయంలో… అతి ఉజ్జా చూపించొద్దని.. " మాట పూర్తిగాకుండానే సీత చెంప ఛెళ్ళుమంది.

"అమ్మా! పరాయి వాడి ముందు అవమానం చేస్తున్నావు"

"ఎవరే పరాయి వాడని కూస్తున్నావు? బావనేనా? పళ్ళు రాలగొడతా! మాదర్చేదు ముండా...  మూసుకోని బావ చెప్పినట్టు చెయ్! పో! " అని లక్షమ్మ గద్దించే సరికి ఏడుస్తూ…   ఛీ! అంటూ లోపలికి వెళ్ళిపోయింది సీత.

"అత్తా! ఇంత చిన్న విషయానికి దాన్ని కొట్టాలా? చిన్నంగా చెప్పొచ్చుగదా! పాపం చిన్న పిల్ల…"

"రామూ! ఊర్కో చాలుగానీ...అది చిన్నపిల్లేం కాదు ముద్దు జెయ్యడానికి.. ఈ మధ్యన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది. దాన్ని నెత్తినెక్కించుకున్నాం కాబట్టే… యిలా నోటికి హద్దూ పద్దూ లేకుండా వాగుతోంది. దాన్ని ఒక కంట కనిపెట్టాలి" అంటూ లోపలికి వెళ్ళింది.

***

"ఊర్కో...అన్నిటికి ఏడవకు...ఏదో ఒకటి చేద్దాంలే.." అన్న దశపతి మాటలకు అడ్డొస్తూ "నువ్వు అట్టాగే మాట్టాడతా ఉండు ఏదో ఒకరోజు మూడుముళ్ళు ఏసేస్తాడు మా బావ!"

"కాఫీ సార్!" అంటూ వచ్చిన సప్లయర్‌ను "నువ్వు వెళ్ళు.. మేము నిదానంగా తాగుతాము. పిలిచినప్పుడు రా!" అన్న మాటకు సరే సార్!  అంటూ వెళ్ళిపోయాడు.

"ఎప్పుడో పదిహేను యేళ్ళ క్రితం మా అమ్మ చేతిలో చెయ్యి వేయించుకుని చచ్చిందట మా అత్త. ఈ ఎదవను కట్టుకోవాలని. ఆ మాట పట్టుకోని వాడు నా మీద సొతంత్రం చెలాయిస్తున్నాడు. చూస్తేనే కంపరం వాడిని! వట్టి మట్టి మణిషి"

"మీ నాయనేమంటాడు సీతా!"

"ఆయన మా అమ్మ చేతిలో కీలుబొమ్మ. ఆస్తి మొత్తం మా అమ్మ పేరుమీదే ఉందట. హు..అదీ మా అమ్మ పొగరు."

 "నేను అన్నీ చూచుకుంటా తొందరపడకు! నాకు సవాలక్ష పనులు. ఆరు షాపులు జూసుకోవాలి. మా నాన్న కు అన్నీ లెక్క జెప్పాలి సాయంత్రానికి. చదవడానికే టైము లేదు నాకు. ఐడియా వేస్తున్నా ఆగు..మన రౌడీ గ్యాంగులో యిద్దర్ని వాడి మీదకి తోలాననుకో! దేహశుద్ధి జేస్తారు. జన్మలో నీ జోళికిరాడు మళ్ళీ.."

"తొందరలో మన పరీక్షలొస్తున్నాయి కదా! అప్పుడు వాడు తప్పకుండా వస్తాడు నాతో.. అమ్మ గ్యారంటీగా పంపుతుంది. అప్పుడు చూద్దాం ఆ విషయం. నేను నీకు ముందు కబురు చేస్తా!"

"రేపట్నించీ ప్రిపరేషన్ హాలిడేస్. మళ్ళీ ఇంకో నెలకు గదా పరీక్షలు. ఈలోపు రావా నువ్వు?"

