క్రొత్తనీరు.(తొమ్మిదవ భాగం ) - అచ్చంగా తెలుగు

క్రొత్తనీరు.(తొమ్మిదవ భాగం )

Share This

క్రొత్తనీరు.(తొమ్మిదవ భాగం )

టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.




ప్రణయ్ కి ఫోన్ చేసింది సమీర.

మాళవిక మానసిక స్థితి గురించి చెప్పి మిత్ర గురించి అడిగింది.


"మిత్ర చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు సమీరా!ఆలోచించలేక పోతున్నాడు..మాళవిక మీద ప్రేమ ఒకవైపు,పెద్దవాళ్ళ మధ్య అంతస్తుల తేడా మరొకవైపు వాడిని క్షోభ పెడుతున్నాయి..వాళ్ళిద్దరూ కూర్చుని క్లియర్ గా మాట్లాడుకోవాలి!.. పెళ్లి వలన కుటుంబంలో అశాంతి రాకూడదని వాడి భావన. పెద్దవాళ్ళని కాదని  మాళవికను పెళ్లి చేసుకోవడం మిత్రకు ఇష్టం లేదు... అసలు ఈ విషయంలో సమర్థవంతంగా ఎవరైనా పెద్దరికం వహించి పరిస్థితిని దారికి తేవాలి.!..నాకు ఏమీ తోచడం లేదు!నాకు ఇరువైపుల పేరెంట్స్ పరిచయం లేదు. ఒక వేళ పరిచయం చేసుకొని చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారా?..మనం  చిన్నవాళ్లం!...పెద్దవాళ్లను కూర్చోబెట్టి ఏం చెప్తాం? ...."


 'ప్రణయ్ చెప్పింది నిజమే తనకు ప్రణయ్ ని పెళ్లి చేసుకోవాలని ఉంది... మరి ఇక్కడ అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో!...ఏమో!...'


"ప్రణయ్ నువ్వు ఒకసారి హైదరాబాదు రాకూడదూ!"


"ఎందుకు ఇప్పుడు? "


"ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు!.... "


నిశ్శబ్దం........


సమీర  హృదయం వేగంగా కొట్టుకొంటోంది 


"వస్తాను!...వస్తాను!... డోంట్ వర్రీ!..ఒక పది రోజులు వెయిట్ చేస్తావా!ఇక్కడ పొలంలో నారు వేస్తున్నారు!.. ప్లీజ్!"


హమ్మయ్య!...ప్రణయ్ కంఠంలో వినిపించిన దగ్గరితనానికి సంతోషం వేసింది సమీరకు.


 అప్పటినుండి నిమిషమొక యుగంలా గడుస్తోంది సమీరకు.


***


మనోజ్  ఒక్కడే వచ్చాడు.

 ఎయిర్పోర్ట్ కు అందరూ వెళ్లారు.

"ఎంత చిక్కిపోయావురా!"అంటూ కౌగలించుకుంది నీరజ.

వాసుదేవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.కొడుకు భుజం పట్టుకొని దగ్గరకు తీసుకున్నాడు. చిన్నపిల్లలా అన్నను చుట్టుకుంది మాళవిక.

అవీ ఇవీ మాట్లాడుతూ ఇల్లు చేరారందరు.


భోజనాల దగ్గర ఉండబట్టలేక అడిగేసింది నీరజ.


"కోడల్ని వెంట తీసుకొస్తావనుకున్నాము!  ఇక్కడ అమ్మాయిని మేము సరిగ్గా రిసీవ్ చేసుకోమని అనుకున్నావా?"


 మనోజ్ ముఖం మ్లానమయింది.కాసేపు మాట్లాడలేదు....


" ఏమైంది నాన్నా!... " మృదువుగా మనోజ్ భుజం మీద చెయ్యి వేశాడు వాసుదేవరావు.


ఇక తప్పదన్నట్లు 


"డైవర్స్ తీసుకున్నాం నాన్నా!మా ఇద్దరికీ పడలేదు....."

 మెల్లగా చెప్పాడు మనోజ్.


నిశ్శబ్దంగా చూస్తున్నారు మిగిలిన ముగ్గురు.


 కాసేపటికి తనే చెప్పడం మొదలుపెట్టాడు మనోజ్.


