ఈ పాటి సుఖమూ యిలలోని జీవునికి (21-01-2021) - అచ్చంగా తెలుగు

ఈ పాటి సుఖమూ యిలలోని జీవునికి (21-01-2021)

Share This

ఈ పాటి సుఖమూ యిలలోని జీవునికి (21-01-2021)

డా.తాడేపల్లి పతంజలి 


తాళ్లపాక పెదతిరుమలాచార్య అధ్యాత్మ సంకీర్తన

రేకు: 50-3   సంపుటము: 15-283


ఈ పాటి సుఖమూ యిలలోని జీవునికి

చేపట్టి యింత సేసిన శ్రీపతి నెఱుగడు        ॥పల్లవి॥

నిరతిఁ గట్టివేసినవాని విడిచి మోపెత్తితే

పరువువారి సంతోషపడినయట్లు

దరిద్రుఁడయినవాని తగు రాజుగా జేసితే

మురిసి వేడుకె కాని ముందర యెఱుగడు  ॥ఈపాటి॥

గుండు మోచేయట్టివాని గొప్ప యేత మెత్తించితే

అందనే పాడుచు నలపార్చుకొన్నట్లు

పండని తపసిదెచ్చి బలుసంసారిజేసితే

దండితనమే కాని యందలి పాట్లెంచడు      ॥ఈపాటి॥

పట్టి దున్నేయెద్దుదెచ్చి బంతి గట్టి నురిపితే

నట్టే గవుక మేసి మల్లాడినయట్లు

గట్టిగా శ్రీవేంకటేశ కష్టునిబుణ్యుజేసితే

వట్టియహంకారియై యెవ్వరినిగైకొనఁడు    ||ఈపాటి||


తాత్పర్యం

వేంకటేశ!

ఈ భూమిలోని జీవుడు ఈ పాటి- కొద్దిపాటి -సుఖానికి - పొంగిపోతూ  తనను ఇంత చేసిన శ్రీ వేంకటేశుని మదిలో గ్రహించుట ఎప్పుడూ చేయడు(అనగా శ్రీ వేంకటేశుని భక్తితో పూజించడని కవి భావం. )( ఈ కొద్దిపాటి సుఖమేమిటో రాబోయే మూడు చరణాలలో కవి వివరిస్తున్నాడు)

 

1.

ఆసక్తితో కట్టబడినవానిని వానిని ఒక్కసారి బంధనాల నుంచి విడిచి పెడితే  పరుగెత్తి (పరువువారి)  అతడు సంతోషపడిన విధముగా- దరిద్రుడైన  వానిని రాజుగా చేస్తే మురిసిపోయి వేడుకలు చేసుకుంటాడు కానీ రాబోయే ఆపదను గ్రహించడు. ఈ పాటి- కొద్దిపాటి -సుఖానికి – పొంగిపోతూ  తనను ఇంత చేసిన శ్రీ వేంకటేశుని భక్తితో పూజించడు.

 

2.

గుండును(గుండ్రని పెద్దరాయి మోసే వ్యక్తిని ఆ పని నుంచి తప్పించి దానికంటె సులభమైన ఏతాము(నూయి మొదలగువానినుండి నీళ్ళెత్తెడు యంత్రము  పనిని చేయమని ఆదేశిస్తే వాడు చాలా సంతోషపడుతూ  ఆ ఏతాము పనిలో పాటలు పాడుచూ   తన  అలసటని పోగొట్టుకున్నట్టు- తపస్సులో పండని వానిని  (అనగా తపస్సు ఫలించని వానిని)  తీసుకువచ్చి పెద్ద కుటుంబం కలవానిగా సంసారిగా  చేస్తే అతిశయమే కానీ ఆ సంసారం లోని కష్టాలను తెలుసుకోడు. ఈ పాటి- కొద్దిపాటి -సుఖానికి – పొంగిపోతూ  తనను ఇంత చేసిన శ్రీ వేంకటేశుని భక్తితో పూజించడు.

3.

శ్రీవేంకటేశ !పొలంలో దున్నే ఎద్దుని తీసుకువచ్చి బంతి గట్టి(= కుప్ప నూర్పిడికి ఎడ్లను తాడుతో కట్టు, కలిపి కట్టబడిన ఎద్దులు.ఎద్దుల వరుసలో కట్టి   విడిచిపెడితే  - అది మిగతా ఎద్దులతో పాటు -గడ్డిని తింటూ – క్రీడించినట్లుగా

 కష్టపడే వారిని పుణ్యాత్ముడు గా చేసి సుఖాలలో ముంచితే- అతగాడు   అహంకారియై ఎవరిని లెక్కపెట్టడు. ఈ పాటి కొద్దిపాటి -సుఖానికి – పొంగిపోతూ  తనను ఇంత చేసిన శ్రీ వేంకటేశుని భక్తితో పూజించడు.


***

No comments:

Post a Comment

Pages