కృష్ణవేణి - అచ్చంగా తెలుగు

కృష్ణవేణి

భావరాజు పద్మిని 


కృష్ణవేణి చచ్చిపోయింది...
ఈ వార్త మా నర్సాపురం ఊరంతా గుప్పుమంది.

మరో ఆలోచన లేకుండా పంజా సెంటర్లో ఉండే ఖాన్, క్రిస్టియన్ పేటలో ఉండే జోసఫ్, ఇందిరా కాలనీలో ఉండే శాస్త్రి వంటివారంతా అక్కడ గుమికూడారు.

వచ్చిన వాళ్లలో ఉత్తర కూడా ఉంది. మౌనంగా నిలబడి కృష్ణవేణినే చూస్తోంది. ఆమె చుట్టూ నిలబడి ఆమె శవాన్ని చూస్తూ ఎక్కులు పెట్టి ఏడుస్తున్న వారిని చూస్తోంది. కృష్ణవేణిని మెదటిసారి కలిసిన ఘట్టం ఆమె మనసులో మెదిలింది.

***
హైదరాబాదు లో జర్నలిజం కోర్సు చేస్తూ, సెలవలకు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో, నర్సాపురంలో ఉన్న తన మేనమామ వద్దకు బయల్దేరింది ఉత్తర. ట్రైన్ ఎక్కిన దగ్గర్నుంచి,  సైడ్ బెర్త్ లో తన ఎదురు సీట్లో నిండు చందమామలా ఉన్నావిడ మీద నుంచి చూపు తిప్పుకోలేకపోతోంది. ఉత్తర వంక చూసిన ఆవిడ పలకరింపుగా నవ్వింది.

"మీ పేరు?" 
"కృష్ణవేణి!"
"ఎక్కడకు వెళ్తున్నారు?"
"గమ్యం తెలియని ప్రయాణికురాల్ని! జీవితం ఎక్కడకు తీసుకువెళ్తే అక్కడికే!" చెదరని నవ్వుతో సమాధానమిచ్చిందావిడ.

ఆవిడనే ఆశ్చర్యంగా చూస్తూ, "జీవితాన్ని కాచి వడపోసిన వారిలా ఉన్నారే! మీ‌మాటలు చాలా లోతుగా ఉన్నాయి. ఎక్కడుంటారు నర్సాపురంలో?" ఆసక్తిగా అడిగింది ఉత్తర.

"నీ ఊహ నిజమే! జీవితాన్ని కాచి వడపోసాను. కానీ కొన్ని ప్రశ్నలు వడపోతలో పైన పెట్టిన జల్లెడ మీదే తొరకల్లా ఆగిపోయాయి. ఇంకా సమాధానం దొరకలేదు వాటికి. కృష్ణవేణి ఎక్కడుంటుంది, అని ఆ ఊళ్లో ఎవరినడిగినా, ఎర్రమిల్లి వారి వీధిలో, అంటారు. దానితోపాటు, 'ఆవిడతో నీకేం పని?' అని ఇంకో ప్రశ్న కూడా వేస్తారమ్మా. ఎందుకంటే నేను మీలాంటి సంస్కారవంతులకో సవాలుని, ఏ ఆదరణా నోచుకోని వారికో జవాబుని!"

"అంటే మీరు...?" ఆశ్చర్యంగా చూస్తూ అడగలేక ఆగిపోయింది ఉత్తర. 

"ఔనమ్మా! నేనొక వెలయాలిని. కట్టుబాట్లతో నడిచే సమాజానికి ఓ కళంకాన్ని!"

కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఉత్తర. ఆ తర్వాత తేరుకుని,

"అసలు మీరు ఇటువైపు ఎలా వచ్చారు? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి" అని అడిగింది.