" ఒక సంవత్సరం బాగానే ఉన్నాము.....తర్వాత చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయి అవే పెద్దవిగా మారి విడాకుల దాకా వచ్చాయి.. విడిపోయి ఒక ఏడాది అయింది...నేను మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నాను... మీతో చెప్పడానికి నాకు అభిమానం అనిపించింది.. అక్కడ ఐటీ రంగం  పరిస్థితి కూడా బాగాలేదు... ఆఖరికి ఇక్కడికి వచ్చేసాను!... "


" మంచి పని చేశావు! ఇక్కడే ఏదైనా చూసుకొందువు గాని!...జరిగిపోయిన వాటికి బాధపడకు! అంటూ కొడుకుకు ధైర్యం చెప్పాడు వాసుదేవరావు.


నీరజకు నిశ్చింతగా ఉంది.

 మనోజ్ ఇక్కడే ఉంటాడు.ఇప్పుడు మాళవిక పెళ్లి జరగాలి.

మంచి సంబంధం చూసి మాళవికను అత్తగారింటికి పంపిద్దామనుకొంది నీరజ.

 మళ్లీ మాట్రిమోనీ సంస్థలతో మాట్లాడటం మొదలు పెట్టింది. పోయినసారి వీళ్ళు పెట్టిన కండిషనును వద్దన్న వాళ్ళ గురించి చెప్పారు వాళ్ళు.   అబ్బాయి వైపు వాళ్లకు ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదు. అమ్మాయిని మాత్రమే వాళ్ళ అబ్బాయి దగ్గరికి పంపించేట్లయితే ఇంకేమీ అభ్యంతరాలు లేవని కబురు చేశారు వాళ్ళు.

వాసుదేవరావు కూడా వాళ్లతో మాట్లాడాడు.ఇంతకుముందు మాళవిక ఆ సంబంధం గురించి కాస్త ఉత్సాహం చూపించింది కూడా.

ఇంకేముంది!

మాళవికకు విషయం చెప్పింది నీరజ.

ముఖం నల్లగా పెట్టుకొని కూర్చుంది మాళవిక.


" పోయిన సారి ఈ సంబంధం బాగానే ఉందన్నావు కదా! "

అసహనంగా ఉంది నీరజకు.


"అప్పుడు అన్నాను ఇప్పుడు నాకు నచ్చటం లేదు!.."


 "ఎందుకని? "


జవాబు లేదు.


" నీ వెంట మేము వచ్చి ఉండకపోతే వాళ్లకి ఇష్టమే అని చెప్పారు..అతడు ఉండేది బెంగళూరులోనే!..వాళ్ళ అమ్మ వాళ్ళు కాకినాడ.నువ్వు మేనేజ్ చేసుకోగలవు కదా!"


జవాబు ఇవ్వలేదు మాళవిక.


మనోజ్ కు అర్థమైంది.

మాళవికకు ఇష్టం లేదు. ఈ సంబంధం ఇష్టం లేదా? లేక పెళ్లి అంటే ఇష్టం లేదా?

తండ్రివైపు చూశాడు మనోజ్.

"తర్వాత మాట్లాడుతా!"అన్నట్లు కళ్ళతోనే చెప్పాడు వాసుదేవరావు.


"నువ్వు ఊరుకోమ్మా!దాన్ని కాస్త ఆలోచించుకోని!మెల్లగా తర్వాత మాట్లాడుకుందాం!"అంటూ తల్లిని వారించాడు మనోజ్.


ఆఫీసుకు వెళ్ళింది మాళవిక.


"ఈ మధ్య మల్లి పరధ్యాన్నంగా, దిగులుగా ఉంటోంది!...విషయం అడిగితే చెప్పటం లేదు. దాటవేస్తోంది!"

చెప్పాడు వాసుదేవరావు.


"చూద్దాం నాన్నా!నేను సమీరను కనుక్కొంటాను!"


 సమీరకు ఫోన్ చేశాడు మనోజ్.


"మాళవిక పెళ్లి గురించి నీతో కొంచెం మాట్లాడాలి సమీరా!ఎప్పుడు ఫ్రీ అవుతావో చెప్తే నేను నీ కిచెన్ కి వస్తాను!"


 " నేనే వస్తానన్నయ్యా!ఇక్కడ పనివాళ్ళ ముందు మనం మాట్లాడుకోవడం బాగుండదు!"


"అయితే అబిడ్స్ తాజ్ కు వస్తావా!"


 "ఓకే ఓకే!ఒక గంటలో వస్తాను!"


గబగబా పని ముగించుకొని తాజ్ కు వచ్చింది సమీర.

 వర్కింగ్ డే పైగా ఉదయం పదకొండుగంటల సమయం. తాజ్ లో జనాలు ఎవ్వరూ లేరు.


