మన మనస్సే మన మిత్రుడు, శత్రువు - అచ్చంగా తెలుగు

మన మనస్సే మన మిత్రుడు, శత్రువు

Share This

మన మనస్సే మన మిత్రుడు, శత్రువు

సి.హెచ్.ప్రతాప్ 
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః:

భగవద్గీత 6 వ అధ్యాయం, 5 వ శ్లోకం
ప్రతీ ఒక్కరు  తన యందు నిక్షిప్తమై వున్న మనస్సు సహాయం చేత తనను తాను ఉద్ధరించుకోవాలి గాని అధోగతి పాలు కారాదు.  బద్ధ జీవునకు మనస్సనేది మిత్రుడు, శత్రువు కూడా అయి వున్నది అని పై శ్లోకం యొక్క భావం. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరుఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు, ఎవరికి నిద్రవస్తే వారే నిద్రపోవాలి , ఎవరి సాధన వాళ్ళే చేసుకోవాలి, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించుకోవాలి ,ఒకరు చక్కగా ధ్యానసాధన చేసి యోగియై ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తే ఆ గొప్పతనం వాళ్ళదే, ఒకరి గొప్పతనం ఇంకొకరిది ఎప్పటికీ కాజాలదు.

మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి  కాబట్టి మన కర్మలను మనమే సరిచేసుకుంటూ వుండాలి. ఇందుకు మన మనస్సును నియంత్రణలోకి తెచ్చుకునే బాధ్యత కూడా మనదే. అవతలివారు మన అదృష్టాన్ని బాగు చెయ్యలేరు లేదా చెడగొట్టలేరు , అదే విధంగా మన మనస్సులను నియంత్రించుకొని మెరుగైన జీవితాన్ని తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మనదే. 

అనుక్షణం మనల్ని అటు ఇటు పరుగులు తీయిస్తూ చంచలత్వానికి గురి చేసేది మన మనస్సే. ఇది మనలోనే నిక్షిప్తమై వుంది.  మనసుతో స్నేహం చేయాలంటే ముందుగా దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దానితో స్నేహం చేయాలి, మచ్చిక చేసుకోవాలి. నెమ్మది నెమ్మదిగా దానిని మన దారికి తెచ్చుకోవాలి. అట్లా కాకుంటే అది ఎదురు తిరగడం ఖాయం. అందుకో కొందరు రచయితలు మన అదుపులో లేని మనస్సును కల్లు తాగిన కోతితో సరిపోల్చడం జరిగింది.  కాబట్టి అటువంటి మనసును యోగం అనే సాధన ద్వారా కట్టుదిట్టం చేసి ఇంద్రియార్ధముల వెనుక పరుగులు తీయనివ్వకుండా చేయాలని భగవంతుడు సాధకులకు స్పష్టం చేస్తున్నాడు. జీవులకు అజ్ఞానమనే బురద నుండి ముక్తిని కలిగించే విధంగా మనస్సుకు శిక్షణ  ఇవ్వాలి.  చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా ఘనత సాధించేందుకు మనం నిరంతరం కృషి చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మనమే మన శత్రువులం అవుతాం. విజయవంతం కావడం లేదా వైఫల్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.


మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరూ భగవత్ ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకు మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి.


ఆధ్యాత్మిక మార్గంలో కాని భౌతిక జీవితంలో కాని  ప్రతికూల పరిస్థితులు  ఎదురైనప్పుడు, ఇతరులు మనకు తీవ్ర అన్యాయం చేసారు అని,వారి వలనే మనకు ఇటివంటి కష్టనష్టాలు కలుగుతున్నాయని , వారే మనకు శత్రువులని ఫిర్యాదు చేస్తాము. కానీ, మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి అదే. ఒక పక్క మనకు అత్యంత శ్రేయస్సుని కలుగ చేసే శక్తి  మనస్సుకి ఉంది. మరో పక్క, మన ప్రగాఢ శత్రువుగా, మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు ఏంతో మేలు కలుగ చేయవచ్చు, అదేవిధంగా, నిగ్రహింపబడని మనస్సు తుచ్ఛమైన తలంపులతో జీవాత్మను పతనానికి గురి చేయవచ్చు. కాబట్టి క్రమశిక్షణతో, దైవం పైన సంపూర్ణ విశ్వాసంతో మన మనస్సును కట్టు దిట్టం చేసుకోవాల్సిన ఆవశ్యకతను భగవానుడు ఈ శ్లోకం ద్వారా అర్జునుడిని నిమిత్తమాత్రంగా  మానవాళికి బోధిస్తున్నాడు. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేకానేక ఆకర్షణలు, ప్రలోభాలకు ఆకర్షితులం కాకుండా మనస్సును కట్టుదిట్టం చేసుకోవాలి. ఇణ్ద్రియాల పట్ల మానవులు ఎంతగా ఆకర్షితులౌతారో అంతగా వారి పతనం ఖాయమని కూడా భగవానుడు పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. ఈ భవబంధాలలో చిక్కుకోకుండా వుండాలంటే మనస్సును సదా భగవంతుని పాదారవిందముల వద్ద నిలపడం అత్యావశ్యకం.

No comments:

Post a Comment

Pages