"తెరిచిన పుస్తకం‌ నా జీవితం! ఇందులో దాచడానికేముంది? మాది కోటిపల్లి పరిసర ప్రాంతాల్లోని కుగ్రామమని గుర్తు, అంతే అంతకుమించి నాకు నా వారిని గురించిన ఏ జ్ఞాపకాలు లేవు! చిన్నప్పుడు కోటిపల్లి తీర్థంలో తప్పిపోతే, పరిమళ అనే ఒకావిడ నన్ను చేరదీసి, పెద్దాపురం తీసుకువచ్చింది. ఆవిడ కళావతుల కుటుంబంలో పుట్టింది కనుక నాకు కూడా సంగీతం, నాట్యం నేర్పించి, వాటితో పాటే కాస్తంత చదవడం, వ్రాయడం కూడా చెప్పించింది. ఆ తర్వాత, అక్కడకు వచ్చి, నా నాట్యం చూసిన ఒకాయన, పరిమళ దగ్గర పెద్ద మొత్తం చెల్లించి, నన్ను కొని, నరసాపురం తెచ్చి పెట్టాడు‌. ఉండడానికి నాకు ఓ ఇల్లు రాసి ఇచ్చాడు. కానీ అనుకోకుండా ఒక ప్రమాదంలో ఆయన మరణించడంతో నేను దిక్కు లేని దాన్నయ్యాను. ఊరందరి కళ్ళు నా మీద పడ్డాయి.... తప్పనిసరి పరిస్థితుల్లో ఇంక ఈ వృత్తి లోకే దిగక తప్పలేదు!"

ఆమె కథంతా విని భారంగా నిట్టూర్చింది ఉత్తర! కాసేపటికి, "మీరు తప్పుగా అనుకోనంటే ఒక మాట అడుగుతాను. అంతో ఎంతో చదువుకున్నారు కదా, ఏదో ఒక కాయ కష్టం చేసుకుని బ్రతికితే ఇంతకన్నా గౌరవంగా ఉండేది కదా!"

గలగలా నవ్వింది కృష్ణవేణి. "నేనూ నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెబుతావా? అసలు పెళ్లాలుండగా కొంతమంది మగవాళ్ళు నా వంటి వారి వద్దకు ఎందుకు వస్తారు? కేవలం దేహకాంక్ష కోసమని అనుకుంటున్నావా?"

"నాకు తెలిసి అంతే!" టక్కున బదులిచ్చింది ఉత్తర.

"నేను చూసినంతలో అయితే కాదని ఖచ్చితంగా చెప్పగలను. ఉదాహరణకు నా దగ్గరకు వచ్చే శాస్త్రి అనే ఒకాయన భార్య విపరీతమైన మొండితనం, అసూయ కలిగినది. ఏదీ ఓర్వలేదు! ఏదో కారణంగా భర్తతో గొడవ పెట్టుకుని గత 22 ఏళ్లుగా అతన్ని కనీసం తాకలేదు! అప్పటికే పుట్టిన పిల్లల్ని సమర్థించుకుంటూ ఆయన జీవితం వెళ్లదీస్తున్నాడు! అతనూ మనిషే కదా! కాస్తంత ప్రేమ, ఆప్యాయతకు నోచుకోడా! కష్టం చెప్పుకోడానికి ఓ తోడు కోరుకోడా! అసలు ఒక మనిషి 22 ఏళ్లుగా సాటి మనిషి స్పర్శ కోసం, చిన్న ఓదార్పు కోసం, కాస్తంత ప్రేమ కోసం పరితపించిపోవడమేమిటి? మనం ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం?అతడొచ్చినప్పుడల్లా, నా ఒళ్లో తల పెట్టుకుని కాసేపు తన సంగతులు మనసువిప్పి చెప్పుకుని వెళ్తాడు. అతనికి నేను ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఒక ధైర్యాన్ని! "

"ఎక్కడో ఒకరలా ఉండచ్చు... కానీ అందరూ అలా ఉండరుగా!"

"ఇంకో విచిత్రమైన కథ చెప్తాను విను. ఖాన్ అనే ఒక భోజన ప్రియుడున్నాడు. కానీ అతని అదృష్టం ఏమిటో, పెళ్ళాం చేత్తో ఏం వండినా కటిక విషంలా ఉంటుంది. అతడు ఒకసారి ఆకలితో నకనకలాడుతూ ఎండలో మా అరుగు మీద కూర్చొని ఉంటే, ఏదో ఇంత వండింది పెట్టాను. వాళ్ళ అమ్మ వంట జ్ఞాపకం వచ్చిందట! వారానికోసారన్నా వచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోతాడు. అంతకుమించి మా మధ్యన ఏమీ లేదు కానీ చూసే జనం దృష్టి వేరుగా ఉంటుంది. హితవైన భోజనం దొరక్కపోవడమే అతను నా దగ్గరకు వచ్చే కారణం!"

"విచిత్రంగా ఉందే! భోజనం దొరక్కపోతే ఏ హోటల్ లోనో తినొచ్చు, లేకపోతే వంట మనిషిని పెట్టుకోవచ్చు కదా! ఎందుకు ఇలా రావడం?"