దోసె ఆర్డర్ ఇచ్చాడు మనోజ్.


"మల్లికి నువ్వే మంచి ఫ్రెండ్ వి. పోయినసారి ఒక సంబంధం వస్తే మల్లికి నచ్చింది. అయితే మా పేరెంట్స్ పెట్టిన కండిషన్ వాళ్లకు నచ్చక వెనక్కు వెళ్లిపోయారు వాళ్ళు. ఇప్పుడు అదే సంబంధం కుదుర్చుకుందామంటే మల్లికి ఇష్టం లేదంటోంది!... ఈ మధ్య మల్లి మనసులో ఏదో బాధపడుతోందని మా నాన్న గమనించారు.... ఏమన్నా విషయం ఉందా అని అనుమానంగా ఉంది!... మల్లిని అడగటానికి ముందు నీతో మాట్లాడదామని... పెళ్లి విషయంలో  తన అభిప్రాయం ఏమిటో నీకు తెలిస్తే చెప్తావా!ఒక్కోసారి ఎంత దగ్గర అనుకున్నా పేరెంట్స్ తో అన్నివిషయాలు మనం చెప్పుకోలేము!....."


సమీర తటపటాయించింది.


'తీరా మిత్ర గురించి చెప్తేస్తే అన్నయ్య పాజిటివ్ తీసికోకపోతే..... "


సమీరనే చూస్తున్నాడు మనోజ్.


"సరే!నువ్వేమి చెప్పక పోతే నేనే   కనుక్కుంటాను!నీకు తెలిసిన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు? మల్లి జీవితానికి సంబంధించిన నిర్ణయం పెద్ద వాళ్లకు తెలిస్తే మంచిదికదా!"తీవ్రంగా పలికాడు మనోజ్.


భయంగా చూసింది సమీర.


"ఓకే!నా అనుమానం కరెక్టే!అతడు ఎవరు?"


నోరువిప్పింది సమీర.


"అన్నయ్యా!మిత్ర.. అని వరంగలులో   మాళవిక స్కూలుమేట్ పరిచయం అయ్యాడు..."


"మిత్ర.. అంటే శ్రీదేవి తమ్ముడా?... వాడసలు చదవడే!... శ్రీదేవి బాగా చదివేది... వీడు.. ఏదో డిగ్రీ అఘోరించాడనుకుంటా!మరీ!... నా చెల్లెలి బుర్ర ఇంత చెత్తగా ఎలా ఆలోచిస్తోంది?..."


నమ్మలేకపోతున్నాడు మనోజ్.


"మిత్ర ఇప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తున్నాడన్నయ్యా! పెద్ద చదువులు చదవకపోవచ్చు!... కానీ..లోకాన్ని బాగానే చదివాడు... మిత్ర మంచివాడు..

నువ్వు చూడు!...నువ్వు చూస్తే నీకు కూడా అతడు నచ్చుతాడు!"


"చూస్తాను!చూస్తాను!... కానీ నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది.. నీకు తెలియదు!.. చిన్నప్పుడు మా చెల్లెలు క్లాసులో    తొంభైశాతం మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళతో మాట్లాడేది కాదు... అది ఎవరితోనన్నా ఆడుకోవాలంటే చదువుతో తూకం వేసేది.. అలాంటి పిల్ల ఇప్పుడు వాడి చదువు,స్థితిగతులు కూడా చూడటం లేదంటే  చాలా ఆశ్చర్యంగా ఉంది!"


"నువ్వు మిత్రతో మాట్లాడితే నీ అభిప్రాయం తప్పకుండా మారుతుంది!పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించన్నయ్యా!"


 ఆలోచిస్తున్నాడు మనోజ్.


సమీరను కిచెన్ దగ్గర దింపి వరంగల్ లో ఉన్న తన చిన్నప్పటి క్లాసుమేటు తరుణ్ కు ఫోన్ చేశాడు మనోజ్.

తరుణ్ వరంగల్ లో లెక్చరరుగా పనిచేస్తున్నాడు.

మరీ ఇలాంటి విషయాలు ఫోన్ లో మాట్లాడటం బాగుండదు అనుకొని తరుణ్ వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు చెప్పి వరంగల్ కు బయలుదేరాడు మనోజ్.


***


చాలా ఏళ్లు ఉన్న ఊరు. 

 కుశల ప్రశ్నలు అయ్యాక మిత్ర గురించి తరుణ్ ని అడిగాడు మనోజ్.


