చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 2 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 2

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 2

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene 

(నాన్సీకి అపరిచిత వ్యక్తి నుంచి పోస్టులో వచ్చిన పాకెట్టులో ఒక చంద్రకాంత మణి ఉంటుంది. దానితో జోడించిన కాగితంపై నీకు అదృష్టం పట్టాలనే ఆకాంక్షతో నీ శ్రేయోభిలాషి అని ఉన్న సందేశం కనిపిస్తుంది. దాన్ని పంపిన వ్యక్తి వివరాలు కనుక్కొందామని పోస్టాఫీసుకి బయల్దేరిన ఆమె తనను ఎవరైనా అనుసరిస్తారేమో రహస్యంగా గమనించమని తన స్నేహితురాళ్ళకు చెబుతుంది. తరువాత. . .)

@@@@@@@@@@

    అకస్మాత్తుగా బెస్ ఆమె బంధువు చేతిని పట్టుకొంది.  "ఇప్పుడే ఆ వీధి దాటిన వ్యక్తి!  అతను నాన్సీని అనుసరిస్తున్నాడు!  అటు చూడు." 

 జార్జ్ ఆ వ్యక్తి వైపు ఏకాగ్రతతో చూసింది.

  ఆ వ్యక్తి నాన్సీ వెనుకే పోస్టాఫీసులోకి వెళ్ళాడు.  ఆమె పార్సెల్ పోస్టు కిటికీ దగ్గరకెళ్ళి, పోస్టాఫీసు గుమాస్తాతో మాట్లాడుతోంది.  అపరిచితుడు ఆమె వెనకాల నిలబడ్డాడు.  

  "అతను గూఢచర్యం చేస్తున్నాడు" బెస్ అంది.  ఆఫీసు బయట కాలిబాట మీద ఆమె, జార్జ్ నిలబడి చూస్తున్నారు.  

  సన్నగా, నల్లగా ఉన్న వ్యక్తి ముఖాన్ని చిట్లిస్తూ వెనక్కి తిరిగి, ఆ భవనాన్ని వదిలిపెట్టాడు.  అతను వీధికి అడ్డంగా నడిచి, ఎదురుగా ఉన్న దుకాణం గుమ్మం దగ్గర నిలబడ్డాడు.  

  "నేను నాన్సీని హెచ్చరించాలని అనుకుంటున్నాను" బెస్ అంది.  

  దానికి జార్జ్ ఒప్పుకోలేదు.   "మనం అతన్ని ఎందుకు అనుసరించకూడదు?" అని సూచించింది.   "అప్పుడు అతనెవరో, ఏమి చేస్తున్నాడో మనం తెలుసుకోవచ్చు."

  "అయితే సరె!" 

  ఈలోగా నాన్సీ తనకు గూఢమైన, భీమా చేయని బంగీని పంపిన వ్యక్తి గురించి సమాచారాన్ని తెలుసుకోలేకపోయింది.   పోస్టాఫీసులో ఎవరూ దాన్ని తమకు అప్పగించిన వ్యక్తిని గుర్తు చేసుకోలేకపోయారు.   కనీసం ఆమె పేరు, చిరునామా అక్షరాలను అతికించిన వ్యక్తిని గమనించలేదు.   ఆ పార్సెల్లో వచ్చిన వాటి వివరాలను ఆమె వారికి చెప్పకుండా ఆపుకొంది.   నాన్సీ నిరాశతో వెనక్కి తిరిగి యింటికి బయల్దేరింది.   పరాయి వ్యక్తి తాను దాగున్న చోటు నుంచి బయటకి వచ్చి ఆమెను అనుసరించాడు.  బెస్, జార్జ్ అతని వెనుక చేరారు. 

  "అతను మనను గమనించాడని నేను అనుకోను" బెస్ తన బంధువుతో అంది.   

"ఇప్పుడు మనమేం చేద్దాం? కారు దగ్గరకు ఎప్పుడు చేరుకొందాం?"

  "దాని గురించి సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం" జార్జ్ సలహా యిచ్చింది.   "ఆ వ్యక్తి  డ్రూ యింటిని గమనించి ఉన్నట్లయితే, ఖచ్చితంగా మనం నాన్సీతో కలిసి యింట్లోంచి బయటకు రావటాన్ని గమనించి ఉండొచ్చు.   ప్రస్తుతం మనం యింటికి వెళ్ళిపోయామని అనుకొని ఉండొచ్చు.   అతన్ని అలాగే అనుకోనీయి."  

