జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 28 - అచ్చంగా తెలుగు
 జర్నీ ఆఫ్ ఎ టీచర్ - 28
చెన్నూరి సుదర్శన్
(జరిగిన కధ: విశ్రాంత గణిత శాస్త్ర ఉపాధ్యాయుడైన సూర్య ప్రకాష్ వద్దకు వస్తాడు కాంచనగంగ కాలేజీ అధినేత కనకారావు. కాని, సూర్యప్రకాష్ తాను పేద పిల్లలకు చెప్పే ట్యూషన్లే తనకు చాలునని, అందుకు నిరాకరించి, తన  గత జ్ఞాపకాల్లోకి జారిపోతారు. సూర్యప్రకాష్ జూనియర్ లెక్చరర్ నుండి ప్రిన్సిపాల్‍గా పదవోన్నతి పొంది వేసవి సెలవుల్లో జాయినయ్యాడు. ఆ రోజున పెట్టిన వార్షిక స్టాఫ్ మీటింగ్ లో తను  మొదటిసారిగా జూనియర్ లెక్చరర్ పదవిలో చేరినప్పటి  అనుభవాలను వారితో  పంచుకుంటూ ఉంటాడు.)  
ఈ మధ్య కాలంలో ఏకాంబరానికి పోలీసు స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. నేను సునీతను ఫిర్యాదును వెనక్కి తీసు కొమ్మని ప్రాధేయ పడ్డాను.. నా మాటకు గౌరవమిచ్చింది. ఏకాంబరం బయటికి వచ్చాడు. నాలుగు రోజులు సెలవులు కలిసి రావడం తాత్కాలికంగా కాలేజీ ఉపశమనం పొందింది.
తిరిగి కాలేజీ తెరచిన రోజు బోర్డు నుండి డిప్యూటీ డైరక్టర్ ఎంక్వైరీ ఆఫీసర్‍గా వచ్చాడు.
ఏకాంబరం, సునీతలు ఆశ్చర్యపోయారు. అందరి స్టేట్‍మెంట్స్  తానే  స్వయంగా రికార్డు చేసుకున్నాడు.
ఏకాంబరం తన స్టేట్‍మెంటులో సునీతను తన సిస్టర్ లాంటిదని పేర్కొన్నాడు. అలాంటి నీచుణ్ణి ఇంతవరకు చూడలేదని స్టాఫంతా అనుకున్నాం.
వారం రోజుల్లో సునీతకు ఉత్తరానికి.. ఏకాంబరానికి దక్షణానికి గల సుదీర్ఘ కాలేజీలకు బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.
యాదగిరి వచ్చి నాపై   ప్రశంసల ఝల్లు  కురిపించాడు
***
కాలేజీ ప్రశాంతతకు ప్రతీకగా నిలిచింది.
కాలేజీ విద్యాసంవత్సర ముగింపు సందర్భంగా యాదగిరి మీటింగ్ పెట్టాడు. ఇక రాబోయే పరీక్షలు ఆతరువాత కాలేజీ అడ్మిషన్లపైదృష్టి కేంద్రీకరించాలని స్టాఫ్ తో చర్చించాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. కాలేజీ సమయం పూర్తి కావస్తోంది. అంతా వెళ్ళిపోయారు.
నేను కంప్యూటర్ గదికి వెళ్లి అన్నీ సర్ది తాళం వేసే పనిలో కొండయ్య సాయం తీసుకుంటున్నాను. 
ఇంతలో హీరోహోండా కాలేజీ ముందు ఆగిన శబ్దమయ్యింది. తాళంకప్ప చేతిలోపట్టుకున్న కొండయ్య టేబుల్‍పై పెట్టి బయటకు పరుగెత్తాడు. నేను కుర్చీలో కూర్చుండిపోయిన నా దృష్టి  కొండయ్యననుసరిస్తోంది.
హోండాపై వచ్చిన  జంట కొండయ్యను ఎవరో ఉన్నారా అన్నట్లు అడుగుతున్నారు.. కొండయ్య సమాధానం
వారిని తృప్తిపర్చినట్లు అతడి వెనకాలే రాసాగారు. నా కోసమే  వస్తున్నట్లు తోచింది. పరీక్షగా చూడసాగాను.