"హితవైన... అన్నాను కదా! అతనికి నచ్చినట్టు భోజనం ఉండాలనే అతని కోరిక. ఇంకో సంగతేంటంటే..‌. అతని భార్య చాలా మంచిది, సున్నిత మనస్కురాలు. ఏ విషయంలోనూ తిరస్కారాన్ని తట్టుకోలేదు. పైగా గుండెజబ్బు మనిషి. మిగిల్న అన్ని విషయాల్లో బాగున్న ఆమెను, భోజనం విషయంలో మాత్రం నొప్పించడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తాడు."

"ఓహో. ఇంకెవరైనా ఇలా ప్రత్యేకంగా వచ్చేవారు ఉన్నారా?" కుతూహలంగా అడిగింది ఉత్తర. 

"ఇతరుల సంగతి తెలీదు గానీ, నా వద్దకు వచ్చేవారిలో చాలామంది ఇటువంటివారే! అనాథ అయిన జోసఫ్ అనే ఒకతనున్నాడు... నల్లగా, ఎత్తుపల్లతో, అందవికారంగా ఉంటాడని అందరూ హేళన చేస్తూ ఉంటారు. అవమానాలన్నీ సహిస్తూ, అక్కడా ఇక్కడా చిన్నచిన్న పనులు చేసుకుంటూ పెరిగాడు. అతనికీ సమాజం మీద, అనుబంధాల మీద నమ్మకం పోయింది. అందుకే ఎవరితోనూ మాట్లాడడం మానేసాడు. ఏదో పనిమీద అతన్ని పిలిచినప్పుడు నన్ను చూసాడు. భోజనం వేళని కాస్త అన్నం పెట్టి, ఆదరంగా మాట్లాడేసరికి, పొంగిపోయాడు. అక్కా, అక్కా... అంటూ వచ్చి అన్ని సంగతులూ చెబుతూంటాడు. నాకు ఏ అనారోగ్యం వచ్చినా కంటికి రెప్పలా కాచుకుంటాడు. ఉత్తరా! ఒక్కమాట చెప్పనా... ఎన్ని యంత్రాలొచ్చినా, మంచీచెడ్డా చెప్పుకోడానికి మనిషికి మనిషి ఆసరానే అవసరం! అలా 'నా' అన్నవారు లేకపోవడమే అతను నా దగ్గరకు వచ్చే కారణం!"

"వెరీ టచింగ్! కానీ, మీరెన్ని విషయాలు చెప్పినా... ఎందుకో నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. క్షమించండి!"

"మారుతున్న సమాజంలో బంధాల తీరు కూడా మారడం నువ్వు చూసే ఉంటావు. నేడు నచ్చిన వారితో నచ్చినట్టు బాహాటంగానే గడపడం జరుగుతోంది. అంతెందుకు, ఒకప్పుడు ఇల్లద్దెకి ఇవ్వాలంటే ఫ్యామిలీ కోసం చూసేవారు. కానీ ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు నచ్చిన వారితో కలిసి జీవించే హాస్టల్స్ వచ్చాయి. ఢిల్లీ వంటి నగరాల్లో సహజీవనానికి ఫ్లాట్స్ వచ్చాయి. ఉన్నన్నాళ్లు ఉండి విడిపోతారు. వాళ్లకి సరదాలు కావాలి, కానీ బాధ్యతలొద్దు. మరి‌ ఆ బంధాలు సరైనవేనా, వాటిని ఏమంటారు చెప్పు!"

"అది మారుతున్న ట్రెండ్ కదండీ!"

"అది ట్రెండ్ అని సరిపెట్టుకున్నప్పుడు, మూసపోసిన ఈ పాత దృష్టితో మమ్మల్ని మాత్రం ఇలా చూడడం ఎందుకు? నీలోనే పాత, కొత్త తరాల మధ్యన సంఘర్షణ జరుగుతోందా, ఆలోచించు!"

"ఏమో... అవుననే అనిపిస్తోంది."

