దివ్య జ్యోతి (పెద్ద కథ) - 3
రోజా రమణి
మంచంపై బోర్లా పడుకుని మోచేతులలో దాచుకున్న తలను పైకెత్తి చూసింది జ్యోతి. "అమ్మగారు! కాఫీ" అన్న పనమ్మాయ్ పిలుపుకు. కాఫీ తాగుతూ 'అమ్మ, తమ్ముడు ఎలా ఉన్నారో ఏంటో! అమ్మ నన్ను గుర్తుపట్టి ఉంటుందా! లేదా ఎవరో "సినిమా యాక్టర్" ని చూడటానికి వచ్చినట్టు వచ్చిందా! ఏమి అర్థం కాకుండా ఉంది. సరే! ఇప్పుడు నా పరిస్థితి బావుందికదా.. అమ్మను తమ్ముడిని తెచ్చుకుంటాను. నాకు మాత్రం వాళ్ళు తప్ప ఎవరున్నారు?' ఆలోచనలు ఆమె మనసుతో యుద్ధం చేస్తున్నాయి.
'ఒకసారి అనసూయమ్మగారి దగ్గరకు వెళతాను. తనకి నా గురించి తెలుసుకదా! నాకు మంచి జరిగే సలహానే ఇస్తారు. అవును ఇప్పుడే వెళ్తాను' "డ్రైవర్ కారు తియ్యు, అనసూయమ్మ గారింటికి వెళ్ళాలి" అంటూ గట్టిగా డ్రైవర్ ని పిలిచింది జ్యోతి.
అరగంటలో అనసూయమ్మగారి ఇంటికి చేరుకుంది. "ఏమిటి జ్యోతి ఇలా వచ్చావ్? రా.. రా.. కూర్చో ఏమిటి సంగతులు. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టు ఉన్నావ్. పోనీలే భగవంతుడు నీకు ఒక మంచిదారి చూపించాడు. మంచివాళ్లకు ఎప్పుడూ మంచే జరుగుతుంది. అది సరే! చెప్పు ఏంటి సంగతులు " అంటూ అనసూయమ్మగారు కుశలప్రశ్నలు వేశారు. దేనికీ సమాధానం చెప్పని జ్యోతిని చూసి ఏదో జరిగిందన్న విషయం గ్రహించిన ఆవిడ తనే ఇంకా ఏవో కబుర్లు చెబుతూ.. సందర్బం చూసుకుని జ్యోతిని నెమ్మదిగా అడిగింది. " ఏం జ్యోతి! ఏమిటి ముభావంగా ఉన్నావ్? ఏదైనా ఉంటే నాతో చెప్పకూడదూ" అంటూ అడిగింది అనసూయమ్మ.
వెంటనే భోరుమంటూ ఏడుపు అందుకుంది జ్యోతి. "ఛీ పిచ్చిపిల్ల ఏం జరిగిందో చెప్పు" అంటూ మళ్ళీ అడిగింది.
"అమ్మా! మీరే లేకుంటే నా జీవితం ఎప్పుడో అంతమైపోయుండేది. తల్లిలా ఆదరించారు. బ్రతుకు తెరువు చూపించారు. మీరిచ్చిన ఈ జీవితానికి ఎన్ని జన్మలెత్తినా నేను ఋణం తీర్చుకోలేను."అంటూ బావురుమంది.
"నేను కాదు తల్లీ! భగవంతుని అనుగ్రహం, నీ శ్రమ, క్రమశిక్షణ అన్నీ కలిపి నిన్నీ స్థాయిలో నిలబెట్టాయి. సరే ఏం జరిగింది. ఇప్పుడెందుకు ఈ కళ్ల నీరు, చెప్పు " అంటూ అడిగారు అనసూయమ్మగారు.
"నేను నిన్న రాయవరం 'గోల్డ్ షాప్ ఓపెనింగ్' కి అతిథిగా వెళ్ళానమ్మా! అక్కడ అమ్మ, తమ్ముడు కనిపించారు. సరైన బట్టలు కూడాలేవు వాళ్లకు. అదే నేనా పెళ్ళి చేసుకుని ఉంటే వాళ్ళు సుబ్బరంగా ఉండేవారేమో! తప్పు చేశానేమో అన్న బాధ నామనసును పీకేస్తోంది." వాళ్ళని చూసిన దగ్గరనుంచి నా మనసు భారంగా ఉందమ్మా! ఏం చెయ్యాలో అర్థం కావటంలేదు" అంటూ ఏడ్చింది.
"మీ అమ్మ నిన్ను చూసిందా!?"
