ఆంధ్రుల అభిమాన అత్తగారు శ్రీమతి సూర్యకాంతం - అచ్చంగా తెలుగు

ఆంధ్రుల అభిమాన అత్తగారు శ్రీమతి సూర్యకాంతం

Share This

ఆంధ్రుల అభిమాన అత్తగారు శ్రీమతి సూర్యకాంతం

పోడూరి శ్రీనివాసరావు



ఈ ప్రపంచం లో కొన్నిటికి ప్రత్యేకం గా పరిచయం అక్కరలేదు.   ఉదాహరణకు...
మండు వేసవిలో మల్లెపూల పరిమళం, కొత్తావకాయ, ఆకు కూరలు అన్నిటికీ తల్లి లాంటి శాకాంబరీ మాత..గోంగూర పచ్చడి, కొత్తగా పెళ్ళైన నూతన దంపతుల మధ్య అనురాగాలు, అలకలు, పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ ల నటన  ... అబ్బో.. ఇలా ఒకటేమిటి, కొన్ని అలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయి.

అలాంటివాటిలో ఒకటి .. శ్రీమతి సూర్యకాంతం నటన కూడా చెప్పుకోతగినదే.
ప్రత్యేకంగా, మన అచ్చంగా తెలుగు సంచికలో శ్రీమతి సూర్యకాంతం నటన గురించి ప్రస్తావించడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. ఈ సంవత్సరం శ్రీమతి సూర్యకాంతం శతాబ్ది సంవత్సరం... అక్టోబర్ 28, 2023 తో ఆమెకు 99 సంవత్సరాలు పూర్తయి, శతాబ్ది సంవత్సరం (1924 -2024) మొదలవుతుంది. అందుకే, ఆ ప్రత్యేకతను పురస్కరించుకుని, ఆమెపై వ్యాసం వ్రాయ సంకల్పించాను.

గయ్యాళి పాత్రలకు పేరుగాంచిన సూర్య కాంతం 28, అక్టోబర్ 1924 తేదీన, తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ సమీపం లో వెంకట కృష్ణ రాయపురం గ్రామంలో శ్రీ పొన్నాడ అనంత రామయ్య, శ్రీమతి వెంకటరత్న మ్మ దంపతులకు 14 వ సంతానంగా జన్మించింది.ఆరేళ్ల వయసులోనే, పాడడం, నాట్యమాడడం నేర్చుకుంది. వయసు పెరిగే కొద్దీ హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించడంతో, సినిమాల్లో నటించాలనే కోరికతో మద్రాసు (ప్రస్తుత చెన్నై) చేరుకుంది.మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. నెలకు 65 రూపాయల జీతం ఇవ్వబోతే నిరాకరించ డంతో  నెలకు 75 రూపాయల జీతం  నిర్ధారించ బడింది. తర్వాత  1949 లో ధర్మాంగద చిత్రంలో మూగదాని వేషం వేసింది. ఆ సమయంలో చిన్నా చితకా వేషాలు వేసేది. అప్పుడే మొదటి సారిగా, నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. అప్పుడు వేస్తున్న చిన్నా చితకా వేషాలు నచ్చక జెమిని స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. బొంబాయి వెళ్దామనుకునే ఆలోచన మనసులో  ఉన్నా,  ఆర్థిక స్థోమత లేక ఆ ఆలోచనను విరమించు కుంది.అటువంటి సమయంలో ఆమెకు గృహప్రవేశం సినిమాలో సహాయనటిగా మంచి అవకాశం వచ్చింది. పిమ్మట తన కలల పాత్ర,  హీరోయిన్ వేషం -  సౌదామిని చిత్రంలో వచ్చింది. కానీ,  ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి, ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం కాస్తా తప్పి పోయింది. గాయం బాగయ్యాక సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది.  ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించడంతో,  ఆ తర్వాత సూర్యకాంతానికి  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. గయ్యాళి అత్త పాత్రలకు తను పేటెంట్ గా,  బ్రాండ్ అంబాసిడర్‌గా అయి పోయింది.

