వారసులకిచ్చే వాస్తవ ఆస్తి..'భూమి'! - అచ్చంగా తెలుగు

వారసులకిచ్చే వాస్తవ ఆస్తి..'భూమి'!

Share This

 'వారసులకిచ్చ వాస్తవ ఆస్తి..'భూమి'!

-సుజాత.పి.వి.ఎల్,

సైనిక్ పురి, సికిందరాబాద్.

 పంచభూతాల్లో ఒక్కటైన భూమి సమస్త ప్రాణికోటికి జీవాధారం. భూమికి మాతృస్థానమిచ్చి గౌరవించడం మన భారతీయ సంస్కృతి గొప్పతనం. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ప్రజలు తాము నివసిస్తున్న భూమిని తల్లిగా భావించరు. ఒక్క మన దేశంలో మాత్రమే ఈ మట్టిని అమ్మకన్నా ఎక్కువనుకుంటాం. అథర్వవేదంలోని పృథ్వీ సూక్తం- ప్రకృతి, పర్యావరణం గురించి మనకు అసమాన జ్ఞానాన్ని ప్రసాదించింది. ఈ సందర్భంగా వేదంలోని అద్భుత శ్లోకాన్ని స్ఫురణకు తెచ్చుకొందాం.

యస్యాం సముద్ర ఉత సిన్ధురాపో
యస్యామన్నం కృష్టయః సంబభూవుః
యస్యామిదం జిన్వతి ప్రాణదేజత్సా నో
భూమిః పూర్వపేయే దధాతు

అంటే- "భూమాతకు వందనం. సముద్ర, నదీజలాలను ఏకం చేసి తనలో ఇముడ్చుకున్నదీ మాత. తనను దున్నినపుడు తన గర్భంలోని ఆహారాన్ని ఆ మాత అందిస్తుంది. నిజానికి అన్ని ప్రాణులూ నివసిస్తున్నది ఆమెలోనే… ఆ జీవశక్తిని భూమాత సదా మనకు ప్రసాదించుగాక!" అని అర్థం.
జన్మనిచ్చిన భూమిని కన్నతల్లిగా పూజించడం ఈనాటి సంప్రదాయం కాదు. అనాదిగా వస్తున్న ఆచారం. మాతా భూమి పుత్రోహం పృథివ్యా అని కూడా పృథ్వీ సూక్తం ఉద్బోధించింది. ఈ పుడమి నా తల్లి, నేనామె పుత్రుడను అని దీని అర్థం. మర్యాద మిన్నగాగల పురుషోత్తముడు శ్రీ రాముడు మనందరికీ ఆదర్శప్రాయుడు.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు. అంటే, జన్మనిచ్చిన తల్లి, జన్మభూమి రెండు స్వర్గం కంటే గొప్పవని అర్థం. జన్మనిచ్చిన తల్లి నవమాసాలు మోస్తుంది. జన్మభూమి మనల్ని జీవితాంతం మోస్తుంది. మన జీవితాలకి ఆధారం అవుతుంది. అటువంటి భూమిపై పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. మన వారసులకు ఇచ్చే అద్భుతమైన కానుక భూమి. ఎందుకంటే భూమిని నమ్ముకున్న వాడు..ముందు ఆలోచనతో ఎంతో కొంత భూమి (ల్యాండ్) ని కొనిపెట్టుకొంటాడు, అతడే భూపతి. నిజ ధనవంతుడు. ఇలా చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఎందుచేతనంటే..రోజు రోజుకి ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నది తెలిసిందే. అందుకే మన జీవనానికి, వికాసానికి నెలవైన భూమిపై కొంత పెట్టుబడి పెట్టి మన వారసులకు వాస్తవ ఆస్తినిద్దాం. వారిని భూస్వాములుగా చూద్దాం. పసితనం బంగారు భవితకు బాటవేద్దాం. వారి ఉన్నతికి చేయూతనందిద్దాం.  తల్లిదండ్రులుగా పిల్లలను భూపుత్రులను చేద్దాం.
ఈనాటి మన సరైన నిర్ణయమే..మన పిల్లల జీవితాలను కచ్చితంగా మారుస్తుందని ముందు ముందు గ్రహిస్తాం. ప్రతి సామాన్యుడు సొంత ఇంటికలను సాకారం చేసుకునే బంగారంలాంటి భూ అవకాశం ఇది.
భూమ్మీద మనకంటూ కొంత భూమి ఉండడం..వరం!
సర్వేజనా మంగళం మహత్!
***

No comments:

Post a Comment

Pages