"నా వైపు ఆ సమయంలో చూస్తున్నట్టు అనిపించింది. కానీ 'నేనే' అని గుర్తుపట్టిందో లేదో తెలియలేదు. ఈ లోపు జనసందోహం ఎక్కువ కావటంతో.. వెనక్కి వచ్చేశాము. ఒకవేళ నన్ను గుర్తుపట్టి ఉంటే కనీసం చూడను కూడా చూడలేదని ఎంత బాధపడి ఉంటుందో.. కానీ నేను అప్పుడు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నానమ్మా!" అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటూనే ఉంది జ్యోతి. "సరేలే ఇప్పుడు ఏమయ్యిందని. వాళ్ళ గురించి ఒకసారి వాకబు చేయించి ఒక నెలరోజులలో మీ అమ్మను, తమ్ముడిని తెచ్చుకుందువుగాని. సడన్ గా అంటే.. కాస్త కష్టం కదా! ఒక నెల రోజులు ఓపిక పట్టు అంతా మంచే జరుగుతుంది. మీ వాళ్ళని తెచ్చేసుకుని ఆనందంగా ఉండొచ్చు సరేనా" అంటూ ఓదార్చింది అనసూయమ్మ.
"సరేనమ్మా "
"ఇంక నువ్వు ఏమీ ఆలోచించకుండా ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకో. రేపటి నుంచి మళ్ళీ షూటింగ్లు అవీ ఉన్నాయేమో కదా!ఇంక వెళ్ళు" అని సౌమ్యంగా చెప్పింది అనసూయమ్మ.
ఒక వారం రోజులు పోయాక అనసూయమ్మగారి సహాయంతో అమ్మ, తమ్ముడి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం మొదలు పెట్టింది. బాగా బీదరికంలో ఉన్నారని తెలుసుకుని, ఒకరోజు అనసూయమ్మగారి సహాయంతో ఒక వ్యక్తిని పంపించి వారిద్దరినీ చెన్నైకి పిలిపించింది జ్యోతి. జ్యోతి ఇంటికి చేరుకున్న ఆమె అమ్మ, తమ్ముడు ఇంటిని చూసి, నౌకర్లను చూసి ఆశ్చర్యపోయారు. వారు చేరుకునేటప్పటికి ఇంట్లో జ్యోతితో పాటు అనసూయమ్మగారూ, జ్యోతిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన కృష్ణారావు కూడా ఉన్నారు.
ఇంటిని, నౌకర్లను, డబ్బును చూసిన జ్యోతితల్లికి అప్పటివరుకూ జ్యోతిమీద ఉన్న కోపం పోయి, ఉన్నపళంగా ప్రేమ ముంచుకొచ్చింది.
"అమ్మా! జ్యోతి ఇన్నాళ్లు ఏమైపోయావే! మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయావ్? నీవు కనిపించకపోయేసరికి నాకు నిద్రపట్టడం మానేసింది. వెధవ సంబంధం నేరకపోయి తెచ్చాను. బగారం లాంటి పిల్లను దూరం చేసుకున్నానే అంటూ ఏడవని రోజు లేదు తల్లీ!" అంటూ మొసలికన్నీరు కార్చటం మొదలుపెట్టింది. బడబడా ఏడుస్తున్న అమ్మ వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు విక్రమ్.
"ఏమిట్రా అలాచూస్తున్నావ్? ఇన్ని రోజులూ అక్క, అక్క అని అల్లాడిపోయావ్ కదా! ఇదుగో అక్క. భగవంతుడు ఇన్నాళ్ళకి మళ్ళీ మనల్ని కలిపాడు. దేవుడున్నాడు" అంటూ కొడుకు చూపును కూడా తాళంలో కలిపేసి తనకు అనుకూలంగా మార్చుకుంది రంగమ్మ. జ్యోతి కూడా "అమ్మా!" అంటూ మనస్ఫూర్తిగా తల్లిని కౌగలించుకుంది.
అనసూయమ్మగారిని, కృష్ణారావు గారిని రంగమ్మకు పరిచయం చేసింది జ్యోతి. ఒకరినొకరు కుశలప్రశ్నలు వేసుకోవటం జరిగింది. కొంతసమయం తరువాత అనసూయమ్మ, కృష్ణారావు గారూ వెళ్లిపోయారు. తరువాత విక్రమ్ ను 10 వ తరగతి ప్రయివేటుగా కట్టించి, ట్యూషన్ క్లాస్సెస్ పెట్టి,చదివించే ఏర్పాట్లు చేసింది జ్యోతి.
