ఇంద్రియ నిగ్రహం - అచ్చంగా తెలుగు

 ఇంద్రియ నిగ్రహం

రచన: సి.హెచ్.ప్రతాప్

  భగవద్గీత 2 వ అధ్యాయము, 58 వ శ్లోకం

యదా సమ్హరతే చాయం కూర్మోజ్గానీవ సర్వస:
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||

మానవులకు ఇంద్రియ నిగ్రహం అత్యంత ఆవశ్యకం అయినది. దీనిని పాటించి ఎందరో మహానీయులు ప్రఖ్యాతి గడించారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటూ, సుఖ దుఖాలు, చావు పుట్టుకలు, ఆనంద విచారాలు మొదలైన  ద్వందాలు నుండి విడివడి పరిపూర్ణమైన , శాశ్వతమైన బ్రహ్మానందాన్ని ఎలా పొందవచ్చునో శ్రీ కృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మానవాళికి తెలియజేస్తున్నాడు.

తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకొని, బాహ్య  ప్రపంచం నుండి వచ్చే ఆపదల నుండి తనను రక్షించుకునే   విధంగా  మానవుడు ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుకొని సంపూర్ణ జ్ఞానమునందు స్థిరుడైన వారికి శాశ్వత బ్రహ్మానందం ప్రాప్తిస్తుందని ఈ శ్లోకం భావం.

ఇంద్రియ నిగ్రహం లేనివారికి అమ్మవారి కృపకి పాత్రులయ్యే భాగ్యం కలుగదు. అంటే శమదమాదులపై నిగ్రహం ఉండాలి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. మనస్సుని అదుపులో ఉంచుకోవడం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం.

‘ఓ అర్జునా! ఎవరియొక్క ఇంద్రియాలు వారిచేత నిగ్రహింపబడి ఉంటాయో అటువంటివారి జ్ఞానమే సుస్థిరమైన జ్ఞానం. అటువంటివారే ‘స్థితప్రజ్ఞులుగా పిలువబడతారు’’ అని చెప్పిన మాట కేవలం అర్జునుని యుద్ధ సందర్భంలో మాత్రమే గాక జీవితంలోని వివిధ సందర్భాల్లోనూ ఉపయోగపడేమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలనుకున్నవారి విషయంలో ఇది తప్పనిసరిగా పాటించవలసిన ప్రధాన కర్తవ్యంగా భావించాలి.

  ఈ కలియుగంలో మానవులందరూ తమ తమ ఇంద్రియాలకు బానిసలవుతారని, ఇంద్రియాలు అతి ప్రభావవంతమైన మానవులను ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాయని బ్రహ్మదేవుడు కలి పురుషుని లక్షణాలు తెలియజేసాడు. నేడు తాను కోరిన విధంగా తమ ఇంద్రియాలను నియంత్రించుకోవడం అనేది మానవులకు ఒక అగ్ని పరీక్షగా మారింది.  గుణాతీతులైన పార్వతీపరమేశ్వరులను చేరుకోవడానికి గొప్ప ఇంద్రియనిగ్రహం అత్యంత ఆవశ్యకం. అనితరసాధ్యమైన ఇంద్రియనిగ్రహం ఉండబట్టే మనుచరిత్రలో ప్రవరుడు పరమపవిత్రుడైన అగ్నిదేవుడి కృపకి పాత్రుడు కాగలిగాడు. ఇంద్రియాలను శాస్త్రం విష సర్పాలతో పోల్చింది.అవి ఎప్పుడూ ఎలాంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా బుసలు కొడుతూ సంచరిస్తుంటాయి. కాబట్టి వాటిని నియంత్రణ లోకి తెచ్చుకోవాలంటే ముందుగా సాధకుడు పాములు ఆడించేవానిలా పరాక్రమవంతుడై వుండాలి. పాముల శయ్యపై శయనించే విష్ణుమూర్తి, పాములను సదా మెడలో ఆభరణాలుగా ధరించే శంకరుడు  ఇంద్రియాలను నిగ్రహించే తత్వానికి ప్రతీకలు. సాధకుడు ఇంద్రియాలు బాహ్య విషయాల వైపు  పరుగులు తీసినప్పుడు తాబేలు లా బుద్ధి ఉపయోగించుకొని ఇంద్రియాలను ఉపసంహరించుకోవాలి,మనస్సును సహజంగా నిగ్రహించుకోవడం కష్టసాధ్యం కాబట్టి మనస్సు కంటే శ్రేష్టమైన బుద్ధిని ఉపయోగించుకొని, భౌతిక చర్యలు, కర్మలను నిగ్రహించుకుంటూ తద్వారా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యమని భగవద్గీత తెలియజేస్తోంది.. భగవంతుని వైపు దృష్టి సారించి , పూజ, స్తోత్రం, ఆరాధన, జపం, తపస్సు, యోగము, ధ్యానం వంటి ధార్మిక అంశాలపై దృష్టి సారించాలి. భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం, శరణాగతి, నిష్కల్మషమైన ప్రేమ పెంచుకోవాలి. అన్ని రకాల సంశయ భావాలను తొలగించుకోవాలి. తన ఇంద్రియాలు స్వీయ సంతృప్తి కోసం కాక భగవంతుని సేవ కోసమే వినియోగించుకోవడమనే అభ్యాసం చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో చేయడం ఎంతో అవసరం.కోరికలనేవి అగ్ని వంటివి. అగ్ని దహించినట్లుగా అవికూడా మన జీవితాల్ని బుగ్గిపాలు చేస్తాయి. భగవంతుడు తనకిచ్చిన బుద్ధిబలంతో మనలోని కోరికలలో ఏవి మంచివి, ఏవి చెడ్డవి అని ఆలోచించి విచక్షణతో మనిషి వాటిని తీర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. భగవంతుని భక్తి రస భావితుడు కానివారు ఇంద్రియములకు లోబడిపోయి, మనస్సు అనుక్షణం చంచలమవుతుండదం వలన తీవ్ర మనోవేదనకు లోనవుతారు.అటువంటి వ్యక్తి ఎంతటి శక్తి సంపనుడైనా చివరకు జీవితంలో వైఫల్యం పొందక తప్పదని భగవద్గీత బోధిస్తోంది.ఈ విధమైన విచక్షణచేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులు, అవరోధాలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. వీటిని సహనంతో అధిగమించాలి. అటువంటి వానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం.  శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే చాలదు. శాస్త్రం చెప్పిన విధముగా ఆచరించాలి.

No comments:

Post a Comment

Pages