‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ - పుస్తక సమీక్ష - అచ్చంగా తెలుగు

‘తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ - పుస్తక సమీక్ష

Share This

తూర్పు తీరంలో తెలుగు రేఖలు’ - పుస్తక సమీక్ష

  ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

 ఆస్ట్రేలియాలో అరవై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు ప్రజల సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ పరిణామం ఎంతో విశిష్టమైనదీ, విలక్షణమైనది. ఏడు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారిగా తెలుగు కుటుంబాలు, ఆస్ట్రేలియా ఖండంలో అడుగు పెట్టాయి. కేవలం కొన్ని కుటుంబాలతో ఈ వలస ప్రారంభమైంది. మరో పదేళ్ళలో పదుల సంఖ్యలో తెలుగు వారు ఈ ఖండానికి వచ్చారు. ఉద్యోగాన్వేషణలో కొందరు, ప్రభుత్వ ఆహ్వానంపై కొందరు, ఉపాధిని వెతుక్కుంటూ కొందరు, ఉన్నత విద్య కోసం ఇంకొందరు వచ్చారు, వాతావరణ పరిస్థితులతో, ఆహారపు అలవాట్లతో అష్టకష్టాలు పడ్డారు. అయినా నిలద్రొక్కుకున్నారు. క్రమంగా వందల, వేల సంఖ్యలో ఈ ఆరవ ఖండానికి తెలుగువారొచ్చారు. స్థిరపడ్డారు. తమ అస్తిత్వ అన్వేషణ మొదలుపెట్టారు. భాషాప్రాతిపదికపై తెలుగు సంఘాలేర్పడ్డాయి. తెలుగు పత్రికలు ప్రారంభమయ్యాయి. రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. సభలు, సమావేశాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, అవధానాలు, పండుగలు, పర్వదినాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రష్టాయి కార్యక్రమాలు మొదలుకొని ప్రపంచ స్థాయి మహాసభలు నిర్వహిస్తున్నారు.

 

ఈ మొత్తం ప్రస్థానాన్ని తెలుగుమల్లి అంతర్జాల పత్రిక సంపాదకులు కొంచాడ మల్లికేశ్వర రావు గ్రంథస్థం చేసారు. ఇందులో ఇక్కడి ప్రముఖుల అనుభవాలున్నాయి, సాహిత్య ప్రభాసాలున్నాయి, విజ్ఞాన వీచికలున్నాయి, ప్రవాస ప్రయాసలున్నాయి, వలస విలాసాలున్నాయి. వివిధ తెలుగు సంస్థల నిర్విరామ కృషిని అంచనా వేయడం జరిగింది. మాధ్యమ సాధ్యమాలున్నాయి – ఇందులో ఆస్ట్రేలియాలో వెలువడుతున్న అనేక పత్రికల వివరాలున్నాయి. రేడియో ప్రసార సమాచారమున్నది. లలిత కళా విలాసాలున్నాయి, సాంస్కృతిక కార్యక్రమ విశేషాలున్నాయి.  

 

ప్రతికూల పరిస్థితులలో తెలుగువారు తమ తల్లిభాషనూ, సాహిత్యాన్నీ, సంస్కృతినీ, పరిరక్షించుకోవడానికి అభినందనీయమైన కృషిని నిబద్ధతతో, నిస్వార్ధంగా కొనసాగిస్తున్నారు. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, బోనాలు, బతుకమ్మ పండగలను అత్యంత ఉత్సాహపూరితంగా, వైభవోపేతంగా జరుపుకుంటున్నారు.

 

నిన్నటి అనుభవాలు, నేటి జీవన ప్రయాణం, రేపటి తరానికి తెలియజేయడం కోసం సాహితీ మిత్రులు కొంచాడ మల్లికేశ్వర రావు గారు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ ప్రామాణిక గ్రంథం “తూర్పు తీరంలో తెలుగు రేఖలు” (ఆస్ట్రేలియాలో అరవై తెలుగు వసంతాలు) రూపొందించారు. ఈ గ్రంథానికి చక్కని ముఖ చిత్రాన్ని శ్రీమతి ప్రత్యూష సమకూర్చారు. అధ్యాయాలకు తగిన చిత్రాలను నర్సిం గారు వేశారు.

 

ఆస్ట్రేలియాలో తెలుగువారి చరిత్ర, సంస్కృతిపై ఆసక్తి ఉన్న పరిశోధకులు ఈ గ్రంథంపై పి.హెచ్.డి పరిశోధన చేస్తే బావుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఒక ప్రయోజనకరమైన గ్రంథాన్ని వెలువరించడంలో సహకరించిన కొంచాడ రావుగారి మిత్ర బృందానికి, తమ విలువైన అనుభవాలను, రచనలను పంపిన మిత్రులందరికీ అభినందనలు.

 

                                                                ఆచార్య ఎస్వీ సత్యనారాయణ

                                                                                డి.లిట్

                                                                        పూర్వ ఉపకులపతి

                                                  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము


No comments:

Post a Comment

Pages