  నాన్సీ తన కారు దగ్గరకు రాగానే, లోనికెక్కి, నేర్పుగా కారుని వెనక్కి నడిపి, రోడ్డు పైకి మళ్ళించి, తన యింటి దిక్కుకి కారుని పోనిచ్చింది.   ఆమె తనకు కనుమరుగు కాగూడదని ఆ వ్యక్తి కారు వెనుక పరుగెత్తాడు.   బెస్, జార్జ్ కూడా అతని వెనుక పరుగెత్తారు.  

  నాన్సీ తన యింటి వృత్తాకారపు ముంగిట్లోకి కారుని మళ్ళించగానే, అపరిచితుడు ఆగాడు.  అతను కదలకుండా అలాగే నిలబడి, ఏమి చేయాలో నిర్ణయించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు తల దించుకొన్నాడు. 

  బెస్. జార్జ్ కూడా ఆగారు.  అకస్మాత్తుగా ఆ వ్యక్తి వారి వైపు తిరిగాడు.  అతను వాళ్ళిద్దరినీ గుర్తించి ఉండవచ్చు,  ఎందుకంటే వాళ్ళను చూసిన అతను వాళ్ళకు వ్యతిరేక దిక్కులో పరుగుతీసాడు. 

  "రా!" జార్జ్ తన బంధువుని తొందరచేసింది.  వీధి చివర్లో అపరిచితుడు తన కుడి చేతిని చాపి, వచ్చే బస్సును ఆపమన్నట్లు సైగ చేసాడు.  అమ్మాయిలు అతన్ని చేరుకొనేలోపునే, అతను బస్సులోకి దూకాడు.  బస్సు చప్పుడు చేస్తూ రోడ్డు మీద దూసుకుపోయింది.  

  "ఛస్!" జార్జ్ చిరాకుగా అరిచింది.  "మనం చాలా దగ్గరకొచ్చాం!"  

  దాయాదులిద్దరూ వెనక్కి తిరిగి డ్రూ యింటికి వచ్చారు.  ఈ కథంతా వినగానే నాన్సీ తటాలున టెలిఫోను దగ్గరకు వెళ్ళి, తన మిత్రుడైన పోలీసు చీఫ్ మెగ్గినీస్ తో మాట్లాడింది.  

   “నేను మొత్తం కథను ఒక నిమిషంలో మీకు చెప్తాను, కానీ మొదట మీరు గ్రాన్బీకి వెళ్ళే బస్సులో ఉన్న వ్యక్తిని గుర్తించి, అతను ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించగలరా? అతను ఎరుపు, గోధుమల మిశ్రితమైన గళ్ళ సూట్ ధరించాడు. సన్నగా ఉన్నాడు.  ముఖం ఎప్పుడూ చిరచిరలాడుతూ ఉంటుంది.  అతను రహస్యంగా నా వెంట పడుతున్నాడు." 

  "అలాగే! తప్పకుండా నాన్సీ!  కాసేపు లైన్లో ఉండండి" అంటూ చీఫ్ దాదాపు ఒక నిమిషం బయటకెళ్ళి తిరిగి ఫోను అందుకొన్నాడు.  "ఇప్పుడు మొత్తం కథ చెప్పండి."

నాన్సీ అసాధారణమైన చంద్రకాంత శిల బహుమతి దగ్గర మొదలెట్టి, అనుమానాస్పదంగా మనిషి పారిపోవటం వరకు చెప్పింది.  చీఫ్ మెగ్గిన్నిస్ అస్పష్టంగా ఏదో గొణగటం ఆమెకు వినిపించింది. 

  "నాన్సీ! ఈ విషయం నాతో చెప్పినందుకు చాలా సంతోషం.  ఏదో జరుగుతోందని ఖచ్చితంగా చెప్పొచ్చు.  చూసి అడుగెయ్యండి.  కొంత వివరం తెలిసిన వెంటనే నేను మీకు ఫోను చేస్తాను."

తన ఎదురుగా కూర్చుని ఉన్న అమ్మాయిలతో నాన్సీ యిలా చెప్పింది :  "నాన్న పని చేస్తున్న కేసు గురించి మీరు వినాలనుకుంటున్నారా? ఇది రహస్యం కానందున నేను మీకు చెప్పగలను.” 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages