శివం - 126 - అచ్చంగా తెలుగు

 శివం - 126

(శివుడే చెబుతున్న కథలు)

రాజ కార్తీక్ 


 
(నటరాజుగా నేను వరదరాజుగా విష్ణువు సామాన్యుల వలె నటిస్తూ కార్తికేయని మా ప్రదేశంలోకి తీసుకొచ్చాము .. బ్రహ్మదేవుడిగా కమల సంభ .. మాతో నాటకాన్ని ఆడుతున్నాడు.. మీ త్రిమాతలు కూడా మాతో కలిసి ఉన్నారు . ప్రతి ఒక్కరూ కార్తికేయని రచనలలో తమకిష్టమైనవి చెప్పుకుంటున్నారు
హరసిద్ధుడికి ఈ సన్నివేశాలు గోచరిస్తున్నాయి 
కార్తికేయనికి తన ఆత్మ స్థితి తెలుసుకొని మమ్మల్ని నిజంగా దర్శించుకొని తీవ్రమైన భక్తి తన్మయత్వంతో ఉన్నాడు.. నాకేమో అలంకారము విష్ణువుకేమో అభిషేకము చేసి ఉప్పొంగిపోతున్నాడు. త్రిమాతలు కార్తికేయని సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నారు ) 

విష్ణు దేవుడు " మహాదేవ మీ ప్రణాళిక ఏమిటో చెబితే మేము ప్రణాళికలో పావులు అవుతాం "

కమల సంబ (బ్రహ్మదేవుడు) 
 "మహేశ్వర.. ఇతగాడి ఏ నాటకంలో మన నటించబోతున్నాము "

త్రిమాతలు " మహాదేవులు వారు దర్శకుడి బుర్రలో ఏమి రాశారో.. బ్రహ్మదేవుల వారు దర్శకుడి తల మీద ఏమి రాశారో.. విష్ణు దేవులు వారు దర్శకుడి మనసును ఏ రకంగా రంజింప చేస్తారో "

నేను స్థాణువై కార్తికేయని వైపు చూస్తున్నాను 

విష్ణు దేవుడు " ఏమిటి బావ ఏమిటి ఆలోచిస్తున్నారు"

నేను " ఏమీ లేదు బావ కార్తికేయుడు మనసులో ఎప్పుడూ ఒకటి నా గురించి అనుకుంటూ ఉంటాడు "

పార్వతీ మాత " ఏమిటిది"

నేను " అప్పుడప్పుడు కార్తికేయుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేస్తాడు .. అదేమిటంటే ! చాలామంది వాగ్గేయకారులు  కావ్య రచయితలు తమ కీర్తనలను తమ రచనలను తమ యొక్క ఇష్ట దైవమైన భగవంతుడికి సమర్పించుకుంటారు అది వారి జన్మ ధన్యంగా భావిస్తారు.. అంతేకాకుండా భగవంతుడు పట్ల తము చూపించిన భక్తిగా కూడా భావిస్తారు . అది ఆ రూపంలో ఉన్న భగవంతుడికి ఎంతో ఆనందం కలిగిస్తుంది.. అలాగే కార్తికేయుడు కూడా ఎప్పుడూ ఒకటనుకుంటాడు"

లక్ష్మీ దేవి " ఏంటది మహాదేవ "

నేను " అతగాడు ఇప్పటిదాకా నా మీద రచనలు చేశాడు కదా అలాగే ఎన్నో అద్భుతమైన కల్పనలు చేశాడు కదా . భగవత్ పాత్రలతో గొప్ప గొప్ప సన్నివేశాలు అల్లాడు కదా , అవన్నీ నాకు ప్రత్యక్షంగా కూర్చోబెట్టి చెప్పాలని కోరిక .."

