క్రొత్త నీరు - 11 - అచ్చంగా తెలుగు

 క్రొత్తనీరు .(పదకొండవ భాగం )

రచన :టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

 



మాళవిక పెళ్లి పనులు చేయటానికి వారం రోజుల ముందే సమీర ద్రాక్షారామం చేరుకుంది. అంతకంటే ముందే వసంత,నాగరాజులు తమ బంధువులను తీసుకొని అక్కడికి వచ్చి ఉన్నారు.మిత్ర,ప్రణయ్ అక్కడ ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సమీర తల్లిదండ్రులు, చెల్లెలు ఒకరోజు ముందు వచ్చి రామకృష్ణ ఇంట్లో దిగారు.

 నీరజ, వాసుదేవరావులు బంధువులతో ఒకరోజు ముందు వచ్చారు.

వాళ్లకు తోటలో బస. మిత్ర బంధువులు చాలామంది ప్రణయ్ వాళ్ళింట్లో దిగారు.

ఈ పెళ్ళిలో విశేషం ఏమిటంటే మగపెళ్లి వాళ్ళు ఆడపిల్ల వైపు వాళ్లకు పడీ, పడీ  మర్యాదలు చేయడం.

మాళవికకు మిత్రా వాళ్ళు పెట్టిన నగలు, పట్టుచీరలు చూసి తృప్తి పడింది నీరజ.

 పెళ్లి వైభవంగా జరిగింది.

అయితే ఈ పెళ్లిలో ప్రణయ్ ని సమీరను నిశితంగా పరిశీలించాడు రామకృష్ణ.

ఎవరూ అంత పట్టించుకోలేదు కానీ ప్రణయ్ సమీరా కలిసి ఛలోక్తులు వేసుకుంటూ తిరగటం చూస్తే వాళ్ల మధ్య సాన్నిహిత్యం ఉన్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది.

'సమీరతో మాట్లాడాలి!' అనుకున్నాడు రామకృష్ణ.

పెళ్లి అయ్యాక మాళవిక అత్తగారింటికి వెళ్ళింది.

వాళ్ళు అటునుంచి అటే హనీమూనుకు ప్లాన్ చేసుకున్నారు.

పద్మ,రఘురాం,సాధన హైదరాబాద్ చేరుకున్నారు.

సర్దాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ, ప్రణయ్ కి హెల్పుగా ద్రాక్షారామంలోనే ఉండిపోయింది సమీర.

 ఆ రాత్రి పెళ్లి ఖర్చుకు అయిన లెక్కలు చూసుకొంటోంది సమీర.

రామకృష్ణ సమీర దగ్గరికి వచ్చాడు.


"నిన్నొక విషయం అడగనా బంగారూ!"


"అడుగు మామయ్యా!"


"నీకు ప్రణయ్ నచ్చాడా?"


" మావయ్యా!..... "


"లేదంటే చెప్పు! పెళ్లిలో చూస్తే నాకు అలా అనిపించింది!"


 తలవంచుకొంది సమీర.


"ఈ వారం రోజులుగా వాడి గురించి నేను పూర్తిగా కనుక్కుంటున్నాను!... బాగానే చేస్తున్నాడు..అయితే కాయకష్టం ఎక్కువ...సున్నితమైన ఉద్యోగం కాదు!.. ఆదాయం నిలకడగా వస్తుందని గ్యారెంటీ లేదు!.."


" నాకు కూడా వస్తుంది కదా మామయ్యా!..కిచెనులో ప్రస్తుతం లాభలే వస్తున్నాయి.అవి కాక మిత్రతో వెడ్డింగ్ ఈవెంట్సులో భాగస్వామ్యం కూడా ఉంది!.. "


" నీకు ధైర్యం ఉంటే చాలదు తల్లీ! రేపొద్దున మళ్లీ పశ్చాత్తాపపడి,నా ఖర్మ కొద్దీ చేసుకున్నాను!అంటూ అసంతృప్తి పడితే పెద్దవాళ్ళం ఏమీ చేయలేము! అడుగు వేసే ముందే ఆలోచించుకోవాలి!"

అనునయంగా చెప్పాడు రామకృష్ణ.


"ప్రణయ్ మీద నాకు నమ్మకం ఉంది మామయ్యా!"స్థిరంగా చెప్పింది సమీర.


