ఆధ్యాత్మిక మార్గం - అచ్చంగా తెలుగు

ఆధ్యాత్మిక మార్గం

Share This

 ఆధ్యాత్మిక మార్గం

సి.హెచ్.ప్రతాప్

 


భగవంతునికి ఆడంబరమైన పూజా పునస్కారాలు, హోరెత్తించే స్త్రోత్ర పఠనాలు అవసరం లేదు. భక్తి భావన లేకుండా చేసే క్రతువులు భగవంతునికి ఏ మాత్రం ప్రీతి కలిగించవు. బుద్ధిగతం గా, పవిత్రమైన మనస్సుతో, ఆత్మశుద్ధితో తమను తాము ఉద్ధరించుకుంటూ నిత్య ఛైతన్య స్వరూపులుగా మసలుకునే వారే మోక్షార్హులు మరియు భగవంతునికి ఇష్టులు అన్నది శాస్త్రవాక్యం. దయ గల హృదయమే పూజామందిరం. కరుణ నిండిన మనస్సే భగవంతునికి ఆలవాలం.మనస్సును దైవంతో,వాక్కును ప్రియ సంభాషణలతో,కర్తవ్యాలను  దైవ కార్యాలతో సమ్మిళితం చేయడం ఎంతో అవసరం. భగవంతుని చేరుటకు అదియే రాచబాట.


శ్లో: యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యత్ చ దుర్గమం!
తత్ సర్వం తపసా సాధ్యం తపోహి దురతిక్రమం!!

దేనిని మనం అసలు చేయలేం అనుకుంటామో, దేనిని మనం పొందలేము అనుకుంటామో, దేనిని సాధించలేము అనుకుంటామో, అవన్నీ కూడా తపస్సు చేస్తే సాధ్యం అవుతుంది అని శాస్త్రవాక్యం చెబుతోంది.

మానవుడు గతాన్ని తలుచుకుంటూ  ఏడుస్తూ కూర్చోకూడదు.దుఃఖం ఎక్కువ ఉన్నప్పుడు తపస్సు పెంచుకోవాలి.తద్వారా ఆ దుఖం నుండి బయటపడేందుకు యత్నించాలి. దేవతారాధన, నియమబద్ధమైన జీవితం, ధార్మికమైన ఆలోచనా సరళి పెంచుకుంటూ తపో మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించినట్లయితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం .చేసుకోగలము. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్లే. నిజానికి దేవుడు మనం కల్పించు కొన్న ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవాలంటే, నేను అనే అహాన్ని తొలగించుకోవాలి, నేనెవరు నీవెవరు మన మధ్య ఉన్న బేధం ఏమిటని అని పరిశీలించుకోవాలి. అప్పుడే దేవుడే జీవుడు, జీవుడే దేవుడు అని తెలుసుకోగలం. అప్పుడు మన మన మనస్సు  మహానందం, పరమానందాన్ని పొందుతుంది. ఎలాంటి అలజడులు మన మనసులోకి రానేరావు, ప్రశాంత జీవితానికి ఆధ్యాత్మికత పునాది అవుతుంది. ఆచరించడం అంటే పదా ర్థాలకు విలువ ఇస్తున్నాం. కానీ పరమార్ధాన్ని వదిలి వేస్తు న్నాం. జీవుడు వ్యష్టి, దేవుడు సమిష్టి, వ్యక్తి పవిత్రంగా ఉంటే, ఆనందంగా ఉంటే సమాజం కూడా పవిత్రంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. కనుక వ్యక్తి అహం, స్వార్థం వీడి తాను బ్రతుకుతూ, పదిమందిని బ్రతికిస్తూ ఉంటే, సమాజం కూడా ప్రగతి పథంలో వికసిస్తుంది. ఇదే మన ఆధ్యాత్మిక వేత్తలు మనకు ఆచరించి చూపిన ఆధ్యాత్మిక మార్గం.రామాయణం జీవన విలువల గురించి గొప్ప సందేశం అందించింది. తండ్రిమాటకు, ప్రజల మాటకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో శ్రీరాముడు బోధించాడు. ఆయన బోధ ఆచరణాత్మకంగా సాగింది. పట్టాభిషేకానికి సిద్ధమై ప్రజల ఆశీర్వచనాలు, అభినందనలు పొందినప్పుడు విరిసిన రాముడి చిరునవ్వు, వనవాసానికి వెళ్లేటప్పుడూ చెక్కుచెదరలేదు. కష్టాలకు కుంగక, సుఖాలకు పొంగని స్థిరచిత్తమే నిజమైన సంపదగా శ్రీరాముడు భావించాడు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనే సత్వగుణాలు మానవతా విలువలుగా ప్రసిద్ధి పొందాయి. దయగల హృదయమే దైవ మందిరమన్నది పెద్దల మాట. జాలి, కరుణ, సానుభూతి మానవుడుని ఉన్నతస్థితికి చేరుస్తాయి.అత్యున్నత జీవన విధానాన్ని తెలుపిన శ్రీ మద్రామాయణ మహాకావ్యాన్ని అందుకే అందరం నిత్యం చదవాలి, అందులోని ధర్మాన్ని ఆచరించాలి.మానవ జన్మకు సార్ధకత చేకూర్చుకోవాలి. శ్రీ రామ నామాన్ని నిత్యం జపించాలి. అదియే మోక్షకారకం. 

No comments:

Post a Comment

Pages