శివం - 71 - అచ్చంగా తెలుగు

శివం - 71

రాజ కార్తీక్  


(బొజ్జ లింగం కథ .. ధర్మయ్య మాటలు మొత్తం విని హరసిద్ధుడు.. తన దగ్గరికి వచ్చిoది నేనే అని తెలిసి, తీవ్ర తన్మయత్వంలో‌ మునిగిపోయి ఉన్నాడు)..


హారసిద్దు కి  ఇప్పుడు ఎక్కడ చూసినా నేనే కనబడుతున్నా.‌ తన మనసు అంతా నా తలపులో లీనమైంది.‌ అసలే భావావేశాపరుడు అయిన హర సిద్దు కి అంతా నా మయం, అదే శివమయం. ధర్మయ్య  చెప్పిన‌బొజ్జ లింగం జంగమయ్య కథ అంతా ఆ గుడిలో తిరుగుతూ ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది అనుకుంటూ ధర్మయ్య చెప్పిన కథ ను నెమరు వేసుకున్నాడు.  అందరూ కలిసి తనను ఒక చేతకాని వాడిని చేశారు. అందరూ ఉండి సగం అనాధ అయ్యాడు. తను చేయబోయే ప్రతి గొప్ప పని చివర్లో ఆగిపోవటం వల్ల తన తెలివితేటలు, తన మంచితనం అందరికీ అత్యాశ లాగా, చేతగానితనం లాగా అనిపించింది. తనను పెంచిన తన నాయనమ్మ, తాతయ్య చనిపోయిన తర్వాత రాజులాగా పెరిగిన హర సిద్దు, బంటు లాగా మారలేకపోయాడు. తను నమ్మిన ప్రతి ఒక్కరూ తనని ఏదోరకంగా మోసం చేశారు, సహజంగా తను తన ఆత్మాభిమానం మీద దాడి జరిగినప్పుడు తను చేసే ప్రతి ఘటన ఎదుటివారికి జీవితమంతా గుర్తుంటుంది.

అందులోనూ, యదార్థవాది లోకవిరోధి అంటారు. అవసరమైనప్పుడు గుణ పాఠం నేర్పే కఠిన మనసున్న నేర్పరి, ఎంత తెలివి గలవాడో అంత అమాయకుడు, ఎంత నమ్ముతాడో అంత మోసపోతాడు. తనని మోసం చేసిన వారిని జీవితమంతా గుర్తు పెట్టుకునే విధంగా దెబ్బ కొట్టి గలడు. అయినా వారిని వదిలేశాడు. అదే మంచితనం, ఎదుట వారికీ చేతగానితనం. అందులోనూ బొత్తిగా లౌక్యం తెలియని తెలివిగలవాడు, అందుకే కదా నేను రావాల్సి వచ్చింది, ఇక ముందు జరగబోయే కథ లో మలుపులు ఎన్నో.


ధర్మయ్య "హార సిద్ధూ రావయ్య, భోజనం చెద్దూ గానీ, నీతో కలిసి భోజనం చేసే అదృష్టం ఉంది నాకు" అన్నాడు.


కానీ హార సిద్దు మాత్రం. జీవితంలో తను పైకి రాలేక, తనని పెంచిన వాళ్లని కోల్పోయి, తనకి కావాల్సిన వాళ్ళ దగ్గర అవమానాల పాలై, తన వైపు ఉండే వ్యక్తి ఒక్కరిని కూడా సంపాదించుకోలేక, ధనం సంపాదించడం ఇప్పటివరకు కుదరక, తన ప్రయత్నాలు సఫలం కాక తనను తాను ఒక దురదృష్టవంతుడిగా అనుకున్నాడు.


ఆ నవ్వుకి అర్థం కనిపెట్టిన ధర్మయ్య, ఎలాగో తనతోమాట్లాడాడు కాబట్టి.


ధర్మయ్య 'హర సిద్దా! నువ్వేమీ పండు వృద్ధుడివి కాదు. నువ్వు ఏ విషయంలోనూ బాధపడాల్సిన అవసరం లేదు, నీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది, నూరేళ్లు బతికే నీలాంటి మహారాజుల కి కాలం త్వరలోనే కలిసివస్తుంది, అప్పుడు అందరికీ సమాధానం లభిస్తుంది, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, అందులో భాగంగానే కుంభన్న స్వామి నీ దగ్గరికి వచ్చాడు ఇక్కడికి చేర్చాడు, బాధపడకు ఏదో పెద్దది నీ కోసం మహాదేవుడు అట్టిపెట్టాడు. అది మాత్రం తథ్యం, నువ్వు మాత్రం నీలాగే ఉండు, నా కొడుకు వయసు ఉన్న నీకు ఇది నేను అనుభవంతో చెప్పితే సలహా, నీ వాక్చాతుర్యం, మీ మనసాక్షి ఆ మహాదేవుడికి నచ్చాయి, అదృష్టం అంటావా? ఎవరికి లభించిన అదృష్టం వారిది. సృష్టి ఏర్పడ్డ దగ్గర నుండి కొంత మందికి మాత్రమే లభించిన వరం నీకు లభించింది. ఏదో గొప్ప కార్యం కోసమే ఇదంతా జరుగుతోంది. ఏమీ భయపడకు నువ్వు చేసిన తప్పులు ఆ దేవుడి దగ్గర క్షమాపణ వేడి చేయకుండా ఉంటే చాలు, అంతే నాయనా అయినా నీకు నేనేం చెప్పగలను," అంటూ పుత్ర వాత్సల్యంతో చేరదీశాడు.