"ఎందుకు రానూ.. ఆ పల్లెటూరి వాళ్ళకు ఏమి చెప్పి మస్కా కొట్టాలో నాకు తెలుసుకదా! వర్రీ కాబాకు" 

***

చుట్ట తాగుతూ పొగ రింగులు రింగులు గా వదులుతూ రాఘవయ్య అన్న మాటలకు ఉలిక్కిపడ్డ వాసుదేవయ్య "ఏందో చెప్పహె! నా కాడ మొగమాటాలూ అనుకోవడాలు లాంటియేమీ ఉండవు." అంటూ పంపుసెట్టు ఆన్ జెయ్యబోతుండగా.

"ఒక్క నిముషం తర్వాత నా మాట యిన్నాక  ఆన్ చెయ్యి.. గోలలో యినబడదు నీకు"

"పర్వాలేదెహె!" అంటూ ఆన్ చేశాడు.

రాఘవయ్య మాటలు వినిన తర్వాత దీర్ఘాలోచనలో పడ్డాడు.  మోటారు ఆఫు చేసి యిద్దరూ బయలుదేరారు.

"నేంజెప్పినట్టు ఎక్కడా అనబాకయ్యోవ్. నా మెడకు చుట్టబాక పీకులాట. యింకో ఇషయం.... తొందరపడబాక...ఇట్టాంటియన్నీ ఆలోచించి చెయ్యాల…. ఆ... ఆడోళ్ళకు తెలీనీ బాక. రామూ తో మాట్లాడు చాలు. ఆడు జూసుకుంటాడు అన్నీ"

***

"నాయనా! కాలేజీకి బోతుండా.."

"మేయ్.. యిప్పుడు సెలవులంటగదా! ఏం కాలేజీ…."

"పాఠాలు అవక ప్రైవేటు క్లాసులు జరుగుతున్నాయి నాయనా"

"అట్నా! సరేలే! నేనూ వస్తుండా... కాస్త పనుంది నెళ్ళూళ్ళో.. వచ్చి కాలేజీ కాడ దింపి పోతా స్కూటర్ మీద" 

"నువ్వా! నాయనా.. ఎందుకు నేను బోతాలే"

"సీతా..మీ నాయన ఆగమంటుంటే యెక్కడికి? ఆగు" అమ్మ గొంతు ఖంగుమని మ్రోగింది. 

"పరీక్షలు ఎప్పటినుంచీ?"

"యిరవై రోజులున్నాయమ్మా!" 

"మీ నాయనతో బొయి నాయనతో రా! బాడుగోలు తిరుగుళ్ళు బాగా మరిగావు" అనగానే ఆమె గొంతులో ఏదో తేడా పసిగట్టింది సీత.

***

"హలో..ఎక్కడ"

"షాపులో ఉన్నా జెప్పు"

"నిన్న మా నాయన కాలేజీకి వచ్చి క్లాసులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పమని నిలదీశాడు. లోపలికి బొయి వచ్చినట్లు యాక్షన్ జేసి లెక్చరరుకు వొంట్లో బాగాలేదని కవర్ చేశా!"

"గుడ్! ఇవాళ వస్తున్నావా?"

"నో! నాయనకు ఏదో అనుమానం వచ్చింది. వద్దు. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి"

"పోనీ నేను రానా జొన్నవాడకు"

"చంపేస్తాడు మా నాన్న! ఫోనులో ఎప్పటికప్పుడు పొజిషన్ చెప్తా..చూద్దాం.రెండు రోజుల్లో ఏదో ఒకటి చెప్పి కలుస్తాను"

"సరే! బై"

***

నాయనా! హాల్ టికెట్లు ఇస్తున్నారట"

"అయితే"

"నేను రేపు పొయి తెచ్చుకుంటా!"