" మా అక్కయ్య, బావగారు మాత్రం చాలా నిరాశ పడతారు! పిల్లలు మొండికేస్తే పెద్ద వాళ్ళం ప్రేమకొద్దీ ఒప్పుకుంటాము! మీ భద్రతనే మేము కోరుకుంటాము! పెద్ద వాళ్లం కాబట్టి మాకు ఆమాత్రం ఆరాటం ఉండటం సహజం!"అంటూ సమీర తలని నిమిరాడు రామకృష్ణ.


సమీర కంటే  ముందు సమీర ప్రేమ  సమాచారం పద్మకూ, రఘురాముకు  చేరింది.

 'సమీర అభిప్రాయం దృఢంగా ఉంద'ని చెప్పాడు రామకృష్ణ.


ఆ రోజు రాత్రి భర్త దగ్గరకు వచ్చింది సరళ.


"నాకు ఒక విషయం అర్థం కావటం లేదండీ!"


"ఏమిటీ!"అడిగాడు రామకృష్ణ.


"సమీరకు మంచి మంచి సంబంధాలు చూశాము కదా!అవన్నీ వద్దని పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకునే ప్రణయ్ ని చేసుకుంటాననటం వింతగా లేదూ?"


"ఒక రకంగా చూస్తే ఇప్పటి పిల్లలు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు మన పెళ్లిళ్లు ఎలా జరిగాయి? కుటుంబం చూసి, పెద్దవాళ్ళ స్థితిగతులు చూసి ఫలానా వాళ్ళబ్బాయి అని చేసేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలయినా, ఉద్యోగం ఏదైనా పెళ్లి రెండు కుటుంబాల మధ్య జరిగే పవిత్రమైన వేడుక. చాలా వరకు పరువుకోసం పాకులాట ఉండేదప్పుడు. కాలం మారింది!చిన్న కుటుంబాలు.. ఆడపిల్లల పెద్దచదువులు, వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యం.. ప్రపంచీకరణ!వీటి ప్రభావం వివాహ వ్యవస్థమీద పడింది!ఇప్పుడు అంతటా అభద్రత!యుద్ధభయం!ఉద్యోగాలు లేకపోవటం! యువత ఇంజనీరింగ్, డాక్టర్ ప్రొఫెషన్లు కాకుండా స్వయం ఉపాధి గురించి ఆలోచించటం!ఇప్పుడు ఇలా ఉందనుకోవాలి!జీవులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాటి జీవన విధానాన్ని మార్చుకుంటాయి!అలాగే మనుషులు కూడా!నదుల్లోకి కొత్తనీరు వస్తే పాతనీరు ఎలా కొట్టుకుపోతుందో ఇదీ అంతే!ఏమైనా ప్రవాహం మాత్రం ఆగదు!"


భర్త మాటలు వింటూ" నిజమే!రేపు మన పిల్లలు ఎలా వుంటారో!" అంది సరళ.


"ఎలా ఉన్నా బాగానే ఉంటారని ఆశిద్దాం!"అన్నాడు రామకృష్ణ.

***

కిచెన్ నుంచి ఇంటికి వచ్చింది సమీర.

 రాత్రి భోజనాలయ్యాక కూతురు గదిలోకి వచ్చింది పద్మ. 

తల్లి తనతో  ప్రణయ్ విషయం మాట్లాడుతోందని ఊహించింది సమీర.

పక్క మీద కూర్చుంది పద్మ.


" నా చిన్నప్పటి నుండి నేను గమనించిన విషయాలు నీకు చెప్తాను! నేను సరస్వతి ఒకే క్లాసులో ఉండేవాళ్ళం. అది నాకంటే ఆరు నెలలు చిన్నది. వాళ్ళ నాన్న వాళ్ళు కొంచెం పేదవాళ్లు. ఆయనకు పెద్ద సంసారం.. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. అందులో మూడోది  సరస్వతి.ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళకి వాళ్ళ నాన్న అరిగిపోయాడు. వరప్రసాదరావు వాళ్లది వ్యవసాయం. వాళ్ళది కూడా పెద్ద కుటుంబమే!.. అయితే ఆస్తులు ఉన్నాయి.. పిల్ల సుఖపడుతుందని సరస్వతిని ఇచ్చి చేశారు.

ప్రసాదరావుకు ఇద్దరు అన్నలు,ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు.ఇద్దరు అన్నలకు రాజమండ్రిలో ఉద్యోగాలు.తమ్ముడు డాక్టర్.

వ్యవసాయం అంతా  ప్రసాదరావే చూసుకునేవాడు.అంత పెద్ద కుటుంబంలో వాళ్ళ అత్తగారి పక్కనే తిరుగుతూ ఇరవై నాలుగు గంటలూ చాకిరికి అంకితం అయిపోయింది సరస్వతి. దాని ఎముకలు అరిగిపోయాయి.

 నేను బిఏ చదివి, ఒక రెండేళ్లు ఉద్యోగం చేశాక మీ నాన్న సంబంధం వచ్చింది.

 అప్పటికే సరస్వతి ముసలి దానిలా అయిపోయింది. ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయం చేసి కుటుంబం నెట్టుకొస్తుంటే వాళ్ళ నాన్న చనిపోయాక అందరూ ఆస్తి పంపకాలు చేసుకున్నారు.ఆస్తి పంపకాల్లో వాళ్ళ వాటా తీసికొని అన్నదమ్ములూ,అక్క చెల్లెళ్లూ వాళ్ల పాటికి వాళ్లు వెళ్లిపోయారు . ప్రసాదరావుకు   పది ఎకరాలు మిగిలింది!....ఆ కొంప చూశావా? వాన వస్తే ఇల్లంతా కారుతుంది!.. వాళ్ళు అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తే ప్రణయ్ వెనక్కు వచ్చాడు... తమ్ముడు డాక్టర్!.. ఇప్పుడు రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేస్తూ, బాధ్యతలు మోసి, మంచంలో ఉన్న ముసలివాళ్లకు చేసి, చేసి అరిగిపోతే వీళ్లకు దక్కేదేమిటి? ఆ ఉన్న ఆస్తిలో  ఆ రెండో వాడు చక్కగా భాగం తీసికొని సిటీకి ఎగిరిపోతాడు. రేప్పొద్దున సరస్వతికి పట్టిన గతే నీకు పడుతుంది!... నా కంటే చిన్నది కదా!ఆ ముగ్గుబుట్టలా ఆ తల చూడు!అడుగుతీసి అడుగు వెయ్యటం కష్టం!.. ప్రసాదరావుకు పిచ్చికోపం!.. ఎక్కడెక్కడి విసుగూ, చికాకూ పెళ్ళాం మీద చూపించి హడలగొడుతూ ఉంటాడు!.. వాళ్ళ ఆడపడుచులు, తోడి కోడళ్ళు  పట్టుచీరలు కట్టుకొని, నగలు పెట్టుకొని తిప్పుకుంటూ తిరుగుతుంటే ఇది మాత్రం పిచ్చిదానిలా  వాళ్లకు అగ్గగ్గలాడుతూ గుండిగలు, గుండిగలు వండిపెడుతూ ఉండేది!... నేను చెప్పింది అర్థం అవుతుందా!.... మళ్ళీ చరిత్ర పునరావృతం!... "


పద్మకు కళ్ళనీళ్లు జలజలా కారుతున్నాయి. సమీర జీవితం గురించి దిగులు, భయం దుఃఖం రూపంలో బయటికి వచ్చింది.

తల్లిని ఎలా కన్విన్సు చెయ్యాలో తెలియలేదు సమీరకు.

గదిలోకి వచ్చాడు రఘురామ్.

భార్య ప్రక్కన కూర్చున్నాడు.


"నాన్నా!.. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా!ఆలోచించండి!నాకు కూడా ఆదాయం వస్తుంది!.. అమ్మ చెప్పినవి గుర్తుపెట్టుకుంటాను!చరిత్ర పునరావృతం అవకుండా చూసుకుంటాము!ఆస్తి పంపకాలు అంటే వినయ్, మేము ఇద్దరమే కదా!మేము ఇంకో ఇల్లు ప్రక్కనే కట్టుకుంటాము!.. జాగ్రత్తగా ఉంటాము!అప్పటి కాలంలో ఉమ్మడికుటుంబాలు అలాగే ఉండేవి... ఇప్పుడు కాలం మారింది...సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో మాత్రం భద్రత ఎక్కడ ఉంది?..."