హార సిద్ధుడు. భోజనం చేస్తుండగా ధర్మయ్య మాత్రం అందర్నీ వెళ్ళమని చెప్పి, ఆ రోజు జంగమయ్య ఏమి వంటలు తిన్నాడో అవి మళ్ళీ చేయించి, హార సిద్ధుకి కొసరి కొసరి వడ్డిస్తున్నాడు. అలా తనకి తన నాయనమ్మ పెట్టేది, ఆ తర్వాత ఎప్పుడో తప్ప, కడుపు నింపుకోవడానికి తప్ప, ఎప్పుడూ అలా తినలేదు. తన నాయనమ్మ వలె ముద్ద ముద్దకీ నెయ్యి పోస్తున్నాడు ధర్మయ్య. ధర్మయ్యకు మాత్రం హర సిద్దు ఏదో నా గణంలో ఒకడి లాగా కనపడుతూ ఉన్నాడు. హర సిద్దు లో నన్ను చూశాడు.


హార సిద్దు "ధర్మయ్య బాబాయ్ నువ్విలా నాకు పెడుతుంటే అచ్చం మా నాయనమ్మ గుర్తుకొస్తుంది, భోజనం చేసే ప్రతి సారి మొదటిగా నేను మా నాయనమ్మ ని తలచుకుంటాను,చాలా కొద్ది సేపు లోనే నీమీద నాకు ఎంతో అభిమానం ఏర్పడింది, నువ్వు కూడా నన్ను ఎంత అభిమానంగా చూస్తున్నావ్, నీ ప్రేమకు ధన్యుడను బాబాయ్" అన్నాడు కృతజ్ఞతగా.


ధర్మయ్య "వాళ్ళందరూ ఉంటే దిష్టి తగులుతుంది అందుకే వారందర్నీ పంపించా, నువ్వు  భోజనం చేసేయ్.." అన్నాడు.


హార సిద్దు "అచ్చం మా నాయనమ్మ కూడా అంతే అనేది బాబాయ్" అన్నాడు.


ధర్మయ్య "మీ నాయనమ్మ నిన్ను ఇంత ధర్మాచరణలో పెంచట వల్లే నీకు సాక్షాత్తు పరమేశ్వర దర్శనభాగ్యం లభించింది. అలాగే నిన్ను కన్న తల్లి దండ్రులు కూడా అదృష్టవంతులు, నీ గొప్పతనం తెలిసిన రోజు అర్థమవుతుంది. నీ ఔదార్యం వాళ్ళందరికీ బోధపడుతుంది, నువ్వు మాత్రం మీ నాయనమ్మ గుర్తుగా చిరస్థాయిగా నిలిచే విధంగా ఏదో ఒకటి చెయ్యి నీకు చేత అయినట్లు"

అని సూచించాడు.


ఇప్పుడు గుర్తుకు వచ్చింది హర సిద్దు కి 

తన నాయనమ్మ "ఓరే హర సిద్దు, ఇంత చిన్న వయసులోనే శిల్ప కళలో ఎంతో నేర్పు చూపిస్తున్నావ్, కళాకారుడివిరా నువ్వు, ఆ నటరాజ స్వామి అనుగ్రహం, ముద్దుల పట్టివి," అనేది. అప్పుడు హర సిద్ధ మాత్రం, "చెప్పమ్మా నీ కోసం ఏమైనా చేస్తాను" అని అన్నాడు, అప్పుడు వాళ్ళ నాయనమ్మ ఒక కోరిక కోరు కుంది. 


"ఒరేయ్ పరమేశ్వరుడు ఎప్పుడూ లింగరూపంలో ఉంటాడు కదా, ఆయన ఎంతో చూడ చక్కని వాడు కదా, ఆయనది ఒక అందమైన విగ్రహం నీ  స్వహస్తాలతో సిద్ధం చేయరా. అది బాగుంటుంది, సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసం లోనే పెట్టుకుంటాడు,  సాక్షాత్తు నిజమైన శివుని చూసిన అనుభూతి రావాలి రా" అనేది.


హర సిద్దు "ధర్మయ్య బాబాయ్ నీ రూపం లో నాకు ఆ దేవుడే చెప్పించాడు, మా నాయనమ్మ శివుని విగ్రహం ఒకటి శిల్పం లాగా చెక్క మంది, ఆ విగ్రహం సాక్షాత్తు శివుని చూసినట్టే ఉండాలని అని చెప్పింది, అది కచ్చితంగా చేస్తా " అన్నాడు.


ధర్మయ్య "అది, అంతే చేయాల్సిందే, నువ్వు మనసు పెడితే ఎంత సేపు!" అని ప్రోత్సహించాడు.


 భోజనం అయిపోయింది...


హార సిద్దు "బాబాయ్ ఇలా భోజనం చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో" అన్నాడు సంతోషంగా.


ఇద్దరూ నవ్వుకున్నారు కాసేపు.


ఇంతలో దూరం నుంచి మహారాజ పరివారం వస్తున్నారు...


"ధర్మయ్య అదుగో మా రాజు గారు వస్తున్నారు" అన్నాడు.


హార సిద్దు మోము లో  నవ్వు ...


నా భక్తుని మోములో నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి...

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages