యాదగిరీంద్ర శతకము - తిరువాయిపాటి వెంకటకవి - అచ్చంగా తెలుగు

యాదగిరీంద్ర శతకము - తిరువాయిపాటి వెంకటకవి

Share This
యాదగిరీంద్ర శతకము -  తిరువాయిపాటి వెంకటకవి
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం:
యాదగిరీంద్ర శతకకర్త తిరువాయిపాటి వెంకటకవి నిజాము రాష్త్రమునందలి నలగొండ మండలమునకు చెందిన కొలనుపాకలో కొంతకాలము నివసించినట్లు, ఇతను సాతాని వైష్ణవుడని చరిత్రకారుల నిర్ణయం. ఈకవి తండ్రి పరాంకుశుడు. ఈశతకాంతమున కవి తనగురించి ఈ విధంగా చెప్పికొనినాడు.

ఉ. శ్రీతిరువాయిపాటి కులశేఖరుఁడౌ మణవాళజియ్యరుం
డాతనిపుత్రుఁడౌ వరపరాంకుశ సూనుఁడ వేంకటాఖ్యుఁడన్
శ్రీతరుణీశ నీకథలఁ జేసి ధరాతలమందు భూజనుల్
జేతమునన్ బఠించునెడఁ జేకొన యాదగిరీంద్ర మ్రొక్కెదన్

ఈకవి "యాదగిరినృసింహ " అనే మకుటంతో ఒక కందపద్య శతకం కూడా చెప్పినట్లు తెలుస్తున్నది. కాని ఇది అముద్రితం. పై వివరాలుతప్ప ఈ కవి గురించిగానీ ఈతని ఇతర రచనలను గురించిగానీ ఏవివరాలూ తెలియటం లేదు.

శతక పరిచయం:

"యాదగిరీంద్ర మ్రొక్కెదన్" అనే మకుటంతో నూట ఎనిమిది చంపకోత్పలమాల వృత్తాలలో రచించిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. భాష సరళంగా ఉండి చదివేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

ఉ. మానము నేల ద్రౌపదికి మన్ననఁ గోకలఁ బెక్కులిచ్చితౌ
ధ్యానముచేయఁగాఁ గరికి తత్వపదంబగుమోక్ష మిచ్చితౌ
పూని దరిద్రవిప్రునకు భూరిపదార్థము లిచ్చినాదవ
ట్లే నను నేల భారమొ కడిందిగ యాదగిరింద్ర మ్రొక్కెదన్

ఈశతకంలో 51వ పద్యము నుండి 60వ పద్యము వరకు దశావతారవర్ణనము, 61వ పద్యమునుండి 84వ పద్యమువరకు రామచరితము, మరియు 85వ పద్యమునుండి  102వ పద్యం వరకు కృష్ణచరితము చెప్పినారు. ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ. నిన్నుం మదిం దలంచితిని నీరజలోచన నీమహత్వమున్
ఎన్నతరంబుగాదు నను నేమరకన్ దరిజేర్చుశౌరి యా
పన్నశరణ్య భక్తజనపాల సుశీల గుణాలవాల నిన్
సన్నుతిజేసితిన్ సుగుణసాగర యాదగిరీంద్ర మ్రొక్కెదన్

ఉ. కంటిని పాదపద్మములు కంటిని జంఘలు మధ్యదేశముం
గంటిని శంఖచక్రములఁ గంటిని నీ కనుదోయి కర్ణముల్
గంటిని నీదుపల్వరుసఁ గంటిని నీముఖతేజమున్ మదిన్
గంటి కిరీటమస్తకము గావవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్

చ. తిరుమలవేంకటేశుఁడవు ధీయుతకాంచిపురీనివాసుఁడున్
ధరణిని యాదవాద్రిపురధాముఁడవైతివి భద్రశైల సు
స్థిరరఘురాముదున్ మఱియు శ్రీపురుషోత్తమపౌరధాముఁడున్
నిరతము నీవెగానఁ గరుణింపుము యాదగిరీంద్ర మ్రొక్కెదన్

దశవతారముల పద్యాలలో కొన్ని చూద్దాము.