రోజులు గడుస్తున్నాయ్. షూటింగ్ లతో బిజీగా ఉంటోంది జ్యోతి. ఇంటి పెత్తనం అంతా అమ్మ చేతిలో పెట్టింది. నౌకర్ల జీతభత్యాలు, ఇంటి ఖర్చులు, వ్యవహారాలు అన్నీ రంగమ్మే చూసుకుంటోంది. డబ్బు పెరగటంతో కొంతమంది దగ్గర చుట్టాలు కూడా జ్యోతి పంచన చేరటం జరిగింది. "సరే పోయేదేముంది తిండి పెట్టటమే కదా! రంగమ్మకు కూడా చేదోడు వాదోడుగా ఉంటారని" ఉండనిచ్చింది జ్యోతి. రంగమ్మ కొంత ఒడుపు, సాంఘిక పరిజ్ఞానం కూడ నెమ్మదిగా నేర్చుకుంది. ముందున్న స్వార్థంతో పాటు డబ్బు రావటం వలన కొంత అహంకారం కూడా ఆమెలో నెమ్మదిగా చోటు చేసుకుంది.
ఒకరోజు కృష్ణారావు, జ్యోతి ఇంటికి వచ్చాడు
"జ్యోతీ! మీరు మేనేజర్ కావాలని అన్నారు కదా! ఈయన పేరు భరద్వాజ్. నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, నమ్మకస్తుడు. ఇంతకు ముందు 'డైరెక్టర్ గంగాధర్' వద్ద డబ్బు వ్యవహారాలవీ చూసుకునేవాడు. తరువాత కాస్త పని వత్తిడి పెరిగి జీతం తక్కువ కావటంతో అక్కడ మొన్నీమధ్యనే మానేశాడు. సరే అని మీ దగ్గరకు తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతేనే!" అన్నాడు కృష్ణారావు.
"అయ్యో! మీకన్నా, అనసూయమ్మగారి కన్నా నా మంచి చెడులు గురించి ఆలోచించే వారెవరుంటారండి. నిరభ్యంతరంగా పెట్టుకుందాం" అంది జ్యోతి.
"ఎంతమంచి వాడో భరద్వాజ్ అంత ఆత్మాభిమానం కలవాడు." అన్నాడు కృష్ణారావు.
భారద్వాజ్ కూడా నవ్వి ఊరుకున్నాడు.
ఈ సంభాషణలు వింటున్న రంగమ్మకు అనసూయమ్మ పై కొంత ఈర్ష్య కలిగింది. నెమ్మదిగా అది కృష్ణారావు, అనసూయమ్మలపై ద్వేషంగా కూడా మారింది.
భరద్వాజ్ మేనేజర్ గా జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరం వచ్చి 3,4 నెలలు గడిచాయి.
ఒకరోజు "భరద్వాజ్ గారూ! నాకు ఒక 25,000 కావాలి"
"అలాగే బాబు మీ అక్కకు ఒక మాట చెప్పి ఇస్తాను"
ఇంతకుముందు అడిగినప్పుడు బాగానే ఇచ్చారుగా! ఇప్పుడు అక్క పెర్మిషన్ కావాలని కొత్తగా అంటారు. అయినా అక్క నేను అడిగినప్పుడు డబ్బు ఇమ్మని చెప్పింది కదా! ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నారు" అన్నాడు విక్రమ్.
"మీ అక్కయ్యగారు ఇమ్మన్నది 2000,3000 రూపాయలు బాబూ! కానీ మీరిప్పుడు ఏకంగా ఒకేసారి 25,000 అడుగుతున్నారు. "నాకు తెలియకుండా ఎందుకిచ్చారు?" అని అడిగితే నేను మీ అక్కకు సమాధానం చెప్పాలి కదా! అందుకని అన్నాడు భరద్వాజ్. సౌమ్యంగా.
"నాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు. నాకూ ఖర్చులు అవీ ఉంటాయి. వారి ముందు చిన్నబోవటం నాకు అవమానంగా ఉంటుంది. ఎన్నాళ్ళు ఇలా వెయ్యి, రెండువేలు తీసుకోవటం. పరవాలేదు ఇవ్వండి అక్కడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను" అని ఖటువుగా మాట్లాడాడు విక్రమ్. ఇంటి ఖర్చుల నిమిత్తము రంగమ్మ కూడా అవసరానికి మించి డబ్బులు అడగటం మొదలు పెట్టింది. ఖర్చుల లెక్క చెప్పమంటే
" ఏదో నీ సొమ్ము మాకిస్తున్నట్టు అలా గింజకుంటావేమిటి? నా కూతురు సంపాదించిందే కదా అడుగుతున్నది" అంటోంది రంగమ్మ. రంగమ్మకు తోడు ఆమె పక్కన ఉండే భజన బృందం కూడా రంగమ్మకు వంతపాడే వారు.వ్యవహారం ముదరటం ప్రారంభించింది. ఇంక లాభం లేదని జ్యోతితో వ్యవహారం చెప్పాడు భరద్వాజ్.