"ఒక్కదానివేనా? వద్దు"

"ఏం బూచులేమన్నా పట్టుకుంటాయా? రోజూ కాలేజీకి వంటరిగానే పొయి వచ్చాను కదా ఇన్నేళ్ళనుండి"

"కరక్టే గానీ రేపు మీ బావొస్తాడు ఆణ్ణి తీసుకుని యెళ్ళు"



***

పొద్దున రచ్చ బండ దగ్గరనుండి వస్తూనే వాసుదేవయ్య "సీతెక్కడే!" అని వేసిన ప్రశ్నకు లక్షమ్మ "కాలేజీలో ఏవో పరీక్ష కాగితాలు యిస్తున్నారని పొయింది పొద్ద పొద్దన్నే!" అనింది.

"రామూతో  ఎళ్ళిందా?"

"లేదు అర్జెంటని తొందరగా ఆటోలో వెళ్ళింది.  రామూ ఏదో పని మీద బయటికెళ్ళి వచ్చి అరగంట తర్వాత బయలుదేరాడు. కాలేజీకి వెళ్ళి తీసుకొస్తానని చెప్పాడు. కంగారు పడొద్దు"   

***

ఈ దశపతి ఎన్ని సార్లు రింగు చేసినా ఎత్తడంలేదు. ఏమయిందో ఏమో! నేను బయల్దేరానని త్వరగా రమ్మని ఎన్ని సార్లు చెప్పాను. అయినా రాలేదు. ఒక పక్క బావ బయలుదేరాడు స్కూటరు మీద అని అమ్మ చెప్పగానే ఆ విషయం కూడా చెప్పాను. హాల్‌టికెట్లు తీసుకోని అరగంట అయింది. అంతులేడు. సాయంత్రం దాకా సరదాగా తిరుగుదామనుకుంటే వీడు ఫోను ఎత్తడంలేదు. అనుకుంది సీత. అందరూ ఇంకో 10 రోజుల్లో జరగబోయే పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో హరిత వచ్చి "ఏమే! నీకీ విషయం తెలుసా? దశపతి వాళ్ళ నాన్నను దొంగ లిక్కరు కేసుక్రింద అరెస్టు చేశారట. అరగంట క్రితం దశపతిని కూడా తీసుకెళ్ళారట పోలీసులు. రాకేష్ అందరికి ఆ విషయమే చెప్తున్నాడు చూడు అంది. పరీక్షలు ఏమి చేస్తాడో ఏమో పాపం" అన్న మాటలకు భూమి ఒక్కసారి క్రుంగి పోయినట్టు ఫీలయింది సీత. తలతిరిగి పడిపోగానే స్నేహితులు లేపి సోడా మొహం మీద చల్లి పరామర్శ చేశారు. ఇంతలో రాము వచ్చి ఏమైందని అడిగే సరికి విషయం చెప్పారు.  ఆటోలో ఎక్కించి తీసుకుని జొన్నవాడకు తీసుకుని వచ్చాడు.

***

ఆటొ దిగుతున్న రామూ సీతలను చూసి "స్కూటరేదీ? ఆటోలో వచ్చారేమయిందీ" అన్న మామ ప్రశ్నలకు ఆగండి అని సైగ చేసి లోపలికి తీసుకెళ్ళి సీతను పడుకోబెట్టండి. ఆరోగ్యం బాగాలేదు దానికి" అన్నాడు. సీత మాత్రం వంచిన తల ఎత్తడంలేదు. 

"హయ్యో! ఏమైంది! సరే! స్కూటరేది? అన్న మామ ప్రశ్నకు నవ్వుతూ "చిన్న ఆక్సిడెంటు మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం రాండి చెప్తాను" అన్నాడు.

విషయం విన్న వాసుదేవయ్య "అంతకు తెగించాడా! డబ్బున్నోళ్ళు ఏమైనా చేయించగలరు. స్కూటర్ పాడయితే బాగు జేయిద్దాం గానీ నీకు దెబ్బలు తగిలాయా?" అన్నాడు.

