తలనీలాలు - అచ్చంగా తెలుగు

తలనీలాలు

రచన: కర్లపాలెం హనుమంతరావు

Karlapalwm2010@gmail.com 



జడ మెడ చుట్టూ వేసుకొంటే కృష్ణవేణి నాగాభరుణుడు మహాదేవుడిని మరిపిస్తుంది.

 

అట్టే మంచి మార్కులు వచ్చే తెలివితేటలు లేకున్నా స్కూలు టీచర్ల అభిమానం, తోటి పిల్లల అసూయ కృష్ణవేణికి మాత్రమే సొంతమవటానికి కారణం కారునలుపు బారు కేశాలు కలిగివుండటమే.

 

"దీని జుట్టు దువ్వి జడవేయడానికే నా రెక్కలు పడిపోతున్నాయి"     అని తల్లి సణుక్కుంటున్నప్పుడు గర్వంగా ఫీలయ్యేది కృష్ణవేణి.

 

"కట్టుకొనేవాడెవడో కాని దీని జుట్టు సింగారాలకే  సగం ఖర్చయిపోతుంది" అంటాడు తండ్రి ముసిముసిగా నవ్వుతూ.

 

నవ్వులాటకు అన్న దమ్ములు ఏం చేసినా సహించేది కాని, జడపట్టుకుని గుంజితే మాత్రం బ్రహ్మరాక్షసి మాదిరి మీద పడి రక్కిపారేసేది.

 

కృష్ణవేణికి  మిస్ యూనివర్శిటీ కాంపిటీషన్లో  ప్రథమ బహుమతి రావటంలో ఆమె నీలాల కురుల సోయగాలదే ప్రధానపాత్ర.

 

నల్ల రేగుపండు రంగుతో పోటీకి దిగే తన కురుల సొగసే కృష్ణవేణికి భృంగామలక తైల ఆయుర్వేద ఫార్మసీవారి వ్యాపార  ప్రకటనల మోడల్ కెరీర్ సంపాదించింది. 

 

శ్రావణమాసం నోముల సమయంలో  సుధా వాళ్లింటికి సింగారించుకొని పేరంటానికెళ్లి రఘు కంటబడిన  మిస్ కృష్ణవేణి. ఇరువైపుల పెద్దల ఆశీస్సులతో మాఘమాసం తిరగకముందే మిసెస్  కృష్ణవేణీ రఘనందన్ అయిపోయింది.

 

అత్తా కోడళ్లు ఒకే చూరు కింద ఉండకూడదన్న ఆచారం మూలకంగా  పుట్టింటికే పరిమితమయిన కృష్ణవేణి    భర్త నుంచి అందుకొన్న ప్రేమలేఖలలో అధికభాగం ఆమె నీలాల కురుల సౌందర్యం మీద అవధులెరుగని విరహ వేదనే.

 

కాని, పెళ్లయిన ఏడాదికి కడుపు పండిన కృష్ణవేణి,  గర్భంలో ఎదిగే బిడ్డ పెరుగుదలలో లోపముందని  గుర్తించి వైద్యుల  చికిత్స చేస్తున్న కాలంలో గండం లేకండా బిడ్డ  భూమ్మీద పడితే చాలు తలనీలాలు సమర్పించుకొంటానని ఏడుకొండలవాడికి ముడుపు కట్టింది.

 

అపరంజి బొమ్మవంటి బిడ్డకు  తల్లి అయిన కృష్ణవేణి   .. అపురూపంగా చూసుకొన్న తల నీలాలను దైవపరంచేసేసింది .

 

బిడ్డ కోసం ప్రాణత్యాగానికయినా సిద్ధపడే స్త్రీకి ఎంత అపురూపమయినదైనా కేశ సంపద వెంట్రుకతో సమానం కదా!

***

No comments:

Post a Comment

Pages