పెద్దలు చెప్పిన మాట... - అచ్చంగా తెలుగు

పెద్దలు చెప్పిన మాట...

Share This
||శ్రీ ||
పెద్దలు చెప్పిన మాట
రచన: శారదా తనయ
(C.Ramesh Babu)
ముకుందరావు జలజలకు ఏం చెయ్యాలో అంతుబట్టడం లేదు. వారిద్దరూ తమ అమ్మాయి, అఖిల, తో పాటు మూడు నెలలు ఉండడానికి అమెరికాకు వచ్చారు. ఆ అమ్మాయికి ఒక బాబు. వాడికి సంవత్సరంన్నర.
అప్పటికి అఖిల ఉద్యోగం మానేసి సంవత్సరంన్నర పైనే అయింది. మళ్ళీ ఉద్యోగంలో చేరాలని ఆమె తాపత్రయం. ఇంట్లో బాబును చూసుకుంటూ అంట్లు తోముకోవడానికా నేను అంతా చదివింది. నేను పనిచేసేటప్పుడు నాకెంత గుర్తింపు ఉండేది. అదంతా పోయింది అని ఒకటే వాపోతోంది.  అమ్మాయి కాన్పు సమయంలో జలజ వచ్చి ఆరునెలలు ఉండి, అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకున్నాక తిరిగి వెళ్ళారు. తరువాత వియ్యంకులు  వచ్చారు. కానీ వియ్యంకుడి ఆరోగ్యం అంత బాగా లేకపోవడం వలన తొందరగా వెళ్ళిపోయారు. అందుకే మళ్ళీ తన తల్లిదండ్రులను పిలిపించుకుంది అఖిల. 
ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక నెల అయింది.

వచ్చినప్పటినుండి ఇద్దరూ చూస్తున్నారు అఖిల మనోభావాన్ని. అన్నిటికీ చిరాకు పడ్డం, తనని తాను తిట్టుకోవడం, అయినా నాకింతేలే అనే నైరాశ్యపు మాటలు అనుకోవడం. అప్పటికీ జలజగారు చాలా సార్లు సమాధాన పరచడానికి ప్రయత్నించారు. కానీ ఒప్పుకోదే. “ నీకేమమ్మా ! నువ్వు హౌస్ వైఫ్ వి. నీకు ఇలాంటి ప్రాబ్లమ్ అస్సలు రాలేదు. వచ్చుంటే నువ్వూ ఇలాగే అనుకునేదానివి ఖచ్చితంగా “ అనేది. కాలనీలో ఉన్న ఇండియన్ ఫ్యామిలీస్ లో చాలా మంది ఆడవాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తనను చాలా తేలికగా మాట్లాడిస్తారని ఆమె అభిప్రాయం. “ వాళ్ళంతా వర్కింగ్ ఉమెన్ కదా. వాళ్ళవేవో వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను, ఇంకో ఆమె ఉందిలే, ఆమె మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా కారణానికి ఆమె రాకపోతే నేనొక్కదాన్నే అయిపోతాను. విసుగొచ్చేస్తుంది. “ అంటుంది. 
వాళ్ళాయనకి ఇటీవల ఆఫీసులో పనెక్కువయిందని లేటుగా వస్తాడు. గంటన్నర డ్రైవ్ చేసుకుని వచ్చేటప్పటికి అలసి పోతాడు. ఇంట్లోని ఈ పనినీ ముట్టుకోడు. బజారుకెళ్ళి సామాన్లన్నీ తనే తేవాలి. బాబును చూసుకోవాలి. పనిమనుషులు దొరకరు. పాత్రలు తోముకోవాలి. ఇక వంట సరేసరి.  ఇన్ని పనుల మధ్య తీరిక దొరికినప్పుడెల్లా తన కెరియర్ గంగలో కలిసిందని బాధపడడం, ఇదే వరస రోజూ. ఎన్నిసార్లని వినడం. దంపతులిద్దరికీ విసుగొచ్చేసింది. ఒక రోజు బాబు పడుకున్న సమయం చూసుకుని అఖిలను ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాలని పిలిచారు. హాల్లో ఉన్న డైనింగ్ టేబుల్ కి అటూ ఇటూ కూర్చుని చర్చ ప్రారంభించారు. 
