నిలచినవాడవు నీవేకాక దైవమా - అచ్చంగా తెలుగు

నిలచినవాడవు నీవేకాక దైవమా

Share This

నిలచినవాడవు నీవేకాక దైవమా

(అన్నమయ్య కీర్తనకు వివరణ)

డా.తాడేపల్లి పతంజలి 




రేకు: 0351-06 సం: 04-302

పల్లవి:

నిలచినవాడవు నీవేకాక దైవమా

నెలవై ప్రకృతి నేను నీలోనిసొమ్ములము


చ.1:

తఱి నిరువదేను తత్వములుండగాను

యెఱగని యజ్ఞానానకెవ్వరు గురి

నెఱిజైతన్యమెల్లా నీసొమ్మై వుండగాను

యెఱుకవొక్కటేకాక యెవ్వరున్నా రీడను


చ.2:

దినలెక్క లూరుపులు తెచ్చి తెచ్చి వొప్పించగ

యెనలేని జన్మములకెవ్వరు గురి

వునికై బ్రహ్మాండము వొళ్ళునీకై వుండగాను

యేనసే ఆనందమేకా కెవ్వరున్నా రీడను


చ.3:

 అచ్చపు సుముద్రవంటాత్మలణువైయుండగా

యిచ్చ గామక్రోథాల కెవ్వరు గురి

నిచ్చలు శ్రీవేంకటేశ నీవేలికవై యుండగా

హెచ్చేటిదాస్యమేకాక యెవ్వరున్నా రీడను


భావం:

పల్లవి: ఓ దైవమా! వేంకటేశా !మా భక్తులకోసం నిలచినవాడవు నీవేకదా !

ప్రకృతికి నువ్వు స్థానము.  నేను(మేము) నీలోనిసొమ్ములము .


చ.1:

సమీపములో ఇరవై అయిదు  తత్వములుండగా ఇంకా ఎరగని అజ్ఞానానికి ఎవరు గురి అవుతారు?(గురి కారని భావం)

పూర్ణ చైతన్యమంతా  నీసొమ్మై ఉండగా- జ్ఞానము ఒక్కటే కాక- నువ్వు తప్పించి ఎవరున్నారు?( సర్వము నువ్వే అని భావం)


చ.2:

ప్రతిదినపు లెక్కలు, శ్వాసములు  తెచ్చి తెచ్చి ఒప్పించగా సాటిలేని  జన్మములకు ఎవరు లక్ష్యం?(నువ్వే లక్ష్యమని భావం)

బ్రహ్మాండమంతా నీ శరీరమై ఉండగా -ఇక సర్వత్రా ఆనందమే కదా ! అది కాదనే వారు ఈలోకంలో ఎవరు లేరు.

స్వామి ఆనంద స్వరూపుడు. ఆయన ఉండే ఈ బ్రహ్మాండం ఆనందనిలయమని భావం)


చ.3:

అచ్చమైన సుముద్రవంటి ఆత్మలు అణువై యుండగా- ఇష్టంగా కామక్రోధాలకు ఎవరు గురి అవుతారు?( శరీరంలోపల అణువుల వంటి  జీవాత్మ  పరమాత్మలు ఉన్నాయనే విషయంతెలుసుకొన్నతర్వాత ఎవరూ కామక్రోధాల వశం కారు).


శ్రీవేంకటేశ! నిత్యంగా నువ్వు ఏలికగా ఉండగా  నీకు దాస్యము పెరుగుతుంది.( చాలామంది నీకు భక్తులు అవుతారని భావం). నువ్వు కాక ఇతర దైవాలు ఎవరున్నారు?( ఎవరూ లేరని భావం)


విశేషాలు:

తత్వములు:

పంచవింశతి తత్వములు

 అష్టప్రకృతులు,  షోడశ వికారములు(ఏకాదశేంద్రియములు, పంచభూతములును.) పురుషుడు.


అష్టప్రకృతులు:

1. శబ్దము, 2. స్పర్శము, 3. రూపము, 4. రసము, 5. గంధము, 6. అవ్యక్తము, 7. మహత్తు, 8. అహంకారము.


షోడశ వికారములు:

 పదకొండు ఇంద్రియాలు.(జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు -)


పంచభూతములు:

1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము

***

No comments:

Post a Comment

Pages