వీడని బంధం - అచ్చంగా తెలుగు

 వీడని బంధం

(మా జొన్నవాడ కథలు)

-       డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)

               "నర్సమ్మా! దేవళం వెనకాల ఎవరో పిల్లగాడు చాలా సేపటి నుంచీ ఏడుస్తూ ఉన్నాడు చూడు. గోలగా ఉంది చాలా సేపటినుండి..వాళ్ళమ్మకు చెప్పు!" అన్నాడు పూజారి విసుగ్గా.

"అట్నే అయ్యా!" అంటూ వెనకకు వెళ్ళి అరుగుమీద చూసే సరికి ఏడాది బిడ్డ గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్నాడు.

ఉదయం ఏడు కావస్తున్నది. టైంలో ఎవరు ఇక్కడ పిలగాణ్ణి వదిలేసి పెత్తనాలు చేస్తున్నారా… అని చుట్టూ చూసింది. జనం వాళ్ళపాటికి వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప పిల్లవాణ్ణి ఎవరూ పట్టించుకోలేదు. కాసేపు చూసి వాణ్ణి ఎత్తుకొని నిదానంగా అందర్నీ పరీక్షగా చూస్తూ, తనూ రెండు మూడు ప్రదక్షిణాలు చేసింది. ఎవరూ తమ బిడ్డ అని చెప్పలేదు. వెంటనే బిడ్డను చంకనేసుకుని పూజారి దగ్గరకు వచ్చి నిలబడై "సామీ! ఎవరి బిడ్డో ఏందో...ఎవరూ పలకడంలేదు ఈడ!" అంది.

"చక్కగా ఉన్నాడు. అబ్బాయి. పెన్నకు స్నానానికి వెళ్ళారో ఏమో! చూద్దాంలే. అన్నట్టు నీ పని అయిపొయింది గదా! కాసేపు చూడు. ఎవరో అర్జెంటు పనుండి పొయింటారు"

"ఇవాళ బేస్తవారం...రేపు సుక్కరారం స్వామీ.. ఈణ్ణెత్తుకోని కూకుంటే.. నాలుగ్గాళ్ళ మండపం శుభ్రం చేయిబల్లా..చెప్పూ..."

"మండపం ఎదురుగా ఉన్న అంగట్లో కూచోబెట్టి ఊడువు.. నర్సమ్మా " అంటూ లోపలికి వెళ్ళిపోయాడు.

నర్సమ్మ పన్లన్నీ అవడమే కాకుండా బారెడు పొద్దెక్కింది. పిల్లోడికోసం ఎవరూ రాలేదు. పూజారి, దేవళం సిబ్బంది ఇంక దేవళం  మూసేస్తారనగా అక్కడ గుమికూడారు.

"ఇదుగో నర్సమ్మా.. పిల్లోణ్ణి నువ్వే ఇంటికి తీసుకోని పో.. ఎవరన్నా వచ్చి అడిగితే చూద్దాం. నీకూ ఎవరూ లేరు కదా.. కాలక్షేపంగా ఉంటుంది." అన్న పూజారి మాటకు దిగులుగా చూస్తూ "స్వామీ! యేభై ఏళ్ళ వయసులో పిలగాణ్ణి సాగ్గలనా?" అంది.

"దేవుడిచ్చిన బిడ్డనుకో! చూద్దాం..ఈలోపల ఎవరో ఒకరు వస్తార్లే..ఏదో పనిమీద మర్చిపొయ్యి వెళ్ళి పొయ్యింటారు"

"సామీ..పొద్దుణ్ణుంచీ ఇప్పటిదాకా  ఐదు గంటలయింది. ఎవరో కావాలని చేసిన పనిది"

"నాగ్గూడా అట్నే అనిపిస్తా ఉండాది. వీడి మెళ్ళో ఉన్న ఆంజనేయస్వామి బిళ్ళ ఉంది చూడు. అది అలాగే ఉంచు తియ్యబాక! అదే గుర్తు వీణ్ణి ఎవరన్నా గుర్తుబట్టేదానికి" అన్న గుమాస్తా గుర్నాధం మాటకు "అట్టాగే సామీ..అంటూ" నిర్వేదంగా నవ్వింది.

పూజారి సలహామేరకు హనుమయ్య అని పేరుబెట్టింది. పది సంవత్సరాలు అలా దొర్లిపోయాయి. నర్సమ్మ ఇంట్లో బిడ్డేనని అందరూ అనుకునేంతగా మారిపోయాడు. పచ్చని ఛాయలో దొరలాగా ఉంటాడని అందరూ అనుకుంటూ ఉంటే మురిసిపోయేది నర్సమ్మ. హనుమంతుకు నేను మీ అమ్మమ్మను, మీ అమ్మా నాయనా బస్సు ప్రమాదంలో చనిపోయారని మాత్రమే చెప్పింది.

***

 

"మల్లెపూలు...మల్లెపూలు.. చానా సలీసు" అంటూ హనుమంతు అక్కడి అంగళ్ళ వాళ్ళకు పోటీగా బుట్ట తీసుకుని కార్లదగ్గరికి, బస్సులొచ్చే వేళకు వెళ్ళి అమ్మేవాడు. పూలంగల్లోళ్ళు "వీడెమ్మ భడవా.. ఎవరికి బేరాలు రానీకుండా జేస్తున్నాడీ పిలగాడు" అని విసుక్కునే వాళ్ళు. బుచ్చికి రోజూ సైకిలేసుకుని వెళ్ళి పూలు తెచ్చేవాడు. జొన్నవాడలో పూలమ్మే వాళ్ళకంటే కాస్త చౌకగా ఇచ్చేవాడు. 

              నరసమ్మకు అరవై యేళ్ళు రాగానే దేవాలయంలో ఉద్యోగం పోయింది. అలా ఇంట్లో ఉంటూ పూలమ్మితే  వచ్చిన డబ్బుల్తో కాలం గడిపేది. హనుమంతు కూడా దుర్ఖర్చులేమీ పెట్టకుండా డబ్బులన్నీ నర్సమ్మకే ఇచ్చేవాడు. కాలం తీరి హనుమంతును ఒంటరివాణ్ణి చేసి ఒకరోజు నిద్రలోనే  వెళ్ళిపోయింది నర్సమ్మ. పూలమ్మిన డబ్బుల్తో హోటల్లో అన్నం తినడం, నర్సమ్మ ఇంట్లో పడుకోవడం చేసేవాడు. అప్పటినుండీ మంచీ చెడూ పూజారికే చెప్పుకునే వాడు హనుమంతు.

 

***

 

          ఒకరోజు పెద్ద కారు వచ్చి ఆగ్గానే ఎగబడ్డాడు హనుమంతు. కొన్న దాకా వదలకుండా పట్టుకొని ఏభై రూపాయల పూలు కొనిపిచ్చాడు వాళ్ళచేత. కారు దిగిన ముప్పై యేళ్ళ సుశీలమ్మ "ఏవండీ చూశారా! పిల్లోడు ఎంత ముద్దొస్తున్నాడో! నిండా పదేళ్ళు కూడా లేవు. అమ్మ గన్న బిడ్డో..ఇలా ఎండలో పూలమ్మే అవసరం కలిగింది" అంటూ భర్తతో కారు దిగి  "ఏయ్ అబ్బాయ్! నీ పేరేంది?" అన్న ప్రశ్నకు "హనుమంతు" అంటూ వెళ్ళిపోబోతూ ఉండగా వాడి చెయ్యిపట్టుకుని "ఆగరా! కాస్తా! మీ అమ్మా నాయనా ఎవరు?" అన్న ప్రశ్నకు "ఎందుకు? నాకు అమ్మా నాయనా ఎవరూ లేరు.  అయినా మీకెందుకివన్నీ.. పూలమ్ముకోవాల...నన్ను బోనీండి" అంటూ చేయి వదుల్చుకోని వెళ్తూ ఉండగా అప్పుడే బయటకొచ్చిన పూజారి ఇదంతా చూసి "ఎవరమ్మా మీరు?" అన్నాడు. మాది కావలి. మావారు డాక్టరు. మాకు పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడ. అబ్బాయి అనాధ అంటున్నాడు….." అంది అనుమానంగా.

              "అవునమ్మా వాడు చెప్పింది నిజమే!  వాడు అనాధ. మొన్నటిదాకా ఇక్కడ పాచిపనులు చేసే నర్సమ్మ పెంచుకుంది. ఆమె చనిపోయాక నిజంగానే అనాధ అయ్యాడు" అనేసరికి అవాక్కయింది సుశీలమ్మ.

భర్త సుదర్శన్రెడ్డితో "ఏమండీ..అబ్బాయి చక్కగా ఉన్నాడు. మనం తీసుకెళ్ళి పెంచుకుందాం" అనగానే "చిన్నపిల్లోణ్ణి పెంచుకుంటారు గాని, పదేళ్ళ అబ్బాయిని పెంచుకోవడం బాగుంటుందా చెప్పు?" అన్నమాటకు పూజారి కల్పించుకుంటూ "అమ్మా… వాడు చెప్పాలంటే ఏక సంధాగ్రాహి. ఒకసారి చెబితే పట్టుకుంటాడు. వాడు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి నేను చదివే మంత్రాలన్నీ నాతోపాటూ చదివేస్తుంటాడు దేవళంలో. వాడు ఏడాది వయసున్నప్పుడు ఎవరో తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళారు. అమ్మగన్న బిడ్డో దురదృష్టవంతుడు. పూలమ్ముకుని బ్రతుకుతున్నాడు"

"నా మాట వినండి. చదువు రాకపోయినా పర్వాలేదు. అబ్బాయి చురుకుగా ఉన్నాడు కదా!" అన్న మాటలు విన్న పూజారి గుమాస్తాను పిలిచి "హనుమంతును నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా!" అన్నాడు.

"అయ్యా..చెప్పండి.." అనగానే సుశీలమ్మ ఏదో మాట్లాడబోతుండగా ఆమెను ఆగమని "ఏరా..స్కూల్లో చేర్పిస్తే చదువుకుంటావా?" అన్నాడు.

"మరి బువ్వెవరు పెడతారు నాకు స్వామీ!" అని పెద్దగా నవ్వాడు.

"వీళ్ళు... చూడు.... ఈయన పెద్ద డాక్టరు. కావలి వీళ్ళది. నిన్ను పెంచుకుంటామని చెప్తున్నారు. చదివిస్తారు. పెద్ద ఉద్యోగం చెయ్యొచ్చు. అన్నీ వాళ్ళే చూసుకుంటారు. వెళ్తావా?"

"మిమ్మల్నందరిని వదిలిపెట్టి ఉండలేను స్వామీ!"

"అరే అలా కాదురా! ఒక్క మాటవిను! చదువుకుంటే చాలా డబ్బొస్తుంది"

"నాకు పదేళ్ళు వచ్చాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటో తరగతిలో చేరారా?"

"పల్లేదురా..నీవు ఒక సం. ప్రైవేటుగా చదివి ఆరో క్లాసులో చేరొచ్చు. నేను పురాణం చెప్పేటప్పుడు ఒక్కసారి విన్నకథను మళ్ళీ పిల్లకాయలను పోగేసుకుని నువ్వు రచ్చబండ మీద కూర్చొని యధాతధంగా నన్ను అనుకరిస్తూ చెప్తున్నావు కదా! అలాగే ఒక్కసారి వింటే వచ్చేస్తుంది నీకు. నీకు ఒక సంవత్సరం చాలు"

"ఏమో పూజారి గారూ...అమ్మైనా.. నాయనైనా మీరే! నర్సమ్మ అమ్మమ్మ నిన్ను చదివించలేకపోయానురా! ఏమీ అనుకోవద్దు. అని చచ్చిపోయేప్పుడు చానా బాధపడి ఏడ్చింది. అమ్మమ్మ కోసమైనా చదవాలనిపిస్తున్నాది"

"నేను చెప్పినట్టు విను! అంతా శుభం జరుగుతుంది" అన్న పూజారి మాటలకు మౌనంగా తలూపాడు.

"రెడ్డిగారూ.. మీరు ఏమనుకోకుండా అబ్బాయిని తీసుకెళ్తున్నట్టు ఒక్క కాగితం వ్రాసివ్వండి. మీ అడ్రసు, ఫోన్ నంబర్లు అన్నీ రాసివ్వండి" అన్నాడు.

***

          మరో పదిహేనేళ్ళకు హనుమారెడ్డి పెద్ద కార్డియాలజిస్టు అయ్యాడు. కావలిలోనే కాదు చుట్టుప్రక్కల ఎక్కడ గుండె ఆపరేషన్ చెయ్యాలన్నా హనుమారెడ్డి ఉండాల్సిందే! సుదర్శన్రెడ్డికి కొడుకును చూసుకున్నప్పుడల్లా గర్వంగా ఉంటుంది.

              నెల్లూరులో ఉన్న సుదర్శన్రెడ్డి అన్న కేశవరెడ్డికి అర్ధరాత్రి గుండెపోటు వచ్చిందని హుటాహుటిన కావలికి తరలించారు. హనుమంతు వెంటనే ఆపరేషన్చేసి నయం చేశాడు హనుమంతు.

ప్రక్కరోజు స్పృహ రాగానే "ఒరే! మీ అబ్బాయి ఉండబట్టి నాకు నయం అయింది. లేకపోతే పైకి బొయ్యేవాణ్ణే" అంటూ బాధపడుతుండగా "అవే మాటలన్నా! దేవుడు అన్నీ చూస్తాడు. భయంలేదు" అని ఓదార్చాడు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత, హనుమంతు వచ్చి  స్టెతస్కోపుతో పరిశీలిస్తూ ఉండగా మెడలో ఊగుతున్న హనుమంతుడి బిళ్ళ కనపడింది కేశవరెడ్డికి. ఆశ్చర్యపడ్డాడు. అది మెడలో తిరుగుతూ ఉండగా బొమ్మ వెనుక ఉన్న కె.ఆర్. అనే అక్షరాలు అతని కంటబడ్డాయి. కళ్ళనీళ్ళు ఒక్కసారి జారిపడ్డాయి. "అరె! ఎందుకు పెదనాయనా! బాధపడుతున్నారు. మీకు పూర్తిగా నయం అయిపోయింది. ఒక వారం .సీ.యు లో ఉండాలి అంతే!" అంటూ మాత్రలు ఇచ్చి నర్సును జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్ళిపోయాడు.

"ఒరే! సుదర్శనా! అబ్బాయిని దత్తు తీసుకున్నప్పుడు, మద్రాసులో ఉన్న సుశీలమ్మ బంధువు అని చెప్పావు నాకు. నిజమేనా? ఒట్టేసి చెప్పు!" అని చేతులు పట్టుకున్నాడు.

"లేదురా! ఒట్లెందుకు కాని, వీడు జొన్నవాడలో పదిహేనేళ్ళ క్రితం పూలమ్ముకునే అబ్బాయి. అందరూ రెడ్లు కాదంటారేమోనని భయపడి సుశీల చుట్టాలబ్బాయని అబద్ధం చెప్పాను. సుశీల అబ్బాయే కావాలని పట్టుబట్టింది. ఏమైంది?  ఇప్పుడు విషయాలు ఎందుకడుగుతున్నావు?"

