త్రివిక్రమావతారం - 8 - అచ్చంగా తెలుగు
త్రివిక్రమావతారం - 8

శ్రీరామభట్ల ఆదిత్య 



పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు. ఈ విధంగా బలవంతుడైన తమ్ముడి ప్రాపువల్ల, ఇంద్రుడికి ఇంద్రపదవి తిరిగి లభించింది. శ్రేష్ఠుడైన తమ్ముడుంటే అన్నగారి కోరికలు నెరవేరకుండా ఉంటాయా. దేవతలతల్లి అదితికి కడపటివాడైన కొడుకు వామనుడు భిక్షం అడిగి సంపాదించిన ముల్లోకాలూ తన అన్నకే ఇచ్చేసాడు. అందులో భాగాన్ని అడగలేదు. లాభాన్ని అడగలేదు. ఆవిధంగా అన్నల కోసం ఎంత శ్రమపడే తమ్ముళ్ళు అయినా వామనునితో సరిపోలగలరా?

దేవతల సమూహాన్ని కన్న అదితి చివరకి అదృష్టం పండేటట్లు వామనుడిని కన్నది. కడుపు పగిలేలా పదిమందిని కనేకన్నా, ఏ తల్లికైనా అలాంటి కొడుకు ఒక్కడు చాలు. అలా వామనుడు సంపాదించి ఇచ్చిన మూడులోకాల సామ్రాజ్య సంపదనూ దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటుపిమ్మట బ్రహ్మదేవుడూ, శివుడూ, కుమారస్వామి, భృగువూ మొదలైన మునులూ, పితృదేవతలూ, దక్షుడూ మొదలైన ప్రజాపతులూ, సిద్ధులూ, దేవతలూ ఇంకా తక్కినవారు అందరూ విష్ణుదేవుని లీలావిలాసాలకు ముచ్చట పడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు.

త్రివిక్రమావతారుడైన వామనుడి గొప్ప గుణాలను పూర్తిగా తెలుసుకోడం కానీ లెక్కించడం కానీ ఎవరికీ సాధ్యంకాదు. భూమిలోని ధూళి కణాలను లెక్కపెట్టగలిగిన వాడికైనా, ఇది సాధ్యం కాదు. ఇంక వేరేవారి సంగతి చెప్పేదేముంది. అత్యద్భుత మైన లీలలతోకూడిన విష్ణుమూర్తి నిర్మల వర్తనములను గురించి తెలిపే ఈపుణ్య చరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడు అవుతాడు. చివరకి ప్రకాశించే ప్రభావంతో దివ్యలోకాలను పొందుతాడు. పరీక్షిన్మహారాజా! మానవులకూ పితృదేవతలకూ దేవతలకూ సంబంధించిన పుణ్యకార్యాలు చేసే సమయాలలో ఎవరైతే త్రివిక్రముని చరిత్రను కీర్తిస్తుంటారో, వారు ఎప్పుడూ సర్వ సుఖాలూ పొందుతూ ఉంటారు. 

జంభాసురుని సంహరించిన ఇంద్రుడు, దేవతలు, అశక్తులై స్వర్గాన్ని ఓడిపోయారు. విష్ణుమూర్తి వారిని కాపాడటానికి వామనావతాం ఎత్తి, విరోచనుని కొడుకు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని అడిగి పుచ్చుకున్నాడు. త్రివిక్రమావతారం ఎత్తి రెండు అడుగులు వేయడంతోనే బ్రహ్మాండం అంతా నిండిపోయి ఆనందంగా ఉండే ఆ వామనుడికి ఎప్పుడూ మ్రొక్కుతూ ఉంటాను.

నారాయణోజయతు సర్వత్ర

( సమాప్తం )

No comments:

Post a Comment

Pages