అత్యాశ
(డా:సి.హెచ్.ప్రతాప్)
పూర్వం ఒక పల్లెటూరిలో భీమయ్య అనే మధ్యతరగతి రైతు ఉండేవాడు. అతనికి పొలం పనులు చేసుకోవడానికి సరిపడా భూమి, కష్టపడడానికి శక్తి, పండించుకున్న పంటతో సంతృప్తిగా జీవించడానికి ఒక చిన్న కుటుంబం ఉండేది. అయితే, భీమయ్యకు ఒకే ఒక బలహీనత – డబ్బుపై అంతులేని ఆశ. తనకున్న దానితో తృప్తి పడకుండా, ఇతరుల ధనం చూసి లోలోపల అసూయ పడేవాడు.
"మానవులకు ఎంత వున్నా తృప్తి తీరనిది డబ్బే," అని అతడు తరచుగా అనుకునేవాడు. "ఈ కొద్దిపాటి పొలం కాదు, నాకు ఇంకా చాలా కావాలి. నేను ఈ గ్రామంలోనే అత్యంత ధనవంతుడిని కావాలి."
ఒక రోజు, భీమయ్య పొలంలో పని చేస్తుండగా, భూమిలో ఏదో గట్టిగా తగిలిన శబ్దం వచ్చింది. అతడు తవ్వి చూడగా, అందులో నిండా బంగారు నాణేలు ఉన్న ఒక పురాతన కుండ దొరికింది. అతడి ఆనందానికి అవధుల్లేవు. ఇది దైవదత్తంగా లభించిన అదృష్టంగా భావించి, ఆ ధనాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకున్నాడు.
ఆ ధనంతో భీమయ్య వెంటనే పక్క పొలాలను, ఊళ్లోని ఖరీదైన ఇళ్లను కొనేశాడు. తక్కువ కాలంలోనే ఊళ్లోకెల్లా అతి పెద్ద ధనవంతుడయ్యాడు. అందరూ అతడి వైభవాన్ని చూసి , రాత్రికి రాత్రి భీమయ్య ఇంత పెద్ద ధనవంతుడు ఎలా కాగలిగాడా అని అందరూ ఆశ్చర్యపోయారు.
డబ్బు పెరిగే కొద్దీ భీమయ్య ఆశ కూడా పెరిగింది. చిన్నపాటి ఆశ అత్యాశగా మారింది. అతడు అధిక వడ్డీ రేట్లకు గ్రామస్తులకు అప్పులు ఇవ్వడం ప్రారంభించాడు. అంతేకాక, అకౌంట్‌లలో, లెక్కల్లో తప్పులు లెక్కించి పేదవారిని మోసం చేసేవాడు. గడువులోగా అప్పు తీర్చలేని వారి తాకట్టు బంగారం మరియు విలువైన వస్తువులను ఏ మాత్రం దయ లేకుండా స్వాహా చేసేవాడు. తన అపారమైన సంపదను కాపాడుకోవడానికి, దాన్ని మరింత పెంచడానికి అతడు పగలు, రాత్రి కష్టపడసాగాడు. తన పొరుగువారిని మోసం చేసి వారి భూములు లాక్కోవడం, అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. చివరకు భీమయ్య ఈ ఊరికి దాపురించిన ఒక కర్కోటకుడిగా అందరూ అతడిని భావించడం మొదలెట్టారు.
ఒక సమయంలో, భీమయ్య భార్య, పిల్లలు కొద్ది రోజుల పాటు పుట్టింటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, భీమయ్య తన సంపదను లెక్కించుకోవడానికి, దానిని రహస్య గదిలో భద్రంగా దాచడానికి ఇదే మంచి సమయంగా భావించాడు.
ఒక రోజు, భీమయ్య తన సంపదను లెక్కించుకుంటూ, ఆశతో కళ్ళు బైర్లు కమ్మి, తాకట్టుగా ఉంచుకున్న బంగారాన్ని కూడా తన పెట్టెలో దాచడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో, ఊళ్లోకి దొంగల ముఠా ప్రవేశించిందనే వార్త వినిపించింది. ఈ ముఠా పొరుగు గ్రామాలలో అనేక దొంగతనాలు చేసి, ధనవంతులనే లక్ష్యంగా చేసుకుని, మనుషులను చంపడానికి కూడా వెనకాడని ఒక భయంకరైఅన్ కర్కోటక ముఠా. వారిని పట్టుకోవడానికి ఆ దేసపు రాజు ఎన్ని పధకాలు వేసినా అవి సఫలం కాలేదు. మెరుపూలా వచ్చి, భీభత్సం సృష్టించి, సొమ్ము, నగలు దోచుకొని, అంతే మెరుపు వేగంతో మాయమైపోయేవారు.. గ్రామ పెద్దలకు, అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఇప్పటివరకు భద్రతా బలగాలు ఈ ముఠాను పట్టుకోవడంలో సఫలం కాలేదు.