"వాడి మెళ్ళో హనుమంతుడి బిళ్ళ గమనించావా?"

"అవును. అది చిన్నప్పటినుంచీ ఉంది. అప్పట్లో జొన్నవాడ పూజారి దాన్ని మాత్రం తీయొద్దని వాడి బలం బిళ్ళలోనే ఉందని ఒట్టేయించుకొన్నాడు" అన్న మాటకు కేశవరెడ్డి వెక్కి వెక్కి ఏడవ సాగాడు.

"అన్నా! ఏమైందన్నా! ఏమంది? ఎందుకు ఏడుపు?"

" బిళ్ళమీద నా పేరు ఉంది గమనించావా?"

"నీపేరా? దానిమీద కె.ఆర్ అని ఉంది. పెంచిన నర్సమ్మ వేసిందని చెప్పాడు హనుమంతు.

"వాడు నా బిడ్డరా! నాకు రమణమ్మకు పుట్టిన బిడ్డ!" అని మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చాడు.

"..నిజమా? రమణమ్మ ఎవరు? ఇప్పుడెక్కడుంది? ఏడవకుండా చెప్పన్నా.."

"అవును నేను నెల్లూరులో కాలేజీ చదివే రోజుల్లో ప్రక్కింటి అమ్మాయిని ప్రేమించి చేసిన ఘనకార్యం అది! ఆరోజుల్లో రమణమ్మకు నిండా పదహారేళ్ళు కూడా లేవు. కడుపవడంతో వాళ్ళ అమ్మా నాయినా ఈవిషయం దాచిపెట్టారు. కాన్పు సమయంలో రమణమ్మ మగబిడ్డను కని మరణించింది. ఒక ఆయాకు ఇచ్చి ఒక సంవత్సరం పెంచిన తర్వాత, తీసుకునివెళ్ళి జొన్నవాడలో దేవళంలో నా చేతులతో నేనే వదలి పెట్టాను. నా మెడలో ఉన్న ఆంజనేయ స్వామి గొలుసు వాడికి వేసి వదిలేసి వచ్చాను. దీనికైన డబ్బులు, రమణమ్మ అమ్మా నాయనకు ఇచ్చిన డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా? అమ్మ నగలు ఒకరోజు ఎవరూ లేనప్పుడు నేనే దొంగిలించి అమ్మేశాను. అమ్మావాళ్ళు ఇంట్లో దొంగలు పడ్డారనుకున్నారు. దొంగను కూడా నేనే! చాలా పాపాలు చేశానురా! నన్ను క్షమించు!"

"ఊరుకో అన్నా! ఇప్పుడవన్నీ త్రవ్వుకోని బాధపడకు! నీ బిడ్డయినా నా బిడ్డయినా మళ్ళీ విధి మనవద్దకే చేర్చింది చూశావా?"

అంటుండగా సుశీల లోపలికి "బావగారిని ఊర్కే మాట్లాడించవద్దని అబ్బాయి చెప్పాడు. మీరివతలికి రండి. మిమ్మల్ని నర్సు పిలుస్తోంది. ఏదో అర్జెంటు కేసట వెళ్ళండి" అంది. 

***

          డిస్చార్జి  అవగానే,  కేశవరెడ్డి తన ఆస్తి మొత్తం హనుమారెడ్డి పేరిట వీలునామా వ్రాసి, ఉండడానికి ఇళ్ళు, తినడానికి రెండెకరాల పొలం మాత్రమే తమకు ఉంచడం పట్ల కారణం తెలియని గయ్యాళి భార్య జానకమ్మకు గాని,  కొడుకు  సుబ్బారెడ్డి గాని జీర్ణించుకోలేక ఆగ్రహావేశాలు వెళ్ళగ్రక్కారు.  అది ఎప్పటికి, ఎవరికి అర్ధం కాని రహస్యంగానే మిగిలిపోయింది.  

-0o0-

No comments:

Post a Comment

Pages