సమీర తల్లిదండ్రులను బ్రతిమిలాడుతూ అభ్యర్థించినా, ఆమె కంఠంలో ధైర్యం తొణికిసలాడుతోంది.

నవతరానికి ప్రతినిధి సమీర. కష్టమో...నష్టమో... ఎదుర్కొందామనే తత్వం ఆమె వ్యక్తిత్వానికి హుందాతనాన్ని తెచ్చిపెట్టింది.ఆమె చిన్నపిల్లకాదు.. అదిరించో, బెదిరించో తమకిష్టమైన వాడికిచ్చి చేయటానికి. ఆమె పరిణితి చెందిన యువతి.

రఘురామ్ కు అర్థం అయింది. 

అతడు కూతురిని దగ్గరకు తీసికొన్నాడు. తలమీద ముద్దుపెట్టుకున్నాడు.


"నీ నిర్ణయం ఏదైనా మాకు అంగీకారమే తల్లీ!అయితే నీకు మేము ఎప్పుడూ తోడుగా ఉంటాము!ఏదైనా సమస్య వస్తే ముందు మాకే చెప్పు! నువ్వు, సాధన తప్ప మా కెవ్వరున్నారు?..."కంఠం వణికింది రఘురాముకు.

తండ్రి గుండెల్లో తలదాచుకొంది సమీర.

పద్మను సముదాయించాడు రఘురామ్. మనసులో కొంత దిగులు ఉన్నా సరస్వతి దగ్గర తన బిడ్డ కష్టపడదులే అనుకుంటూ పెళ్లికి ఒప్పుకుంది పద్మ.

సరస్వతి మాత్రం చాలా సంతోషించింది. 


హైదరాబాదులో సమీర, ప్రణయ్ ల వివాహం జరిగింది. వివాహం మొత్తం మిత్ర, మాళవిక చేతులమీదుగా ఘనంగా జరిగింది.



సమీర తన కిచెన్ ఇంట్లోనే పెట్టుకొంది.

లంకంత ఇల్లు... సందడిగా ఉంది సరస్వతికి.

హైదరాబాదులో పని వాళ్ళ కంటే ద్రాక్షారామంలో ఆడవాళ్లు బాధ్యతగా వంట పని చేస్తున్నారు.

 కాశీపతీ,రమణయ్య వాళ్ళతో పాటు వసంత,నాగరాజు కూడా ద్రాక్షారామం వచ్చారు. మిత్ర చేసే వెడ్డింగ్ ఈవెంట్స్ లో సహాయం చేస్తున్నారు.

 చదువు పూర్తి చేసుకుని ప్రణయ్ తమ్ముడు వినయ్ రాజమండ్రిలోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేరాడు.


 శ్రావణమాసం.

ఆరోజు మంగళవారం.

సరస్వతి కోడలు చేత మంగళ గౌరీ నోము పట్టించింది. రాత్రి పేరంటం అయ్యింది.

 పెరట్లో బ్రహ్మ కమలాలు పూశాయి.ఆ పువ్వుల దగ్గర దీపం పెట్టింది సమీర.

 ఫోనుతో బ్రహ్మకమలాలను ఫోటోలు తీస్తూ నిలుచుంది.


అక్కడికి వచ్చాడు ప్రణయ్.

పైన వెన్నెల...క్రింద విచ్చుకున్న బ్రహ్మ కమలాలు...అవి వెదజల్లే పరిమళం...

ఆ పక్కనే మెరిసిపోతున్న సమీర...ఆహ్లాదంగా  ఉందా ప్రకృతి.


భుజాలు పట్టుకొని సమీరను దగ్గరకు తీసుకున్నాడు ప్రణయ్.


" ఇంత సులభంగా అత్తయ్య,మామయ్య మన పెళ్ళికి ఒప్పుకుంటారనుకోలేదు!"


 "నువ్వే అన్నావు కదా!మన పెళ్లి దేవతలు చేస్తారని!.. అదే జరిగింది!" అంది నవ్వుతూ సమీర.


వాళ్ళిద్దరి మధ్యలో తనెందుకని వెన్నెలను కురిపిస్తూ కొబ్బరాకుల చాటుకు వెళ్ళిపోయాడు చందమామ.


(సమాప్తం )

No comments:

Post a Comment

Pages