ఇంటిలో చర్చమొదలయ్యింది.
"25,000 ఎందుకు విక్రమ్ నీకు?" అడిగింది జ్యోతి.
"నేను 25,000 ఎక్కడ అడిగాను 5000 ఇమ్మన్నాను ఇచ్చారు అంతే " అన్నాడు విక్రమ్.
వెంటనే భరద్వాజ్ వైపు చూసింది జ్యోతి. " ఏంటండీ!ఇది మీరు అకౌంట్ లో 25,000 లెక్క చూపించారు వాడు 5000 ఇచ్చారు అంటున్నాడు " అంది జ్యోతి. విక్రమ్, భరద్వాజ్ ను చూసి, ఒక చిన్న వ్యంగ్యమైన నవ్వు నవ్వాడు.
రంగమ్మ " ఏం తల్లీ! కని, పెంచిన నన్నే అనుమానిస్తున్నావా! ఇంతకన్నా అవమానం మరొకటి లేదు. డబ్బు కోసం కన్న కూతురుని మోసం చేస్తానా! అయినా అతను చెప్పటం, నువ్వు నమ్మటం ఇదేమీ బాగాలేదు". అంటూ కళ్లనిండా నీటిని నింపుకుని లోపలకు వెళ్లిపోయింది రంగమ్మ. చేసేది లేక జ్యోతి భరద్వాజ్ వైపు, తమ్ముడి వైపు చూస్తూ "ఏంటో! ఈ ఇంట్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థంకావటం లేదు" అంటూ చకచకా మెట్లెక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది .
ఇంకా కొనసాగితే పరిస్థితి విషమించే అవకాశం ఉందని అనిపించి భరద్వాజ్ జ్యోతి వద్ద రాజీనామా చేసి వెళ్ళిపోయాడు.
రెండు రోజుల తరువాత జ్యోతి ఇంటికి అనుకోకుండా రాహుల్ వచ్చాడు. అనసూయమ్మ గారి ఇంట్లో జ్యోతి ఉన్నప్పుడు ఆ ఇంటి ఎదురుగా రాహుల్ ఉండేవాడు. అనసూయమ్మ గారికి కూడా బాగా పరిచయం ఉన్న వ్యక్తి. కాస్తో కూస్తో మంచివాడు కూడాను. జ్యోతితో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు.
"హాయ్ రాహుల్ బాగున్నావా!" అడిగింది జ్యోతి. "ఏంటి ఇలా వచ్చావ్ చాలా రోజులకి".
"ఊరికనే వచ్చాను జ్యోతి. నిన్ను ఒకసారి చూసి పోదామని, అనసూయమ్మ గారు కూడా వచ్చారు. వారు వస్తుంటే వారితో పాటు వచ్చాను"
"చాలా పెద్దదానివి అయిపోయావు. చూస్తుండగానే జీవితంలో చాలా ఎదిగావ్ జ్యోతి. నువ్వు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలి" అన్నాడు రాహుల్.
ఈ లోపు ద్వారం దాటి లోపలికి వస్తున్న అనసూయమ్మ గారిని చూసి " రండమ్మా! లోపలికి రండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. కబురు పెడితే నేనే వచ్చి ఉండేదాన్ని కదా! మీకెందుకు శ్రమ" అంది జ్యోతి.
"రా! రాహుల్. కూర్చోండి ఇప్పుడే వస్తాను". అంటూ జ్యోతి లోపలికి వెళ్లి పనమ్మాయితో జ్యూస్ తీసుకురమ్మని చెప్పి వచ్చి కూర్చుంది.
"ఏం జ్యోతి అలా ఉన్నావ్? ఎప్పుడూ ఉన్నంత హుషారుగా లేవే! ఏం? మళ్లీ ఏం జరిగింది?"
"ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది"
" సరే భారద్వాజ్ ఏడి? కనిపించటం లేదు." అడిగింది అనసూయమ్మ.
"లేరు వెళ్లిపోయారు"
"వెళ్లిపోయారు? అంటే "
"ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్లిపోయారమ్మా!"
"అవునా! కనీసం నాకు గాని, కృష్ణారావుకు గాని చెప్పనేలేదు"
"వెళ్లి రెండురోజులు అయ్యింది. నేనే కృష్ణారావు గారికి ఫోన్ చేద్దామనుకున్నా! ఎదో పనిలోపడి మరిచిపోయాను" అంది జ్యోతి ఎలా చెప్పాలో అర్థం కాక...
(ఇంకా ఉంది)




No comments:
Post a Comment