“సార్.. మీకోసమే వచ్చారు” అంటున్న కొండయ్య మాటల్లో “నమస్కారం సార్” అంటూ వచ్చిన జంట మాటలు మిళితమయ్యాయి.
నాకింకా స్పురణకు రావడం లేదు..
“సార్..నేను ప్రభాకర్.. “ అంటూండగా.. వెంటనే గుర్తుకు వచ్చింది.
“యస్..మునిపల్లి చెట్టు కింది ప్రేమపక్షులు.. అనిత కదూ.. నీపేరు..” అంటూ ఆమెను చూసుకుంటూ స్వాగతిస్తూ చిరునవ్వు నవ్వాను.
“ అనితా నువ్వు చీరలో అచ్చంగా తెలుగింటి ఆడపడుచులా ఉన్నావు.. గుర్తుబట్టలేదు.. సారీ..” అంటూ ఇద్దరినీ కూర్చోమంటూ కుర్చీలు చూపించాను.
“ఫరవాలేదు సార్.. “ అంటూ ప్రభాకర్ మొదట మొహమాటపడుతూ.. నా చొరవతో ఇద్దరూ కూర్చున్నారు.
“సార్.. ఆనాటి చెట్టుకింది ప్రేమ పక్షులకు రెక్కలు లేవు. ఈనాడు రెక్కలొచ్చిన పక్షులం.. చెట్టుపైకి ఎగురబోతున్నాం” అంటూ చమత్కారంగా చెప్పడం మొదలుపెట్టాడు ప్రభాకర్. ఎంటీ.. ఇంకా ఇంత ఆలస్యంగానా..అన్నట్లు వారిరువురిని చూడసాగాను.
అనిత తన హ్యాండు బ్యాగులో నుండి తీసిచ్చింది.  శుభలేఖలో వివరాలు  చూడసాగాను. 
“సార్.. మీరు ఆరోజు మా భవిష్యత్తు జాతకం చెప్పారు. అనితా నేను బాగా ఆలోచించాం.. మా కాళ్ళపై మేము నిలబడే శక్తి రానంతవరకు ఒకరికొకరం కలుసుకోవద్దనుకున్నాం. మాలో ఉన్నది  కేవలం ఆవేశపూరిత ఆకర్షణ కాదు.. చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే ప్రేమ అని రుజువు చేయాలని ప్రతినబూనాం. దానికి తగ్గ కృషి చేసి సాధించాం...” అంటూ ఎంతో ధీమాగా చెప్పసాగాడు ప్రభాకర్. “అనిత ఫార్మసీ పూర్తి చేసి రెడ్డి ల్యాబ్ లో పనిచేస్తోంది సార్..నేను లా పూర్తి చేసి ఒక సీనియర్ లాయర్ వద్ద ప్రాక్టీసు చేస్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాం..”
నేను శుభలేఖ చదవడం పూర్తి చేసి “ప్రభాకర్.. నా మాటకు గౌరవమిచ్చి మీ భవిష్యత్తుకు బంగారు
బాటలు వేసుకోవడం నాకు చాలా సంతోషంగా వుంది” అంటూ ఇరువురిని అభినందించాను.
 “సార్.. ఒక లెక్చరర్‍గా  కేవలం విద్యార్థులకు చదువు చెప్పడమే గాకుండా .. వారి జీవితాలు తీర్చిదిద్దడంలో మీరు సలహాలిస్తుంటారు.. మా అదృష్టం కొద్దీ ఆవేళ మీ కంటపడ్డాం” అంటూ నవ్వింది. ఆనవ్వులో శృతి కలుపుతూ.. “చూడమ్మా అనితా.. ఎందరికో సలహాలిస్తూంటాం.. అందరూ పాటిస్తారా.. మీలాంటి వారు నా శిష్యులని చెప్పుకోవడం నాకు గర్వంగా ఉంది.. తప్పకుండా మీ పెళ్ళికి వస్తాను..” అంటూ ప్రభాకర్, అనితల చేయి కలిపాను.     
కొండయ్యకు మా మాటలన్నీ దాదాపుగా అర్థమయ్యాయన్నట్లు.. ముసి ముసి నవ్వులు నవ్వతూ తాళం కప్పకు పని చెప్పాడు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment

Pages