విష్ణువు " గొప్ప గొప్ప గాత్రం కలవారు కీర్తనలను స్వరపరిచి మన ముందు గానం చేసి సంతుష్టులై చరితార్థులైనట్టు .. తన రచనలతో అలా చేద్దామని అనుకున్నాడు మన కార్తికేయుడు"

నేను "  అదేముంది!  ఒకరోజు ఒక శివరాత్రి రోజున తన ఇంట్లో ఉన్న శివలింగమునకు అభిషేకం చేసి .. రాత్రంతా జాగారం చేయుటకు .. తను నా మీద రాసిన కథలు వింటున్నావా స్వామి అని నిజంగా నాకు చెప్పి జాగారం చేయలేక నిద్రలోకి జారుకున్నాడు .. అలా ప్రత్యక్షంగా నేను కూర్చుంటే. నాకు ఆ కథలు చెబుదామని. M ఆరె బడవ ! కథలు చెప్పకుండా పడుకుంటావేమిటి అని నవ్వుతూ నెలల పిల్ల వాడిని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించి లాలనగా చూశాను "

విష్ణుదేవుడు " వారికి ఆ కథ చెప్పకుండా నిద్రపోయినందుకు బాధ ఎందుకంటే మంచి సన్నివేశంలో మంచి రస పట్టు లో ఉన్నప్పుడు ఆ కథలో తర్వాత ఏం జరుగుతుందో చెప్పకుండా నిద్రలోకి జారుకున్నాడు మన కార్తికేయుడు "
{
బ్రాహ్మ దేవుడు " ఆ సన్నివేశం ఏదో నేను చెబుతాను"

ఆ సన్నివేశం 

" విరాగి అయినా మహేశ్వరుడికి , ఆది అంతం తెలియని ఈ ఆది దేవుడికి .. శక్తిని జోడు చేయాలని నేను విష్ణు దేవులు నిర్ణయించుకున్నాం 

తదనుగుణంగా శివుడికి సతిమాతతో పరిచయం తరువాత కల్యాణమై తనతో పాటు కైలాసంలో కాపురం చేయటం మొదలుపెట్టింది..
రాజకుమారి అయిన సతీ మాతకి  శివుడంటే ఎనలేని ఇష్టం.. శివుని బైరాగి వేషంలో కాకుండా అందమైన రాజకుమారుడు రూపంలో చూడాలని ఆవిడ కోరిక 
కానీ మన మహా దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ధ్యానస్థితిలో ఉంటూ తన గృహస్థ కార్యక్రమాలను కొంచెం పక్కన పెట్టాడు .. ఇదే బాధ నందితో చెప్పింది, కానీ నందీశ్వరుడు మాత్రం "మాత మీకు విష్ణుదేవులు మాత్రమే ఈ విషయంలో సహాయం చేస్తారు. మేము శివుని ధ్యాన భగ్నం చేయుట అంత వారము కాదు"
అనగా సతీమత పిలవగానే విష్ణు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ..

విష్ణుమూర్తి " సోదరి మీరు మమ్మల్ని ప్రార్థించారు ఏమి చేయవలెను"

సతి " సోదరా ! మహాదేవులు వారిని ఈ బైరాగి రూపంలో కాకుండా మీ వలె గొప్ప అలంకారీగా ఒకసారి చూడాలని నా మనసు కోరుకుంటుంది , ఏది ఏమైనా అలా చూడాలని ముచ్చట పడుతున్న ఆమె యదార్థ రూపమే ఆయనకి ఎంతో ఉత్తమంగా ఉన్నప్పటికీ కూడా ఇది తన సహధర్మ చారిని గా నా కోరిక ఇది మీరు  వారికి తెలియజేయగలరని నా ప్రార్ధన "

విష్ణు దేవుడు "అలాగే సోదరి కొంత సమయం ఇవ్వండి "అని మహా దేవుని ముందు ప్రత్యక్షమయ్యారు
 

శివుడు " ఏమిటి విష్ణుదేవ ! తమరి రాక కి కారణం "

విష్ణువు" మహాదేవ రాక్షసులకు వరాలిస్తే సరిపోదు.. భక్తులకు జ్ఞానం ఇస్తే సరిపోదు... పుణ్యములకు ఫలితం ఇస్తే సరిపోదు.. తపస్సులకు మోక్షం ఇస్తే సరిపోదు "

శివుడు " ఏమిటి ఈ ప్రాస విష్ణు దేవా?"

