అమ్మ అమ్మే - అచ్చంగా తెలుగు

 అమ్మ అమ్మే

                                                                    పి.యస్.యమ్. లక్ష్మి




చిన్నారి వాన్యకి ఆరేళ్ళు.  అన్నీ తెలుసుకోవాలనే ఆరాటం.  దానితో ఆలోచనలు ఎక్కువ.  తన సందేహాలన్నింటికీ సమాధానాలు చెప్పేదాకా తల్లి తండ్రులను వేధిస్తూనే వుంటుంది.  అమ్మా, నాన్నలిద్దరూ ప్రైవేటు కంపెనీ ఉద్యోగస్తులు.  పైగా అవి విదేశ కంపెనీలు.  అంటే వాళ్ళిద్దరికీ పగలు ఆఫీసులోనే కాకుండా రాత్రిళ్ళు ఇంటికొచ్చిన తర్వాత కూడా 11 గంటలదాకా మీటింగులంటూ కంప్యూటర్ తో బిజీగా వుంటారు.  దానితో వాన్యకి ఎక్కువ సమయం వెచ్చించలేరు.

 

తాము ఇంకో సంతానం వద్దనుకున్నారు ప్రస్తుత కాల పరిస్ధితులనుబట్టి.  ఈ కాలంలో చాలామందికి ఇవే సమస్యలు అవటంతో చాలామంది ఒక సంతానానికే పరిమితమయ్యారు.  దానివల్ల కనబడుతున్న ప్రధమ సమస్య పిల్లలకి ఆడుకునేందుకు వాళ్ళ వయసు పిల్లల తోడు వుండటం లేదు.  స్నేహితులు లేక వున్న ఒక్క సంతానం తోచక అల్లరి చేస్తుంటే, తమ ఆఫీసు మీటింగులు సవ్యంగా సాగాలని పిల్లలకి టేబ్ లు కొనిచ్చేస్తున్నారు అంతా.  అంటే కారణమేదయితేనేమి పిల్లలకి టేబ్ లు, ఫోన్ లు పెద్దలే అలవాటు చేస్తున్నారు. 

 

వాన్యకి టేబ్ కూడా విసుగు పుట్టింది.  కొద్ది రోజులనుంచీ ఇంటి చుట్టూ తిరుగుతున్న తెల్ల పిల్లి మీద దృష్టి పడింది.  పిల్లి చర్మమంతా తెల్లగా అక్కడక్కడా తేనె రంగు మచ్చలతో చాలా బాగుంది.  ఏదంటే అది తెచ్చిచ్చే అమ్మా నాన్నలున్నారు కదా.  పిల్లి కోసం పేచీ మొదలయింది.  ఇంట్లో ఎవరం వుండం కదమ్మా, దానికి ఆకలేస్తే బువ్వెవరు పెడతారు అని వాన్యని సమాధాన పరచబోయారు. తమకుండే కొంచెం సమయంలో పిల్లి బాగోగులు కూడా ఎక్కడ చూస్తామనే సంశయంతో.  వాన్య వినలేదు.  పొద్దున్నే తనతోబాటే టిఫెన్ పెట్టి, మళ్ళీ లంచ్ బాక్స్ అక్కడ పెడితే అదే తింటుందిలే, నేను తిన్నట్లు అన్నది.

 

వాన్యకి తోడు కోసమన్నా పిల్లిని తీసుకు వద్దామని సమాధాన పడ్డారు తల్లి దండ్రులు.  ఫలితం ఇంట్లో వాన్య కోరుకున్నట్లే కొన్న తేనె మచ్చల తెల్ల పిల్లి.  ఆ పిల్లి కూడా వాన్య అంత అల్లరిది.  రెండు రోజుల్లోనే వాన్యకి మాలిమి అయింది. వాన్య దానికి రాణి అని పేరు పెట్టింది.  తననా ఇంట్లో అంతా రాజ కుమారి అంటూ ముద్దు చేస్తారు.  అందుకేనేమో ఆ పేరు. కొన్నాళ్ళయ్యేసరికి రాణి ఆ ఇంటి అలవాట్లన్నీ పసి కట్టేసింది. వాన్య ఇంట్లో వున్నంతవరకు తన చుట్టూ తిరుగుతూ, తనతో ఆడుతూ బుధ్ధిగా వుండేది.  వాన్య స్కూల్ కి వెళ్ళి, అమ్మా నాన్నా ఆఫీసులకి వెళ్ళగానే విజృంభించేది.  హడావిడిలో భోజనాల బల్ల దగ్గర వదిలేసి వెళ్ళిన పాలు పెరుగు తాగినన్ని తాగి, కింద ఒలక పోసి చక్కగా ఆడుకునేది.  కర్టెన్లతో ఆడుకుంటున్నాననుకుని చించేసేది.  మంచాల మీద ఎక్కి తొక్కి పాడు చేసేది.  ఆ అల్లరి భరించలేక అమ్మా, నాన్నా, వాన్య ఏడిస్తే ఏడ్చిందిలే, ఇంకో విధంగా మరిపిద్దాము, రాణీని తీసుకెళ్ళి కొన్న చోట ఇచ్చేద్దామనుకున్నారు.   కానీ వాన్య గోల భరించలేక ఆగిపోయారు.