అటువంటి సమయంలో ఆమెకు గృహప్రవేశం సినిమాలో సహాయనటిగా మంచి అవకాశం వచ్చింది. పిమ్మట తన కలల పాత్ర,  హీరోయిన్ వేషం -  సౌదామిని చిత్రంలో వచ్చింది. కానీ,  ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి, ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం కాస్తా తప్పి పోయింది. గాయం బాగయ్యాక సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది.  ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించడంతో,  ఆ తర్వాత సూర్యకాంతానికి  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది. గయ్యాళి అత్త పాత్రలకు తను పేటెంట్ గా,  బ్రాండ్ అంబాసిడర్‌గా అయి పోయింది.

సంసారం చిత్రం తర్వాత బొంబాయి కి చెందిన ఒక నిర్మాత ద్వారా... తను కోరుకునే హీరోయిన్ పాత్ర వచ్చింది. కానీ తనకు ఆ అవకాశం రాక ముందే ఆ పాత్రకు మరొక హీరోయిన్ ని తీసుకొని, తర్వాత ఆమెను ఆ సినిమా నుంచి  తీసేసారని తెలియడంతో... ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను... అంటూ ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం  సినిమా ఆమె కు ఎంతో పేరు తీసుకొచ్చింది.ఆ రోజుల్లో అనేక చిత్రాల్లో సూర్యకాంతం నటించింది. ఒక విధంగా చెప్పాలంటే, సూర్యకాంతం నటించని సినిమా ఉండేది కాదు. కొత్త సినిమా వస్తుంటే... అందులో సూర్యకాంతం  ఉందా, లేదా అని ప్రేక్షకులూ, సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదేమో. ముఖ్యంగా సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్య కాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, యస్ వి. రంగారావు - సూర్యకాంతం,  గుమ్మడి -  సూర్యకాంతం జంటలు తప్పనిసరిగా ఉండేవి.నటనా పరంగా చూస్తే... సూర్యకాంతాన్ని  కేవలం గయ్యాళి అత్తగా  కానీ, హాస్యనటిగా కానీ అనుకోవడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయక పోయినా..  ఆమె సంభాషణలు చెప్పే విధానం ఒక ప్రక్క నవ్వు తెప్పిస్తే, చేసే చేష్టలు మరో పక్క కోపం  తెప్పిస్తాయి. అలా  ఆమెను కేవలం హాస్యనటి అనీ అన లేము, దుష్ట పాత్రధారినీ అని  అనలేం. గయ్యాళి అత్త అని కూడా అన లేం. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్... సహాయ నటి... ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఒదిగి పోతుంది. ఏ పాత్ర లోనైనా ఆమె జీవించగలదు. ఆమె నటన, ఆమె నటించే పాత్రకు వన్నె తెస్తుంది. కానీ, గయ్యాళి అత్త పాత్ర ను ఆమె స్పెషలైజేషన్ చేసింది అనుకోవాలి. ఆమె నటించిన చిత్రాల్లో, ఆ తరహా పాత్రలకు ఆమె జీవం పోసింది.

ఇక సూర్యకాంతం వ్యక్తిత్వం విషయానికి వస్తే అస్సలు గయ్యాళి కానే కాదు. మామూలు మనిషే. ఎంతో సరదాలు,  హాస్య చతురత ఉన్న మనిషి. దయార్ద్రహృదయం గల మనిషి. ఇతరులకు సహాయం చేసే మనిషి. కానీ, ఆమె చేసిన పాత్రల వల్ల కాబోలు ఏ సమావేశానికైనా, సినిమా ఉత్సవాలకైనా వెళ్లినప్పుడు. స్త్రీలు సైతం ఆమె వద్దకు ఆటోగ్రాఫ్‌ల కోసం వెళ్లడానికి భయపడే వారట. నిజానికి ఆమె చాలా నికార్సయిన మనిషి. ఖచ్చితమైన మనిషి. సహృదయం గల మనిషి. నలుగురికీ సహాయపడే మనిషి. దబాయింపు, కచ్చితత్వం ఉన్న మనిషే అయినా... మనసు మాత్రం వెన్నలా సున్నితం. సహాయపడే స్వభావం ఉన్నా, అవసరమైన వాళ్లకు ఆర్థికసహాయం చేసేది కానీ ... అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేది కాదు.