 మిత్ర గురించి పూస గుచ్చినట్లు చెప్పాడు తరుణ్.


" వాడిది కష్టపడే తత్వం మనోజ్!  ప్రస్తుతం అయితే ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని పేరెంట్స్ తో ఉన్నాడు.. వాళ్ళ అక్క శ్రీదేవి పెళ్లి కూడా  వీడే చేశాడు.. మంచివాడు... డబ్బు వచ్చిందని భేషజం చూపించడు. మొన్న మా ఇంటి గృహప్రవేశానికి కూడా  మిత్ర.అన్ని ఏర్పాట్లు చేశాడు....తెలిసిన వాళ్ళమని ఎక్కువ డబ్బులు కూడా తీసుకోలేదు.. కష్టం సుఖం తెలిసినవాడు..ఇంకా అంకుల్, ఆంటీలయితే  ఏమీ మార లేదు!....వాళ్ళు అక్కడే ఆ కాలంలోనే ఉండిపోయారు.. ఎవరి ఇంటికి వాళ్లు వచ్చినా వంట పనులు చేస్తూ ఉంటారు...మొన్న మా నాన్నగారికి తెలిసిన వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్లారు..

 అక్కడ నాగరాజు అంకుల్ కనిపించి మా నాన్నగారికి కుర్చీ చూపించి ఆయన మాత్రం నేల మీదే కూర్చున్నారట!మిత్ర   నాకంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు...ఈ మధ్య ఇంకో స్థలం కూడా కొన్నాడని విన్నాను...స్థితిగతులు పక్కన పెడితే మిత్రలాంటివాడు ఈ కాలంలో దొరకడం కష్టం!ఆలోచించు! 

ఈరోజు పెళ్లి చేసుకుని రెండు నెలలకి విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువయ్యాయి....మన ఇండియాలో కూడా దాంపత్య విలువలు దారుణంగా పడిపోయాయి.... అభద్రత..... అనుమానం.... ఎవరినీ నమ్మలేము! ఈ పరిస్థితుల్లో ఆడపిల్లకే కాదు మగ పిల్లలకు కూడా పెళ్లిళ్లు సమస్యాత్మకంగా తయారయ్యాయి...ఏమంటావు?... "


"చూస్తాను తరుణ్!అంతా బాగుంటే మంచి వాడిని వదులుకోను!...మన వాళ్ళలో ఇంకా  ఎవరెవరున్నారిక్కడ?"


 "రామారావు మాస్టరుగారి కూతురు సుభాషిణి పెళ్లి అయింది.ఇక్కడే వాళ్ళ ఆయన పౌరోహిత్యం చేస్తూ వేద పాఠశాలలో టీచరుగా పని చేస్తున్నాడు.. ఇంకా దర్శన్,.. వినోద్.. ప్రకాష్ ఉన్నారు.. ...చాలామంది వైజాగ్,హైదరాబాద్ కు మైగ్రేట్ అయ్యారు.."


"సరే తరుణ్!నేను సుభాషిణి ఇంటికి కూడా వెళ్ళొస్తాను! నాకు తెలిసి మిత్ర  వాళ్లకు సుభాషిణి వాళ్ళు బంధువులనుకుంటా!..."


అంటూ బయలుదేరి ఊర్లో ఉన్న మిగిలిన మిత్రులందరికీ వెళ్లి మిత్ర గురించి వాకబు చేశాడు మనోజ్.అతని వ్యక్తిత్వం తెలుసుకున్నాక  కొంచెం స్థిమితపడ్డాడతడు.


మిత్రకు ఫోన్ చేశాడు.మనోజ్ అని తెలియంగానే కొంచెం అయోమయానికి గురయ్యాడు మిత్ర.మాళవిక తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పేసిందా?...అయినా నవ్వుతూ 

 "ఇంటికి రా అన్నయ్యా! మా అక్కయ్య కూడా వచ్చి ఉంది.భోజనానికి కూడా రావాలి!"

అంటూ ఆహ్వానించాడు మిత్ర.


" అవేమీ పెట్టుకోకురా! ....జస్ట్!.. పాత ఫ్రెండ్స్ ని చూద్దామని వచ్చాను మిత్రా!ఇంకా కలవాల్సిన లిస్ట్ పెద్దదే ఉంది!....ఒకసారి శ్రీదేవిని, నిన్ను చూద్దామని! "

అన్నాడు తేలిగ్గా మనోజ్.


రెండో రోజు నాగరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మనోజ్.


(సశేషం )


***

No comments:

Post a Comment

Pages