ఉ. భీకరమైనకూర్మమున బింకముతో వడికొండనెత్తి ల
క్ష్మీకరదేవసంఘముల క్షేమము గోరియు నాతిరూపమై
చేకొనియున్ సుధారసము సేవకులందరి కిచ్చినట్టి సు
స్లోకరమేశ దైత్య గణసూదన యాదగిరీంద్ర మ్రొక్కెదన్

ఉ. ఆకనకాక్షు నగ్రజునికై మును స్థంభమునందు బుట్టి యా
లోకము చూడఁగాఁ గడుపులోని నరంబులదీసి చంపితౌ
భీకరనారసింహ జగదీశ్వర పుణ్యపురాణమూర్తి సు
శ్లోకభవత్పదద్వయముఁ జూపవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్

రామచరిత భాగమునుండి కొన్ని పద్యాలు చూద్దాము

చ. జనకునియాజ్ఞఁ బుచ్చుకొని జానకి లక్ష్మణమూర్తి నీవు స
య్యన విపినంబుజేరి మునులంద ఱొసంగినవిందులన్ భుజిం
చిన  పిదపన్ ముదంబునను జిత్రకుటీరము జేరి యావలన్
దనుజువిరాధునిన్ దునుము ధన్యుఁడ యాదగిరీంద్ర మ్రొక్కెదన్

చ. అనిలజుఁ జేర బిల్చుకొని యంబుధిదాఁటియు లంక కేగి సీ
తను గని ముద్దుటుంగరము దత్తముజేసి మదీయవృత్తమున్
వినయము మీఱఁ దెల్పి కడువేగముగా నొగి నానవాలు తె
మ్మనిన మహానుభావపరమాత్ముఁడ యాదగిరీంద్ర మ్రొక్కెదన్

చ. కపటపురావణాసురుఁడు కార్ముకముల్ శరముల్ రథంబుపై
నపరిమితంబు జేర్చుకొని యద్భుతసైన్యము వెంతనంటి రా
నపు డతివేగవచ్చి నిశితాస్త్రము లేయఁగఁ జూచి వానిశీ
ర్షపటలినెల్ల నేలపయి రాల్చిన యాదగిరీంద్ర మ్రొక్కెదన్

కొన్ని కృష్ణ చరితములోని పద్యాలను చూద్దాము.

ఉ. అష్టమి రోహిణిదివసమందున దేవకిదేవిగర్భమం
దిష్టముతో జనించి కలుషేంగితపూతన సంహరించియున్
దుష్టుఁడు రాక్షసుండొకఁడు తూగియు బండివిధానఁ బైఁబడన్
కష్టుని వాని గూలిచినగణ్యుఁడ యాదగిరీంద్ర మ్రొక్కెదన్

ఉ. వారిజలోచనల్ యమునవారిని దీర్థము లాడుచుండఁగాఁ
గూరిమితోడఁ జేడియలకోకలు గైకొని చెట్టుమీదికిం
గోరిక నెక్కియున్ శరణు గోరంగ వారల గారవించుశృం
గారమనోజ్ఞ వేష మముఁ గావవె యాదగిరీంద్ర మ్రొక్కెదన్

ఉ. యాదవసుందరీమణుల  నందఱ గానసుధాప్తిఁదేల్చి యా
మోదము నొందఁజేసితివిమోదముమీఱగఁ గ్రీడఁదేల్చి నీ
గాదిలిసంద్రమందుమునుఁగన్ గరుణించితి విట్టి నీదయా
స్వాదనమెప్డు చూరఁగొనఁజాలుదు యాదగిరీంద్ర మ్రొక్కెదన్

చక్కని ఈశతకాన్ని మీరు చదవండి. మీ మిత్రులచేత చదివించండి

 ***

No comments:

Post a Comment

Pages