జయద్రదుడు (సైంధవుడు) - అచ్చంగా తెలుగు
జయద్రదుడు (సైంధవుడు)
అంబడిపూడి శ్యామసుందర రావు


మహాభారతములో నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సల భర్త. ఈ జయద్రదుడు ఇతను సింధు రాజ్యానికి రాజు కాబట్టి సైంధవుడు అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే అతను ప్రసిద్ధి చెందాడు. ఇతనికి దుస్సల కాకుండా మరో ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో ఒకరు గాంధార రాజ్యము నుండి మరొకరు కాంభోజ రాజ్యము నుండి.

ఇతని తండ్రి పేరు వృద్ధక్షత్రుడు జయద్రదుడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీడు  యుద్దములో వీడి తల తునుమబడును అని చెప్పగా, అది  విన్న అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు వీని తలను నేలమీద ఎవరు పడవేస్తారో వారి తల వెయ్యి ముక్కలగును అని పలికెను. కానీ కురుక్షేత్ర సంగ్రామములో వీని తల నరికింది కృష్ణుని ఉపాయముతో అర్జునుడే అయినప్పటికీ  ఆ తల ను నేల మీద పడవేసింది సాక్షాత్తు తండ్రియే! తన వాక్కు ఫలితముగా తండ్రి వృద్ధక్షత్రుని తల వెయ్యి ముక్కలవుతుంది .

జయద్రదుని పేరు రెండు సంస్కృత పదాలనుండి వచ్చింది "జయత్"అంటే విజయవంతుడైన
,"రథ"అంటే రధము. అంటే విజయవంతమైన రధాలు కలిగినవాడు అని అర్ధము అలాగే సింధు
రాజ్యానికి రాజు కాబట్టి  సింధూరాజా అనియు సింధు రాజ్య వారసుడిగా సైంధవుడు అని పిలుస్తారు ఈ పేరుతోనే అతను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాడు. ఇంత  చరిత్ర ఉన్న రాజు అయినప్పటికీ గొప్ప కురు వంశానికి అల్లుడైనప్పటికీ, బుద్ధి  మంచిది కాదు. పాండవులు మాయ జూదములో ఒడి అరణ్యవాసము చేస్తున్నప్పుడు పాండవులు వేటకు వెళుతు ద్రౌపదిని  తృణబిందు మరియు ధౌమ్య ఋషుల ఆశ్రమములో వారి రక్షణలో ఉంచి వెళతారు. ఆ సమయములో ద్రౌపదిని చూసిన జయద్రదుడు తన మంత్రి కోటికస్యు ని ఆమె ఎవరో కనుక్కుని
రమ్మని పంపుతాడు. ఆతను ఆశ్రమానికి వచ్చి, ద్రౌపది పాండవుల భార్యగా గుర్తించి ఆ సంగతిని జయద్రదునికి తెలియజేస్తాడు. అన్ని విషయాలు తెలిసినప్పటికీ జయద్రదుడు ద్రౌపది దగ్గరకు వచ్చి తన్ను తానూ పాండవుల బావగారిగా పరిచయము చేసుకొని ద్రౌపదిని తనను పరిణయమాడమని అడుగుతాడు. 

ఇది విన్న ద్రౌపది జయద్రదుని మందలిస్తుంది. కానీ ఆగ్రహించిన జయద్రదుడు ద్రౌపదిని
అపహరించి తన రాజ్యానికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు. ఇదంతా గమనించిన ద్రౌపది సఖి ధాత్రేయిక పాండవులకు జరిగిన విషయాన్ని చెపుతుంది. అప్పుడు ధర్మరాజు తన సోదరులను ద్రౌపదిని విడిపించుకు రమ్మని పంపుతాడు. వారు జయద్రదుని సైన్యాన్ని వెంబండించి, అతని సైనికులను హతమారుస్తారు.

ఇది చుసిన జయద్రదుడు ద్రౌపది ని అక్కడే వదిలి పారిపోతాడు. అర్జునుడు సైనికుల తప్పేమి లేదు వారిని చంపటం అనవసరం వదిలేయమని, భీమునికి సలహా ఇచ్చి తన బాణాలతో పారిపోతున్నజయద్రదుని అశ్వాలను చంపి, జయద్రదుని బందీగా పట్టుకుంటాడు. భీముడు కోపముతో జయద్రదుని జుట్టు పట్టుకొని నేలకేసి బాదుతాడు. చంపటానికి సిద్దమైన భీముడిని అర్జునుడు వారిస్తాడు. భీముడు జయద్రదుని కి గుండు గీసి సంకెళ్లతో బంధించి  ధర్మరాజు సముఖానికి తీసుకువస్తాడు. భీముడు ద్రౌపదిని ఏవిధమైన శిక్ష వేయమంటావు అని అడుగుతాడు.

కానీ ద్రౌపది పెద్ద మనసుతో ఇప్పటికే బానిస వలే ధర్మరాజు ముందు మోకరిల్లి ఉన్నాడు. ఎంతైనా ఇంటి ఆడబడుచు భర్త చంపటం మంచిది కాదు, క్షమించి వదిలెయ్యండి అని చెపుతుంది. ఆ విధముగా అవమాన భారంతో జయద్రదుడు తన రాజధానికి చేరుకుంటాడు.

పరాభవించబడ్డ సైంధవుడు చాలా దుఃఖించి, పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరకోమనగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు. మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా, పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరకు
ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని,శ్రీకృష్ణుని ప్రక్కకి తప్పించడానికి ద్రోణుడు ఒక ప్రణాళిక వేసి, సుశర్మ,త్రిగట అనే ఇద్దరు  రాజులను వారి సైన్యాలతో మరోచోట యుద్ధము చేయటానికి అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవులు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల
సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రతిజ్ఞ
చేస్తాడు. ఆనాడు జయద్రదుని చంపకుండా వదిలివేసినందుకు భీముడు ద్రౌపది చింతిస్తారు.

అర్జునుడి బారి నుండి జయద్రదుని రక్షించటానికి ద్రోణుడు మూడు రకాల వ్యూహాలను ఏర్పరుస్తాడు మొదటిది శకట వ్యూహము, రెండవది సూచీముఖం వ్యూహము, మూడవది పద్మవ్యూహము. భీముడు, అర్జునుడు, సాత్యకి కౌరవ సేనను చీల్చుకుంటూ ముందుకు సాగుతారు.  అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవ సైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతిస్తూ  సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా
శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి, తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న
సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు.

జయద్రదునికి దుస్సల వలన కలిగిన కొడుకు సురధడు.  కానీ ఇతను కురుక్షేత్ర యుద్దములో  పాల్గొనడు కురుక్షేత్ర యుద్ధము అనంతరము ధర్మరాజు అశ్వ మేధయాగము చేస్తూ సైన్యము వెంబడి అర్జునుని పంపుతాడు. అర్జునుడు సింధు రాజ్యానికి వచ్చినప్పుడు సురధుడు అర్జునుని ఎదుర్కొని గెలవటం కష్టము అని భావించి ప్రాణత్యాగము చేస్తాడు. ఈ విషయము తెలుసుకున్న అర్జునుడు సురధుడి కొడుకును రాజుగా పట్టాభిషేకము చేసి యుద్ధము చేయకుండానే తన రాజ్యానికి వెళతాడు.

****

No comments:

Post a Comment

Pages