ముందుగా జలజ ప్రారంభించింది. “ కాదే అఖిలా ! వచ్చినప్పట్నుండి చూస్తున్నాము. ఉత్త విసుగు, చిరాకు, సణుగుడు. బాబు పైన కూడా విరుచుకుపడుతుంటావు. మీ ఆయన పై కూడా విసుర్లు. పాపం ఆయన మేమున్నామనో ఏమో నిన్నేమీ అనలేకుండా మొహం చిన్నబుచ్చుకోవడం ఎన్నో సార్లు చూశాం. ఎందుకిలా చేస్తున్నావు ? నీకేం తక్కువయిందని ? అల్లుడుగారు మంచి మనిషి. బాబు పుట్టడానికి ముందు నువ్వు ఇండియాకు వచ్చినప్పుడు నిన్ను బాగా చూసుకుంటారని నువ్వేగా అన్నావు . మరిప్పుడేమిటి ఇలా ? మీ అత్తగారు వచ్చినప్పుడు ఏమైనా మాటలన్నారా ? డబ్బులకేమైనా కటకటగా ఉందా ? ఏమిటి నీ సమస్య ? మాతో కాస్త వివరంగానూ, ఓపన్ గానూ మాట్లాడితే పెద్దవారుగా మాకు తోచిన సలహా ఇవ్వగలం. నువ్విలాగే కంటిన్యూ చేశావనుకో మేము వెళ్ళిన తర్వాత కష్టపడతావ్ అంతే. మేమైనా ఇంకో రెణ్ణెల్లు ఉంటాం అంతేగా. చెప్పు. ఏం జరిగింది ? ఎందుకలా ఉన్నావు ? “ అని నిలదీసింది. ముకుందరావు కూడా “ అవునమ్మా ! మనస్సులో ఉన్నది మాకైనా చెప్తే బాగుంటుంది “ అంటూ వత్తాసు పలికారు.

అఖిల అప్పుడు తన మనస్సులోని మాటను చెప్పనారంభించింది.” ఏం లేదమ్మా ! చదువులో నేనెంత బ్రిలియంటునో నీకు తెలుసు కదా ! ఇంజనీరింగ్ లోనూ మంచి మార్కులు, కాంపస్ సెలెక్షన్ వచ్చింది కదా ! ఇక్కడికొచ్చాక కూడా నాకు మంచి ఉద్యోగమే దొరికింది. జీతం కూడా ఆయనకు సమానంగానే వచ్చేది. అంతలో ప్రెగ్నెంటునవడం, కాన్పు, బాబును చూసుకోవడం కోసం నేను ఆ ఉద్యోగాన్ని మానేయాల్సొచ్చింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు ? నా ఉనికే పోయినట్టుగా ఉంది. నీకు ముందే చెప్పాను చూడు. కాలనీలోని మనవాళ్ళందరూ తీసేసినట్టు చూస్తారు. వాళ్ళ మాటల్లోకి నన్ను రానివ్వరు. నాకైతే తల కొట్టేసినట్టుంటుంది. నాకే ఎందుకమ్మా ఈ పనిష్మెంటు ? పిల్లలు కావాలని ఇద్దరూ అనుకున్నాం కదా ? మరి తనకేమీ ఈ బాధలుండవా ? తనేమీ ఉద్యోగం వదలి పెట్టలేదే ? పైపెచ్చు పని ఎక్కువయిందని లేటుగా వస్తాడు. ఇంట్లో పనంతా చేసుకోవాలి, బాబును చూసుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి.  అంత ఇంజనియరింగ్ చదివి నేను మిగతా అందరి హౌస్ వైఫుల్లాగా అంట్లు తోముకోవాలా ? అంటే నా తెలివంతా ఈ పన్ల మధ్యే గడచిపోవాలా ? తనకేం బాధ్యతలు లేవా ? మళ్ళీ నేనెప్పుడు జాబ్ కెళ్ళేది ? వంశీ ఏమో మొన్న ఎవరి ఇంటికో వెళ్ళినప్పుడు వాళ్ళింట్లోని ఇద్దరు పిల్లలని చూపించి మనం కూడా బాబుకు ఒక కంపెనీ ఇవ్వాలి అఖిలా ఆంటూ నావైపు చూశాడు. నాకు ఒళ్ళు మండిపోయిందనుకో. అంటే ఇక నేనిప్పుడూ ఇంతేనా ? ఇప్పుడు చెప్పండి. నేను ఇలా ఫీలవుతోంది సమంజసమా కాదా ? నాలా ఉన్న ఒకిద్దరితో మాట్లాడాను. వాళ్ళు కూడా నాలానే ఏదో కోల్పోయినట్లే ఫీలవుతున్నారు తెలుసా ” అని చెప్పి వీళ్ళ వైపు చూసింది.