 

కొన్నాళ్ళు గడిచాయి.  రాణీకి ఇంకో నాలుగు బుల్లి పిల్లులు పుట్టాయి.  అందులో ఒకటి తెల్లది, ఒకటి బూడిద రంగు ఇంకో రెండు రంగు రంగుల మచ్చలున్నవి వున్నాయి.  ఏమయినా ఆ పిల్లులన్నీ వాన్యకి తెగ నచ్చేశాయి.  కానీ రాణీ మాత్రం వాన్యని కూడా తన పిల్లలని తాకనివ్వలేదు.  దగ్గరకొస్తే అరిచేది.  వాన్యకి వాటితో ఆడుకోవాలని వున్నా, అమ్మా, నాన్నా సూచనల ప్రకారం, రాణీ గోలతోనూ వాటికి దూరంగానే వుండి చూస్తోంది.

 

ఆ రోజు సాయంత్రం అమ్మా, నాన్నా కంప్యూటర్ ల ముందు వున్నారు.  వాన్య హోమ్ వర్క్ చేసుకుంటోంది.  వున్నట్లుండి రాణీ ఆపకుండా అరవసాగింది.  ఒక నిముషం తాత్సారం చేసినా, ఎప్పుడూ అలా అరవదు, ఏమయిందోనని ముగ్గురూ పరిగెత్తారు.  ఎలా జరిగిందో తెలియదు వంటింట్లో అగ్ని ప్రమాదం.  తెరలు, గట్టు మీద వున్న ప్లాస్టిక్ సామాను, ఇంకా కొన్ని వస్తువులు మండుతున్నాయి.  వంట సగంలోనే వుండటంతో గేస్ పూర్తిగా కట్టేయలేదు.  గేస్ పేలుతుందేమోనని జాగ్రత్త కోసం లైట్లు కట్టేయబోయిన వాన్యా వాళ్ళ అమ్మని వారించాడు నాన్న.  అలాంటి సమయంలో లైట్లు వెయ్యకూడదు, ఆర్ప కూడదు, ఆ సమయంలో స్విచ్ నుంచి వచ్చే రవ్వంత మంటకి కూడా గేస్ పేలచ్చు అని. 

 

వెనక ఇంట్లో వాళ్ళు పొగ, మంటలు రావటం చూసి ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేశారు.  నిముషాల్లో అది హాజరు.  వాళ్ళు ఇంట్లోవాళ్ళందరినీ బయటకి రమ్మన్నారు.  వాన్య అమ్మా, నాన్నా, వాన్యని తీసుకుని బయటకి వచ్చెయ్యబోయారు కానీ వాన్య గబుక్కున పరిగెత్తి రాణీని, చేతికి అందిన ఒక పిల్లి కూనని కూడా తీసుకు వచ్చింది.  ఫైర్ ఇంజన్ తో వచ్చిన వాళ్ళల్లో ఒకరు అక్కడ మూగిన జనాన్ని అదుపులో పెడుతుంటే, మిగతావారు లోపలకెళ్ళి మంటలనదుపు చెయ్యటానికి ప్రయత్నిస్తున్నారు.  అంత హడావిడిలోనూ వాన్య రాణీ కోసం చూసింది.  కనబడలేదు.  ఇంట్లోకి వెళ్ళి చూద్దామనుకుంది.  కానీ అమ్మా, నాన్నే కాదు వాకిలి దగ్గర అంకుల్ కూడా లోపలకి వెళ్ళనివ్వలేదు.  మరి రాణీ ఎక్కడికెళ్ళింది.  అది లేకపోతే తనెవరితో ఆడుకోవాలి.  అంతకు మించి ఆలోచించ లేక పోతోంది ఆ చిన్ని మనసు.

 

ఇంతలో రాణీ కనబడింది లోపలనుంచీ వస్తూ.  దాని నోట్లో ఒక పిల్లి కూన.  తన పక్కన వున్న పిల్లి కూన ఎలా వుందోనని చూసింది వాన్య.  ఆశ్చర్యం.  ఒక్క పిల్లికూన కాదు.  ఇంకో రెండు, అంటే మొత్తం మూడు వున్నాయి.  నాలుగోది రాణీ నోట్లో వుంది.

 

వాన్య సంతోషానికి అవధులు లేవు.   రాణీతోనే కాదు, దాని నాలుగు పిల్లలతో కూడా తనిప్పుడు ఆడుకోవచ్చు.  పిల్లులు అన్నీ క్షేమంగా వున్నందుకు సంతోషించిన వాన్య తల్లీ, తండ్రీ, జంతువుల్లో కూడా ఇంత తల్లి ప్రేమ వుంటుందా అని ఆశ్చర్యపోయారు.  మనుషులయినా, జంతువులయినా అమ్మ అమ్మే.
 
***

No comments:

Post a Comment

Pages