"సమాజానికి తాను చేసే తప్పులు ఒప్పుకోవడం రాదు. అన్నెం పున్నెం ఎరుగని నావంటి పసిపిల్ల తీర్థంలో తప్పిపోతే, పోలీసులకో, ఆమె తల్లిదండ్రులకో అప్పగించకుండా వేశ్యా గృహం పాలు  చేసిన స్వార్ధం గుర్తుకురాదు. అహాలు, పంతాలు వ్యక్తిత్వాలతో నూరి పోసి, శాస్త్రిని ప్రేమరాహిత్యానికి గురిచేసిన జాడ్యం గుర్తుకురాదు! వంటరాని భార్యతో ఖాన్ పడే ఆకలి గుర్తుకురాదు! నా అన్న వారు లేని జోసఫ్ వేదన గుర్తుకురాదు. కానీ ఇటువంటి వారికి ఆసరాగా ఉండే నాలాంటి వాళ్లను ఎత్తిచూపడం మాత్రం గుర్తుకొస్తుంది. మావంటి వారి వద్దకొచ్చే మగవారిని రసికులుగా భావించే అదే సమాజం, మమ్మల్ని మాత్రం వెలయాళ్లని అంటుంది. ఇదంతా కాదుగానీ, ఒక‌మాట చెప్పనా... ఉద్వేగాల నియంత్రణ లేని సమాజం నేరస్థులకు నెలవౌతుంది. చాటుగానో మాటుగానో, ఒక తోడు కోసం వెతికే వారికి, ఉద్వేగ వాహికలా ఉంటూ వారిని సమతుల్యత లో ఉంచడం... నా దృష్టిలో నేనొక సేవగానే, అవసరంగానే భావిస్తాను. అందుకోసం మీవంటి వారి దృష్టిలో నేరస్థురాలిగా నిలవడానికి కూడా నేను సిద్ధమే!"

"సరే వీళ్లందరికీ మీరున్నారు, మరి మీకంటూ ఎవరున్నారు?"

"కరోనాలో తమవారిని కోల్పోయిన ఇద్దరు పిల్లల్ని చేరదీసి, హాస్టళ్లలో పెట్టి చదివిస్తున్నాను. నా తదనంతరం కూడా వాళ్లకేలోటూ లేకుండా ఏర్పాటు చేసాను. అన్నదానాలకు కడుతుంటాను. ఇవికాక, నాకు వీలైనన్ని మంచి పనులు చేస్తుంటాను. నాకంటూ ఏమైనా ఉంటే, ఈ కాస్త పుణ్యమేనేమో!"

"మీ మాటలు, దృక్పథం నాకు నచ్చాయి. మీరేమీ అనుకోనంటే మీ నెంబరిస్తారా... అప్పుడప్పుడు మాట్లాడతాను!" ట్రైన్ దిగబోయే ముందు అడిగి తీసుకుంది ఉత్తర.

ఆ తర్వాత కృష్ణవేణి మంచి స్నేహితురాలిగా మారింది ఉత్తరకు. ఆమె చెప్పే సంగతులు వింటున్న కొద్దీ ఆమె పట్ల గౌరవం పెరిగింది!

***

"నారాయణ, నారాయణ" అంటూ కృష్ణవేణి శవాన్ని ఎత్తి స్మశానానికి తరలిస్తూండడంతో ఆలోచనల నుంచి బయటకు వచ్చింది ఉత్తర.

శాస్త్రి, జోసఫ్, ఖాన్ అందరూ కలిసి ఆమెను మోసుకు పోతున్నారు. ఆమె పెంచిన పిల్లలు, పనివారు అంతా కన్నీరు మున్నీరవుతున్నారు.

తడిసిన కనులతో, మసకమసగ్గా... దూరంగా కనుమరుగవుతున్న ఆమె అంతిమయాత్రను చూస్తూన్న ఉత్తర మనసులో వారం రోజుల క్రిందట కృష్ణవేణి చెప్పి‌న మాటలు మారుమ్రోగుతున్నాయి...

"నాకింక ఎక్కువ ఆయుష్షు లేదని నాకనిపిస్తోంది. నేనంటూ మరణించిన రోజున చూస్తుండు ఉత్తరా! కులమతాలకు అతీతంగా ఎంతమంది ఇక్కడకు వస్తారో! ఎంతమంది ఇక్కడకు వస్తే... సమాజంలో అంత అసమతుల్యత ఉన్నట్టు, అంత ప్రేమరాహిత్యం ఉన్నట్టు, అన్ని జాడ్యాలున్నట్టు, అంత పీడించడం ఉన్నట్టు... ఇవన్నీ ఉన్నంతకాలం, మనిషికీ మనిషికీ మధ్య దూరం అగాధంలా పెరిగిపోతున్నంత కాలం... ఆ రోగాలకు ఔషధంలా... నా వంటి కృష్ణవేణులు ఎక్కడో పుడుతూనే ఉంటారు!"

***

No comments:

Post a Comment

Pages