తానూ అత్యంత ధనవంతుడిని కావడం వల్ల, తన సంపదను దొంగల నుంచి కాపాడుకోవాలనే భయం, తాను చేసిన అప్పుల మోసాలు, తాకట్టు బంగారం దోచుకున్న అపరాధభావం అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తన కష్టాన్ని, నిద్రను కోల్పోయి, అప్పటికే బలహీనపడి ఉన్న భీమయ్య, ఆ క్షణంలో తన సంపద అంతటినీ ఇంకొక సురక్షితమైన రహస్య గదిలోకి తరలించాలని ఆత్రపడ్డాడు. ఆ అత్యాశ మరియు ప్రాణ భయం కలిగించిన తీవ్ర ఒత్తిడితో, ఒంటరిగా ఆ బరువైన పెట్టెలను మోయడానికి ప్రయత్నిస్తూ, ఊపిరి ఆడక ధనరాశి మధ్యలోనే కుప్పకూలిపోయాడు.జ్షణాలలో అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
కొద్ది రోజుల తర్వాత, భీమయ్య భార్య, పిల్లలు పుట్టింటి నుండి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లో భీమయ్య ఎంతకీ కనిపించకపోయేసరికి, వారు ఆందోళన చెందారు. చివరికి, ధనం దాచిన రహస్య గదిలో ధనరాశి మధ్య భీమయ్య నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాన్ని చూసి వారు దుఃఖంలో మునిగిపోయారు. అతడు సంపాదించిన అపారమైన సంపద అంతా అలాగే ఉండిపోయింది, కానీ ఆ సంపదను అనుభవించేందుకు అతడు లేడు.
ఆశకు హద్దుండాలి. అత్యాశ అనర్ధదాయకం. మనిషి జీవితం ధనంపైనే ఆధారపడి ఉన్నట్లు అనిపించినా, నిజానికి మన జీవన నాణ్యతను నిర్ణయించేది మన మనసు స్థితి. ఎంత డబ్బు ఉన్నా, దానిని సంతోషంగా అనుభవించాలంటే ఆరోగ్యంతో పాటు తృప్తి అనే రెండూ అవసరం. ఆరోగ్యం లేకపోతే సంపదకు విలువ లేదు; తృప్తి లేకపోతే ఆ సంపదను ఆస్వాదించే మనసు ఉండదు.
ధనం కేవలం అవసరాల కోసం మాత్రమే — వినియోగం కోసం, సేవ కోసం, కార్యసాధన కోసం. అది సంతోషాన్ని కొనుక్కోవడానికి కాదు, ఎందుకంటే సంతోషం లోపలి అనుభవం, డబ్బు బయటిది. అత్యాశ అంటే — మనకు అవసరమైనదానికంటే ఎక్కువ కోరుకోవడం, మనకున్నదానిని తగ్గించి చూడడం, ఇతరులదాన్ని చూసి అసూయపడటం.
ఇది మనసుని లోలోపల శాంతి, ఆనందం, సామరస్యం లాంటి విలువల నుండి దూరం చేస్తుంది.
తృప్తి ఉన్న మనసు చిన్నదైన జీవనాన్ని కూడా పెద్ద సంతోషంగా మార్చగలదు. అత్యాశ ఉన్న మనసు పెద్ద సంపదను కూడా పేదరికంలా అనిపించగలదు.
అందుకే గ్రంథాలు సంతోషమే నిజమైన సంపద. అని చెబుతున్నాయి. జీవితంలో సంపాదించవలసిన అసలు ధనం —
ప్రసన్నమైన మనసు, ఆరోగ్యమైన శరీరం, ప్రేమను ఇచ్చే హృదయం.
ధనం → జీవనానికి ఆధారం , సంతోషం → జీవనానికి అర్థం
ఆధారం లేకపోతే జీవితం నిలవదు,అర్థం లేకపోతే జీవితం నిలిచిపోయి కూడా వృథా అవుతుంది.
***




No comments:
Post a Comment