ముకుందరావు,జలజ ముఖ ముఖాలు చూసుకున్నారు. అఖిల వైపునుండి అయితే వాదన సరిగ్గానే అనిపించింది. కానీ అలాగని ఆమెని ఊరడించబోతే పెళ్ళికే మోసం వస్తుంది. చెయ్యకపోతేనేమో అఖిల ఇలాగే డిప్రెషన్ లోకి వెళ్తుందేమోనని భయం పట్టుకుంది. “ సరేనమ్మా ! మేమిద్దరం నీ సమస్యలను చర్చించుకుని రేపటికల్లా నీకు ఏంచేయాలో చెబుతాం. మీ అత్తగారు ఉన్నప్పుడు కూడా ఇలాగే చిరాకు పడ్డావా ? “ అని అనుమానంగా అడిగింది జలజ. “ ఛ ! లేదమ్మా ! అయినా అప్పుడు బాబు చిన్నవాడు. ఇంత అల్లరి చేసేవాడు కాదు. అత్తగారు వాడిని పట్టుకుంటే నేను హాయిగా రెండు గంటలు నిద్రపోయేదాన్ని. అదీగాక నాకు ఆపరేషనయ్యింది కదా. దాని నెప్పులే చాలా ఉండేవి. చాలా మటుకు మా ఆయన, అత్తగారే బాబును చూసుకునేవారు. అప్పుడు వంశీకి ఇంత పనుండేది కాదు. సాయంత్రం ఆరుకల్లా వచ్చేసేవాడు. ఈ మధ్యే బాగా బిజీ అయ్యాడు “ అంది అఖిల. “ పోన్లే గుడ్డిలో మెల్ల మేలు” అనుకుంటూ నిట్టూర్చింది జలజ. ఇంక మిగిలిన రోజుని, రోజూలానే చిరాకుల సణుగుళ్ళ మధ్యనే గడిపింది అఖిల. దాన్ని చూస్తూనే తాము కూడా గడిపారు దంపతులు. 
                                      ****************************

ఆ రోజు రాత్రి ముకుందరావు, జలజలు ఈ సమస్యల గురించి చర్చించుకున్నారు. సమస్యల రెండు కోణాలనూ పరిశీలించుకుని మరుసటి రోజుకు సిద్ధమయ్యారు. క్రితం రోజులాగే డైనింగ్ టేబల్ సిట్టింగ్ జరిగింది. అఖిల జవాబుకోసం ఎదురు చూస్తున్నట్టు ముఖ కవళికలే చెప్తున్నాయి.