విష్ణువు " ప్రాస కాదు సోదరి మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయాస "

శివుడు " ఏమిటో ఆశ"

విష్ణువు " ఉండండి ఎందుకు అంత జిజ్ఞాస"

శివుడు " ఏమిటి ఈ రసభస"

విష్ణువు" రసభస కాదు మాసతికి మీ మీదే ధ్యాస "

శివుడు " తనని వివాహమడి తీర్చానుగా తన మానస "

విష్ణువు " మానస తీరముతో సరే మరి లాలస "

శివుడు " ఈ ప్రాస లాపి ఏమిటో చెప్పండి విష్ణుదేవా"

విష్ణువు " మా చెల్లెలికి మిమ్మల్ని రాజకుమారి రూపంలో చూడాలని కోరిక "

శివుడు " నాకు అటువంటివి ఏమీ లేవు అయినా ప్రస్తుతం నేను ఉన్న రూపము బానే ఉన్నది కదా "

విష్ణువు " మీ రూపము మీరు బహు బ్రహ్మాండంగా ఉన్నారు .. కానీ మీ యొక్క సతి మా యొక్క సోదరి కోరిక తీర్చడంలో ఎటువంటి తప్పులేదు కదా "

శివుడు " అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు.."

విష్ణువు " మిమ్మల్ని అలంకరించుటకు వైకుంఠం నుండి కొంతమందిని ఇక్కడికి తీసుకువచ్చాను.. వారు మిమ్మల్ని బహు బాగుగా అలంకరిస్తారు.. మీరు అలంకరించుకొని వైకుంఠానికి రాగలరు నేను మా సోదరీమణుని వైకుంఠానికి తీసుకు వెళుతున్నాను.. మీరు వచ్చి మాతో కొంత సమయం గడిపి మీ సతిమాతని తీసుకెళ్లగలరు.. వైకుంఠ వాసులు కూడా మిమ్మల్ని చూడటానికి ఉబలాటపడుతున్నారు"

శివుడు " కైలాస వాసులు కూడా మిమ్మల్ని చూడదలిచారు.. దానికి ఈ కారణం చేత మీరు కైలాసం రావడం బహు ఆనందంగా ఉంది.." అంటూ తను కూర్చునే పీఠం మీద విష్ణుమూర్తి ని పక్కనే కూర్చోబెట్టుకున్నారు మహాదేవుడు 

కైలాస పీఠం మీద ఒకేసారి మహాదేవుని విష్ణు దేవుని చూసిన నంది బృంగి గణాలు జయద్వాలు చేసి ఆ సుందర రూపాన్ని తిలకిస్తూ తమ కళ్ల వెంట ఆనంద భాష్పాలు తుడుచుకున్నారు "

}


లక్ష్మీదేవి " చూడండి మహాదేవ ! విష్ణుదేవ! మన కార్తికేయ ఊహ లోకంలో మీ ఇద్దరినీ కైలాసం చేర్చి ఒకే ఆసనం పై కూర్చోపెట్టాడు . నిజంగా ఎంత గొప్ప ఆలోచన కదా"

{. సన్నివేశంలో 

విష్ణువు " మహాదేవ తమరు వైకుంఠం ప్రత్యక్షంగా వచ్చి మా శేషతల్పం పైన కూడా ఆసీనుడు అవ్వాలి "

శివుడు " తప్పక వస్తాను "

విష్ణువు " అలాగైతే సతి మాత ను నాతో తీసుకు వెళుతున్నాను", అంటూ మహాదేవుడి దగ్గర సెలవు పుచ్చుకొని సతీదేవి బయలుదేరుతుండగా ..
మహాదేవుని మనసులో సతి వెళ్ళిపోతుందని ఒక చిన్న బాధ మొదలైంది . సతీ మాత కి కూడా మహాదేవుని విడిచి వెళ్ళటం ఇష్టం ఉండదు.. కానీ తన సోదరుడైన విష్ణు మాటకు ఎదురు చెప్పకూడదు కదా!
 
 }

నేను " మన కార్తికేయుడు! రాసుకున్న ఈ కథని నాకు వినిపిస్తుంటే ఎంతో కమనీయంగా ఉన్నది, ఏదైనా మన కార్తికేయుడు ఎవరికైనా కథ వినిపించాడంటే అది అబ్బురపరచాల్సిందే .. గొప్ప విజయం సాధించాల్సిందే"

త్రీ మాతలు" తధాస్తు"
బ్రహ్మదేవుడు విష్ణు దేవుడు మరియు నేను "  తధాస్తు సంకల్ప సిద్ధిరస్తు " అంటూ నిండు మనసుతో ఆశీర్వదించాం 

{
సన్నివేశంలో 

ఆ తర్వాత మహాదేవుని వైకుంఠవాసులు విష్ణు దేవుని సలహాల మేర ఎంతో అద్భుతంగా రాజకుమారిని వలె తీర్చిదిద్దారు 