"నాకు చిన్న గాయాలే! స్కూటర్లోంచి దారి కాచి వాళ్ళు కట్టిన తాడు తగిలి పడిపోయాను. పొట్టమీద మోచేతుల మీద గాయాలయ్యాయి. హాస్పిటల్‌కు బొయ్యి ఇంజెక్షన్ తీసుకున్నాలే మామా… బయపడొద్దు. వాళ్ళకు మాత్రం దేహశుద్ధి జరిగింది బాగా. ఇంతలో వాళ్ళకు ఫోను వస్తే మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇవాళ వాణ్ణి పోలీసులు అరెస్టు చేశారట దొంగ లిక్కర్ కేసు క్రింద. కనీసం మూడేళ్ళు జైలు శిక్షట. కాలేజీ అంతా గలభాగా చెప్పుకుంటున్నారు" 

"పీడా విరగడయింది. వచ్చే నెల్లోనే ముహుర్తం పెట్టించి మూడు ముళ్ళూ వేయిస్తాను సరిపోతుంది"  

మావా! నువ్వు సీతనేమీ అడక్కు అసలే గిల్టీగా ఫీలవుతోంది. పాపం. ఆటోలో బాగా ఏడిచింది.

"నా కడుపున చెడబుట్టిందది"

"ష్..వద్దన్నానా.. ఆవిషయమింతటితో వదిలెయండి. అత్తకు కూడా చెప్పొద్దు"

"నీవెంత మంచోడివి రామూ!" 

***


"సీతా..అన్నం తిను.. అత్తా మామా కూడా ఎంత డీలా పడ్డారో చూడు"

"బావా! కాసేపు నన్ను ఒంటరిగా ఉండనియ్యి" 

"అలాగే! మాట్లాడకుండా అన్నం ముద్దలు కలిపి నోట్లో పెడతా సరేనా?"

అవును కాదు అనలేకపోయింది. కన్నీళ్ళు కారిపోతున్నాయి. బలవంతంగా నోట్లో నాలుగు ముద్దలు కలిపి పెట్టాడు. లోపలికి వచ్చిన సీత నాన్న ఆ దృశ్యం చూసి పై పంచతో కళ్ళు తుడుచుకుని కోపంగా సీత చాయల చూశాడు.

" నాయనా.... నన్ను క్షమించు" అని కాళ్ళమీద పడ్డ సీతను లేపి "అమ్మా! ఒక్కటి గుర్తు పెట్టుకో ఎప్పుడూ.. దూరపు కొండలు నునుపు. అది తెలుసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. మీలాగా నేను కాలేజీ చదువులు చదువుకోలేదు. నాకు లోక జ్ఞానం తప్ప ఇంకేమీ లేదమ్మా" 

"నన్ను క్షమించు నాయనా!"

"అమ్మా! నిన్ను క్షమించాల్సింది నేను కాదు. బావ. ఒరేయ్ రామూ! ఒక్కసారి చొక్కా విప్పు" అన్నాడు.

"వద్దులే మామా..పోనీ ఏమైంది దిప్పుడు పెద్దా...?"

"ఒరేయ్ మామ మాట కాదంటావా… విప్పు" అనేసరికి చొక్కా విప్పాడు. పొట్టపై గాయాలకు ప్లాస్టర్లు అంటించి ఉన్నాయి.

"అమ్మా! నీకోసం దెబ్బలు తిన్నాడమ్మా బావ!  ఏంజరిగిందో నీకు తెలియదంటే నమ్మెంత పిచ్చి వాణ్ణి కాదు"

పెద్దగా ఏడుస్తూ కౌగిలించుకుని "నువ్వు క్షమించానంటే కానీ వదలను"

"నేను క్షమించానంటే కౌగిలి వదిలేస్తావు. అందుకే క్షమించడంలేదు. ఎంత సేపు పట్టుకుంటావో పట్టుకో నన్ను"

"చీ! పాడు అంటూ వదిలేసింది. అందరూ నవ్వారు.

"సీతా! ఈ రాముడు నీకోసం ఆ దశపతినే కాదు. దశకంఠుడిని కూడా జయించగలను".

"నువ్వు మామూలోడివి కాదు బావా!   

***


No comments:

Post a Comment

Pages