జలజే మొదలుపెట్టింది. “ చూడమ్మా ! నీ సమస్యల్లోని సారాంశమంతా నీ కెరెయర్ పోయినందుకే అనిపిస్తోంది మాకు. నీకు కూడా ఇండియాలో మాదిరిగా ఉదయం నుండి సాయంత్రం దాకా బాబును చూసుకునే ఒక ఆయా దొరికి నువ్వు జాబ్ లో జాయినయి ఆఫీసునుండి ఇంటికి వస్తుంటే నీకు ఈ రకమైన డిప్రెషన్ వచ్చేది కాదు. అవునా ?” అంది. అందుకు అఖిల “ ఇక్కడ అలా దొరకరనేగా ప్రాబ్లెమ్ ? ఇక్కడ న్యానీలు దొరుకుతారు కానీ చాలా కాస్ట్లీ. “ అంది. జలజ అందుకుని “ అదే చెప్తోంది . ఇప్పుడు నువ్వు బాబుని స్కూలుకు ఎప్పుడు చేర్చవచ్చు ? “ అని అడిగింది. “ పద్దెనిమిది నెలల తరువాత డేకేర్ లో వేయవచ్చు. దానికి కూడా నెలకి వెయ్యి డాలర్లు కట్టాలి . అందుకే రెండో సంవత్సరం వేద్దామని అంటున్నాడు వంశీ. దాంతర్వాతైనా వాడిని దింపి రావడం, మళ్ళీ తీసుకురావడం అంతా నేనే చేయాలి. కాకపోతే లిమిటెడ్ అవర్స్ జాబ్ చూసుకోవచ్చు. కానీ అలాంటిది నా క్యాలిబర్ కి తగ్గ జాబ్ గా ఉండదు. జీతం కూడా తక్కువే. “ అంది అఖిల. మళ్ళీ తనే “ ఇవన్నీ సరేనమ్మా ! కానీ వంశీకి ఇందులో కన్సెషన్ ఎందుకు ? మగవాడనేనా ? ఇద్దరూ సమంగా బాధ్యతలను పంచుకోవాలి కదా ! అన్నీ నా పైనే రుద్దితే ఎలాగ ? “ అంది.
ఇప్పుడు దంపతులకు సమస్య పూర్తిగా అర్థమయింది. ఇది ఈ కాలం ఆడపిల్లలందరి మనస్సుల్లోనూ మెదులుతూన్న సమస్యే అని. సమాన హక్కుల కోసం పోరాడే మనస్థితి. తామెందులో తక్కువ అని అనుకునే భావన. కానీ ప్రకృతి సహజమైన కొన్ని నియమాలను సరిగా అర్థం చేసుకోకుండా పడుతున్న వ్యథ. దీనికి అఖిల ఒక్కతే కాదు. చాలామంది ఇండియాలో కూడా ఇలా బాధ పడుతున్నారు. తలిదండ్రులో ఇతర పెద్దలో వాళ్ళకు సరిగ్గా సర్ది చెప్పకపోతే కౌన్సెలింగ్ అంటూ డబ్బు ఖర్చుపెట్టుకుంటూ తమ కాపురంలోకి మరో వ్యక్తిని ఆహ్వానిస్తారు. కొన్ని సందర్భాలలో కౌన్సెలింగ్ చేసేవారు ఇలాంటి అమ్మాయిలను వలలో వేసుకోవడానికి ప్రయత్నించారని పేపర్లలో చదివారు. కాబట్టి ఈ సమస్యకు సరిగ్గా తాము పరిష్కారం చూపగలుగుతే అఖిల మామూలు మనిషవుతుంది అని ఇద్దరికీ అనిపించింది.
జలజ ముందుగా “ అలా ఎందుకు అనుకుంటావే ! ఆ అబ్బాయి కూడా కష్టపడుతున్నాడు కదా ! ఇంటికి వచ్చినప్పటి నుండి మళ్ళీ మరుసటి రోజు ఆఫీసుకు వెళ్ళేదాకా బాబును తనే చూసుకుంటాడు. నువ్వు రాత్రంతా అలసిపోయుంటావని నిన్ను ఎనిమిదింటిదాకా నిద్ర పోనిస్తాడు. ఆఫీసులో పని ఎక్కువయితే తనేం చేస్తాడే పాపం ! తనేం తిరుగుళ్ళు తిరగడు, తాగి తూలుతూ రాడు. “ అని వెనకేసుకుని వచ్చింది.
అఖిల మాట్లాడేలోగా ముకుందరావు అందుకుని ’ చూడమ్మా ! సంతానోత్పత్తికి, మనుకులం యొక్క కొనసాగింపుకు ప్రకృతి  ఆడ, మగ అని ఇద్దరిని సృష్టించి వాళ్ళకి కొన్నికొన్ని గుణాలను పెట్టింది. నేను దేవుడు ఇలా చేశాడనే అనేవాణ్ణి. కానీ మీ తరం వాళ్ళు దేవుడు చేశాడు అంటే ఆయన మగవాడు కాబట్టి పక్షపాతానికి మగవాడికే బాధ్యతలు లేని గుణాలను ఇచ్చాడు అని అంటారేమో అని ప్రకృతి అన్నాను.  మగవాడికి ధైర్యాన్నీ, శక్తినీ ఇస్తూ ఆడదానికి కోమలత, సహనం లాంటి గుణాలను ఇచ్చాడు.  నాగరికతలు ఏవీ ఇంకా పుట్టని సమయంలో, మగవాడు బయటికి వెళ్ళి వేటాడి ఆహారం తెచ్చేవాడు. ఆడది ఇంట్లో ఉంటూ, తన పిల్లల ఆలనా పాలనా చూసుకునేది. సహజంగా మగవాడికి దూకుడెక్కువ. చొచ్చుకుపోయే గుణం ఉంటుంది. కానీ, వాడు ఎంత ప్రయత్నించినా పిల్లల్ని కనలేడు. అది ఈ సృష్టిలో ఒక్క ఆడదానికే చెల్లింది. ఆ హక్కుతో పాటు ఆమెకు సంసార పక్షంగా ఉండడానికీ, ప్రేమతో పిల్లల్ని చూసుకునే గుణం కూడ ఇవ్వబడింది. అందుకే పిల్లల్లు తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతారు. తల్లి చూసుకున్నంత శ్రద్ధగా తండ్రి పిల్లల్ని చూసుకోలేడు. ఎందుకంటే వాడి లక్షణాలు అవి కావు. అందుకే నాగరికతలు విలసిల్లిన కొలదీ ఇదే ప్రాతిపదికగా ఆడ, మగ వారికి విధులను సమాజం విధించింది. అందుకే మన పురాణాలు ఆడదాని కర్తవ్యాలను నిర్దేశించాయి. అలాగే మగవాడికి కూడా. పన్లన్నీ మానేసి ఇంటి పట్టునే ఉంటూ, ఇంటి పనులు చేసే పురుషుణ్ణి మనం హర్షిస్తామా ? ఉద్యోగం పురుష లక్షణం అన్నారు అందుకే. మన భారత దేశంలోనూ ఇదే విధంగా కొన్ని శతాబ్దాల వరకూ ఇలాగే కొనసాగింది. మన దేశం ఇతరుల పాలన క్రిందికి వచ్చాక మన సమాజంలో మార్పులు వచ్చాయి. మనం పాశ్చాత్య పోకడలకు అలవాటు పడ్డాం. అక్కడ కూడా కొన్ని శతాబ్దాల క్రితం ఉన్న చరిత్రను చదివితే ఇదే రకమైన కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది. కానీ ఆడపిల్లలను వంటింటి కుందేలుగా చూస్తున్నారు, వారిని అణగద్రొక్కుతున్నారు అనే నినాదం వచ్చాక, మహిళా సంఘాలు, మహిళా దినాలు వాడుకలోకి వచ్చాక మనందరి దృక్పథం మారిపోయింది. ఆడపిల్లలు చదువులకు వెళ్ళారు. అక్కడక్కడా ఉద్యోగాలు చేశారు. కానీ, ఈ పాతికేళ్ళలో ఐటి రంగం విజృంభించి సమాజంలోని అందరికీ సరిపడా ఉద్యోగాలు కల్పించడంతో, ఆడా మగా అందరూ ఉద్యోగాలలోకి దూకారు. ఇద్దరూ కష్టపడసాగారు. అప్పుడు ఇంటి పనులు పూర్తి చేసుకోవడంలో వంతులు వేసుకోవాలసి వచ్చింది. ఆడవాళ్ళకు ఇలా లభించిన స్వాతంత్ర్యం వలన తాము ఎందుకు వంటింటి పనులు చేయాలనే అభిప్రాయం రాసాగింది. దీన్నుండి కలిగిన పర్యవసానం ఏమిటో తెలుసా ? ఆడవాళ్ళకి ఆడగుణాలు తగ్గాయి. అలాగే మగవాళ్ళకి మగ లక్షణాలు తగ్గాయి. అందుకే సహజంగా జరగవలసిన గర్భధారణ కష్టమయ్యి ఫర్టిలిటీ సెంటర్ల సహాయం తీసుకంటున్నారు. మగవాళ్ళలో కూడా మగతనం తగ్గిపోతోంది. నువ్వు సమాన బాధ్యతల కోసం ఆలోచించడానికి ముందు ఇవన్నీ కూడా ఆలోచించాలమ్మాయ్ ! “ అన్నాడు.