ఒక శుభ ముహూర్తాన మహాదేవుడు వైకుంఠనికి రావడానికి సిద్ధపడ్డారు.. తన కొద్దిపాటి పరివారంతో 
వైకుంఠం వైపుగా బయలుదేరారు ..
వైకుంఠం రానే వచ్చింది 
మహాదేవుడు .. మహారాజు వలె 
"స్వామి ఒక చిన్న రాజ్యంకు రాజు ఎంతో గొప్పగా అలంకరించుకుంటే ఇన్ని వేల లోకాలకి ఇన్ని అనంత భూమండలాలకి అధిపతి అయిన నీవు ఎంత బాగా అలంకరించుకుంటావనేది ఊహకే వదిలేస్తున్నాను "అంటు మహాదేవుడి వర్ణన చెప్పసాగాడు 

వైకుంఠంలో విష్ణు దగ్గరికి వెళ్లడానికి మెట్లు ఎక్కుతూ ఉండగా అందరూ అలంకార స్వాగతాలు.. నమ్మక చమకగింకారాలు చేస్తూ ఉండగా .. సతీ మాత పైనుంచి మహాదేవుని చూసి ఎంతగానో పొంగిపోయింది.. తన మనసులో ఎలా అనుకున్నది అచ్చం అలానే విష్ణు దేవుని వారు మహాదేవుల వారిని సిద్ధం చేశారు..

సతీమాత కళ్ళు తన్మయిత్వంతో మహాదేవుని గొప్పగా చూసినా ఆనందంలో మిరిమిట్లు గొలుపుతున్నాయి 

మహాదేవుడు  కూడా నీ కోరిక తీరిందా అన్నట్లు ఆనందంగా చూస్తున్నాడు. 

ఇదంతా చూసి నంది బృంగి విష్ణు దేవుడు లక్ష్మి మాత సైతం ఎంతో ఆనంద పడుతున్నారు 

లక్ష్మీ మాత ఎదురొచ్చి "ఇన్నాళ్ళకు వైకుంఠం వచ్చారా మహాదేవ అది కూడా మీ సతి కోసం .. ఈ సోదరి కోసం రావాలనిపించలేదా" అని చిరు కోపం చూపిస్తూ ఆట పట్టించింది 

చూసేవారికి అది కన్నుల పండుగగా ఆటవిడుపుగా ఉంది ముల్లోకాలు కూడా దాన్ని ఎంతో ఆనందంగా చూస్తున్నారు.. వదిన పేరు చెప్తేనే ఇంట్లోకి రానీ స్తామని అన్నయ్యని ఎలా ఏడిపిస్తారో కల్యాణంలో అలా ఉంది మహాదేవుని పరిస్థితి..
ఆ తర్వాత
}
నేను " ఏముంది ఆ తర్వాత మన వాడు చక్కగా నిద్రలోకి జారుకున్నాడు "

విష్ణూ దేవుడు " మిగిలింది కదా ఒక మంచి రోజు చేపిద్దాంలే బావ "

నేను "  ఆది అంతమై ఉన్న నాకు.. తన భక్తితో కల్లబొల్లి కథలు చెప్పి నా మనసు దోచాడు.. నిజంగా జరగని సన్నివేశాలను జరిగినట్టు ఒక అల్లిక చేసి నా మనసు రంజింప చేశాడు.. భక్త సులభుడు కదా  భగవంతుడు అనేది ఎంత నిజమో తన యొక్క జిజ్ఞాసతో నిరూపించాడు.. నా పరివారాన్ని అంతేకాకుండా అందరి భగవంతుని పాత్రలని ఆపాదించి కథలు రాస్తూ ఎంతో పుణ్య మూట కట్టుకొని తన పూర్వజన్మ ప్రాపాలను ప్రచారం చేసుకున్నాడు.. అందుకే ఈ దిగ్గజ మహా  దర్శకుడికి, అత్యున్నతమైన ఈ కథ రచయితకు .. ఇంత గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నము 

కార్తికేయుడు ఇంకా రాముని ముందు హనుమంతుడు వలె తన్మయిత్వంతో కూర్చొని ఉన్నాడు 

" విజయోస్తు కార్తికేయ " అని త్రిమాతలు . త్రిపితలు ఆశీర్వదించారు..

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages