నిబద్ధత - అచ్చంగా తెలుగు

 నిబద్ధత

(సి.హెచ్.ప్రతాప్) 




రాజేష్, సురేష్‌ ఒకే కళాశాల నుండి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఇద్దరూ హైదరాబాద్‌లోని వేర్వేరు బహుళజాతి సాంకేతిక సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందారు. ఇద్దరికీ ఒకే లక్ష్యం – త్వరగా ఉన్నత స్థానానికి చేరుకుని, ఎక్కువ ధనం సంపాదించడం. అయితే, వారి మార్గాలు మాత్రం పూర్తిగా భిన్నం.

రాజేష్‌  పనిని దైవారాధనగా భావించేవాడు. అతడు కార్యాలయానికి సమయానికి వచ్చి, ఇచ్చిన పనిని పూర్తి ఏకాగ్రతతో, నాణ్యతతో చేసేవాడు. రాత్రిళ్లు ఆలస్యమైనా, "ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ నా నైపుణ్యానికి ప్రతిబింబం" అని భావించి, అందులో ఎలాంటి దోషాలు లేకుండా చూసుకునేవాడు. అతడి నిబద్ధత, నిజాయితీ అతని ప్రతి పనిలోనూ కనిపించేవి.

 సురేష్ వైఖరి మాత్రం భిన్నంగా వుండేది. అతగాడికి మాత్రం త్వరగా ఎదగాలనే తొందర. అతడు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందాలని ఆశించేవాడు. అతడి దృష్టి కేవలం తన పనిని పూర్తి చేసినట్లు చూపించడంపైనే ఉండేది. కార్యాలయంలో ఎక్కువ సమయం అంతర్జాలంలోని అడ్డదారులు, ఇతరుల కోడ్‌ను అనుకరించడం లేదా తన సహోద్యోగుల సాయంతో త్వరగా పూర్తి చేయడంపైనే ఉండేది. ఉన్నత స్థానానికి చేరడానికి నిజాయితీని పక్కన పెట్టి, ఇతరుల శ్రమను తనదిగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడేవాడు కాదు.

ఉద్యోగంలో చేరిన ఆరు నెలల తర్వాత, ఇద్దరికీ ఒకేరకమైన పనిని అంచనా వేసే బాధ్యత ఆయా సంస్థల అధికారులు అప్పగించారు. రాజేష్‌ ఆ పనిని క్షుణ్ణంగా పరిశీలించి, నాలుగు రోజుల సమయం పడుతుందని ఖచ్చితంగా చెప్పాడు. కానీ సురేష్‌, తన నిర్వాహకుడిని మెప్పించడానికి, ఆ పనిని కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేస్తానని అతి నమ్మకంతో హామీ ఇచ్చాడు. రాజేష్‌ నిజాయితీగా, నిబద్ధతతో నాలుగు రోజుల్లోనే అధిక నాణ్యతతో పనిని పూర్తి చేయగా, సురేష్‌ రెండు రోజుల్లో పని పూర్తి చేసినట్లు చెప్పడానికి, తన కోడ్‌లో అనేక లోపాలను వున్నా ఆ విషయం అధికారులకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఈ కారణంగా, అతని పనిని తిరిగి సరిదిద్దడానికి మొత్తం వారం రోజులు పట్టింది. ఈ సంఘటన నుంచే, రాజేష్‌పై సంస్థకు నమ్మకం పెరగడం, సురేష్‌పై అనుమానం కలగడం మొదలైంది.

మరొక సందర్భంలో ఒక  అత్యంత ముఖ్యమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తిలో ఒక క్లిష్టమైన సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని పరిష్కరించడానికి రాజేష్‌ను, సురేష్‌ను ఆయా సంస్థలు బాధ్యత అప్పగించాయి. సమస్యను పరిష్కరించడానికి కష్టపడకుండా, సురేష్‌ అప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఒక పాత పరిష్కారాన్ని కాపీ చేసి, సమస్య పరిష్కారమైంది అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశాడు. అయితే, రాజేష్‌ మాత్రం రాత్రంతా కష్టపడి, అసలు సమస్య మూలాన్ని కనుగొని, నిజమైన, స్థిరమైన పరిష్కారాన్ని అందించాడు. సురేష్‌ అందించిన కాపీ చేసిన కోడ్, కొద్ది రోజుల తర్వాత అదే సమస్యను తిరిగి సృష్టించింది. తన అబద్ధం, నిర్లక్ష్యం బయటపడటంతో, సురేష్‌ తన తప్పు ఒప్పుకోక తప్పలేదు.

సంవత్సరం గడిచింది. రాజేష్‌ తన ప్రాజెక్ట్‌లో చూపిన అంకితభావం కారణంగా ఒక విదేశీ  సంస్థకు ఒక ముఖ్యమైన ప్రోజెక్ట్ను డెవలప్ చేసేందుకు ఎంపికయ్యాడు. అతడి నిజాయితీ మరియు కష్టపడే తత్వం కారణంగా, సంస్థ అతడికి ఉన్నత బాధ్యతలు అప్పగించింది.

ఇక సురేష్‌ విషయానికొస్తే, త్వరగా ఎదగాలనే ఆశతో, ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన భాగాన్ని తక్కువ సమయంలో పూర్తి చేయడానికి, బయటి అంతర్జాల ఉపకరణాన్ని ఉపయోగించి, ఆ కోడ్‌ను సంస్థ గోప్యతా నియమాలకు విరుద్ధంగా తన ప్రాజెక్ట్‌లో చేర్చాడు. పైగా, తాను ఎక్కువ సమయం పనిచేసినట్లు తప్పుడు పని సమయాన్ని కూడా నమోదు చేశాడు.

కొద్ది రోజులకే, సురేష్‌ చేసిన పనిలోని లోపాలు బయటపడ్డాయి. అతడు తొందరపాటుతో ఉపయోగించిన ఆ అడ్డదారి కోడ్ సంస్థ వ్యవస్థలో ఒక పెద్ద భద్రతా లోపం సృష్టించింది. తక్షణ దర్యాప్తులో, సురేష్‌ తప్పుడు పద్ధతులు, అబద్ధాలు, నిర్లక్ష్యం బహిర్గతమయ్యాయి. తన దోషాలు బయటపడిన వెంటనే, సంస్థ గోప్యత, వృత్తిపరమైన నిజాయితీని ఉల్లంఘించినందుకు అతడిని ఉద్యోగం నుండి తొలగించింది.

కొన్నాళ్లకు, రాజేష్‌ ఉన్నత స్థానానికి చేరి, పెద్ద జీతంతో సంతోషంగా ఉండగా, సురేష్‌ తక్కువ సమయంలో ధనవంతుడు కావాలనే దురాశతో, అడ్డదారులు తొక్కడం వల్ల తన మంచి అవకాశాన్ని పోగొట్టుకుని, జీవితంలో వెనుకబడ్డాడు.

పనిని దైవంగా భావించి, నిబద్ధతతో, నిజాయితీగా చేసేవారు ఆలస్యంగానైనా స్థిరమైన విజయాన్ని సాధిస్తారు. అబద్ధాలు, అడ్డదారులు త్వరగా బయటపడతాయి, వాటి ఫలితం ఎప్పుడూ వినాశకరమే. జీవితంలో నిజాయితీ, నిబద్ధత మాత్రమే మనకు శాశ్వతమైన విజయాన్ని, గౌరవాన్ని అందిస్తాయి. 

***

No comments:

Post a Comment

Pages