జలజ అందుకుని “ నాకు ఈయనంత తెలీదు కానీ, ఒక్క మాట చెప్పవే ! బాబు నీ దగ్గర ఏడవకుండా ఉంటాడా లేదా మీ ఆయన దగ్గిరా ? “ అఖిల వెంటనే “ ఆ ! నా దగ్గిరే నమ్మా. “ అంది. 
“అందుకే చెప్పేది ! మాతృత్వం అనేది ఒక వరమే పిచ్చీ ! ఈ బాబుకు పెళ్ళైన తర్వాత కూడా అమ్మను చూసుకున్నంతగా నాన్నను  చూసుకోడు. నాన్న అనే మనిషి ఎప్పుడూ బయటివాడుగానే ఉంటాడు. ఆయన పనంతా సంపాదించి తెచ్చి పడెయ్యడమే. ఆడదే ఒక కుటుంబాన్ని, ఒక ఇంటిని సరిదిద్దుతుంది. ఆడవాళ్ళు లేని ఇళ్ళు ఎంత చిందరవందరగా ఉంటాయో నువ్వు చూసే ఉంటావు. అందుకే నిదానంగా ఆలోచించి ఆ అబ్బాయిని విసిగించకుండా నీ కాపురాన్ని సరిదిద్దుకో. తనకు ఈ పని ఒత్తిడి కొన్ని రోజులుండొచ్చు. తరువాత మీకోసం సమయం కేటాయించనూ వచ్చు. ఇప్పుడేమైనా నువ్వు ఆయన మనస్సుని విరిచావనుకో. తరువాత  ఆ అబ్బాయి ఏ త్రాగుడుకో, ఏ జూదానికో  అలవాటు పడి ఇక ఇంటికి రావడమే కష్టమై పోతుంది. తరువాత నువ్వు ఎన్ని విధాల ప్రాధేయ పడినా ఫలితం ఉండదు. ఆ అలవాట్ల మత్తు అలాంటిది. ఇప్పుడు మీరు డబ్బుకు కటకటగా అయితే ఏం లేదు కదా “ అని అడిగింది. 
“ ఏం లేదమ్మా ! ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు. “ అంది అఖిల. “ అయితే ఇప్పుడప్పుడే నువ్వు నీ ఉద్యోగం గురించిన ఆలోచనలకు వెళ్ళక, బాబుకు కొంత వయస్సు వచ్చాక మళ్ళీ ప్రయత్నించు. మీకదేదో అవకాశం ఉంటుందట కదా. వర్క్ ఫ్రం హోం, అది ప్రయత్నించు. మీరిద్దరూ ఈ కాపురానికి రెండు కళ్ళు. మేమైనా మీ అత్తా మామలైనా ఎన్నో ఏళ్ళు ఉండము ఇలా సలహాలివ్వడానికి. అందుకే చెప్తున్నా. ఇప్పుడు నేను, మీ నాన్న చెప్పిన విషయాలు మనస్సులో పెట్టుకుని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. సరేనా “అంది జలజ. 
వీళ్ళిద్దరి మాటలు వింటూ దీర్ఘంగా ఆలోచిస్తున్న అఖిల “ సరేనమ్మా ! అలాగే ! అందుకే అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలంటారు. ఎంతైనా అనుభవం కదా మీది “ అన్నది. దంపతులిద్దరికీ కొండంత బరువు దించినట్టయింది. తమ అమెరికా ప్రయాణం ఒక సత్ఫలితాన్నిచ్చింది అని అనిపించింది.

 ***** 

No comments:

Post a Comment

Pages