ఆమె శుభ్రంగా తినేది. కడుపునిండా తినేది. పదిమందికీ పెట్టేది. షూటింగ్‌కి వచ్చినప్పుడు ఏవో తినుబండారాలు, స్నాక్స్ తీసుకురావడం అందరికీ పెట్టడం చేసేది. విశేష దినాలు, పండుగలు,  పబ్బాలు వస్తే ఇక సరే సరి. ఇంక చెప్పనే అక్కరలేదు. ఇటువంటి అలవాటే  తోటి నటీమణులైన సావిత్రి, కృష్ణ కుమారి, జానకీ లాంటి వారికి కూడా ఉండేది.

సూర్యకాంతం మొహమాట పడకుండా నిర్మాతల నుంచి తనకు రావాల్సిన పారితోషికాన్ని గట్టిగా అడిగి తీసుకునేది. ఆమె కు నటన అంటే ఎంత ప్రాణం అంటే, ఎంత ఇష్టమంటే... చివరి దశలో వేషాలు తగ్గిపోయినా... చివరి దాకా నటిస్తూనే ఉండాలి అని కోరుకునేది. తన ఆరోగ్యం బాగు లేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేది. 1946లో ప్రారంభమైన ఆమె నటప్రస్థానం 1994 వరకు కూడా సాగింది. 1946 నుంచి 1994 వరకూ సాగిన 48 సంవత్సరాల నట జీవితం లో ఆమె మొత్తం 313 చిత్రాల్లో  నటించడం జరిగింది.

ఆమె 1950 సంవత్సరంలో  శ్రీ పెద్దిభొట్ల చలపతిరావు గారిని వివాహం చేసుకున్నారు. తదనంతరం ఆయన హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. 
సూర్యకాంతం దంపతులకు సంతానం కలగకపోవడంతో, తన అక్కగారి కుమారుణ్ణి బాల్యం లోనే దత్తత తీసుకున్నారు. సూర్యకాంతం గారి కుమారుడు శ్రీ అనంత పద్మనాభ మూర్తి గారు, ప్రస్తుతం చెన్నై లో హోమియో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, హోమియో డాక్టర్ గా ప్రజాసేవ చేస్తున్నారు.

సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి --- అన్నవి ఆమెకు ప్రదానం చేసిన బిరుదులు.  1994 జూలై నెలలో తిరుపతి లోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు సూర్యకాంతానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.

28 అక్టోబర్ 1924 న జన్మించిన సూర్యకాంతం 18 డిసెంబర్ 1994 లో 70 ఏళ్ల వయసులో చెన్నై లో సహజ మరణం పొందారు.

ఏది ఏమైనా... సూర్యకాంతం అంటే ఒక ప్రభంజనం.  ఆమెలాంటి సహజనటి చలనచిత్ర సీమ లో మరొకరు లేరు, భవిషత్తులో కూడా జన్మించరు. ఆమె నటించిన పాత్రల్లో మరొకరిని ఊహించుకోలేము.

అంతటి గొప్ప నటి మన తెలుగు చలన చిత్ర సీమలో గొప్పగా నటించడం, వారి సినిమాలు చూసే భాగ్యం కలగడం, ఆమె శతాబ్ది సంవత్సరం లో, ఆమె పై ఈ వ్యాసం వ్రాయడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. 
ఈ వ్యాస రచనకు సహకరించిన వికీపీడియా కు కృతజ్ఞతలు.

కొసమెరుపు
శ్రీమతి సూర్యకాంతం పాల్గొన్న ఒక సభలో మహానటుడు శ్రీ గుమ్మడి ఇలా చెప్పారు..."నీ నటన తో, సూర్యకాంతం లాంటి చక్కటి పేరును ఏ ఆడపిల్లా పెట్టుకోడానికి భయపడేలా చేసావు కదా తల్లీ !" అంటూ నవ్వుతూ చెప్పారు. అది నిజమే కదా !

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

No comments:

Post a Comment

Pages